కూచిభొట్లని చూసి నేర్చుకోండి తెలుగు తమ్ముళ్ళూ!
posted on Nov 7, 2015 @ 6:32PM
పదేళ్ళ విరామం తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ పదేళ్ళపాటూ తెలుగుదేశం పార్టీ జెండా మోసిన నాయకులు, కార్యకర్తలు తమ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వంలో తమ పనులు అవుతాయని ఆశలు పెట్టుకున్నారు. అయితే తమ పార్టీ పవర్లో వున్నా తమకు సంతృప్తి లేకుండా పోయిందని, అధికారుల నుంచి తమకు అస్సలు స్పందనే లభించడం లేదని చాలామంది నాయకులు, కార్యకర్తలు బాధపడిపోతున్నారు. అయితే అలా బాధపడిపోయేవారంతా తమలోనే ఏదో తప్పుందని అర్థం చేసుకోవాలి. అధికారుల నుంచి పనులు చేయించుకునేవాళ్ళు ఎలా చాకచక్యంగా చేయించుకుంటున్నారో చూసయినా నేర్చుకోవాలి.
ఫర్ ఎగ్జాంపుల్... అమెరికా నుంచి వచ్చిన కూచిభొట్ల ఆనంద్‌నే చూడండి. తెలుగుదేశం ప్రభుత్వం ఇలా అధికారంలోకి వచ్చిందో లేదో అలా కూచిపూడి నాట్యారామం ప్రాజెక్టు సొంతం చేసేసుకున్నారు. దాంతోపాటు క్యాబినెట్ ర్యాంకు కూడా పొందేశారు. తెలుగుదేశం పార్టీతో ఎలాంటి సంబంధం లేకపోయినా అధికారుల నుంచి పనులు ఎలా చకచకా చేయించుకున్నారో ఆయన్ని చూసి నేర్చుకోవాలి. నిన్నగాక మొన్న నవంబర్ రెండున ఆయన ప్రభుత్వానికి ఓ అప్లికేషన్ పెట్టారు.. కూచిపూడిలో ఓ ఆస్పత్రి పెడతాను స్థలం మంజూరు చేయండీ అని... అంతే... ఎమ్మార్వో దగ్గర్నుంచి రెవిన్యూ శాఖ పెద్ద అధికారుల వరకు ఫైలు చకచకా కదిలింది. అప్లికేషన్ పెట్టిన రెండ్రోజుల్లోనే... అంటే నవంబర్ 4న ఆయనకు కూచిపూడిలో ఒక ఎకరం ఎనిమిది సెంట్ల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం జీవో కూడా జారీ చేసింది. అప్లికేషన్ పెట్టిన రెండ్రోజుల్లోనే భూమి కేటాయింపు కూడా జరిపించుకోవడం మాటలా? అది కూచిభొట్ల ఆనంద్‌కే చెల్లింది. మేధావితనం అంటే అలా వుండాలి. ఎప్పుడొచ్చాం.. ఎక్కడినుంచి వచ్చాం అనేది ముఖ్యం కాదు.. పనులు అవుతున్నాయా లేదా అనేది ముఖ్యం.
కాబట్టి తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు కూచిభొట్ల ఆనంద్‌ని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకోవాలి. అధికారుల నుంచి పనులు చేయించుకునే విషయంలో ఆయన నుంచి ట్రైనింగ్ తీసుకున్నా తప్పు లేదు. అయితే ఓ పని చేయొచ్చు... టీడీపీ యువ నాయకుడు నారా లోకేష్ కార్యకర్తలకు శిక్షణా క్లాసులు నిర్వహిస్తూ వుంటారు కదా... ఈసారి ఎప్పుడైనా అధికారుల చేత పనులు ఎలా చేయించుకోవాలనే అంశంలో తెలుగు తమ్ముళ్ళకు కూచిభొట్ల ఆనంద్ చేత శిక్షణ ఇప్పించమని అడగాలి. అదృష్టం బాగుండి కూచిభొట్ల ఆనంద్ తెలుగు తమ్ముళ్ళకు శిక్షణ ఇస్తే, ఇక పనులు కావడం లేదని బాధపడిపోకుండా అందరూ హ్యాపీగా వుండొచ్చు.