కమల్, చంద్రబాబును కలిసింది అందుకేనా?

ఏపీ సీఎం చంద్రబాబుతో సీనీ నటుడు కమల్ హాసన్ భేటీ అయిన సంగతి తెలిసిందే. అయితే వీరిద్దరు ఎందుకు భేటీ అయ్యారో తెలియదు కానీ.. భేటీపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు తన "చీకిటి రాజ్యం" సినిమా ప్రీమియర్ షోకు చంద్రబాబును ఆహ్వానించడానికే కలిశానని కమల్ హసన్ చెబుతున్నా.. అసలు కారణం వేరే ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఇప్పటికే ఏపీ రాజధానిలో పెట్టుబడులు, పరిశ్రమలు పెట్టడానికి అందరూ ఉవ్విళూరుతున్నారు. కొత్త రాష్ట్రం.. అందునా కొత్త రాజధాని ఇక్కడ పెట్టుబడులు కానీ.. పరిశ్రమలు కానీ పెడితే మంచి లాభాలు చేకురుతాయని అందరూ చాలా ఆసక్తికరంగా ఉన్నారు. ఈ నేపథ్యంలోనే కమల్ హాసన్ చంద్రబాబును కలిసి ఉంటారని అందరూ అనుకుంటున్నారు. ఇప్పటివరకూ సినిమా షూటింగ్ లకు అనువైన ప్లేస్ ఏదంటే ముందు గుర్తొచ్చే పేరు రామోజీ ఫిలిం సిటీ. చిన్న సినిమా దగ్గర నుండి పెద్ద సినిమాల వరకూ ఏదైనా షూటింగ్ చేసుకోవాలంటే ఇక్కడికి రావాల్సిందే. అలాంటి రామోజీ ఫిలిం సిటీ లాంటి మరో స్టూడియో ఉండాలన్నదే కమల్ కోరికట.  ఈ నేపథ్యంలో కమల్, బాబుతో తమ మనసులో మాటను బయటపెట్టారట. దీనిలో భాగంగా అమరావతిలో కమల్ సొంతంగా ఓ ఫిలిం ఓరియెంటెడ్ ఆర్గనైజేషన్ ను ఏర్పాటు చేయాలని.. అందుకు సంబంధించిన భూముల కేటాయింపులు.. మౌలిక వసతుల కల్పన తదితర విషయాల గురించి చర్చించినట్టు తెలుస్తోంది. మొత్తానికి సినీ హీరోలు కూడా ఏపీ రాజధానిలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపించడం విశేషం.

కేసీఆర్ ను పొగుడుతూ చురక అంటించిన ఎమ్మెస్సార్

వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. ఒక పార్టీని మించి ఇంకో పార్టీ నేతలు ప్రచారంలో చాలా బిజీగా ఉన్నారు. అయితే ప్రచారంలో సాధారణంగా ప్రతిపక్షనేతలపై విమర్శలు కురిపిస్తారు.. కానీ ఇక్కడ ఓ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మాత్రం కేసీఆర్ పై పొగడ్తలు కురిపించారు. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ఎం. సత్యనారాయణ.. కేసీఆర్ ప్రవేశ పెట్టిన మిషన్ కాకతీయ, గ్రామ జ్యోతి పథకాల ద్వారా అందరికీ మేలు జరుగుతుందని..తెలంగాణలో విద్యుత్ విధానం కూడా చాలా బాగుందని.. కెసీఆర్ ప్రవేశ పెడుతున్న పథకాలు ప్రజలకు ఉపయోగపడేలా ఉన్నాయని కితాబిచ్చారు. అంతేకాదు అటు పొగుడుతూనే మరో చురక అంటించారు సత్యనారయణ. కేసీఆర్ అందరినీ కలుపుకుంటూ పోవాలని.. దూకుడుగా వెళ్తే మాత్రం ప్రజలు బుద్ధి చెబుతారని ఎద్దేవ చేశారు. చివరిలో కొస మెరుపుగా.. వరంగల్ ఉపఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలో ప్రజలకి తెలుసని చెప్పుకొచ్చారు.

రోజా ఎస్.. షర్మిళ నో.. జగన్

  వైఎస్ జగన్మోహన్ రెడ్డికి తన చెల్లి షర్మిల అంటే ఎంతొ కొంత భయమనే చెప్పాలి. వైఎస్ జగన్ కు ఉన్న పేరుకు సమానంగా.. ఓదార్పు యాత్ర ద్వారా ప్రజల్లో షర్మిలకు బాగానే పేరుంది. అందుకే తన కంటే ఎక్కడ ఎక్కువ పేరు వస్తుందా.. ఎక్కడ ఎక్కువ జనాదారణ లభిస్తుందా అని జగన్ షర్మిళకు ఎప్పటికప్పుడు చెక్ పెట్టుకుంటూ వస్తూనే ఉన్నాడు. ఆఖరికి తను నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు కూడా షర్మిలను తన దరికి రానివ్వలేదు జగన్. అయితే ఇప్పుడు మరోసారి జగన్ షర్మిళను పక్కన పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణలో ఓదార్పు యాత్ర చేయించుకొని పేరు తెచ్చుకున్న జగన్ ఇప్పుడు వరంగల్ ఉపఎన్నిక ప్రచారానికి మాత్రం షర్మిళను దూరం పెట్టారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో తాను ప్రచారానికి వస్తానని.. ఇంకా జనాకర్షణ ఉన్న నేత కావాలంటే రోజాని తీసుకెళ్లండి అని చెప్పారట.. అంతేకాదు ప్రచారానికి షర్మిళను తీసుకురావడానికి మాత్రం ససేమీరా ఒప్పుకోనని తేల్చిచెప్పాడట. దీంతో టీ వైసీపీ నాయకులకు రోజా తప్ప మరే ఛాయిస్ లేకపోయేసరికి వరంగల్ ప్రచారానికి రోజాని తీసుకెళ్లాల్సివచ్చిందట. ఏది ఏమైనా జగన్ మాట ప్రకారం టీ వైసీపీ నేతలు రోజాని తీసుకెళ్లగా.. రోజా ప్రచారానికి మాత్రం మంచి స్పందనే వచ్చిందని తెలుస్తోంది.

మయన్మార్‌లో సూకీ పార్టీ ఘన విజయం

  మయన్మార్‌లో జరిగిన ఎన్నికలలో నోబెల్ శాంతి బహుమతి గ్రహీత ఆన్ సాంగ్ సూకీ నేతృత్వంలోని ఎల్ఎన్‌డీ పార్టీ పూర్తి ఆధిక్యాన్ని సాధించి ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. మయన్మార్‌లో ఎగువ, దిగువ సభలలో ఇప్పటి వరకు సూకీ పార్టీ 348 స్థానాలను గెలుచుకుందని ఆ దేశ ఎన్నికల సంఘం ప్రకటించింది. 664 సీట్లున్న మయన్మార్ పార్లమెంట్‌లో అధికారంలోకి రావాలంటే 329 స్థానాలను గెలవాల్సి వుంటుంది. సూకీ పార్టీ ఇప్పటికే 348 స్థానాలను గెలిచింది. మరికొన్ని స్థానాల ఫలితాలు వెల్లడి కావల్సి వుంది. సైనిక ప్రభుత్వం ఓటమిని అంగీకరించి ప్రశాంతంగా అధికార బదలాయింపు చేసినట్టయితే మయన్మార్‌లో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడనుంది.  

పవన్ ను కూల్ గా కన్విన్స్ చేసిన చంద్రబాబు

ఎవరినైనా కన్విన్స్ చేయడంలో ఏపీ సీఎం చంద్రబాబు తరువాతే అని అందరికి తెలిసిన విషయమే. తన రాజకీయానుభవంలో.. ఎక్కడ ఎలా మెలగాలో.. ఎవరితో ఎలా వ్యవహరించాలో తెలిసిన రాజకీయ చాణక్యుడు చంద్రబాబు. అందుకే తనను ప్రశ్నించడానికి వచ్చిన పవన్ కళ్యాణ్ ను సైతం చాలా చక్కగా కన్విన్స్ చేసి పంపించగలిగారు. చంద్రబాబు.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిన్న భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈనేపథ్యంలో వీరిద్దరు.. రాజధాని భూములు, రైతుల సమస్యలపై చర్చించారు. అయితే పవన్ కళ్యాణ్ దేని మీద చర్చిస్తారో ముందుగానే తెలుసుకున్న చంద్రబాబు.. రాజధాని భూములకు సంబంధించిన పూర్తి వివరాలను ఆయన ముందుంచారు. అంతేకాదు రాజధానికి భూములు ఇవ్వని రైతలు ఎంతమంది.. భూములు ఇవ్వకపోతే వచ్చే ఇబ్బందులు ఏంటీ అన్న విషయం పవన్ కు పూర్తిగా వివరించారట. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ తవ్వకాల గురించి పవన్ అడిగిన నేపథ్యంలో అది గతంలో వైఎస్స్ ప్రభుత్వంలో తీసుకున్న నిర్ణయమే అని.. కొత్తగా తమ ప్రభుత్వం తీసుకున్నది ఏం లేదని తెలిపారట. అంతేకాదు కేంద్రం నుండి రాష్ట్రానికి రావాల్సిన సాయంలో కూడా తోడుండాలని పవన్ ను చంద్రబాబు కోరారు. మొత్తానికి ప్రశ్నిద్దామని వెళ్లిన పవన్ ను కూల్ గా కన్విన్స్ చేయడంలో సక్సెస్ అయ్యారు చంద్రబాబు.

మరో తుఫాన్ రాబోతోంది

  ఈమధ్య తమిళనాడుతోపాటు నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో తుఫాను కారణంగా భారీ వర్షాలు కురిసిన విషయం తెలిసిందే. తుఫాను ప్రభావం తమిళనాడు మీద ఎక్కువగా పడింది. సరిహద్దులో వున్న ఏపీ జిల్లాల మీద కూడా ఆ ప్రభావం కొంత పడింది. నెల్లూరు జిల్లాలో భారీ వర్షాలు కురిశాయి. నెల్లూరు - ముంబై రహదారికి ప్రజలు గండి కొట్టాల్సినంత స్థాయిలో వర్షాలు కురిశాయి. ఇప్పుడిప్పుడే నెల్లూరు జిల్లా ప్రజలు వర్షం బారి నుంచి బయటపడి ఊపిరి పీల్చుకుంటున్నారు. ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా మీద మరో తుఫాను ప్రభావం చూపించే అవకాశం వుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. ప్రస్తుతం బంగాళాఖాతంలో కేంద్రీకృతమై వున్న ఈ తుఫాను ఈనెల 16వ తేదీ నాటికి తీరాన్ని తాకే అవకాశం వుందని తెలుస్తోంది. ఈ తుఫాను విపత్తును ఎదుర్కోవడానికి అధికారులను కలెక్టర్ అప్రమత్తం చేశారు.

వరంగల్ ఉపఎన్నిక.. చంద్రబాబు కోసం టీ బీజేపీ

  బీహార్ ఎన్నికల ఫలితాల వల్ల రాజకీయాల్లో పలు కీలకమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో. నిన్న మెున్నటి వరకూ దూకుడు ప్రదర్శించిన బీజేపీ ఇప్పుడు కాస్త నెమ్మదించినట్టు తెలుస్తోంది.  అంతేకాదు వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ముందు ప్రచారంలో ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు అవసరమని భావించినా తరువాత మాత్రం జాతీయ స్థాయి నేతలు ఉంటే చాలు ప్రచారానికి చంద్రబాబు అవసరంలేదని భావించారు టీ బీజేపీ నేతలు. కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. ఒకవేళ బీహార్ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించినట్టయితే ఆ పరిస్థితి వేరేలా ఉండేది. కానీ ఇప్పుడు అలా కాదు.. వరంగల్ ప్రచారానికి చంద్రబాబు కూడా  వస్తేనే ఎమన్న విజయం సాధించే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తుంది. దీనిలో భాగంగా టీ బీజేపీ నేతలు చంద్రబాబుతో సంప్రదింపులు జరుపుతున్నారట. కనీసం చంద్రబాబు ఒక్కరోజు ప్రచారంలో పాల్గొన్న తమ అభ్యర్ధికి ఎంతో లాభం చేకూరుతుందని భావిస్తున్నారట టీ బీజేపీ నేతలు. అయితే ఇప్పటికే చంద్రబాబు షెడ్యూల్ మొత్తం ఖరారైంది. ఇప్పటికిప్పుడు మార్పులు చేయడమంటే చాలా కష్టమని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. మరి ఈ విషయంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.

డిశంబర్ 2న జగన్ విశాఖ ఏజన్సీ పర్యటన

  ప్రత్యేక హోదా కోసం వైకాపా ఎంత అకస్మాత్తుగా పోరాటాలు మొదలుపెట్టిందో అంతే అకస్మాత్తుగా వాటిని నిలిపివేసింది. కారణాలు అందరికీ తెలిసినవే. ప్రత్యేక హోదాపై పోరాటాలు నిలిపివేసిన తరువాత చంద్రబాబు నాయుడిపై పోరాడేందుకు జగన్మోహన్ రెడ్డి మరో ‘సమస్య’ కోసం వెతుకుతుంటే విశాఖ ఏజన్సీ ప్రాంతంలో బాక్సైట్ తవ్వకాలను అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మరో కొత్త ‘సమస్య’ దొరికేవరకు దానిపై పోరాడవచ్చని భావించిన ఆయన అందుకు సిద్దమవుతున్నట్లుంది.   ఇప్పటికే ఆ పార్టీకి చెందిన పాడేరు ఎమ్మెల్యే గిడ్డి ఈశ్వరి అక్కడ పర్యటించి ఆయనకీ ‘గ్రౌండ్ రిపోర్ట్’ అందజేసారు. పనిలోపనిగా ఆమె ప్రభుత్వానికి ఒక హెచ్చరిక కూడా జారీ చేసారు. బాక్సైట్ తవ్వకాలపై ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే వచ్చే శీతాకాల అసెంబ్లీ సమావేశాలలో తను రాజీనామా చేస్తానని హెచ్చరించారు. అంతేకాదు తను మళ్ళీ అక్కడి నుంచే పోటీ చేస్తానని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనతో పోటీ చేయాలని సవాలు కూడా విసిరారు. ఆవిధంగా ఆమె ప్రభుత్వంపై యుద్ధభేరీ మ్రోగించేసారు కనుక వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి బాక్సైట్ తవ్వకాలు జరుగబోయే విశాఖ ఏజన్సీలో డిశంబర్ 2న పర్యటించడానికి బయలుదేరబోతున్నట్లు ప్రకటించారు. అక్కడి గిరిజనులకు తమ పార్టీ అండగా నిలబడుతుందని ఆయన భరోసా ఇవ్వాలనుకొంటున్నారుట! ఇంతకు ముందు రాజధాని ప్రాంతంలో రైతులకు కూడా అండగా నిలబడతామని ఆయన భరోసా ఇచ్చేరు. కానీ ఆ తరువాత వారిని పట్టించుకోలేదు. ఇప్పుడు గిరిజనులకు భరోసా ఇచ్చేందుకు బయలుదేరుతున్నారు. అప్పుడు రైతులు ఇప్పుడు గిరిజనులు రేపు మరెవరో?

రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు..

ఏపీ రాజధాని రైతులతో సీఆర్ డీఏ అధికారులు సమావేశమయ్యారు. ఈ సమావేశంలో మంత్రి నారాయణ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఆర్డీఏ అధికారులు రైతులుకు మాస్టర్ ప్లాన్ ను వివరిస్తున్నారు. అంతేకాదు రైతులు నుండి సలహాలు సూచనలు కూడా తీసుకుంటున్నారు..దీనిలో భాగంగానే మాస్టర్ ప్లాన్ లో రైతులు కొన్ని మార్పులు కూడా సూచించారు. మొత్తం 29 గ్రామాల్లో 9 సిటీలు నిర్మాణం.. ఏయే గ్రామాల్లో ఏయే సిటీలు నిర్మించాలి అనే దానిపై  సీఆర్ డీఏ కమిషనర్ మంత్రి నారాయణ రైతులకు వివరిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ అన్ని పరిశీలించిన తరువాతే మాస్టర్ ప్లాన్ లో ఉన్న విధంగా నిర్మాణం జరుగుతుందని తెలిపారు.

కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా హ్యాకింగ్ షాక్

  సాధారణంగా సెలబ్రిటీల సోషల్ మీడియా అకౌంట్లు హ్యాక్ కు గురవ్వడం వింటుంటా. ఇప్పుడు ఈ హ్యాకర్లు ప్రభుత్వ అకౌంట్లను సైతం హ్యాక్ చేసే స్థాయికి చేరారు. కేంద్ర వాణిజ్య - పరిశ్రమల మంత్రి నిర్మలా సీతారామన్ కు కూడా ఈ హ్యాకింగ్ షాక్ తగిలింది. నిర్మలా సీతారామన్ కు చెందిన ట్విటర్ హ్యాండిల్-@CimGOI అనే ట్విటర్ అకౌంట్ హ్యాక్ కు గురైంది. ఎవరో తమ ఉత్పత్తి తాలూకు ప్రచారం కోసం మంత్రిగారి అకౌంట్ ను హ్యాక్ చేసి అందులో ప్రొడక్ట్ గురించిన వివరాలు పోస్ట్ చేశారట. అయితే దీనిని గమనించిన మంత్రి గారి సన్నిహితులు ఈ విషయాన్ని ఆమెకు తెలియజేయడంతో ఆమె వారికి కృతజ్ఞతలు తెలిపి..  తన ట్విటర్ అకౌంట్ ను ఎవరు హ్యాక్ చేశారో పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు.

మోడీకి వ్యతిరేకంగా నితీశ్ వ్యూహం

బీహార్ ఎన్నికల్లో మహా కూటమి అద్భుత విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలను ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించిన బీజేపీ కి ఊహించని దెబ్బ తగిలింది. మొదటి నుండి గెలుపు తమదనే భావనతో ఉన్నా.. ఎవరూ ఊహించని విధంగా మహా కూటమి గెలుపొంది అందరికి షాకిచ్చింది. దీంతో ఇప్పుడు మోడీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్లందరూ ఒక్కటయ్యేవిధంగా నితీశ్ వ్యూహం సిద్ధం చేస్తున్నట్లు కనిపిస్తోంది. దీనిలోభాగంగానే ఈ నెల 20న జరగబోయే తన ప్రమాణస్వీకారానికి పలువురు  రాష్ట్రాల నేతల్ని ఆహ్వానించనున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ.. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ కి నితీశ్ ఆహ్వానం పంపారు. దానికి  వారినుండి గ్రీన్ సిగ్నల్ కూడా వచ్చినట్టు తెలుస్తోంది. అంతేకాదు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్.. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్.. అసోం ముఖ్యమంత్రి తరుణ్ గోగాయ్.. హాజరు కానున్నారు. ఇదిలా ఉండగా నితీశ్ తన ప్రమాణస్వీకారానికి మోడీని ఆహ్వానించనున్నట్టు తెలుస్తోంది. మరి నితీశ్ ఆహ్వానించిన నేపథ్యంలో మోడీ ఎలా స్పందిస్తారో చూడాలి.

తలసాని అనర్హుడు.. హైకోర్టు నోటీసులు

తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ నుండి ఎమ్మెల్యేగా గెలుపొంది.. ఆ పదవికి రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లోకి మారి అక్కడ మంత్రి పదవిని కొనసాగిస్తున్నారు. ఇది అందరికి తెలిసిన విషయమే. ఈ వ్యవహారంపై ఎన్నో వివాదాలు.. ఆరోపణలు చాలానే జరిగాయి. అయితే ఇప్పుడు తలసాని రాజీనామాపై హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తలసాని రాజీనామా చేయకుండానే టీఆర్ఎస్ లో మంత్రి పదవిలో కొనసాగుతున్నాడని.. మంత్రి పదవికి తలసాని అనర్హుడని డాక్టర్ తంగెళ్ల శివ ప్రసాద్ రెడ్డి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారణ జరిపిన హైకోర్టు నాలుగు వారాల్లోగా నివేదిక ఇవ్వాలని తలసానికి నోటీసులు జారీ చేసింది. మరి ఇప్పుడైన తలసాని స్పందిస్తారో లేదో చూడాలి.

ఆ స్థోమత నాకు లేదు.. పవన్ కళ్యాణ్

బీజేపీ ఇచ్చిన హామీలను తప్పకుండా నెరవేర్చాల్సిందే అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పైవిధంగా స్పందించారు. అంతేకాదు ప్రజలకు చెడు జరిగితే మాట్లాడటానికి తను అస్సలు వెనుకాడనని అన్నారు. ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం ఏ మాత్రం పట్టించుకోలేదు.. కేంద్ర ప్రభుత్వానికి డెడ్ లైన్ పెట్టే స్థాయి నాకు లేదు.. కానీ పద్దతి ప్రకారమే ఏదైనా సాధించుకోవాలి అని సూచించారు. జనసేనను రాజకీయ పార్టీగా విస్తరించే స్థోమత నాకు లేదు.. 2019 నాటికి పూర్తిస్థాయిలో విస్తరించడానికి ప్రయత్నిస్తా అని అన్నారు.

అభినందనలు తెలిపేందుకే కలిశా.. పవన్ కళ్యాణ్

ఏపీ సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్ భేటీ ముగిసింది. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడుతూ.. అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి తాను రాని కారణంగా.. చంద్రబాబుకు అభినందనలు తెలియజేయడానికి కలిశానని వివరించారు. ముఖ్యంగా బాక్సైట్ తవ్వకాలపై చర్చించాం.. గిరిజనులు జీవితాలు దెబ్బతినకుండా చూడాలని చంద్రబాబును కోరానని చెప్పారు. అంతేకాదు ఏపీ ప్రత్యేక హోదా పై కూడా చర్చించామని.. ప్రధాని మోడీ నుండి తుది ప్రకటన వచ్చాక స్పందిస్తామన్నారు. నా దృష్టికి వచ్చిన సమస్యలు సీఎం ముందుంచా.. దానికి చంద్రబాబు సానుకూలంగా స్పందిచారని పవన్ తెలిపారు. కాగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై ఎలాంటి చర్చ జరగలేదని తెలిపారు.

ప్రత్యేక రాయలసీమపై మైసురా హడావుడి అందుకే తగ్గిందా?

  నిన్న మొన్నటి దాకా ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం అంటూ తెగ హడావుడి చేసిన మైసురారెడ్డి వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. రాయలసీమ రాష్ట్రం సాధన కోసం సొంతంగా పార్టీ పెట్టాలని చూసిన ఆయన ఇప్పుడు మౌనంగా ఉన్నారు. దీనికి కారణం లేకపోలేదు. అసలు జగన్ చేసే పోరాటాలనే ఎవరూ పట్టించుకునేవారు లేరు.. ఇంక మైసురా ను ఎవరూ పట్టించుకుంటారు. కనీసం ప్రజలు కాదు కదా.. మైసురా చేసిన ఆలోచనలకు తమ పార్టీ మిగతా నాయకులనుండే సరైన స్పందన రాలేదు. దీంతో ఆయన కూడ వెనక్కి తగ్గినట్టు తెలుస్తోంది. ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కోసం ఉద్యమించడమే తన లక్ష్యం అంటూ మైసురా చేసిన వ్యాఖ్యలు అందరికి తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలను మాత్రం ఓ ఇంగ్లీష్ దినపత్రిక మాత్రం సీరియస్ గా తీసుకొని మైసురా ఇంటర్య్వూని ప్రచురించింది. దీంతో మైసురా రాయలసీమ సాధన కోసం నాయకత్వం వహించడం ఖాయమని అందరూ అనుకున్నారు. అయితే విచిత్రమేంటంటే.. తాను ఎలాంటి పత్రికకు ఇంటర్య్వూ ఇవ్వలేదని.. దాని గురించే వివరణ కోరేందుకు ప్రయత్నిస్తున్నామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ఇప్పుడు రాయలసీమ సాధన కోసం పోరాడతానన్న మైసురా ఇలా ఎందుకు మాట్లాడారా అని ఆశ్చర్యపోయారు. అయితే ఇంత సడెన్ గా మైసూరా యూటర్న్ తీసుకోవడానికి కారణం తన ఉద్యమానికి సరైన రెస్పాన్స్ రాకపోవడమే అని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మొత్తానికి ఏదో హడావుడి చేసిన మైసురాకి ఇప్పుడు అవన్నీ వర్కవుట్ కావని బాగా అర్ధమయినట్టుంది.