‘అఖిల్’ షార్ట్ అండ్ స్వీట్ రివ్యూ
యూనిట్: అఖిల్, సయేషా సైగల్, రాజేంద్ర ప్రసాద్, మహేష్ మంజ్రేకర్, దర్శకత్వం : వి.వి.వినాయక్, నిర్మాత : శ్రేష్ట్ మూవీస్, సంగీతం : అనూప్ రుబెన్స్, థమన్.
అక్కినేని నాగేశ్వరరావు మనవడు, అక్కినేని నాగార్జున కుమారుడు ‘సిసింద్రీ’ ద్వారా చిన్నప్పుడే సినీ రంగ ప్రవేశంచేసి ‘మనం’లో తళుక్కున మెరిసిన అఖిల్ అక్కినేని యంగ్ హీరోగా నటించిన తొలి సినిమా ‘అఖిల్’ దీపావళి నాడు విడుదలైంది.
ఈ సినిమా సోషియో ఫాంటసీ బ్యాక్‌డ్రాప్‌తో నడిచే లవ్ స్టోరీతో రూపొందింది. కథ విషయానికి వస్తే సంతోషంగా జీవితాన్ని గడిపే మామూలు కుర్రాడు అఖిల్ జీవితంలోకి సయేషా ప్రవేశిస్తుంది. ఆమెని ప్రేమించిన అఖిల్ ఆమె ప్రేమను పొందుతాడు. ఇంతో సయేషాని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేస్తారు. ఆఫ్రికాకి తరలిస్తారు. తన ప్రియురాలిని వెతుక్కుంటూ అఖిల్ ఆఫ్రికా వెళ్తాడు. అక్కడ అఖిల్‌కి అనేక కొత్త కొత్త విషయాలు తెలుస్తాయి. కథ మలుపులు తిరుగుతుంది.
నటుడిగా అఖిల్ తన మీద ఉన్న బాధ్యతకు పూర్తి న్యాయం చేశాడు. డ్యాన్స్, ఫైట్స్ తో పాటు డైలాగ్ డెలివరీ బాడీలాంగ్వేజ్ వంటి విషయాల్లో కూడా మంచి ఈజ్ కనబరిచాడు. హీరోయిన్ సయేషా సైగల్ కూడా మంచి నటన కనబరిచింది. డ్యాన్స్ల్లో అఖిల్‌తో పోటీ పడింది. బ్రహ్మనందం, జయప్రకాష్ రెడ్డి కామెడీ, మహేష్ మంజ్రేకర్ విలనీ ఆకట్టుకుంటాయి. రాజేంద్రప్రసాద్ మరోసారి మంచి పాత్రలో నటించారు. అనూప్, థమన్లు కమర్షియల్ సాంగ్స్‌తో అలరించి, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కూడా చాలా జాగ్రత్తలు తీసుకున్నారు.