పారిస్ దాడిపై ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు..జల్సాలు చేసినపుడు తెలియలేదా?

  ఈ మధ్య ఏదో ఒక అంశంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం.. వార్తల్లో నిలవడం రాజకీయ నేతలకు పరిపాటైపోయింది. ఒకపక్క పారిస్ లో ఉగ్రవాదులు దాడి జరిపి మారణహోమం సృష్టించగా అక్కడి ప్రజలు భయాందోళనతో ఉంటే ఇప్పుడు ఈ ఘటనపై ఉత్తరప్రదేశ్ సీనియర్ మంత్రి ఆజంఖాన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సిరియా, ఇరాక్ దేశాల్లో ఉన్న చమురు నిల్వలు దోచుకొని.. ఆ దేశాల్లోని చమురు క్షేత్రాలను ఆక్రమించి.. ఆ డబ్బుతో పారిస్‌లో జల్సాలు చేసిన రోజున, ఈ పరిస్థితి వస్తుందని ఊహించలేదా? అని ఆజంఖాన్ ప్రశ్నించారు. అమెరికా వంటి అగ్రరాజ్యాలు చేసిన చర్యలకు ప్రతిఫలమే పారిస్ లో ఉగ్రవాదుల దాడి అని.. ఇప్పుడైనా అగ్రరాజ్యం ఈ చర్యలను గుర్తించాలని అన్నారు. ఇరాక్, సిరియాలోని ఐఎస్ఐఎస్ ప్రాబల్య ప్రాంతాల్లో విధ్వంసం సృష్టిస్తుండటంతో అమాయక పౌరులు ప్రాణాలు కోల్పోవడమే కాదు.. వేలమంది నిరాశ్రయులను చేసింది. దీనిని ఎలా సమర్థించుకుంటారు?' అని ఆజంఖాన్ పేర్కొన్నారు.

బీహార్ లో ఏం జరిగింది.. వాళ్లు అధికారంలోకి రాలేదా..

  బీహార్ ఎన్నికల్లో మహా కూటమి విజయం సాధించిన సంగతి తెలసిందే. ఇప్పుడు అదే తరహాలో ఎన్నికల్లో పోటీ చేయాలని ఉత్తర ప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. 2017 లో జరిగే అసెంబ్లీ ఎన్నికలకు గాను వివిధ పార్టీలతో పొత్తు పెట్టుకుని.. మహాకూటమిగా ఏర్పడి బరిలోకి దిగుతామని అఖిలేష్ యాదవ్ అన్నారు. అయితే పొత్త పెట్టుకుంటామని చెప్పారు కాని ఏ పార్టీలతో పొత్తు పెట్టుకుంటారన్న విషయం చెప్పడానికి మాత్రం నిరాకరించారు. అయితే ఇదే విషయంతో మంత్రి ఫరీద్ మహపూజ్ కిద్వాయ్ మాట్లాడుతూ సమాజ్ వాదీ-బీఎస్పీల మద్య పొత్తు ఉంటుందని తెలిపారు. అయితే సమాజ్ వాదీ-బీఎస్పీ పార్టీల మధ్య ఉన్న సఖ్యత అందరికి తెలిసిందే. రెండు పార్టీల మధ్య పచ్చగడ్డివేస్తే భగ్గుమనే పరిస్థితి. ఇదే విషయాన్ని మంత్రి గారి ముందు ఉంచగా  బీహార్ లో ఇప్పుడు ఏమి జరిగింది.. బీహార్ లో జేడీయూ- అర్జేడీలు పరిస్థితి కూడా అంతే.. కానీ పొత్తు పెట్టుకొని ఎన్నికల్లో గెలిచి అధికారంలోకి రాలేదా అని తిరిగి ప్రశ్నించి అందరూ షాకయ్యేలా చేశారు. ప్రజలు అభివృద్ధిని చూసి ఓట్లు వేస్తారని.. బీహార్ ఎన్నికల్లో అదే జరిగిందని.. మేము అభివృద్ది ఎజెండాతోనే ఎన్నికల బరిలోకి దిగుతామని అన్నారు. మొత్తానికి బీహార్ ఎన్నికలు మాత్రం రాజకీయాల్లో పలు మార్పులనే తీసుకొస్తున్నాయని చెప్పొచ్చు.

గవర్నర్ కూడా ఓ ఇల్లు అడిగారు.. కేసీఆర్

  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సికింద్రాబాద్ లోని ఐడీహెచ్ కాలనీలో డబులు బెడ్ రూం ఇళ్లను ప్రారంభించారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల లబ్దీదారులకు పట్టాలను అందజేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పేదలు కూడా ఆత్మగౌరవంతో బతకాలన్నదే ప్రభుత్వం లక్ష్యం.. అందుకే వారికోసం డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టించాం అని అన్నారు. ఇక నుండి పేదలకు కట్టించే ఇళ్లు డబుల్ బెడ్ రూం ఇళ్లే ఉంటాయి అని తెలిపారు. ఈ ఏడాది 60 వేల ఇళ్లు నిర్మించాలన్నది ప్రభుత్వం లక్ష్యమని.. నియోజక వర్గానికి 400 ఇళ్ల చొప్పున డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మిస్తామని అన్నారు. అంతేకాదు తనకూ ఓ ఇల్లు మంజూరు చేయండని గవర్నర్ అడిగారని.. కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు సైతం ఈ డబుల్ బెడ్ రూం ఇళ్ల పథకాన్ని ప్రశంసించారని.. కేంద్రం సహాయంతో రాష్ట్ర వ్యాప్తంగా డబుల్ బెడ్ రూం ఇల్లు నిర్మిస్తామని కేసీఆర్ అన్నారు.

రాజీనామాకు రెడీ.. కేటీఆర్

  వరంగల్ ఉపఎన్నికలో భాగంగా ప్రచారానికి వెళ్తున్న టీఆర్ఎస్ నేతలను ప్రజలు ప్రశ్నలు అడుగుతున్నారని.. టీఆర్ఎస్ నేతలను నిలదీస్తున్నారని అంటూ వస్తున్న వార్తలను తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖండించారు. ఆ వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. అది కేవలం మీడియా సృష్టే అని మండిపడ్డారు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ప్రచారంలో పాల్గొన్న ఆయన పైవిధంగా స్పందించారు. తమ ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టుగానే పాలిస్తుందని.. కావాలనే ప్రతిపక్షాలు ఇలాంటి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. అంతేకాదు ఎన్నికలో వరంగల్ అభ్యర్ధి కనుక ఓడిపోతే తాను మంత్రి పదవికి రాజీనామా చేస్తానని.. అలాగే కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేస్తారా అంటూ సవాల్ విసిరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడి ఇప్పడికి ఏడాదిన్నర పైన అవుతుంది... ఇప్పటివరకూ ప్రధాని మోడీ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది లేదు.. కనీసం తెలంగాణ గురించి మాట్లాడింది లేదు.. అలాంటిది బీజేపీ నేతలు ఏ మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారు.. అసలు వారికి ఓట్లు అడిగే హక్కు కూడా లేదని తేల్చి చెప్పారు.

తన తప్పును సరిచేశాడని ఎమ్మెల్యేని పొట్టలో గుద్దిన హీరో..

  తన తప్పును సరిచేయడానికి చూసిన సొంత పార్టీ ఎమ్మెల్యేను పొట్టలో గుద్ది మీడియాకి ఎక్కారు డీఎండీకే అధ్యక్షుడు, తమిళ నటుడు విజయకాంత్‌. అసలు విషయం ఏంటంటే.. ఇటీవల తమిళనాడులో భారీ వర్షాలు కురిసిన సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు గాను తమిళనాడు కడలూరు లో అనేక గ్రామాల ప్రజలు నిరాశ్రయులయ్యారు. ఈ నేపథ్యంలో విజయకాంత్ ఆ గ్రామాల ప్రజలను పరామర్శించడానికి వెళ్లారు. అయితే అక్కడ ప్రజలను ఉద్దేశించి విజయకాంత్ మాట్లాడుత్న సమయంలో తప్పులు దొర్లాయి. దీంతో పక్కనే ఉన్న శివకుళందై అనే ఎమ్మెల్యే విజయకాంత్ తప్పులను సరిచేయడానికి చూశారు. అంతే విజయకాంత్ వెంటనే ఆ ఎమ్మెల్యే వీపుపై గట్టిగా ఒక దెబ్బ వేసి.. పొట్టలో ఒక గుద్దు గుద్దారు. దాంతో ఎమ్మెల్యేకి ఎం చేయాలో తెలీకా క్వశ్చన్ మార్క్ ఫేస్ తో నిల్చుండిపోయారట. కాగా విజయకాంత్  కు ఇలాంటి పనులు చేయడం కొత్తేమి కాదని.. ఆయన మధ్యమ ప్రియుడు కావడంతో మద్యం పుచ్చుకోవడం వల్ల ఇలా ప్రవర్తిస్తూ ఉంటాడని.. తరచూ ఇలాంటి వివాదాలతో మీడియాకి ఎక్కుతూనే ఉంటారని అనుకుంటున్నారు.

గంగిరెడ్డి ఆస్తులు రూ.400 కోట్ల ఉండొచ్చు.. డిజిపి రాముడు

  అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ కొల్లం గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గంగిరెడ్డిని పోలీసులు మీడియా ముందు ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా డిజిపి రాముడు మాట్లాడుతూ ఎర్రచందనం కేసులో గంగిరెడ్డి 2014లోనే అరెస్ట్ అయ్యాడని.. ఆ తరువాత బెయిల్ ద్వారా బయటకు వచ్చి విదేశాలకు పారిపోయాడని అన్నారు. అలా తాను ఒక దేశం నుండి మరో దేశానికి వెళ్తూ చివరికి మారిషన్ చేరుకున్నాడని.. మారిషన్లో గంగిరెడ్డిని పట్టుకోవడంలో అధికారులు బాగా సహకరించారని అన్నారు. గంగిరెడ్డి దొంగసారా నుంచి హత్యాయత్నం వరకు మొత్తం 28 కేసులు ఉన్నాయన్నారు. గంగిరెడ్డి ఆస్తులు రూ.400 కోట్ల వరకు ఉండొచ్చు అని తెలిపారు. అయితే, ఆయన ఆస్తుల పైన ఈడీ విచారణ చేస్తోందని, అప్పుడే అసలు ఎన్ని ఆస్తులున్నాయో తేలుతుందన్నారు.

జగన్ గంగలో దూకితే నేను దూకుతా.. కొడాలి నాని

గుడివాడలోని వైసీపీ కార్యలయం వివాదం నేపథ్యంలో కొడాలి నాని టీడీపీ నేతలపై ఫైర్ అయ్యారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ ప్రభుత్వం నన్ను టార్గెట్ చేసిందని అన్నారు. వైఎస్సార్ సీపీ లోకి వెళ్లిన ఎమ్మెల్యేలపై కేసులు పెట్టి వేధిస్తున్నారని.. భూమారెడ్డి, రోజాను కూడా టార్గెట్ చేశారు అని వ్యాఖ్యానించారు. నేను రెండు నెలల్లో భవనం ఖాళీ చేసి యజమానురాలికి ఇస్తానని చెప్పాను.. ఇంతలోనే టీడీపీ నేతలు చిల్లర రాజకీయాలు చేస్తున్నారని.. దమ్ముంటే 2019 ఎన్నికల్లో గుడివాడ నుండి చంద్రబాబు పోటీ చేయాలని అన్నారు. ఎంత మంది బుద్దా వెంకన్నలు వచ్చినా ఎవరికీ భయపడనని చెప్పారు. త్వరలోనే నా విశ్వరూపం చూపిస్తా అని.. రాజకీయాల్లో ఉన్నంతకాలం జగన్ తోనే ఉంటాం.. జగన్ గంగలో దూకితే నేను కూడా గంగలో దూకుతా.. ఒకవేళ జగన్ ను వీడాల్సి వస్తే రాజకీయాలనుండే తప్పుకుంటా అని అన్నారు. ఎన్టీఆర్ తర్వాత నేను అభిమానించే వ్యక్తి జగన్ అని అన్నారు.

ఏమాత్రం తగ్గని మోడీ ఇమేజ్..!

  బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఘోర పరాజయం పొందిన నేపథ్యంలో మోడీ దూకుడికి ఇక బ్రేకులు పడ్టట్టే  అనుకున్నారు. కానీ అది ఊహ మాత్రమే అని తెలిసేలా చేశారు మోడీ మరోసారి. సాధారణంగా మోడీ విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు అక్కడ ఉన్న ప్రవాస భారతీయులు మోడీ జపంతో ఊగిపోతారు. అయితే బీహార్ ఎన్నికల్లో ఓడిపోవడంతో ఈసారి అలాంటి వాటికి బ్రేక్ పడుతుందనుకున్నారు. కానీ తాజాగా బ్రిటన్ పర్యటనలో ఉన్న మోడీకి మాత్రం ఘన స్వాగతం లభించింది. అంతేకాదు బ్రిటన్ లోని వెంబ్లే బహిరంగ సభలో మోడీ చేసిన ప్రసంగానికి మంచి స్పందన లభించింది.  ప్రవాస భారతీయుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేపడుతున్నామని.. ప్రవాస భారతీయులు స్వచ్ఛ్ భారత్ కోసం ఎంతో కృషి చేస్తున్నారని.. అహ్మాదాబాద్ నుంచి లండన్ కు డైరెక్ట్ విమాన సర్వీసును డిసెంబరు 15 నుంచి ప్రారంభించబోతున్నామని ప్రవాస భారతీయులను ఉద్దేశించి మోడీ చేసిన ప్రసంగానికి ఎన్నారైలు ఆనందం వ్యక్తం చేశారు. అంతేకాదు దీనికి సంబంధించి బాలీవుడ్ నటుడు రిషీ కపూర్ కూడా తన ట్విట్టర్లో ట్వీట్స్ చేశాడు. బ్రిటన్ పార్లమెంటును ఉద్దేశించి ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ప్రసంగం అద్భుతమని, ఆయన చేసిన ప్రసంగానికి భారతీయుడుగా గర్విస్తున్నానని ఆయన ట్వీట్ చేశారు. మొత్తానికి బీహార్ ఎన్నికల్లో ఓడిపోయినా కాని మోడీ ఇమేజ్ మాత్రం ఏ మాత్రం తగ్గలేదని తెలుస్తోంది.

వైఎస్సార్ కార్యాలయం వివాదం.. ఏం చేస్తారో చేసుకోండి.. కొడాలి నాని

కృష్ణాజిల్లా, గుడివాడలోని వైఎస్సార్ కార్యాలయం వివాదంగా మారింది. వైఎస్సార్ కార్యాలయాన్ని ఖాళీ చేయించి.. కార్యలయం పేరు తొలగించి.. రంగులు వేయించి పోలీసులు యజమానురాలికి అప్పగించారు. దీంతో కొడలి నాని పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ సీఎం చంద్రబాబు కావాలనే పోలీసులను పంపి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు.. కార్యాలయం  తాళం పగలకొట్టి ఇప్పటి నుండి నేను ఇక్కడే ఉంటాను.. దమ్ముంటే ఏం చేస్తారో చేసుకోండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. దీంతో టీడీపీ నేతలు కూడా కొడాలి నానికి ప్రతిసవాల్ విసిరారు. ఈ సందర్బంగా టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ కార్యాలయం దగ్గర ప్రెస్ మీట్ పెట్టి మరీ కొడాలి నాని అక్రమాలను భయటపెడతామని అన్నారు. దీనిలో భాగంగానే బుద్దా వెంకన్న, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు.. ఇంకా పలువురు టీడీపీ కార్యకర్తలు కార్యలయం వద్దకు చేరుకున్నారు. దీంతో వివాదం ముదరడంతో గుడివాడలో భారీగా పోలీసులు మొహరించారు.

నేటి నుండి వరంగల్ ఉప ఎన్నికల ప్రచారంలో జగన్

  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడ ఏ మూల చిన్న సంఘటన జరిగినా హైదరాబాద్ నుండి రెక్కలు కట్టుకొని ఎగిరి వచ్చేసి అక్కడ వాలిపోయే వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఎన్నడూ పక్కనే ఉన్న తెలంగాణా జిల్లాలలో తెలంగాణా జిల్లాలలో పర్యటించలేదు...ప్రజా సమస్యలపై పోరాడలేదు. కనీసం తెలంగాణా వైకాపా నేతలు కూడా ప్రజా సమస్యల పోరాడలేదు. కారణాలు అందరికీ తెలిసినవే. తెలంగాణాలో తన ఉనికే చాటుకోవడానికి ఇష్టపడని వైకాపా ఇప్పుడు వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తుండటం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కానీ అది ఎందుకు పోటీ చేస్తోందో కారణాలు అందరికీ తెలుసు.   వైకాపా తరపున నల్లా సూర్య ప్రకాష్ వరంగల్ ఉప ఎన్నికలలో పోటీ చేస్తున్నారు. అతనికి మద్దతుగా వైకాపా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి నేటి నుండి వరుసగా నాలుగు రోజుల పాటు వరంగల్ లోక్ సభ నియోజక వర్గం పరిధిలో గల 7 అసెంబ్లీ నియోజక వర్గాలలో ప్రచారం చేస్తారు. మొదటి రోజు పరకాల, హన్మకొండ, వరంగల్, స్టేషన్ ఘన్ పూర్ లలో రోడ్ షోలు నిర్వహించి, తొర్రూరులో బహిరంగ సభలో పాల్గొంటారు.   రేపు పరకాల నియోజక వర్గంలోని ఆత్మకూరు నుండి ప్రచారం మొదలుపెట్టి శాయంపేట, రేగొండ, భూపాలపల్లిలలో రోడ్ షోలు నిర్వహిస్తారు. చివరగా పరాకాలలో ఒక భారీ బహిరంగ సభ నిర్వహిస్తారు. బుదవారం నాడు పరకాల నియోజక వర్గంలో సంగెం, గీసుగొండ మండలాలో ప్రచారం చేసిన తరువాత గ్రేటర్ వరంగల్ పరిధిలో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. ఆ మరునాడు హన్మకొండ, కాజీపేట, ధర్మాసాగర్ లలో ప్రచారం చేస్తారు. స్టేషన్ ఘన్ పూర్ లో ఒక బహిరంగ సభ నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం తిరిగి హైదరాబాద్ చేరుకొంటారు.

వైకాపా గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని అరెస్ట్

  గుడివాడ పోలీసులు స్థానిక ఎమ్మెల్యే కొడాలి నానిని ఆదివారం గుడివాడలో అరెస్ట్ చేసారు. గుడివాడలో సుశీల అనే ఆమెకు చెందిన ఒక భవనంలో వై.యస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఏర్పాటు చేసుకొన్నారు. కానీ గత కొన్ని నెలలుగా ఆ భవనానికి వైకాపా నేతలు అద్దె చెల్లించడం లేదు. దానితో ఆమె తన భవనాన్ని ఖాళీ చేయమని కోరుతున్నారు. కానీ వైకాపా నేతలు పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులకు పిర్యాదు చేసి వైకాపా కార్యాలయానికి తాళం వేసేసారు. ఆమె అభ్యర్ధన మేరకు ఆ భవనం వద్ద పోలీసులు మొహరించారు. ఆ సంగతి తెలుసుకొన్న కొడాలి నాని తన అనుచరులతో కలిసి అక్కడికి వచ్చి తమకు తెలియజేయకుండా తమ పార్టీ కార్యాలయానికి తాళం వేసినందుకు ఆమెతో, పోలీసులతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కొడాలి నానిని అరెస్ట్ చేసి ముదినేపల్లి పోలీస్ స్టేషన్ కి తరలించారు. వైకాపాను అప్రదిష్టపాలుజేయడానికే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తమ పార్టీ కార్యాలయానికి పోలీసుల చేత మూసివేయించారని ఆరోపించారు.

ఏపి పోలీసుల అదుపులో స్మగ్లర్ గంగిరెడ్డి

  అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మరియు 2003సం.లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో నిదితుడు కొల్లం గంగిరెడ్డిని రాష్ట్ర సిఐ.డి. అదనపు డిజి ద్వారకా తిరుమల రావు మారిషస్ నుండి డిల్లీ మీదుగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తీసుకువచ్చేరు. అతను గత 15 ఏళ్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా అతనిపై గత ఏడాది వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు.   గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడి నెలరోజుల పాటు జైల్లో ఉన్నాడు. మే 18వ తేదీన బెయిలుపై బయటకు వచ్చి వెంటనే నకిలీ పాస్ పోర్ట్ తో విదేశాలకు పారిపోయాడు. రాష్ట్ర పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో మారిషస్ నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయి మళ్ళీ అక్కడ జైలు పాలయ్యాడు. అతనిని రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు సుమారు ఏడాదిగా ఏపి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర సి.ఐ.డి. తరపున న్యాయవాది, పోలీస్ ఉన్నతాధికారులు మారిషస్ వెళ్లి అక్కడి న్యాయస్థానంలో గంగిరెడ్డిపై రాష్ట్రంలో నమోదయిన కేసుల గురించి వివరించి అక్కడి కోర్టు అనుమతితో అతనిని ఆదివారం హైదరాబాద్ కి తిరిగి తీసుకురాగలిగారు.   అతను ఎర్రచందనం స్మగ్లింగ్, నకిలీ పాస్ పోర్ట్, చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వంటి అనేక కేసులలో నిందితుడుగా ఉన్నాడు. పోలీసులు అతనిని రేపు పొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి అతనిపై ఉన్న అనేక కేసులలో విషయంలో ప్రశ్నించేందుకు అతని కస్టడీ కోరుతారు.

టీఆర్ఎస్ నిబంధనలను ఉల్లంఘిస్తోంది.. రేవంత్ రెడ్డి

తెలంగాణ టీడీపీ నేత రేవంత్ రెడ్డి టీఆర్ఎస్ పార్టీ నేతలపై మండిపడ్డారు. టీఆర్ఎస్ నేతలు తమ ఛానెళ్లలో వార్తలను ప్రసారం చేస్తూ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తోందని.. ప్రచారంలో పరిమితికి మించి ఎక్కువ ఖర్చు చేస్తున్నారని.. టీఆర్ఎస్ నేతలపై ఎన్నికల సంఘం అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. అంతేకాదు టీన్యూస్, నమస్తేతెలంగాణ పత్రికల్లో తమ వార్తలు ప్రచురిస్తున్నారని.. వాటిని పెయిడ్‌న్యూస్‌గా పరిగణించాలని డిమాండ్ చేశారు. కాగా ఈ విషయంపై ఎన్నికల ప్రధాన కార్యదర్శి భన్వర్ లాల్ ను టీ టీడీపీ, బీజేపీ నేతలు కలిశారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉపఎన్నిక టీఆర్ఎస్ నేతలు ఎన్నికలు కోడ్ ను ఉల్లంఘించారు అంటూ ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది.

ఎన్నికల్లో పోటీ చేసినందుకు జుట్టు కత్తిరించారు.. ఎక్కడ?

  ఎన్నికల్లో పోటీ చేయడమే ఆమె చేసిన తప్పు. అందుకే ఆమెను కట్టేసి జట్టు కత్తిరించారు ప్రతిపక్షపార్టీ నేతలు. ఇంతకీ ఎవరామె.. ఎక్కడ ఆ ఘటన జరిగింది అనుకుంటున్నారా? వివరాల ప్రకారం. కేరళలో ఇటీవల జరిగిన స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు సతికుమారి (50) గ్రామ పంచాయితీ ఎన్నికలలో సీపీఎం అభ్యర్థిపైపోటి చేశారు. దీంతో ఆమెపై సీపీఎం నాయకులు దారుణంగా ఆఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆమెను పట్టుకొని కట్టేసి జుట్టు కట్ చేశారు. దీంతో ఈ విషయంపై కేరళ ముఖ్యముంత్రి ఉమెన్ చాందీ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కమ్యూనిస్టు పార్టీలకు ప్రత్యర్థి పార్టీల మీద అసహనం పెరిగిపోతోందని చెప్పడానికి ఈ ఘటనే నిదర్శనమని.. ఇలాంటి సంఘటనలను తాము చూస్తూ ఊరుకోమని నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పారు. ఆశ్చర్య ఏంటంటే సతికుమారి ఎన్నికల్లో ఓడిపోయినా కూడా సీపీఎం అభ్యర్ధులు మాత్రం ఎన్నికల్లో పోటీ చేస్తావా అంటూ దాడి చేశారు.

ఎమ్మెస్సార్ వృద్దాప్యంలో ఉన్నారు.. గుత్తా

  తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత ఎం. నారాయణ కేసీఆర్ ను ప్రశంసించిన సంగతి తెలిసింది. వరంగల్ ఉపఎన్నిక ప్రచారంలో భాగంగా ఎమ్మెస్సార్.. కేసీఆర్ పథకాలు ప్రజలకు ఉపయోగపడుతున్నాయని.. ప్రతిపక్షాలు విమర్శించాలి కాబట్టి విమర్శిస్తున్నాయని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఎమ్మెస్సార్ చేసిన వ్యాఖ్యలపై ఆపార్టీనేత, పార్లమెంట్ సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మండిపడ్డారు. ఎమ్మెస్సార్ క్రియాశీల రాజకీయాలనుండి ఎప్పుడో తప్పుకున్నారని.. ఆయన వృద్దాప్యంలో ఉన్నారు.. అందుకే ఆయనకు కేసీఆర్ పాలనపై సరైన అవగాహన లేదని విమర్శించారు. ఈ వయసులో ఆయనకు నోటీసులు జారీ చేయాల్సిన అవసరం కూడా లేదని అన్నారు. మరి గుత్తా చేసిన వ్యాఖ్యలకు ఎమ్మెస్సార్ ఎలా సమాధానం చెబుతారో చూడాలి.