ఏపి పోలీసుల అదుపులో స్మగ్లర్ గంగిరెడ్డి
posted on Nov 15, 2015 @ 6:01PM
అంతర్జాతీయ ఎర్రచందనం స్మగ్లర్ మరియు 2003సం.లో చంద్రబాబు నాయుడుపై అలిపిరిలో జరిగిన బాంబు దాడిలో నిదితుడు కొల్లం గంగిరెడ్డిని రాష్ట్ర సిఐ.డి. అదనపు డిజి ద్వారకా తిరుమల రావు మారిషస్ నుండి డిల్లీ మీదుగా ఆదివారం మధ్యాహ్నం హైదరాబాద్ తీసుకువచ్చేరు. అతను గత 15 ఏళ్లుగా ఎర్ర చందనం స్మగ్లింగ్ చేస్తున్నప్పటికీ, కొందరు ప్రముఖ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉన్న కారణంగా అతనిపై గత ఏడాది వరకు ఎటువంటి కేసులు నమోదు కాలేదు.
గత ఏడాది ఏప్రిల్ నెలలో ఎర్రచందనం స్మగ్లింగ్ కేసులో కర్నూలు పోలీసులకు పట్టుబడి నెలరోజుల పాటు జైల్లో ఉన్నాడు. మే 18వ తేదీన బెయిలుపై బయటకు వచ్చి వెంటనే నకిలీ పాస్ పోర్ట్ తో విదేశాలకు పారిపోయాడు. రాష్ట్ర పోలీసులు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయడంతో మారిషస్ నుండి పారిపోయేందుకు ప్రయత్నిస్తూ అక్కడి పోలీసులకు దొరికిపోయి మళ్ళీ అక్కడ జైలు పాలయ్యాడు. అతనిని రాష్ట్రానికి తిరిగి రప్పించేందుకు సుమారు ఏడాదిగా ఏపి పోలీసులు చేస్తున్న ప్రయత్నాలు ఫలించాయి. రాష్ట్ర సి.ఐ.డి. తరపున న్యాయవాది, పోలీస్ ఉన్నతాధికారులు మారిషస్ వెళ్లి అక్కడి న్యాయస్థానంలో గంగిరెడ్డిపై రాష్ట్రంలో నమోదయిన కేసుల గురించి వివరించి అక్కడి కోర్టు అనుమతితో అతనిని ఆదివారం హైదరాబాద్ కి తిరిగి తీసుకురాగలిగారు.
అతను ఎర్రచందనం స్మగ్లింగ్, నకిలీ పాస్ పోర్ట్, చంద్రబాబు నాయుడుపై హత్యా ప్రయత్నం వంటి అనేక కేసులలో నిందితుడుగా ఉన్నాడు. పోలీసులు అతనిని రేపు పొద్దుటూరు కోర్టులో హాజరుపరిచి అతనిపై ఉన్న అనేక కేసులలో విషయంలో ప్రశ్నించేందుకు అతని కస్టడీ కోరుతారు.