నటుడు వినోద్ కుమార్ అరెస్ట్
మామగారు, సీతారత్నం గారి అబ్బాయి, మౌనపోరాటం వంటి అనేక సినిమాలలో నటించిన ప్రముఖ నటుడు వినోద్‌కుమార్‌ను ఓ హత్యా ప్రయత్నం కేసులో పోలీసులు నిన్న పుత్తూరులో అరెస్టు చేశారు. ఆయన తన మేనేజర్ సచ్చిదానందను తన కారుతో గుద్దించి చంఫై, దానిని రోడ్డు ప్రమాదంగా చూపాలని ప్రయత్నించినట్లు పిర్యాదు అందడంతో పోలీసులు వినోద్‌కుమార్‌ను, అతనికి సహకరించిన ఉదయ్ అనే వ్యక్తిని అదుపులోకి తీసుకొని పుత్తూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు వారికి రెండు వారాల జ్యూడిషియల్ రిమాండ్ విధించింది. పోలీసులు వారిరువురినీ జైలుకి తరలించారు.
నటుడు వినోద్‌కుమార్ ఆర్ధిక లావాదేవీలను సచ్చిదానంద చూస్తున్నారు. గత కొంతకాలంగా వారి మధ్య వివాదాలు జరుగుతున్నాయి. అకౌంట్స్ నిర్వహణలో మేనేజర్ సచ్చిదానంద అవకతవకలకు పాల్పడుతున్నాడని వినోద్ కుమార్ అనుమానిస్తున్నారు. ఆ కారణంగానే తనను హత్య చేయడానికి ప్రయత్నించారని మేనేజర్ సచ్చిదానంద పిర్యాదు చేయడంతో, పోలీసులు వినోద్‌కుమార్ పై ఐపీసీ సెక్షన్లు 120 బి, 307 (హత్యాయత్నం) కింద కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసారు.