వరంగల్ ఉపఎన్నిక.. టీఆర్ఎస్ పై ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఫిర్యాదు
వరంగల్ ఉపఎన్నిక ప్రచారం ఈరోజు సాయంత్రం 5 గంటలకల్లా ముగియనుంది. అయితే ఈ ప్రచారం నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘన చిక్కుల్లో పడిందా అంటే అవుననే సంకేతాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. సాధారణంగా ఎన్నికల ప్రచారంలో పార్టీ నేతలు ఎవరికి వారు ఎక్కడా తగ్గకుండా మాటలు చెపుతుంటారు. కానీ ఈ విషయంలో తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్ నేతలకు మాత్రం కాస్త దూకుడు ఎక్కువనే చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ దూకుడుతనమే పార్టీని చిక్కుల్లో పడేసినట్టు తెలుస్తోంది.
సాధారణంగా ప్రచారంలో హామీలు ఇవ్వకూడని నేపథ్యంలో పలు అంశాలపై టీఆర్ఎస్ పార్టీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించిందని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల కమిషనర్ కు ఫిర్యాదులు అందజేసింది. క్రిస్మస్‌ను రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించడం, ఉస్మానియా విద్యార్థుల మెస్ ఛార్జీలను రద్దు చేయటం, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు జీఆర్‌ఈ, టోఫెల్ పరీక్షలకు శిక్షణ, కళ్యాణలక్ష్మి పథకంలోకి బీసీలను చేర్చటం, వరంగల్‌లోని కాళోజీ నారాయణరావు వైద్య కళాశాలకు వీసీ నియామకం తదితర అంశాలను ఫిర్యాదులో ప్రస్తావించింది. దీంతో రాష్ట్ర ముఖ్యఎన్నికల అధికారి భన్వర్‌లాల్ నివేదికలను పరిశీలించి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపారు. కేంద్ర ఎన్నికల సంఘం దీనిని పరిశీలించి దీనిపై వివరణ ఇవ్వాలని సూచించింది. మొత్తానికి అన్నిసందర్భాల్లో దూకుడు పనికిరాదని టీఆర్ఎస్ నేతలకు ఎప్పుడు అర్ధమవుతుందో.