టీ టీడీపీ నేతల కొత్త రికార్డ్..
రాజకీయ నేతలు బహిరంగ లేఖలు రాయడం సాధారణమే. కానీ ఇప్పుడు బహిరంగ లేఖలు రాయడంలో కూడా టీ టీడీపీ నేతలు సరికొత్త రికార్డును సృష్టించారు. అప్పుడెప్పుడో కాంగ్రెస్ పాలనలో వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు మాజీ ఎంపీ చేగొండి హరిరామజోగయ్య వైఎస్‌కు వరుసపెట్టి బహిరంగ లేఖలు రాసేవారు. ఆ తరువాత వైఎస్ మరణానంతరం కిరణ్ కుమార్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు మాజీ మంత్రి శంకర్ రావు బహిరంగ లేఖలు రాసి రికార్డు నమోదుచేశారు. ఇప్పుడు టీ టీడీపీ నేతలు ఆ రికార్డ్ ను సైతం బద్దలు కొట్టేశారు.
వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ కు టీ టీడీపీ నేతలు వరుసపెట్టి ఏకంగా తొమ్మిది బహిరంగ లేఖలు రాశారు. తెలంగాణ పార్టీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత మోత్కుపల్లి నరసింహులు సంయుక్తంగా ఒక లేఖ ను విడుదల చేశారు. రేవంత్ రెడ్డి, రమేశ్ రాథోడ్ మరో లేఖ, ఎర్రబెల్లి దయాకరరావు, ఒంటేరు ప్రతాపరెడ్డి పేరిట మరో లేఖ విడుదల అయ్యింది. అదేవిధంగా రావుల చంద్రశేఖరరెడ్డి, రేవూరి ప్రకాశ్ రెడ్డి ఒకటి, అమరనాథ్ బాబు, బుచ్చిలింగం వేరొక లేఖ, ఆర్.కృష్ణయ్య, వీరేందర్ గౌడ్ ఒక లేఖ, శోభారాణి, సీతక్క మరో లేఖ రాసి సరికొత్త సంప్రదాయానికి తెరదీశారు. మరి అంత కష్టపడి రాసిన టీడీపీ నేతల లేఖలకు సీఎం కేసీఆర్ సమాధానం చెపుతారో.. లైట్ తీసుకుంటారో చూడాలి.