చిత్తూరు మేయర్ పదవి ఎవరికి దక్కెనో?

చిత్తూరు మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ గురించి దర్యాప్తు ముమ్మరంగా సాగుతోంది. ఇప్పుడు అనురాధ హత్య నేపథ్యంలో ఇప్పుడు చిత్తూరు మేయర్ గా ఎవరికి అవకాశం దక్కుతుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ మేయర్ పదవి బీసీ కోటాలో రిజర్వ్ అయి ఉంది. కానీ అనురాధ భర్త మోహన్ ఓసీ వర్గానికి చెందిన వాడు.. ఈ నేపథ్యంలో అనురాధ తండ్రి బీసీ వర్గానికి చెందిన వాడు కావడంతో అది పరిగణలోకి తీసుకొని అనురాధకి మేయర్ పదవి ఇచ్చారు. ఇప్పుడు అనురాధ మరణానంతరం.. తన కోడలకి లేదా తన కూతురికో మేయర్ పదవి ఇవ్వాలని చూస్తున్నట్టు తెలుస్తోంది. అయితే అనురాధ కోడలు కూడా ఓసీ వర్గానికి చెందినదే.. దీంతో ఈమెకు మేయర్ పదవి వస్తుందో రాదో అని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు ఈ మేయర్ పదవికి పలు బీసి మహిళా కార్పొరేటర్లు కూడా ప్రయత్నాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో మొత్తం 8 మంది టీడీపీ మహిళా కార్పొరేటర్లు ఉండగా వారు కూడా మేయర్ కోసం ప్రయత్నాలు జరుపుతున్నట్టు.. దీనిలోభాగంగానే అనురాధ కుటుంబం తరుపున ఎవరి పేరును ఖరారు చేయని నేపథ్యంలో తమకు అవకాశం ఇవ్వాలని చంద్రబాబుతో మంతనాలు జరిపినట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి ఎలాగూ నిర్ణయం చంద్రబాబుదే కాబట్టి ఆ అవకాశం ఎవరికి దక్కుతుందో చూడాలి.

కేసీఆర్ వల్లే గెలిచాం.. దయాకర్

వరంగల్ ఉపఎన్నిక పోరులో దాదాపు టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ దే గెలుపు ఖాయమని స్పష్టంగా అర్ధమవుతోంది. ఇప్పటికే పార్టీ నేతలు బాణసంచా కాలుస్తూ.. డప్పులతో సంబరాలు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ వరంగల్ ప్రజలకు తాను రుణపడి ఉంటానని.. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలే తనను గెలిపించాయని ఆయన అన్నారు. తనను గెలిపించినందుకు ప్రజలకు ఉపయోగపడేలా పనిచేస్తానని.. కేసీఆర్ తనపై పెట్టిన బాధ్యతను నిర్వర్తించడానికి శాయశక్తులా కృషిచేస్తానని.. వరంగల్ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. అందరి సహకారంతోనే ఈ విజయం సాధించామని  ప్రజల కోసం, పార్టీ బలోపేతంకోసం కృషి చేస్తానని దయాకర్ స్పష్టం చేశారు. కాగా ఇప్పటివరకూ 16 రౌండ్ల ఓట్ల లెక్కింపు జరుగగా టీఆర్ఎస్ అభ్యర్ధి 4 లక్షల ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. కాంగ్రెస్ - 1,37,852 బీజేపీ - 1,12,880 వైసీపీ - 20,747

కేజ్రీవాల్ కు కౌగిలి కష్టాలు.. లాలూనే లాక్కొని కౌగిలించుకున్నారు

ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కి కౌగిలింత కష్టాలు వచ్చిపడ్డాయి. అదేంటీ అనుకుంటున్నారా.. బీహార్ ముఖ్యమంత్రిగా నితీశ్ కుమార్ ఈ నెల 20వ తేదీన పాట్నాలో ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి నితీశ్ కుమార్ పలువురు ప్రముఖుల్ని, ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులను కూడా పిలిచారు. దీంతో కేజ్రీవాల్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్, కేజ్రీవాల్ ఆలింగనం చేసుకున్నారు. అంతే కేజ్రీవాల్ పై విమర్శలు మొదలయ్యాయి. ఇతర పార్టీనేతలే కాదు.. సొంత పార్టీ నేతలు సైతం దాణా కుంభకోణంలో శిక్షపడిన కళంకిత నేత లాలూను ఎలా కౌగిలించుకుంటారని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నారంట. ఇక మీడియా అయితే ఒక మెట్టెక్కి  ‘నీతితో అవినీతి కౌగిలించుకున్న వేళ’ అంటూ ఒకటే ఏకిపారేశారు. దీంతో కేజ్రీవాల్ ఈ విషయంపై క్లారిటీ ఇవ్వక తప్పలేదు. ఆమ్‌ఆద్మీ పార్టీ జాతీయ మండలి సమావేశంలో పాల్గొన్న కేజ్రీవాల్ మాట్లాడుతూ నేనూ కావాలని కౌగిలించుకున్నది కాదని.. లాలూనే తనను లాక్కుని ఆలింగనం చేసుకున్నారని వివరణ ఇచ్చారు. పనిలో పనిగా లాలూపై అతని కొడుకులపై రెండు విమర్శల బాణాలు వదిలారు. నిజానికి తాము వారసత్వ రాజకీయాలకు వ్యతిరేకమని, పట్నాలో జరిగింది వారసత్వ రాజకీయమేనని, లాలూ ఇద్దరు తనయులు నితీశ్‌ కేబినెట్‌లో చోటు సంపాదించారని చెప్పారు. మరి కేజ్రీవాల్ ఇచ్చిన క్లారిటీతో అయినా ఆయనపై విమర్శలు చేయడం ఆపుతారో లేదో చూడాలి.

టీఆర్ఎస్ పై గుత్తా ఫైర్.. అవసరమైతే టీడీపీతో పొత్తు పెట్టుకుంటాం

వరంగల్ ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్ధి దయాకర్ దాదాపు 3 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో ఆధిక్యంలో ఉన్నారు. దాదాపు దయాకర్ గెలుపు ఖాయమని తెలుస్తోంది. అయితే టీఆర్ఎస్ గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నాయకుడు గుత్తా సుఖేందర్ రెడ్డి మాట్లాడుతూ అవినీతి, అధికార దుర్వినియోగంతోనే ఈ వరంగల్ ఉప ఎన్నికల్లో టీఆర్ఎస్ భారీ మెజార్టీ సాధిస్తోందని.. టీఆర్ఎస్ నిరంకుశ పాలనకు చరమగీతం పాడాలని గుత్తా అన్నారు. అంతేకాదు వచ్చే ఎన్నికల్లో వామపక్షాలతో పొత్తు పెట్టుకుంటాం.. అవసరమైతే టీడీపీతో కూడా పొత్తు పెట్టుకోవడానికి తమ పార్టీ సిద్దంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. మరి టీడీపీతో కాంగ్రెస్ పార్టీ పొత్తుకు రెడీ అయినా.. టీడీపీ అందుకు ఓకే చెపుతుందో లేదో. కాగా వరంగల్ ఉపఎన్నికలో 10 రౌండ్ల లెక్క అనంతరం ఇప్పటివరకూ వచ్చిన ఓట్లు టీఆర్ఎస్ - 4,66,386 కాంగ్రెస్ - 1,17,618 బీజేపీ - 85,655 వైసీపీ - 17,912

అసహనంపై అమీర్ ఖాన్.. దేశం విడిచి వెళదామనుకున్నాం..

దేశంలో పెరుగుతున్న అసహనంపై ఇప్పటికే చాలా మంది చాలా రకాలుగా వ్యాఖ్యానించారు. ఇప్పుడు బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూడా అసహనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రామ్ నాథ్ గోయంకా ఎక్స్ లెన్స్ ఇన్ జర్నలిజం అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మత అసహనంపై మాట్లాడారు. దేశంలో ఈ మధ్య కాలంలో అసహనం పెరిగిందని.. దాని ప్రభావం తన కుటుంబం మీద కూడా పడిందని.. ఈనేపథ్యంలోనే ఒకానొక సందర్భంలో తన భార్య కిరణ్ రావ్ కూడా దేశం విడిచి వెళదామన్న ప్రతిపాదన కూడా తీసుకొచ్చిందని ఆయన తెలిపారు. అంతేకాదు అసహనం వల్ల తాను చాలా ఆందోళనకు.. అభద్రతాభావానికి కూడా లోనయ్యానని అన్నారు. పనిలో పనిగా రాజకీయ నేతలపై కూడా మండిపడ్డారు అమీర్ ఖాన్. కేంద్ర నాయకులు కావచ్చు.. రాష్ట్ర నాయకులు కావచ్చు.. ఎవరైనా చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే వారిపై కఠిన వైఖరి తీసుకోవాలని భావిస్తాం.. ఘాటైన ప్రకటన చేస్తాం. న్యాయ ప్రక్రియ ప్రారంభిస్తాం. ఇలాంటివి జరగనప్పుడు దేవంలో అభద్రతా భావం ఉందని భావిస్తాం’’ అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి అమీర్ ఖాన్ కూడా అసహనంపై నోరు విప్పారు.

సంబరాల్లో టీఆర్ఎస్.. ధన్యవాదాలు తెలుపుతూ కేటీఆర్ ట్వీట్

వరంగల్ ఉపఎన్నిక ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగతూనే ఉంది. అన్ని నియోజక వర్గాల్లో టీఆర్ఎస్ పార్టీనే ఆధిక్యంలో ఉన్నట్టు తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ పార్టీ, బీజేపీకి డిపాజిట్లు గల్లంతయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఇదిలా ఉండగా తెలంగాణ భవన్లో టీఆర్ఎస్ నేతలు అప్పుడే బాణసంచా కాలుస్తూ సంబరాలు మొదలుపెట్టారు. మరోవైపు తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలుపుతూ.. మరింత స్ఫూర్తితో పనిచేస్తామంటూ తెలంగాణ ఐటీ మంత్రి కేటీఆర్ అప్పుడే ట్విట్టర్లో ట్వీట్ కూడా పోస్ట్ చేశారు. ఇప్పటివరకూ వచ్చిన ఓట్లు గమనిస్తే టీఆర్ఎస్ - 3,69,436 కాంగ్రెస్ - 93,639 బీజేపీ - 63,706 వైసీపీ - 7,162

కవితపై మధుయాష్కీ ఫైర్.. సెల్ఫీలు దిగినప్పుడు తెలీదా..

కాంగ్రెస్ నేత మధుయాష్కీ ఈమధ్య మీడియా ద్వారా ప్రతిపక్షాలపై బానే విమర్శలు చేయడం మొదలుపెట్టారు. గత కొద్ది కాలంగా సైలెంట్ గా ఉన్న ఆయన ఈమధ్య నేనూ ఉన్నానంటూ గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి మధుయాష్కీ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు, నిజామాబాద్ ఎంపీ కవితను టార్గెట్ చేశారు. ఎప్పుడో ఆమె మోడీని కలిసి తీసుకున్న సెల్ఫీ గురించి ఇప్పుడు విమర్శల బాణాలు విసిరారు. కవిత ఈ మధ్య కాలంలో మోడీపై చేసిన వ్యాఖ్యలకు గాను ఆయన స్పందించి అప్పట్లో మోడీని కలిసి ఆయనతో సెల్ఫీలు దిగి మంత్రులతో ముచ్చటించిన కవిత ఇప్పుడు అదే మోడీపై విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. ఆమెకు కేంద్ర క్యాబినెట్ లో స్థానం దక్కనందుకే ఇప్పుడు ఇలాంటి విమర్శలు చేస్తుందని అన్నారు. కేంద్రం నుంచి తెలంగాణకు కావాల్సిన హక్కుల్ని సాధించటంలో ఎంపీలు విఫలమైనందుకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారని వ్యాఖ్యానించారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే మోడీపై విమర్శలు చేసిన  కవితపై బీజేపీ నేతలు మండిపడాలి కానీ.. వారు సైలెంట్ గానే ఉన్నారు.. కానీ కాంగ్రెస్ నేత మధుయాష్కీ స్పందించి కవితపై విమర్శలు చేయడం కొంచెం వెరైటీగానే ఉంది.

డిశంబర్ 25 తరువాత జి.హెచ్.ఎం.సి.ఎన్నికల నోటిఫికేషన్?

  జి.హెచ్.ఎం.సి. (గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్) ఎన్నికల నిర్వహణకి హైకోర్టు జనవరి నెలాఖరు వరకు గడువు విధించడంతో అందుకు అంగీకరించిన తెలంగాణా ప్రభుత్వం జనవరి 20-25 తేదీల మధ్య జి.హెచ్.ఎం.సి. ఎన్నికలు నిర్వహించాలని భావిస్తోంది. అందుకు సన్నాహాలు కూడా మొదలుపెట్టింది. వచ్చే నెల క్రిస్మస్ పండుగ తరువాత అంటే డిశంబర్ 25 తరువాత ఎన్నికల నోటిఫికేషన్ జారీ చేయాలని భావిస్తోంది. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల షెడ్యూల్, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్ల ఖరారు తదితర అంశాలపై ప్రతిపక్షాలతో చర్చించేందుకు ఈ శుక్రవారం అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయబోతోంది. రేపటి నుండి సవరించిన ఓటర్ల జాబితలను ఆయా వార్డు కార్యాలయాలలో ప్రజల పరిశీలన కొరకు ఉంచి నోటిఫికేషన్ విడుదల చేసేవరకు సవరణలు, కొత్తగా ఓటర్ల నమోదుకి అవకాశం కల్పిస్తారు. డిశంబర్ 8 నుండి 15లోగా వార్డుల వారిగా నిర్ణయించిన రిజర్వేషన్ల వివరాలను ప్రకటిస్తారు. జి.హెచ్.ఎం.సి. ఎన్నికల నిర్వహణకు సుమారు 40 వేల మంది సిబ్బంది, 5 వేల ఈవీఎంలు ఏర్పాటు కోసం ప్రభుత్వం జి.హెచ్.ఎం.సి.కమీషనర్ కి లేఖ వ్రాసింది.

నేడు వరంగల్ ఓట్ల లెక్కింపు

  వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం నాడు వెల్లడి కానుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో లెక్కింపు జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు వున్నాయి. ప్రతి నియోజకవర్గానికీ 14 టేబుళ్ళు వుంటాయి. మొత్తం లెక్కింపు 22 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు తుది ఫలితం రానుంది. తొలిరౌండ్ ఫలితాన్ని మంగళవారం ఉదయం 8.20 నిమిషాలకు ప్రకటిస్తారు. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో ఆరు వందల మంది సిబ్బంది పాల్గొననున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో 69.19 శాతం ఓట్లు పోలయ్యాయి. 23 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.

ఈఫిల్ టవర్ నూ కూల్చేస్తాం.. ఐసిస్

ఇప్పటికే పారిస్ దాడులకు పాల్పడి ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆతరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్ ను, అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా చంపేస్తామని ఓ వీడియో ద్వారా హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ను కూల్చేస్తామంటూ ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నారు. ముందు ముందు ఇంకా అత్యంత భయానక విధ్వంసాలను సృష్టిస్తామని.. ఈ మేరకు ప్యారిస్‌ కుప్పకూలిపోయిందిః ది రైస్ ఆఫ్ కోబ్రాః అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈఫిల్ టవర్ నూ కూల్చేస్తాం.. రోబోటిక్‌ డిస్ట్రాయర్స్ ఆ టవర్‌ను ధ్వంసం చేస్తుందని, అందరూ చూస్తుండగానే నది మీదుగా టవర్‌ కూలిపోతుందని పేర్కొంది.

రాష్ట్రపతి తనయుడిపై ప్రశంసల జల్లు..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు పార్లమెంట్ సభ్యుడు అభిజిత్ ముఖర్జీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతలా అభిజిత్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించడానికి అతను ఏం చేశాడనా.. ప్రమాదంలో ఉన్న ఓ మహిళ ప్రాణాలు కాపాడటంలో కృషి చేసినందుకు గాను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు  విషయం ఏంటంటే.. సుమితాపాల్ అనే మహిళ తన కుమారుడు ఆర్యతో కలిసి బైక్ లో బురద్వాన్ నుంచి గస్కరాలోని ఓఆలయంలో పూజలు చెయ్యడానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పడంతో సుమితాపాల్ కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలైనాయి. అయితే అది నిర్జనప్రదేశం కావడంతో సుమితాపాల్ కుమారుడు ఆర్య సైతం ఏమి చెయ్యలేని పరిస్థితిలో అలా ఉండిపోయారు. అయితే అదే సమయానికి అభిజిత్ ముఖర్జీ అటు వైపు వెళుతుండటంతో వారిని గుర్తించి.. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకొని.. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను బురద్వాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించలాని అక్కడి వైద్యులు సూచించారు. అంతే అభిజిత్ ముఖర్జీ చేసిన పనికి ఇప్పుడు అందరూ తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

టీడీపీ లోకి ఆనం బ్రదర్స్..?

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండీ ఎంతో మంది నాయకులు వేరే పార్టీలకు జంప్ అయ్యారు. అందరూ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆనం బ్రదర్స్ (ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి) పార్టీని వీడటం అన్నది ఒక ఎత్తు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉన్న వీరిద్దరూ రాజకీయాల్లో క్రియా శీలకమైన పాత్ర పోషించారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుల్లా ఉన్న ఆనం బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అందరిలాగే వీరిద్దరి ఎంట్రీకి చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా.. కొంతమంది టీడీపీ నేతలు వీరి రాకకు అభ్యంతరం చెపుతున్నా చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగించి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి తీసుకురావడాని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఓవారం, పది రోజుల్లో ఆనం బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా రాజకీయాల్లో ఓ చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్ కి ఇప్పుడు టీడీపీలోకి చేరితే ఎలాంటి పదవులు దక్కుతాయి అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. మరి చంద్రబాబు వారికి ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి.