నేడు వరంగల్ ఓట్ల లెక్కింపు

  వరంగల్ పార్లమెంట్ స్థానానికి జరిగిన ఉప ఎన్నిక ఫలితం మంగళవారం నాడు వెల్లడి కానుంది. మంగళవారం ఉదయం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. వరంగల్‌లోని ఎనుమాముల మార్కెట్ యార్డ్‌లో లెక్కింపు జరుగుతుంది. వరంగల్ పార్లమెంట్ స్థానం పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలు వున్నాయి. ప్రతి నియోజకవర్గానికీ 14 టేబుళ్ళు వుంటాయి. మొత్తం లెక్కింపు 22 రౌండ్లలో పూర్తవుతుంది. మధ్యాహ్నం 2 గంటల లోపు తుది ఫలితం రానుంది. తొలిరౌండ్ ఫలితాన్ని మంగళవారం ఉదయం 8.20 నిమిషాలకు ప్రకటిస్తారు. మొదట బ్యాలెట్ ఓట్లను లెక్కించి, ఆ తర్వాత ఈవీఎంల ఓట్లు లెక్కిస్తారు. ఓట్ల లెక్కింపులో ఆరు వందల మంది సిబ్బంది పాల్గొననున్నారు. వరంగల్ ఉప ఎన్నికలో 69.19 శాతం ఓట్లు పోలయ్యాయి. 23 మంది అభ్యర్థులు పోటీలో వున్నారు.

ఈఫిల్ టవర్ నూ కూల్చేస్తాం.. ఐసిస్

ఇప్పటికే పారిస్ దాడులకు పాల్పడి ఉగ్రవాదులు మారణహోమం సృష్టించారు. ఆతరువాత ఫ్రాన్స్ అధ్యక్షుడు హోలెండ్ ను, అమెరికా అధ్యక్షుడు ఒబామాను కూడా చంపేస్తామని ఓ వీడియో ద్వారా హెచ్చరించారు. ఇప్పుడు తాజాగా ప్రపంచ వింతల్లో ఒకటైన ఈఫిల్ టవర్ ను కూల్చేస్తామంటూ ఐసిస్ ఉగ్రవాదులు హెచ్చరిస్తున్నారు. ముందు ముందు ఇంకా అత్యంత భయానక విధ్వంసాలను సృష్టిస్తామని.. ఈ మేరకు ప్యారిస్‌ కుప్పకూలిపోయిందిః ది రైస్ ఆఫ్ కోబ్రాః అనే చిత్రంలోని ఓ వీడియో క్లిప్‌ను విడుదల చేసింది. ఈఫిల్ టవర్ నూ కూల్చేస్తాం.. రోబోటిక్‌ డిస్ట్రాయర్స్ ఆ టవర్‌ను ధ్వంసం చేస్తుందని, అందరూ చూస్తుండగానే నది మీదుగా టవర్‌ కూలిపోతుందని పేర్కొంది.

రాష్ట్రపతి తనయుడిపై ప్రశంసల జల్లు..

రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ తనయుడు పార్లమెంట్ సభ్యుడు అభిజిత్ ముఖర్జీపై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అంతలా అభిజిత్ ముఖర్జీపై ప్రశంసలు కురిపించడానికి అతను ఏం చేశాడనా.. ప్రమాదంలో ఉన్న ఓ మహిళ ప్రాణాలు కాపాడటంలో కృషి చేసినందుకు గాను పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అసలు  విషయం ఏంటంటే.. సుమితాపాల్ అనే మహిళ తన కుమారుడు ఆర్యతో కలిసి బైక్ లో బురద్వాన్ నుంచి గస్కరాలోని ఓఆలయంలో పూజలు చెయ్యడానికి బయలుదేరారు. అయితే మార్గమధ్యంలో బైక్ అదుపుతప్పడంతో సుమితాపాల్ కిందపడిపోయారు. దీంతో ఆమె తలకు తీవ్రగాయాలైనాయి. అయితే అది నిర్జనప్రదేశం కావడంతో సుమితాపాల్ కుమారుడు ఆర్య సైతం ఏమి చెయ్యలేని పరిస్థితిలో అలా ఉండిపోయారు. అయితే అదే సమయానికి అభిజిత్ ముఖర్జీ అటు వైపు వెళుతుండటంతో వారిని గుర్తించి.. వెంటనే వారిని తన కారులో ఎక్కించుకొని.. ఆస్పత్రికి తీసుకెళ్లి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం ఆమెను బురద్వాన్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రికి తరలించి సరైన వైద్యం అందించలాని అక్కడి వైద్యులు సూచించారు. అంతే అభిజిత్ ముఖర్జీ చేసిన పనికి ఇప్పుడు అందరూ తనని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.

టీడీపీ లోకి ఆనం బ్రదర్స్..?

కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు మరో షాక్ తగలనుంది. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ నుండీ ఎంతో మంది నాయకులు వేరే పార్టీలకు జంప్ అయ్యారు. అందరూ ఒక ఎత్తైతే ఇప్పుడు ఆనం బ్రదర్స్ (ఆనం రాంనారాయణరెడ్డి, ఆనం వివేకానందరెడ్డి) పార్టీని వీడటం అన్నది ఒక ఎత్తు. నెల్లూరు జిల్లా రాజకీయాల్లో కాంగ్రెస్ పార్టీ తరుపున ఉన్న వీరిద్దరూ రాజకీయాల్లో క్రియా శీలకమైన పాత్ర పోషించారు. ఇంతకాలం కాంగ్రెస్ పార్టీకి నమ్మిన బంటుల్లా ఉన్న ఆనం బ్రదర్స్ ఇప్పుడు టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు జోరుగా సాగుతున్నాయి. దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. అయితే అందరిలాగే వీరిద్దరి ఎంట్రీకి చిన్న చిన్న అడ్డంకులు ఉన్నా.. కొంతమంది టీడీపీ నేతలు వీరి రాకకు అభ్యంతరం చెపుతున్నా చంద్రబాబు మాత్రం వారిని బుజ్జగించి ఆనం బ్రదర్స్ ని పార్టీలోకి తీసుకురావడాని ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. అన్నీ కుదిరితే ఓవారం, పది రోజుల్లో ఆనం బ్రదర్స్‌ టీడీపీ తీర్థం పుచ్చుకునే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. మొత్తానికి కాంగ్రెస్ పార్టీలో ఉండి జిల్లా రాజకీయాల్లో ఓ చక్రం తిప్పిన ఆనం బ్రదర్స్ కి ఇప్పుడు టీడీపీలోకి చేరితే ఎలాంటి పదవులు దక్కుతాయి అన్న సందేహాలు అప్పుడే మొదలయ్యాయి. మరి చంద్రబాబు వారికి ఎలాంటి పదవులు ఇస్తారో చూడాలి.

హెలికాఫ్టర్ కూలి భక్తులు సజీవదహనం..

జమ్మూ కాశ్మీర్ లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దైవ దర్శనం కోసం బయలుదేరిన భక్తులు సజీవదహనమయ్యారు. వివరాల ప్రకారం.. కాట్రాకు సమీపంలో ప్రసిద్ధి చెందిన వైష్ణోదేవి ఆలయంలో దైవదర్శనం చేసుకోవడానికి జమ్మూ నుంచి ప్రతి రోజు చాలా మంది భక్తులు వెళుతుంటారు. అయితే దీనికి హెలికాప్టర్ సర్వీసులు మాత్రమే ఉన్నాయి. ఎప్పటిలాగే ఈరోజు కూడా దైవదర్శనార్ధం ఐదుగురు భక్తులు, ఇద్దరు సిబ్బంది కలిసి జమ్మూ నుంచి వైష్ణోదేవి ఆలయం దగ్గరకు బయలుదేరారు. అయితే మార్గమధ్యంలోకి వెళ్లేసరికి హెలికాఫ్టర్ అదుపుతప్పి కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాఫ్టర్ లో ఉన్న ఐదుగురు భక్తులతో పాటు ఇద్దరు సిబ్బంది కూడా సజీవదహనమయ్యారు. మరణించిన భక్తుల వివరాలు సేకరిస్తున్నామని, హెలికాప్టర్ కూలిపోవడానికి కచ్చితమైన కారణాలు తెలియడం లేదని అధికారులు తెలిపారు.

వరంగల్ ఉపఎన్నిక.. రెండింటిలోనూ బీజేపీ తప్పుచేసిందా?

వరంగల్ ఉపఎన్నిక పోరు ముగిసింది. ఇక ఫలితాలు ఒక్కటే తేలాల్సి ఉంది. రేపటితో ఎలాగూ ఫలితాలు తెలుస్తాయి కాబట్టి గెలుపెవరిది అన్న విషయం కూడా తేలిపోతుంది. అయితే ఈ ఎన్నికలో మాత్రం బీజేపీ ఓట్లు గణనీయంగా తగ్గిపోయానని పార్టీ నేతలే గుసగుసలాడుకుంటున్నట్టు తెలుస్తోంది. కనీసం బీజేపీ ఓట్ల బ్యాంకును కూడా కాపాడుకోలేకపోయామని నేతలు చర్చించుకుంటున్నట్టు సమాచారం. దీనికి కారణం.. పోటీలో నిల్చున్న అభ్యర్ధి. అసలు వరంగల్ ఉపఎన్నిక అన్నప్పటినుండే బీజేపీ తమ పార్టీ తరుపున అభ్యర్ధిని నిలబెట్టాలని ఎంతగానో పట్టుబట్టింది. మొదట టీడీపీ నేతలు కూడా తమ పార్టీ నేతను పోటీలో నిలబెట్టాలని పట్టుబట్టినా చివరికి మిత్రధర్మం అనే సెంటిమెంట్ తో బీజేపీకే అవకాశం ఇచ్చింది. దీంతో బీజేపీనే తమ అభ్యర్ధిని బరిలో దించింది. అయితే బీజేపీకి ఆ అవకాశం ఇచ్చినా దానిని సరిగా ఉపయోగించుకోలేదనే అనిపిస్తుంది. ఎందుకంటే అభ్యర్ధి ఎంపిక విషయంలో బీజేపీ కాస్త తడబడిందనే చెప్పాలి.  అసలు ఈ సీటును ఎవరికి ఇస్తారనే విషయంలో మిత్రపక్షమైన టీడీపీకి సైతం చివరివరకు క్లారిటీ ఇవ్వని బీజేపీ నేతలు.. ఇక్కడ ఉన్న పార్టీ నేతలకు కాకుండా ఎక్కడో ఉన్న దేవయ్య అనే ఎన్నారైకు సీటు ఇచ్చింది. దీనిపై మొదట పార్టీ నేతలు కూడా అభ్యంతరం తెలియజేశారు. ఇక్కడ ఉండే నాయకుడికి సీటు ఇవ్వాలని సూచించారు. అయినా బీజేపీ నేతలు మాత్రం అవేమి పట్టించుకోకుండా దేవయ్యకే సీటు ఇచ్చారు. సీటు సంగతి సరే కనీసం ప్రచారంలో కూడా టీడీపీని కలుపుకుపోవడంలో బీజేపీ విఫలమైనట్టు తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఎన్నికలో బీజేపీ ఓట్లపై కాస్త అనుమానం వ్యక్తమవుతోంది. దాంతో ఇప్పటివరకు మూడో స్థానంలో ఉంటుందని భావిస్తున్న బీజేపీ టీడీపీ కూటమి… నాలుగో స్థానానికి పడిపోయిన ఆశ్చర్యపోనవసరం లేదని ఎన్నికలు జరిగిన తీరును బట్టి కొందరు బీజేపీ నేతలే అనుకోవడం ఆశ్చర్యకరం. మొత్తానికి అభ్యర్ధి విషయంలో.. అలాగే ప్రచారంలో కూడా బీజేపీ సరైన దిశగా వెళ్లకుండా తప్పుచేసినట్టు తెలుస్తోంది. మరి ఏమవుతుందో తెలియాలంటే రేపటి ఫలితాల వరకూ ఆగాల్సిందే.

బీహెచ్ఎంసీ ఎన్నికలు.. టీఆర్ఎస్ హోర్డింగ్స్ హడావుడి

బీహెచ్ఎంసీ ఎన్నికలను జనవరి నెలఖారు లోపు నిర్వహిస్తామని తెలంగాణ ప్రభుత్వం హైకోర్టుకు చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అప్పుడే టీఆర్ఎస్ పార్టీ హడావుడి మొదలైనట్టు తెలుస్తోంది. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన హోర్డింగులు అప్పుడే దర్శమిస్తున్నాయి. సాధారణంగా ప్రచారంలో హోర్డింగులు ప్రధాన భూమిక పోషిస్తాయి. అందుకే కార్పొరేట్ కంపెనీలు, మొదలు రాజకీయ పార్టీల వరకు హోర్డింగ్స్ లో ప్రచారానికి తెగ ఆసక్తి చూపిస్తుంటాయి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ కూడా అదే సంప్రదాయాన్ని ఫాలో అవుతుంది. జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అప్పుడే తమ పార్టీకి సంబంధించి పెద్ద పెద్ద హోర్డింగులతో పబ్లిసిటీ మొదలుపెట్టింది. టీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన పథకాలు, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఅర్ ఫోటోలతో హోర్డింగులు పెట్టారు. ఇప్పుడే ఇంత పబ్లిసీటీ మొతలైతే.. ఇక ముందు ముందు ఇంకెన్నీ హోర్డింగ్స్ దర్శనమిస్తాయే అని రాజకీయ పార్టీలు భావిస్తున్నాయి. ఎందుకంటే ఎలాగు హోర్డింగ్స్ పై అధికారం జీహెచ్ఎంసీ అధికారుల పరిధిలో ఉంటుంది కాబట్టి.. ఎక్కువ శాతం హోర్డింగ్స్ గులాబీ మయంగా మారే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. ఆశ్చర్యకరమైన విశషం ఏంటంటే.. ఈ హోర్డింగ్స్ కోసం నేతలు ఎంత ఖర్చు చేయడానికైనా వెనుకడుగు వేయకపోవడం. మరి ఈ హోర్డింగ్స్ ఎన్నికల విజయానికి ఎంత వరకూ ఉపయోగపడతాయో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే.

టీడీపీ, బీజేపీపై జేసీ సంచలన వ్యాఖ్యలు

టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి ఎప్పుడు ఏం మాట్లాడినా అది పెద్ద సంచలనమే అవుతుంది. ఇతర పార్టీలపైనే కాదు సొంత పార్టీపైనే వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ఆయన దిట్ట. ఎప్పటిలాగే ఇప్పుడు కూడా తన సొంత పార్టీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు జేసీ. ఇప్పుడు ఆయన చేసిన వ్యాఖ్యలకు అటు టీడీపీ.. ఇటు బీజేపీ రెండు పార్టీలూ డైలమాలో పడ్డాయి. రాష్ట్రం విడిపోయి..ఏడాదిన్నర అవుతోంది.. ఈ ఏడాదిన్నర కాలం పాటు అటు కేంద్ర ప్రభుత్వం.. ఇటు రాష్ట్రం ప్రభుత్వం పాలన చేస్తుంది కాని.. రెండు ప్రభుత్వాల పాలనా విధానంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన అన్నారు. అంతేకాదు రెండు ప్రభుత్వాలు తమ పనితీరు మార్చుకోవాల్సిన అవసరం ఉందని లేకుంటే ఎన్నికల్లో చేదు ఫలితాలను చవిచూడాల్సి వస్తుందని సలహా కూడా ఇచ్చారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడే విజయవాడలో ఉండి పరిపాలన చేస్తున్నారు.. కానీ ఉద్యోగులు మాత్రం హైదరాబాద్లో ఉన్నారని..అందుకే పాలన గాడి తప్పుతోందని.. రెండు పడవల మీద ప్రయాణంలా కాకుండా.. ఒక పడవమీద ప్రయాణం చేస్తే మంచిదని హితవు పలికారు.

కొనసాగుతున్న ఉగ్రవేట.. ఐసిస్ ను నాశనం చేస్తాం.. ఒబామా

బెల్జియం, పారిస్ దాడుల సూత్తధారి కోసం ఉగ్రవేట కొనసాగుతోంది. పారిస్ దాడుల తరువాత సూత్రధారి అబ్దేస్లామ్ బెల్జియం వచ్చినట్టు పోలీసులు తెలుపుతున్నారు. బెల్లిజం.. బ్రసెన్స్ లో అబ్దేస్లామ్ ఉన్నట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి  పోలీసులు ఇప్పటికే 19 మందిని అరెస్ట్ చేశారు. కాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా ఐసిస్ కు వార్నింగ్ ఇచ్చారు. ప్రజలను భయపెట్టేందుకే ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారని అయన వ్యాఖ్యానించారు. ఉగ్రవాదుల ఆర్ధిక మూలాలను ధ్వంసం చేస్తామని..ఐసిస్ ను నాశనం చేస్తామని అన్నారు. తమతో పెట్టుకుంటే భూమిపైనే లేకుండా చేస్తామని.. తమతో పోరాడలేకే పార్కులు, హోటల్స్, ఆలయాలు, రైల్వే స్టేషన్లపై ఐఎస్ దాడులకు దిగుతోందని ఆరోపించారు. అయినప్పటికీ.. తాము భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు.కాగా ఉగ్రవాదులు పారిస్ పై దాడులు జరిపినట్టే ఫ్రాన్స్ అధ్యక్షుడు హాలెండ్ ను.. ఒబామాను చంపేస్తామని హెచ్చరించిన సంగతి తెలిసిందే.

బీజేపీ వీడిన యెన్నం .. ఇప్పుడు నేనొక్కడినే ఉద్యమం మొదలుపెడుతున్నా

పాలమూరులో బీజేపీకి ఎదురుదెబ్బతగిలింది. బీజేపీకి యెన్నం శ్రీనివాస్ గుడ్ బై చెప్పేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి రెండు రోజుల్లో భవిష్యత్ కార్యచరణను ప్రకటిస్తామని తెలియజేశారు. ప్రజలకు మేలు చేసేందుకు యువత కలిసిరావాలి అని సూచించారు. రాబోయే రోజుల్లో తాము ప్రత్యామ్నాయంగా మారుతామని.. ఏపార్టీ ప్రత్యామ్నాయంగా మారలేకపోతున్నాయని అన్నారు. తెలంగాణ గమ్యాలు, లక్ష్యాలు దూరమవుతున్నాయి.. బడుగుల తెలంగాణ కోసం కృషి చేస్తాం.. ఉద్యోగం మానేసి మరీ నేను ఆనాడు ఉద్యమంలో చేరాను.. ఇప్పుడు మళ్లీ ఉద్యమం చేయాల్సి ఉంది.. ఇప్పుడు నేనొక్కడినే ఈ ఉద్యమం మొదలుపెడుతున్నాను అని వ్యాఖ్యానించారు. ఉద్యమకారులను ఇప్పటివరకూ సత్కరించుకోలేకపోయాం.. వాళ్లందరి ఆశీస్సులు మేం తీసుకుంటామన్నారు. నాగం జనార్ధన రెడ్డి మాతోనే ఉన్నారు.. త్వరలో అందరూ కలిసి వస్తారు అని స్పష్టం చేశారు.

నాగార్జున వర్సిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం.. మంత్రి గంటా ఆగ్రహం

  గుంటూరు జిల్లా నాగార్జున యూనివర్శిటీలో మళ్లీ ర్యాగింగ్ కలకలం రేగింది. సీనియర్ విద్యార్ధులు తమను ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ విద్యార్ధులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అసలు విషయం బయట పడింది. ర్యాగింగ్ పై కఠిన చర్యలు తీసకోవాలన్న ఉద్దేశ్యంతోనే ఐదుగురు విద్యార్ధులను సస్పెండ్ చేశామని.. ర్యాగింగ్ కు పాల్పడినందుకు కాలేజ్ హాస్టల్ నుండి వినితేశ్వర్, శ్వేత, మంజునాథ, సురేంద్ర, మనోజ్ లను సస్పెండ్ చేశామని.. సీనియర్లు ర్యాగింగ్ చేస్తున్నారని జూనియర్ విద్యార్ధులు ఫిర్యాదు చేయడంతో చర్యలు తీసుకున్నామని రిజిస్ట్రార్ రాజశేఖర్ తెలిపారు. కాగా నాగార్జున యూనివర్సిటీ ర్యాగింగ్ పై మంత్రి గంటా శ్రీనివాస్ ఆగ్రహం వ్యక్తం చేశారు. రితికేశ్వరీ మృతి తర్యాత ర్యాగింగ్ పై చర్యలు తీసుకున్నప్పటికీ మళ్లీ ఈ ఘటన జరగడంతో గంటా మండిపడుతున్నారు. వీసీ, రిజిస్ట్రార్ రాజశేఖర్ ను అడిగి గంటా వివరాలు తెలుసుకున్నట్టు తెలుస్తోంది. రేపు నాగార్జున వర్సిటీలో గంటా పర్యటించనున్నారు. 

బీజేపీకి ఎన్నం శ్రీనివాస్ గుడ్ బై

  బీజేపీ మాజీ ఎమ్మెల్యే ఎన్నం శ్రీనివాస్ రెడ్డి ఇవ్వాళ్ళ బీజేపీని వీడబోతున్నారు. గత ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలలో తెలంగాణాలోని మహబూబ్ నగర్ నియోజక వర్గం నుండి అసెంబ్లీకి పోటీ చేసి ఓడిపోయారు. అప్పటి నుండి తనను తెలంగాణా బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి పక్కనపెట్టి పార్టీలో కొత్తగా చేరినవారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన ఆవేదన వక్తం చేస్తున్నారు. అందుకే అయన గత కొంత కాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా పార్టీలో ఎవరూ ఆయనను బుజ్జగించలేదు కనీసం పట్టించుకోకపోవడంతో ఇవ్వాళ పార్టీకి రాజీనామా చేయాలనీ నిశ్చయించుకొన్నారు. బీజేపీకి రాజీనామా చేసి తెరాసలో చేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

చింటూ ఆస్తులు జప్తు చేస్తున్న పోలీసులు

కటారి దంపతుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 28 మందికి నోటీసులు అందజేయగా.. ఇప్పుడు మరో 40 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిధ్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు చింటూతో వ్యాపార లావాదేవిలు జరిపిన వారిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆస్తులను పోలీసులు జప్తు చేస్తున్నారు. ఇప్పటికే మురకం బుట్టలో ఉన్న వైన్ షాప్, యాదమర్రిలో చింటూ క్వారీలో ఉన్న వాహనాలు, యంత్రాంగాలు సీజ్ చేశారు. అంతేకాదు కర్నాటకలో కూడా చింటూకు ఆస్తులు ఉన్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సంతపేటలో ఉన్న చింటు అనుచరుడు మురుగ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

అమెరికా న్యూ అర్లిన్ లో కాల్పులు

  అమెరికాలో మళ్ళీ తుపాకుల మోత మారుమ్రోగింది. ఈసారి న్యూ ఆర్లిన్ లోని తొమ్మిదవ వార్డులో గల బన్నీ ఫ్రెండ్ పార్క్ వద్ద జరిగిన కాల్పులలో సుమారు 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పులలో సుమారు 10మంది వరకు చనిపోయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. గాయపడిన వారినందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లుస్థానిక పోలీస్ అధికార ప్రతినిధి టేలర్ గ్యాంబల్ తెలిపారు. ఇది స్థానికంగా ఉండే రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే తప్ప ఉగ్రవాదుల దాడి కాదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కాల్పులపై దర్యాప్తు మొదలుపెట్టమని తెలిపారు.    స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి ఏడు గంటలకి ఆ పార్క్ లో ఒక మ్యూజిక్ వీడియో ఆల్బం షూటింగ్ జరుగుతోంది. దానిలో పాల్గొనేందుకు చాల మంది ప్రజలు తరలివచ్చేరు. అదే సమయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలయింది. చివరికి అది తుపాకీ కాల్పుల వరకు వెళ్లిందని సమాచారం.  ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయినప్పుడు ఆ పార్క్ లో సుమారు 300-500 మంది వరకు సామాన్య ప్రజలు ఉన్నారని, వారందరూ కాల్పుల శబ్దం విని భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.