అరుణ్ జైట్లీ, రాహుల్ గాంధీల భేటీ.. ఎందుకో?
posted on Nov 19, 2015 @ 11:16AM
కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఇంటికి బీజేపీ నేత అరుణ్ జైట్లీ వెళ్లారు. వెళ్లడం ఏంటి సుమారు అరగంట సేపు రాహుల్ గాంధీతో ముచ్చటించారు కూడా. ఇక్కడి వరకూ బానే ఉన్నా.. అసలు రాహుల్ గాంధీ ఇంటికి అరుణ్ జైట్లీ ఎందుకు వెళ్లారు అని.. వాళ్ల భేటీ వెనుక కారణం ఏంటని అందరూ ఒకటే గుసగుసలాడుకుంటున్నారు.
ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నేతలు, బీజేపీ నేతలు ఎప్పుడూ ఒకరిమీద ఒకరు విమర్శలు చేసుకుంటూనే ఉంటారు. అరుణ్ జైట్లీ కూడా రాహుల్ గాంధీని చాలా సార్లు విమర్శించిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ మెచ్యూరిటీ లేకుండా మాట్లాడుతున్నారని.. బుర్రలేని మేధావి అని ఇంకా చాలా కామెంట్లే చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్, అరుణ్ జైట్లీ ని ఎందుకు కలిశారా అని అందరి అనుమానం. అయితే మరో ఐదు రోజుల్లో పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కీలకమైన జీఎస్టీ బిల్లు - ఇటీవల ప్రకటించిన ఎఫ్ డిఐ సంస్కరణలు తదితర అంశాలపై విపక్షాల మద్దతు కోరేందుకే ఆయన వెళ్లి ఉంటారని చాలామంది అనుకుంటున్నారు. ఇది ఒక కారణమైతే.. డిసెంబరు నెలలో జైట్లీ కుమార్తె సోనాలి పెళ్లి ఉంది కాబట్టి..ఈ పెళ్లికి రాహుల్ ను సోనియా గాంధీని ప్రత్యేకంగా ఆహ్వానించేందుకే రాహుల్ ఇంటికి వెళ్లారని మరికొంత మంది అనుకుంటున్నారు. మరి వారిద్దరూ ఎందుకు భేటీ అయ్యారో వారికే తెలియాలి.
కాగా మొన్నటికి మొన్న సోనియా గాంధీ, ప్రియాంకాలు స్పీకర్ సుమిత్ర మహాజన్ ఇంటికి వెళ్లినప్పుడు కూడా చాలా మంది ఆశ్చర్యపోయారు. అయితే దానికి కారణం సుమిత్ర మహాజన్ మనవరాలు కారణమని.. తన మనవరాలికి ప్రియాంక అంటే ఇష్టమని చెప్పిన నేపథ్యంలో సుమిత్ర మహాజన్ ఇదే విషయాన్ని సోనియాకు తెలియజేయటంతో సోనియా తన కూతురు ప్రియాంకని తీసుకొని స్పీకర్ ఇంటికొచ్చారని తెలిసింది. మొత్తానికి కారణం ఏదైనా కాని ఇలా వ్యక్తిగతంగా అయినా ప్రతిపక్షాలు.. అధికార పక్షాలు కలవడం సంతోషకరమైన విషయమే.