అమీర్ అసహనం రచ్చ..శివసేన చీఫ్ ను కొడితే 2లక్షలు

అమీర్ ఖాన్ అసహనం పై చేసిన వ్యాఖ్యలకు దేశ వ్యాప్తంగా విమర్శలు ఎదుర్కొంటున్నాడు. అందరూ విమర్శిస్తున్న నేపథ్యంలో.. ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలు చేసే శివసేన కూడా స్పందించి అమీర్ ఖాన్ ను విమర్శించింది. అయితే అందరూ నోటితో విమర్శిస్తుంటే.. శివసేన మాత్రం దానికి భిన్నంగా అమీర్ ఖాన్ ను చెంపదెబ్బ కొడితే  లక్షరూపాయలు ఇస్తామని.. అతనిని దేశ భక్తుడిగా కీర్తిస్తామని ఆఫర్ ఇచ్చారు. ఇప్పుడు శివసేన ఇచ్చిన ఆఫర్ కు రివర్స్ లో తమిళనాడుకు చెందిన తవ్ హీద్ జమాత్ సంస్థ ఇంకో ఆఫర్ ఇచ్చింది. అదేంటంటే.. శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే ను చెంపదెబ్బ కొట్టినోళ్లకు రూ.2లక్షలు ఇస్తామని ఆ సంస్థ సహాయ కార్యదర్శి తవ్ బీక్ ప్రకటించారు. శివసేన చేస్తున్న ప్రకటనలకు తాము బెదిరిపోమని.. ధైర్యంగా ఎదుర్కొంటామని ఆయన వ్యాఖ్యానించారు. మొత్తానికి అమీర్ ఖాన్ ఏ పరిస్థితిలో ఉండి ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు కానీ దీనిని అడ్డంపెట్టుకొని కొంతమంది ఇంకా రాద్దాంతం చేస్తున్నారనడానికి ఈ ఘటనలే నిదర్శనం.

సారికది ఆత్మహత్యే.. మహిళా సంఘాల ఆందోళన

సిరిసిల్ల రాజయ్య కోడలు సారిక, ముగ్గురు మనవలు అతి దారుణంగా మరణించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులుగా రాజయ్యను, అతని భార్య మాధవి, కొడుకు అనిల్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే పోలీసులు సేకరించిన ఆధారాలు, పోస్టుమార్టం నివేదిక పరిశీలించిన ఫోరెన్సిక్ నిపుణులు సారికది హత్య కాదు ఆత్మహత్యే అని తెలిపారు. అయితే ఇప్పుడు దీనిపై మహిళా సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసును పక్కదారిని పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. అంతేకాదు ఫోరెన్సిక్ నివేదికకు వ్యతిరేకంగా మహిశా సంఘాలు ఆందోళన చేపట్టి.. రాజయ్యను, అతని కుటుంబసభ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. 

నేడు హైదరాబాద్ వెళుతున్న చంద్రబాబు నాయుడు

  ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మూడు నెలలు తరువాత మళ్ళీ నేడు హైదరాబాద్ లో కాలుపెట్టబోతున్నారు. ఇక నుండి వారానికి రెండు రోజులు హైదరాబాద్ లో ఉంటానని ఆయనే స్వయంగా ప్రకటించారు. జనవరిలో జరుగబోయే గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పోరేషన్ ఎన్నికలకు పార్టీని సంసిద్దం చేయడానికే చంద్రబాబు నాయుడు హైదరాబాద్ వెళ్లి రావాలనుకొంటున్నట్లు సమాచారం. ఇవ్వాళ్ళ ఆయన సచివాలయానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. ఇవ్వాళ సాయంత్రం లేదా రేపు ఉదయం జంటనగరాలలో పార్టీ నేతలతో ఆయన సమావేశం అవుతారని సమాచారం. డిశంబర్ నెలలో పార్టీ నేతలతో ఒక విస్తృత స్థాయి సమావేశం నిర్వహించి, జి.హెచ్.ఎం.సి. ఎన్నికలను ఎదుర్కోవడానికి వారికి దిశా నిర్దేశం చేస్తారని కుతుబుల్లా పూర్ తెదేపా ఎమ్మెల్యే కె.పి. వివేకానంద గౌడ్ తెలిపారు.

వైసీపీ పై సోమిరెడ్డి జోస్యం.. అలా అయితేనే మనుగడ..

వైసీపీ పార్టీ అధినేత జగన్ నెల్లూరు జిల్లాలో పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్సీ సోమిరెడ్డి జగన్ పై విమర్శల బాణాలు వదిలారు. నెల్లూరు జిల్లాలో జగన్ చేసిన పర్యటన ప్రజలను రెచ్చగొట్టేలా ఉందని అన్నారు. అంతేకాదు వైసీపీ పార్టీ గురించి జోస్యం కూడా చెప్పారు. వరంగల్ ఉపఎన్నికలో వైసీపీ ఘోర పరాభవం పొందిన నేపథ్యంలో ఏపీలో కూడా వైసీపీ పరిస్థితి అదే అంటూ విమర్శించారు. దేశంలో కొత్తగా పుట్టిన ప్రాంతీయ పార్టీలు తాము ఎదుర్కొన్న తొలి ఎన్నికల్లో గెలిచి అధికారం సాధిస్తేనే మనుగడ సాధించాయని... అలా గెలవలేని పార్టీలన్నీ గంగలో కలిసిపోయాయని ఎద్దేవ చేశారు. మరి వైసీపీ గురించి సోమిరెడ్డి చెప్పిన జోస్యం నిజమవుతుందో లేదో వచ్చే ఎన్నికల బట్టి తెలుస్తుంది.

అందుకే పార్టీ చేరిక.. పదవులు ఆశించి కాదు.. ఆనం బ్రదర్స్

తమ పార్టీ నుండి వేరే పార్టీలోకి మారే ప్రతి నాయకుడు .. తాము ప్రజలకు సేవ చేయాలనే పార్టీ మారుతున్నామని.. పదవులు ఆశించిన కాదని చెప్పే మాటలు ఇవే. ఇప్పుడు ఆనం బ్రదర్స్ కూడా అందరూ చెప్పే రొటీన్ డైలాగ్సే కొట్టి బోర్ కొట్టించారు. ఈ సోదరులు కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలోకి మారుతున్నట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆనం రాంనారాయణరెడ్డి తమ నియోజక వర్గానికి చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలతో సమావేశం కూడా జరిపారు. తమ పార్టీ చేరికను రెండు రోజుల్లో ప్రకటిస్తామని కూడా వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే తాము ప్రజాసేవ చేయకుండా ఉండలేక పోతున్నామని, అందుకే టీడీపీలోకి చేరబోతున్నామని.. అంతేకానీ, పదవీ వ్యామోహంతో కాంగ్రెస్ పార్టీని వీడి టీడీపీలో చేరడం లేదని వారు చెపుతున్నారు. అంతేకాదు పదవుల కోసం రాజకీయాలు చేయకూడదని, బిడ్డల భవిష్యత్ కోసం రాజకీయాలు చేయాలని ఆనం సూచించారు. రాష్ట్ర అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తున్న చంద్రబాబుకు అండగా నిలవాలన్నదే తమ అభిమతమన్నారు. మరి పదవులు ఆశించకపోతే.. కాంగ్రెస్ లో ఉండైనా ప్రజాసేవ చేయోచ్చని ఆనం బ్రదర్స్ కి తెలియదా.

రాజ్యాంగంపై మోడీ..నేను ఇవ్వడంలేదు.. సభ్యుడిగానే మాట్లాడుతున్నా.. మోడీ

  పార్లమెంట్ శీతాకాల సమావేశంలో భాగంగా ఈ రోజు కూడా రాజ్యాంగపై చర్చ కొనసాగుతుంది. మహనీయులకు నావంతు నివాళి అర్పిస్తున్నానని.. రాజ్యాంగంపై అభిప్రాయాలు తెలియజేసిన సభ్యులందరికి ధన్యవాదాలు తెలుపుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ కూజా రాజ్యాంగం పై మాట్లాడుతున్నారు. పార్లమెంట్ చరిత్రలోనే రాజ్యాంగంపై చర్చ ఒక ముసాయిదా అవుతుందని.. నేను చర్చకు జవాబు ఇవ్వడంలేదు..ఒక సామాన్య సభ్యుడిగానే మాట్లాడుతున్నానని వ్యాఖ్యానించారు. భారత ప్రజాస్వామ్య చరిత్రలో నవంబర్ 26 కు ఎంతో విశిష్టత ఉందని.. ప్రతి ఏడాది రాజ్యాంగం దినోత్సవంలో ఎలాంటి మార్పు చేయాలో ఆలోచిద్దామని సూచించారు. భిన్నత్వంగల భారత్ ను కలిపి ఉంచే శక్తి రాజ్యాంగానికి ఉంది.. రాజ్యాంగంపై ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం మొదలైంది.. రాజ్యాంగంపై విద్యాసంస్థల్లో చర్చలు జరపాలి..రాజ్యాంగంపై ఆన్ లైన్ పోటీలు ఎందుకు పెట్టకూడదు? అని ప్రశ్నించారు. ప్రతి ప్రధాని దేశాన్ని అభివృద్ధిచేయడంలో తమ వంతు పాత్ర పోషించారు.. అన్ని ప్రభుత్వాల సహకారంతోనే దేశం అభివృద్ది సాధ్యమైందని.. కొన్ని ప్రభుత్వాలు ఆక్షాంక్షలకు తగ్గట్టు పనిచేయలేకపోవచ్చు అని మోడీ  అన్నారు. ఈ దేశాన్ని నిర్మించింది రాజులు, మహారాజులు కాదు.. దేశంలో ఉన్న విభిన్న వర్గాలు దేశాన్ని నిర్మించారు.. ప్రతి ఒక్క పౌరుడికి భాగస్వామ్యం ఉంది అని మోడీ పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ప్రసంగానికి ఫిదా అయిపోయిన కేంద్రమంత్రి

టీ టీడీపీ రేవంత్ రెడ్డి తన వాగ్ధాటికే ఫైర్ బ్రాండ్ అని పేరు సంపాదించుకున్నాడు. ప్రత్యర్ధులకు ధీటుగా సమాధానం చెప్పి.. వారిని అంతే ధీటుగా విమర్శించగల నైపుణ్యం ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. అందుకే అందరినీ ఏకిపారేసే కేసీఆర్ సైతం కాస్తో, కూస్తో రేవంత్ రెడ్డికి భయపడతారనే చెప్పుకోవచ్చు. ఆయన చేసే ప్రసంగానికి ప్రజలు సైతం చాలా ముగ్ధులైపోతారు. ఇప్పుడు ఏకంగా ఆయన చేసిన ప్రసంగానికి ఓ కేంద్రమంత్రే ముగ్ధుడైపోయాడు. వరంగల్ ఉపఎన్నిక నేపథ్యంలో టీడీపీ-బీజేపీ మిత్రపక్షం కాబట్టి ఆ అభ్యర్ధి తరపున ప్రచారంలో రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. సాధారణంగా రేవంత్ రెడ్డి ప్రసంగానికి ప్రజలు ఫిదా అయిపోయి.. ఈలలు, చప్పట్లతో హడావుడి చేయడం కామన్. అయితే ఈ ప్రచారంలో కూడా అదే జరిగింది. ఇదిలా ఉండగా ఈ ప్రచారానికి బీజేపీ కేంద్రమంత్రి హన్సరాజ్ గంగరామ్‌ కూడా హాజరయ్యారు. ఈయన రేవంత్ రెడ్డి ప్రసంగానికి వచ్చిన రెస్పాన్స్ చూసి ఒక్కసారిగా షాకయిపోయారంట. అంతేకాదు ప్రసంగం అయిపోయిన తరువాత రేవంత్ రెడ్డి దగ్గరకి వెళ్లి "వెల్‌డ‌న్" అంటూ అభినందనులు కూడా తెలిపారట. అక్కడితో ఆగకుండా తాను రేవంత్ రెడ్డికి ఓ ఆఫర్ కూడా ఇచ్చారంట. మీలాంటి వాళ్లు బీజేపీలో ఉండాలని.. పార్టీలో చేరండి.. పార్టీలో చేరితే కనుక బీజేపీ తరపున మీరే అంటూ పెద్ద ఆఫర్‌ను ముందుంచారట. కానీ రేవంత్ రెడ్డి అంతే సునితంగా దానిని తిరస్కరించి.. తను పార్టీ మారే ప్రసక్తే లేదు అని చెప్పారంట. మొత్తానికి రేవంత్ రెడ్డి తన ప్రసంగంతో సామాన్య ప్రజలనే కాదు.. కేంద్రమంత్రులను కూడా ఆకర్షిస్తున్నాడు. 

ప్లేస్ చెప్తే పేల్చేస్తాం.. ఒబామాతో పుతిన్

ఫ్రాన్స్ల్ లో ఉగ్రవాదులు సృష్టించిన మారణహోమం అంతా ఇంతా కాదు. దీనివల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. దీనికి తమ విషయంలో జోక్యం చేసుకున్నందుకే ఈ దాడులు జరిపామని సిరియా దేశం కూడా తేల్చిచెప్పింది. అయితే ఈ విషయంలో టర్కీలో జరిగిన జి20 సదస్సు సందర్భంగా రష్యా అధ్యక్షుడు వ్లాదిమీర్ పుతిన్ అమెరికా అధ్యక్షుడు ఒబామాని సహాయం అడిగినట్టు తెలుస్తోంది. సిరియాలో ఉన్న ఐసిస్ ఉగ్రవాదాన్ని పూర్తిగా అంతం చేసే క్రమంలో చేస్తున్న యుధ్ధానికి పూర్తిగా సహకరించాలని.. దీనిలో భాగంగానే తమ అంతరిక్షంలో ఉన్న అత్యాదునిక శాటిలైట్ల ద్వారా ఉగ్రవాదుల స్థావరాలను, కదలికలను గుర్తించి చెబితే నిమిషాల్లో అక్కడికి వెళ్లి బాంబుల వర్షం కురిపించి వారిని ధ్వంసం చేస్తామని చెప్పారు. కాగా ఇటీవల సిరియా దేశం తమ దేశ యుద్ద విమానాన్ని కూల్చేంసినందుకు రష్యా తీవ్ర ఆగ్రహంగా ఉన్న సంగతి తెలిసింది. మరి వారికి ఒబామా వారికి సహకరిస్తారో లేదో.

ఓడిపోయినందుకు ఉత్తమ్ తెగ ఫీలవుతున్నారట..

తెలంగాణ వరంగల్ ఉపఎన్నికల రిజల్ట్ చూసి అన్నిపార్టీలు షాకయ్యాయి. అయితే రాజకీయాల్లో గెలుపు, ఓటములు కామన్ కాబట్టి నాయకులు కూడా వాటిని లైట్ తీసుకొని ఎప్పటిలాగే వారి కార్యక్రమాల్లో పాల్గొంటారు. కానీ ఈ వరంగల్ ఫలితాల వల్ల ఒక నేత మాత్రం బయటకి రావడానికి కూడా ఇష్టపడటం లేదట. అతను ఎవరనుకుంటున్నారా.. టీ కాంగ్రెస్ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఎన్నికులు జరిగి.. ఫలితాలు వచ్చి దాదాపు నాలుగు రోజులు పైన అవుతున్నా ఆయన మాత్రం ఇప్పటి వరకూ ఇంటి నుండి బయటకు రాలేదు.. ఎటువంటి మీడియా సమావేశాల్లో పాల్గొనలేదు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘోరంగా ఓడి పోయిన కారణంగా ఉత్తమ్ బయటకు రావడానికి కూడా ఇష్టపడటం లేదట. వరంగల్ ఉపఎన్నిక అభ్యర్ధి దగ్గర నుండి.. ఎన్నిక ప్రచారం వరకూ ఉత్తమ్ బాగానే కష్టపడ్డారు. మరో పక్క రాజయ్య ఉదంతం. ఎన్నిఇబ్బందులు ఎదురైనా.. వాటిని అధిగమిస్తూ పోటీ చేశారు. అంతేకాదు ఈ ఉప ఎన్నిక కోసం తన సొంత డబ్బును కూడా ఉత్తమ్ ఖర్చు చేసినట్లుగా చెబుతున్నారు. కానీ అంత శ్రమించినా ఫలితం చూస్తే శూన్యం. దీంతో ఉత్తమ్ ఈ ఓటమిని వ్యక్తిగతంగా తీసుకొని తెగ ఫీలైపోతున్నారట.

కోర్టు చుట్టూ తిరుగుతా కానీ.. సారీ చెప్పను.. రాహుల్ గాంధీ

రాజకీయ నేతలు అప్పుడప్పుడు ఆవేశంగా నోరు జారడం పరిపాటే. అలా ఆవేశంగా మాట్లాడుతారు.. తరువాత ఇబ్బందులు పడతారు. కానీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు డోంట్ కేర్ అంటున్నాడు. అసలు సంగతేంటంటే.. రాహాలు గాంధీ మహాత్మాగాంధీ హత్యకు ఆర్ఎస్ఎస్ కారణమంటూ ఈ మధ్యన ఆర్ఎస్ఎస్ ను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ఆర్ఎస్ఎస్ నేతలు రాహుల్ గాంధీపై మండిపడుతున్నారు. తమపై చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ క్షమాపణలు చెప్పాలని.. లేకపోతే అతడిపై న్యాయపరమైన చర్యలు తీసుకుంటానని హెచ్చరించింది. ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మహారాష్ట్రలోని బివాండీ జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో సంఘ్ నేతలు పిటీషన్ వేశారు. అయితే దీనికి రాహుల్ గాంధీ మాత్రం తాను చేసిన వ్యాఖ్యలకు అవసరమైతే కోర్టు చుట్టూ తిరుగుతాను కానీ.. సారీ మాత్రం చెప్పేది లేదని తేల్చిచెప్పారు. మరి ఈ వ్యవహారం ఎక్కడి వరకూ వెళుతుందో చూడాలి.

అమీర్ ఖాన్ కు పాకిస్థాన్ టికెట్లు బుక్..

అమీర్ అసహనం పై గోల రోజు రోజుకి పెరిగిపోతుంది. ఒకపక్క అమీర్ ఖాన్ పై విమర్శలు చేసేవాళ్లు చేస్తుంటే.. మరోపక్క ఆయనకు సపోర్టుగా కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇప్పుడు అమీర్ ఖాన్ కు ఏకంగా పాకిస్థాన్ కు రెండు టికెట్లు బుక్ చేసి మరీ దానిని ట్విట్టర్లో పోస్ట్ చేశారు. ఢిల్లీకి చెందిన ఒక జర్నలిస్టు అమీర్ ఖాన్ కుటుంబం పాకిస్థాన్ కు వెళ్లేందుకు వీలుగా మూడు ఫ్లైట్ టిక్కెట్లను బుక్ చేసినట్లుగా హిందూసేన ప్రకటించి వాటిని ట్విట్టర్లో పోస్ట్ చేసింది. కాగా ఎప్పూడూ వివాదస్పద వ్యాఖ్యలు చేసే శివసేన కూడా అమీర్ వ్యాఖ్యలకు స్పందించింది. దీనిలో భాగంగానే అమీర్ ను చెంపదెబ్బ కొడితే లక్ష రూపాయలు ఇస్తానని.. ప్రతి చెంప దెబ్బకి ఒక లక్ష ఇస్తామని.. అంతేకాదు అతనిని దేశభక్తుడిగా కీర్తిస్తామంటూ వ్యాఖ్యాలు చేసింది. మరి అమీర్ ఖాన్ వ్యవహారం ఎక్కడివరకూ దారి తీస్తుందో చూడాలి.

పార్లమెంట్ లో రాజ్యాంగంపై చర్చ.. రాజ్యాంగంపై వెంకయ్య

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు రెండురోజు కూడా ప్రారంభమయ్యాయి. ఈ రోజు కూడా రాజ్యాంగంపై చర్చ కొనసాగుతుంది. ఈ సందర్బంగా కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాట్లాడుతూ రాజ్యాంగాన్ని బలోపేతం చేయడంలో అంబేద్కర్ ఎనలేని కృషి చేశారని వ్యాఖ్యానించారు. సామాన్య కుటుంబం నుండి వచ్చిన అంబేద్కర్ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను  అధిగమించారని చెప్పారు. ప్రజలకు స్వేచ్చ అనేది చాలా ముఖ్యమని.. సమాజంలో అస్పృశ్యత, అసమానతలపై అంబేద్కర్ పోరాటం చేశారని అన్నారు. నైతికంగా, సామాజికంగా ప్రజలు అభివృద్ది చెందాలని అంబేద్కర్ తపించేవారు.. దేశంలో ఉమ్మడి పౌరస్మృతి ఉండాలని అంబేద్కర్ గట్టిగా విశ్వసించేవారు.. ఆదిశలో ఇప్పటికీ మనం ముందడుగు వేయలేకపోతున్నామని అన్నారు. బ్రిటిష్ పాలన సమయంలో దేశ పునర్నిర్మాణానికి అంబేద్కర్ కృషి చేశారని.. అంబేద్కర్ ఎప్పుడూ పదవులు ఆశించలేదని.. ప్రజల సంక్షేమం కోసమే పరితపించేవారని వెంకయ్య వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్ కు రెవెన్యూ లోటు ఉన్నందుకే ప్రత్యేకో హోదా అండిగాం.. ప్రత్యేక హోదా అంశం నీతి అయోగ్ కమీటీ పరిశీలనలో ఉంది.. ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా కావాలని నేనూ ఆకాంక్షిస్తున్నా.. అని అన్నారు. ప్రస్తుతం దేశంలో చాలా రాష్ట్రాలు ప్రత్యేక హోదా కోరుకుంటున్నాయి.. అభివృధ్ది చెందిన పంజాబ్ వంటి రాష్ట్రాలు కూడా ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుకుంటున్నాయి.. దేశ సమగ్ర అభివృద్ధి దృష్టిలో పెట్టుకొని రాష్ట్రాలు కూడా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు.

కేసీఆర్ హామీ ఇప్పుడప్పుడే నెరవేరదా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ హామీలు ఇవ్వడంలో దిట్ట. అవి తొందరగా నెరవేరుతాయా లేదా అన్నది కూడా ఆలోచించకుండా హామీలు ఇవ్వడంలో ఆయన తరువాతే ఎవరైనా అని చెప్పవచ్చు. అయితే అప్పుడప్పుడు ఆయన చేసిన హామీలు అంత తొందరగా నెరవేరవు అని చాలాసార్లు నిరూపితమైన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మరోసారి అది నిజమని నిరూపితమైంది. అది కేసీఆర్ ఇచ్చిన కొత్త జిల్లాల హామీ విషయంలో. తెలంగాణలో ప్రస్తుతం 10 జిల్లాలు ఉన్న సంగతి తెలిసిందే. వీటికి తోటు ఇంకో పద్నాలుగు జిల్లాలను ఏర్పాటు చేయాలని కేసీఆర్ భావించారు. దీనికి సంబంధించి ఏయే జిల్లాల్లో ఇంకా అదనంగా జిల్లాలు ఏర్పాటు చేస్తున్నారో కూడా తెలిపారు. కానీ ఇప్పుడు ఈ కొత్త జిల్లాల ఏర్పాటు అంత సులభం కాదని చెపుతున్నారు ప్రభుత్వ అధికారులు. అసలు వచ్చే సంవత్సరం.. తెలంగాణ ఆవిర్భావదినోత్సవం రోజు కల్లా ఈ కొత్త జిల్లాల ఏర్పాటు కావాలని కేసీఆర్  అధికారులను ఆదేశించారు.. దీనికోసం ఒక కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ కమిటీ కూడా కేసీఆర్ ఆదేశాల మేరకూ ఆగమేగాల మీద కొత్త జిల్లాల ఏర్పాటు నివేదికను తయారుచేయడంలో బిజీ అయింది. అయితే దీనివల్ల అధికారులకు తెలసిన విషయం ఏంటంటే  ప్రస్తుతం రెవెన్యూ శాఖ దగ్గర ఇంకా నిజాం కాలం నాటి సర్వే రికార్డులే ఉన్నాయని… వాటి ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటు చేయడం కష్టమని. దీంతో ప్రస్తుతం ఉన్న భూమి రికార్డులను పూర్తిగా డిజిటైలైజ్ చేసిన తరువాతే కొత్త జిల్లాల ఏర్పాటు చేయొచ్చని.. దీనికి రెండు సంవత్సరాలైన పట్టవచ్చని కేసీఆర్ కు తెలిపినట్టు తెలుస్తోంది. మొత్తానికి కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడప్పుడే నెరవేరేలా లేదని మరోసారి రుజువైంది.

చంద్రబాబు ప్లాన్.. త్వరలో జగన్ కు సూపర్ ఝలక్

ఏపీలో అధికార ప్రభుత్వం ప్రస్తుతానికి అమరావతి పనుల్లో.. వాటికి సంబంధించిన కాంట్రాక్టు పనులు, సమావేశాలు, అభివృధ్ది ప్రాజెక్టులు అంటూ చాలా బిజీగా ఉంది. ఇక ఈ ప్రాజెక్టుల పుణ్యమా అంటూ అటు కాంట్రాక్టర్లు కూడా చేతి నిండా పనులతో.. రెండు రాళ్లు వెనుకేసుకోవచ్చు అన్న ధోరణిలో ఉన్నారు. అయితే ఇప్పుడు అధికార పార్టీ సంగతి బానే ఉన్నా ప్రతిపక్ష పార్టీ పరిస్థితే బాలేదని అనుకుంటున్నారు. ముఖ్యంగా ఆపార్టీలో ఉన్న నేతలు. ఒక పక్క అధికార పార్టీతో సంబంధాలు ఉన్నవారు టెండర్లు దక్కించుకుంటుంటే..ఇప్పుడు ఆందోళనలు, ధర్నాలు చేసుకుంటూపోతే ఒరిగేదిలేదని.. ఇందులో భాగంగానే వైసీపీ నేతలు కొంతమంది టీడీపీ లీడ‌ర్లతో మంతనాలు కూడా జరుపుతున్నారు. ఎలాగూ ఇప్పుడప్పుడే ఏపీలో ఎన్నికలు లేవు.. ఒకవేళ 2019 ఎన్నికల్లో అయినా వైసీపీ గెలస్తుందో లేదో తెలియదు.. అందుకనే ఇప్పుడే టీడీపీలోకి మారి నాలుగు రాళ్లు  రాళ్లు వెనుకేసుకోవ‌చ్చ‌ని భావిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు దీనికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా సై అంటున్నట్టు తెలుస్తోంది. పనిలో పనిగా చంద్రబాబు వచ్చే జనవరి నుండి ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్‌కు ప‌చ్చ జెండా ఊప‌బోతు న్నారట‌! దీని ద్వారా వైసీపీ లో ఉన్నకీలక నేతలను తమవైపు తిప్పుకునేందుకు ప్రయత్నిస్తున్నారట. మొత్తానికి రానున్న రోజుల్లో టీడీపీయే కాదు ఆయన పార్టీ నేతలు కూడా జగన్ కు గట్టి ఝలక్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.

నిర్భయ ఉదంతం.. అతని మొహాన్ని చూపించండి.. నిర్భయ తల్లిదండ్రులు

ఢిల్లీ నిర్భయపై జరిగిన అత్యాచారం గురించి అందరికి తెలిసిందే. అది అంత తొందరగా మరిచిపోయే ఘటన కూడా కాదు. ఈ ఘటనకు పాల్పడిన నిందితులందరికి శిక్ష పడింది కాని ఒక్కడికి తప్ప. ఈ దుర్మార్గానికి  పాల్పడిన వారిలో అందరూ మేజర్లు కాగా ఒక్కడు మాత్రం మైనర్ అనే ఒక కుంటి సాకుతో శిక్ష నుండి తప్పించుకున్నాడు. దీంతో అప్పటి నుండి జైలులోనే ఉంటూ ఈ ఘటనకు పాల్పడినందుకు అనుభవించాల్సిన శిక్ష కంటే చాలా తక్కువ శిక్షను అనుభవిస్తూ జైల్లో ఉన్నాడు. అయితే అప్పుడు మైనర్లుగా పరిగణించే వయో పరిమితి కూడా తగ్గించాలని డిమాండ్ చేశారు. కానీ అది మాత్రం ఎవరూ పట్టించుకోలేదు. అంతేకాడు ఆ దుర్మార్గుడి మొహం చూపించింది కూడా లేదు. అయితే ఇప్పుడు ఈ వ్యవహారానికి సంబంధించి నిర్భయ తల్లిదండ్రులు జైల్లో శిక్ష అనుభవిస్తున్న అతగాడి ముఖాన్ని బయట ప్రపంచానికి చూపించాలంటూ వారు జాతీయ మానవహక్కుల కమిషనర్ని అభ్యర్థించారు. జైల్లో ఉన్న అతనికి తీవ్రవాదంపై దృష్టి పడిందని. ఇలాంటి దుర్మార్గుడి ముఖం అందరికి తెలిస్తే ఎవరి జాగ్రత్తలో వారు ఉంటారని కమిషనర్ని కోరినట్టు తెలుస్తోంది.  మరి పోలీసులు వారి అభ్యర్ధనని విని ఆ దుర్మార్గుడి మొహాన్ని చూపిస్తారో లేదో చూడాలి.

అగ్రిగోల్డ్ కేసు.. మానవత్వంతో ఆలోచించండి.. హైకోర్టు

అగ్రిగోల్డ్ కేసు విచారణను హైకోర్టు సోమవారానికి వాయిదా వేసింది. అగ్రిగోల్డ్ ఆస్తి అమ్మకాలకు సంబంధించి సీ1 ఏజెన్సీ 0.5 శాతం కమీషన్ ఇవ్వాలని హైకోర్టును అడిగింది. దీంతో పేద, మధ్య తరగతి ప్రజల సొమ్ము విషయంలో మానవత్వంతో ఆలోచించాలని.. సీ1 ఏజెన్సీకి కమీషన్ ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. అయితే కోల్ కతాకు చెందిన ఎంఎస్టీసీ ఏజేన్సీ కి అప్పగిస్తానన్న హైకోర్టు స్పష్టం చేసింది. కాగా దీనికి సంబంధించి ఏర్పాటు చేసిన సూర్యారావు కమిటీ జనవరి 1 నుండి అగ్రిగోల్డ్ ఆస్తులను అమ్మాలను హైకోర్టుకు సూచించింది. హైకోర్టు కూడా కమిటీ చేసిన సూచనలను పరిగణలోకి తీసుకోవడం జరిగింది.