మాలి ఉగ్రవాదుల చెర నుండి బందీలను విడిపించిన సంయుక్త దళాలు
posted on Nov 21, 2015 8:00AM
మాలీ రాజధాని బమాకో లో రాడిసన్ బ్లూ హోటల్లో ఉగ్రవాదుల చేతిలో బందీలుగా చిక్కిన 170 మందిలో 143 మందిని సంయుక్త దళాలు సురక్షితంగా విడిపించాయి. మిగిలిన 27మంది ఉగ్రవాదుల చేతుల్లో ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రవాదులకు చిక్కిన 20 మంది భారతీయులు క్షేమంగా బయటపడ్డారు. సుమారు 9 గంటలపాటు సాగిన ఈ మిలటరీ ఆపరేషన్ లో మాలి, ఫ్రాన్స్, అమెరికా, ఐఖ్యరాజ్య సమితికి చెందిన భద్రతా దళాలు పాల్గొన్నాయి. సంయుక్త దళాల చేతిలో ఇద్దరు ఉగ్రవాదులు మరణించారు.
అల్ మౌరాబి టౌన్ అనే తీవ్రవాద సంస్థ ఈదాడికి పాల్పడినట్లు ప్రకటించుకొంది. అది అల్ ఖైదా అనుబంధ తీవ్రవాద సంస్థ. మాలీ ఉత్తర రాష్ట్రాలలో తువారెగ్, అరబ్ అనే మరో రెండు ఉగ్రవాద సంస్థలు కూడా దానితో బాటు పనిచేస్తున్నాయి. గత రెండు మూడేళ్ళుగా మాలిలో తరచూ ఇటువంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఈసారి ఉగ్రవాదుల దాడుల్లో ఏకంగా 27మంది ప్రాణాలు కోల్పోవడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.
నిన్న ఉదయం ఉగ్రవాదులు రాడిసన్ బ్లూ హోటల్ లోకి ప్రవేశించి 170 మందిని బందీలుగా పట్టుకొన్న సమయంలో మాలి రాజధాని బమాకో సమీపంలోనే ఇటువంటి కమెండో ఆపరేషన్లను నిర్వహించడంలో సుశిక్షితులయిన, అత్యాధునిక ఆయుధాలు, సాంకేతిక పరిజ్ఞానం కలిగిన ఫ్రాన్స్, అమెరికా, ఐరాస భద్రతా దళాలు నిలిచి ఉండటం చాలా కలిసి వచ్చిందని భావించాలి. కేవలం మాలి భద్రతా దళాలు మాత్రమే ఈ మిలటరీ ఆపరేషన్ లో పాల్గొని ఉన్నట్లయితే మృతుల సంఖ్య ఇంకా పెరిగేమో?
కనీసం పది మంది ఉగ్రవాదులను తాము చూసామని బందీలు చెప్పడంతో మిగిలిన ఉగ్రవాదుల కోసం సంయుక్త దళాలు హోటల్ ని ఆణువణువూ గాలిస్తున్నాయి. హోటల్ చుట్టూ సంయుక్త దళాలు మొహరించి ఉన్నందున ఎవరూ తప్పించుకొని పారిపోయే అవకాశం లేదు. కనుక మిగిలినవారు లోపల ఎక్కడయినా దాగి ఉన్నారా లేక చనిపోయిన 27మందిలో వారు కూడా ఉన్నారా? అనే విషయం ఇంకా తెలియవలసి ఉంది. పారిస్ దాడుల తరువాత వరుసపెట్టి జరుగుతున్న ఈ సంఘటనలను చూస్తుంటే భారత్ తో సహా అన్ని దేశాలు అటువంటి దాడులు పునరావృతం కాకుండా నిలువరించడానికి తగిన సన్నాహాలు చేసుకోవడం మంచిదని స్పష్టం అవుతోంది.