అయుత చండీయాగానికి అంకురార్పణ
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం అంకురార్పణ కార్యక్రమం సోమవారం జరిగింది. మెదక్ జిల్లా జగదేవపూర్ మండలం ఎర్రవల్లిలోని తమ వ్యవసాయ క్షేత్రంలో అయుత మహా చండీయాగానికి ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన సతీమణి శోభ అంకురార్పణ, ఆరంభపూజ చేశారు. చండీయాగం ముందస్తు కార్యక్రమాలలో భాగంగా ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఉదయం గురుప్రార్థనతో పూజలు ప్రారంభించారు. శృంగేరి పీఠం నుంచి వచ్చిన రుత్విజులు ఫణిశశాంక శర్మ, గోపీకృష్ణశర్మ, హరినాథ్ శర్మ ఆధ్వర్యంలో గురు ప్రార్థన, గణపతి పూజ, దేవనాంది, అంకురార్పణ, పంచగవ్య మేళనం, ప్రాశనం, గోపూజ, యాగశాల ప్రవేశం, సంస్కారం, అఖండ దీపారాధన, మహా సంకల్పం, సహస్ర మోదక మహా గణపతి హోమం, మంగళహారతి, ప్రార్థన, ప్రసాద వితరణ కార్యక్రమాలు జరిగాయి. కేసీఆర్ దంపతులు యాగశాల ప్రవేశం చేసి శాస్త్రోక్తంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గణపతి, గోమాతకు పూజలు చేశారు. సోమవారం సాయంత్రం వాస్తు రాక్షోఘ్న హోమం, అఘోరాస్త్ర హోమం జరిగాయి.