దావూద్ ఇబ్రహీం పాక్ లో లేడు కానీ తరచూ వచ్చి పోతుంటాడుట!
posted on Dec 24, 2015 @ 7:54PM
అనేక నేరాలలో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ గా ఉన్న అండర్ వరల్డ్ డాన్ దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో ఉంటున్నట్లు భారత నిఘావర్గాలు ఆధారాలను చూపుతుంటే, పాక్ ప్రభుత్వం అతను తమ దేశంలో నివసించడం లేదని వాదిస్తోంది. పాక్ ప్రభుత్వం చెపుతున్నది నిజమే కాని పాక్షికంగా మాత్రమేనని పాకిస్తాన్ కి చెందిన ప్రముఖ 'డాన్' మీడియా గ్రూప్ సి.ఈ.ఓ. హమీద్ హరూన్ మాటలు స్పష్టం చేస్తున్నాయి. ఆయన ఈరోజు సాయంత్రం “భారత్-పాకిస్తాన్ మధ్య మెరుగుపడిన సంబంధాలను స్థిరీకరించడానికి ఎటువంటి చర్యలు చేప్పట్టాలి” అనే విషయం చర్చించేందుకు ముంబై ప్రెస్ క్లబ్ మరియు అబ్సర్వర్ రీసెర్చ్ ఫౌండేషన్ సంస్థలు సంయుక్తంగా ముంబైలో ఏర్పాటు చేసిన ఒక చర్చా కార్యక్రమంలో పాల్గొన్నపుడు దావూద్ ఇబ్రహీం గురించి కొన్ని ఆసక్తికరమయిన విషయాలు తెలియజేసారు.
హమీద్ హరూన్ ఆ చర్చా కార్యక్రమంలో మాట్లాడుతూ “దావూద్ ఇబ్రహీం పాకిస్తాన్ లో స్థిరనివాసం ఏర్పరచుకోలేదనే విషయం నేను ఖచ్చితం చెప్పగలను. కానీ అతను తరచూ పాకిస్తాన్ వచ్చి పోతుంటాడనే సంగతి విషయం నేను చాలా సార్లు విన్నాను. అతను దుబాయ్, దక్షిణాఫ్రికా దేశాల మధ్య తిరుగుతూ అక్కడే ఉంటున్నట్లు నేను విన్నాను. అతనిని నేను ఇంతవరకు ఎన్నడూ చూడలేదు. అతను ఒక హంతకుడు. పాక్ ప్రభుత్వం అటువంటి హంతకులను పట్టుకొని కటినంగా శిక్షించాలని కోరుకొంటున్నాను. అటువంటి వ్యక్తులను ఉపేక్షించరాదు,” అని అన్నారు.
భారత్ మీడియా ప్రతినిధులు అడిగిన ఒక ప్రశ్నకు ఆయన జవాబు చెపుతూ “ఒకవేళ భారత్-పాకిస్తాన్ దేశాల ప్రభుత్వాలు తమ చర్చలను ముందుకు తీసుకువెళ్ళడంలో విఫలమయితే, ఇరు దేశాల ప్రజలే చొరవ తీసుకొని రెండు దేశాల మధ్య సహృద్భావ వాతావరణం ఏర్పడేందుకు కృషి చేయాలి,” అని అన్నారు.
భారత్-పాకిస్తాన్ దేశాల మత్స్యకారులను ఇరు దేశాల ప్రభుత్వాలు విడుదల చేస్తూ ఇరు దేశాల మధ్య సత్సంబంధాలు నెలకొనేందుకు దోహదపడుతున్నాయి. మత్య్సకారులను దేశభద్రత, రక్షణ కారణాలతో ఇబ్బందిపెట్టకూడదని నేను అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే వారు రెండు దేశాలలో సమాజంలోని అతి పేద వర్గానికి చెందినవారు,” అని హమీద్ హరూన్ అన్నారు.