ఏపి, తెలంగాణా ముఖ్యమంత్రులకు బెదిరింపు లేఖ!
ఆంద్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు నాయుడు, కేసీఆర్ లను చంపివేస్తామని హెచ్చరిస్తూ ఒక బెదిరింపు లేఖ వచ్చింది. అంతేకాక ఆంద్రప్రదేశ్ లో నౌకాశ్రయాలను, విశాఖ విమానాశ్రయాన్ని, శ్రీహరి కోట రాకెట్ సెంటర్ ని కూడా పేల్చి వేస్తామని ఆ లేఖలో హెచ్చరిక ఉంది. ఆశ్చర్యకరమయిన విషయం ఏమిటంటే తెలుగులో వ్రాసి ఉన్న ఆ లేఖని ముఖ్యమంత్రుల కార్యాలయానికో లేక పోలీస్ ఉన్నతాధికారులకో లేక ఏ మీడియా సంస్థకో పంపించకుండా విశాఖ విమానాశ్రయ డైరక్టర్ కి పోస్టులో పంపబడింది. నిజామాబాద్ జిల్లాలోని నిర్మల్ పట్టణంలో ఆ లేఖ పోస్ట్ చేయబడినట్లు పోలీసులు గుర్తించారు. ఆ లేఖను ఎవరు వ్రాసారో, ఏ ఉద్దేశ్యంతో వ్రాసారనే విషయాలు దర్యాప్తులో తేలుతాయని చినట్లు విశాఖ పోలీస్ కమీషనర్ అమిత్ గర్గ్ అన్నారు. ఒకవేళ మావోయిష్టులు ఆ లేఖ వ్రాసి ఉండి ఉంటే వారు దైర్యంగా తామే వ్రాసామని స్వయంగా ప్రకటించుకొనేవారు. కానీ మావోయిష్టులు ఆ లేఖను వ్రాసినట్లు కమీషనర్ చెప్పలేదు కనుక వేరే ఎవరో వ్రాసి ఉండాలి. ఒకవేళ పాకిస్తాన్ ఉగ్రవాదుల మద్దతుదారులు ఎవరయినా ఆ లేఖ వ్రాసారా? లేక ఎవరో ఆకతాయి ఈ లేఖ వ్రాశాడా? అనేది దర్యాప్తులో తేలవలసి ఉంది. ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు ఇద్దరు ముఖ్యమంత్రుల భద్రత, లేఖలో పేర్కొన్న సంస్థల వద్ద భద్రత మరింత కట్టుదిట్టం చేసారు.