అమెరికాలోనూ మతాల రాజకీయమే!

అమెరికా అధ్యక్షుడు ఒబామా ఈ వారం ఒక మసీదుని సందర్శించనున్నారు. అధ్యక్షుని హోదాలో ఆయన తన దేశంలో ఒక మసీదులోకి అడుగుపెట్టడం ఇది తొలిసారి. అమెరికాలో నివసిస్తున్న ముస్లిం పౌరులలో సద్భావాన్ని నింపేందుకు ఈ చర్య తీసుకున్నానని చెబుతున్నారు ఒబామా. కానీ ఈ చర్యని తరచి చూస్తే భారతీయ తరహా రాజకీయ సూత్రాలు కొన్ని బయటపడక మానవు. ఈ సంవత్సరం జరగనున్న అమెరికా అధ్యక్ష పదవి కోసం ఒబామా సొంత పార్టీ అయిన డెమాక్రెటిక్‌ పార్టీకీ రిపబ్లికన్‌ పక్షానికి మధ్య తీవ్రమైన పోరు జరుగుతోంది. రిపబ్లికన్ తరఫున అభ్యర్థిగా నిలిచే అవకాశం ఉన్న డొనాల్డ్ ట్రంప్ చీటికీమాటికీ ముస్లిం ప్రజల మీద విద్వేషాన్ని చిమ్ముతున్నారు. మసీదులని మూసివేయాలనీ, ముస్లింలను దేశం నుంచి వెళ్లగొట్టాలనీ… రకరకాల ప్రకటనలు చేస్తున్నారు ట్రంప్‌. ట్రంప్ మాటలకు ప్రపంచం నలుమూలల నుంచీ నిరసన వినిపిస్తోంది. బ్రిటన్‌ పార్లమెంట్‌ సభ్యులైతే ఏకంగా ట్రంప్‌ను తమ దేశంలోకి అడుగుపెట్టనీయకూడదని అంటున్నారు. ఆశ్చర్యకరంగా అమెరికాలో మాత్రం ట్రంప్‌కు ప్రజల మద్దతు పెరిగిపోతోంది. ట్రంప్‌ను నిలువరించేందుకు ఇప్పుడు ఒబామా మసీదులోకి అడుగుపెడుతున్నారంటూ కొందరు విమర్శిస్తున్నారు. పైగా సందర్శన కోసం ఒబామా ఎంచుకున్న ‘బాల్టిమోర్‌’ మసీదుకి తీవ్రవాదులతో సంబంధాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. కానీ ISIS ఉగ్రవాదంతో ముస్లింలకీ ఇతర మతస్తులకీ మధ్య పెరుగుతున్న దూరాన్ని తగ్గించేందుకే ఒబామా ఈ నిర్ణయాన్ని తీసుకున్నారని ఆయన మద్దతుదారులు అంటున్నారు. ఎవరేమన్నా ఒబామా నిజంగా దేశ సమైక్యత కోసమే ఈ పని చేస్తుంటే అంతకంటే కావల్సింది ఏముంది!

టీఆర్ఎస్ కార్యకర్తలు అరెస్ట్.. 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్

గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీఆర్ఎస్ నేతలు అరెస్ట్ అయ్యారు. నెరేడ్‌మెట్ పోలింగ్ బూత్ వద్ద డబ్బులు పంచుతూ టీఆర్‌ఎస్ కార్యకర్తలు పోలీసులకు పట్టుబడ్డారు. దీంతో పోలీసుల  ముగ్గురిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. కాగా ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. కాగా మధ్యాహ్నం 12 గంటల వరకు 21.65 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ ముగిసే సమయానికి 60 శాతం పోలింగ్ నమోదయ్యే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలుపుతున్నారు. జంట నగరాల్లో పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు తమ ఓటు వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా యువతీయువకులు ఉత్సాహంతో ఓటింగ్‌లో పాల్గొంటున్నారు.

60 మంది విద్యార్ధుల ఆత్మహత్య..

తాము ఆత్మహత్య చేసుకుంటామని 60 మంది దళిత విద్యార్దులు ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ ఘటన బీహార్ లో జరిగింది. వివరాల ప్రకారం.. బీహార్‌, భువనేశ్వర్‌లోని రాజ్‌ధాని ఇంజనీరింగ్‌ కాలేజ్‌లో చదువుతున్న 60 మంది విద్యార్ధులు ప్రభుత్వానికి ఈ రకమైన హెచ్చరిక జారీ చేశారు. ఇంజనీరింగ్ కాలేజ్ లో చదువుతున్న వీరికి ప్రభుత్వం ఉపకార వేతం చెల్లించకపోవడంతో విద్యార్థులు కళాశాలనుంచి, హాస్టల్‌నుంచి బైటికి వెళ్లిపోవాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం తమకు ఉపకార వేతనాలు చెల్లించాలని.. ఎస్‌సి,ఎస్‌టి సంక్షేమ శాఖ నిర్లక్ష్యం కారణంగా తమ భవిష్యత్తు అంధకారంలో పడినందున తాము ఆత్మహత్యకు పాల్పడాలని నిర్ణయించుకున్నామని వారు తెలిపారు.

జీహెచ్ఎంసీ ఎన్నికలు.. వెబ్‌కాస్టింగ్ ద్వారా పర్యవేక్షణ

జీహెచ్ఎంసీ ఎన్నికలు సజావుగా సాగుతున్నాయి. జంట నగరాల్లో దాదాపు 7వేలకు పైగా ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ప్రజలు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఇప్పటికే పోలింగ్ కేంద్రాల్లో ఎలాంటి గొడవలు జరగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అధికారులు. అంతేకాదు పోలింగ్ కేంద్రాల్లో జరిగే పరిస్థితుల గురించి ఎప్పటికప్పుడు అత్యాధునికమైన ఇంటిగ్రేటేడ్ ఈ-సర్వేలేన్స్ కెమెరాల ద్వారా పోలింగ్ సరళిని, బందోబస్తును పోలీసు ఉన్నతాధికారులు కమెండ్ కంట్రోల్ సెంటర్ నుంచి పర్యవేక్షిస్తున్నారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 811 సమస్యాత్మక, 286 అత్యంత సమస్యాత్మక కేంద్రాలను అధికారులు గుర్తించిన విషయం తెలిసిందే.

ఓటు వేసేందుకు వెళ్తున్నారా!

- ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. - 5 గంటలలోపల క్యూలో ఉన్నవారు ఎంత ఆలస్యమైనా ఓటు వేసి వెళ్లవచ్చు. - ఇవాళ కూడా ప్రభుత్వ వెబ్‌సైట్‌ నుంచి ఓటరు స్లిప్‌ను పొందవచ్చు(ghmc.gov.in) - ఓటు వేసే చోట సెల్‌ఫోన్లను అనుమతించరు. - పోలింగ్‌ కేంద్రం లోపల ఫొటోలు తీయడం నిషిద్దం. - అంధులు తమ ఓటు వేసేందుకు వేరొకరిని వెంటపెట్టుకుని రావచ్చు. - ప్రతి పోలింగ్ కేంద్రంలో తాగునీటి సౌకర్యం తప్పనిసరిగా ఉంటుంది. - వికలాంగులు నేరుగా వీల్‌చైరుతో పోలింగ్‌ కేంద్రం లోపలికి వెళ్లవచ్చు. - ఇప్పటికే వేరెవరన్నా మీ ఓటు వేసేసి ఉంటే అక్కడి ఉన్న అధికారికి ఫిర్యాదు చేయండి.

ఓటరు గుర్తింపు కార్డు లేకపోతే…

  ఓటు ఉంటే చాలు ఓటరు గుర్తింపు కార్డు లేకున్నా ఫర్వాలేదు అంటున్నారు ఎన్నికల అధికారులు. తాము సూచించిన గుర్తింపు కార్డులలో ఏది ఉన్నా కూడా పోలింగ్‌కు అనుమతిస్తామని అంటున్నారు. ఓటరు తన గుర్తింపుని నిరూపించుకునేందుకు ఎలక్షన్‌ అధికారులు 21 రకాల పత్రాలను అనుమతించారు. ఆధార్‌, పాస్‌పోర్ట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, పాన్‌కార్డు, బ్యాంకు లేదా పోస్టాపీసు జారీ చేసిన పాస్‌పుస్తకం, ప్రభుత్వ సంస్థలు లేదా పబ్లిక్‌ లిమిటెడ్‌ కంపెనీలు జారీ చేసిన సర్వీసు గుర్తింపు పత్రం, రేషన్‌ కార్డులు, ఆహార భద్రత కార్డులు, కులధృవీకరణ ప్రతాలు, పట్టాదారు పాసుపుస్తకాలు, ఏటీఎం కార్డు… ఈ జాబితాలో ముఖ్యమైనవి. వీటిలో ఏది చూపించినా కూడా నేడు జరుగుతున్న జి.హెచ్‌.ఎం.సి ఎన్నికలలో పాలుపంచుకోవచ్చు.

గ్రేటర్ ఎన్నికలకు ఏర్పాట్లు సిద్దం..

రేపు జీహెచ్ఎంసీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఏర్పాట్లు సిద్దమైనట్టు తెలుస్తోంది. ఈ సందర్బంగా హైదరాబాద్ కమిషనర్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్నికలను సజావుగా నిర్వహించేందుకు భారీ బందోబస్తును ఏర్పాటు చేశామని, హైదరాబాద్‌లో 25624 మంది, సైబరాబాద్ పరిధిలో 16 వేల సిబ్బందితో కలిపి మొత్తం 41624 మందిని నియమించామని పేర్కొన్నారు. 4860 ఆర్మీ రిజర్వు ఫోర్స్‌తోపాటు 3 వేల ఎన్నెసెస్, 1400 మంది ఎన్సీసీ వాలంటీర్లు కూడా ఉన్నారని పేర్కొన్నారు. రేపు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రతీ పోలింగ్ స్టేషన్‌కు 200 మీటర్ల పరిధిలో 144 సెక్షన్ విధించినట్టు కమిషనర్ మహేందర్‌రెడ్డి తెలిపారు. తమకు కేటాయించిన వరుసల్లో వెళ్లి మహిళా, పురుష ఓటర్లు ఓటుహక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. 3200 పోలింగ్ కేంద్రాలలో వెబ్‌కాస్టింగ్‌ను ఏర్పాటు చేసి దానిని కమిషనర్ కార్యాలయంలోని కమాండ్, కంట్రోల్ సెంటర్‌కు అనుసంధానం చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

ఆర్‌. కృష్ణ‌య్య‌కు ఆ విష‌యం తెలియ‌దా!

తుని సంఘ‌ట‌న మీద బిసి సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్.కృష్ణ‌య్య చాలా చిరాకుప‌డిపోతున్న‌ట్లు వార్త‌లు వ‌స్తున్నాయి. కాపుల‌ను బి.సిలలో చేర్చితే మిగ‌తా బి.సి.ల‌కు తీవ్ర అన్యాయం జ‌రుగుతుంద‌ని, అందుక‌ని వారి డిమాండ్‌కి త‌ల ఒగ్గ‌ద్ద‌నీ ఆయ‌న చంద్ర‌బాబు నాయుడుని హెచ్చ‌రిస్తున్నారు కృష్ణ‌య్య‌. మ‌రి తెలుగుదేశం, కాపుల‌ను బి.సిల‌లోకి చేర్చేందుకు కృషి చేస్తామ‌ని త‌న మ్యానిఫెస్టోలో చెప్పింది క‌దా! అదే మ్యానిఫెస్టోతో అంద‌రూ ఎన్నిక‌ల‌కి దిగారు క‌దా! ఆ రోజున కిమ్మ‌న‌కుండా ఉన్న కృష్ణ‌య్య‌గారు ఈ రోజున ఎందుకు కోప‌గించుకుంటున్నారంటూ తెలుగు త‌మ్ముళ్లు ప్ర‌శ్నిస్తున్నారు. కృష్ణయ్య‌గారు తెదెపా త‌ర‌ఫు నుంచి ఎల్‌.బి.న‌గ‌ర్ నియోజ‌క‌వ‌ర్గంలో పోటీ చేసి ప్ర‌స్తుత తెలంగాణ శాస‌న‌స‌భ్యులుగా ఉన్నారు. ఆయ‌న మొద‌టి నుంచీ కాపుల‌ని బి.సి.ల‌లోకి చేర్చేకూడ‌దంటూ త‌న నిర‌స‌న గ‌ళాన్ని వినిపిస్తూనే ఉండేవారు. కాక‌పోతే ఎన్నిక‌ల స‌మ‌యంలో కాస్త శాంతించి ఉంటారంతే.

"తుని" వెనుక సంఘ విద్రోహులు.. పవన్

ముద్రగడ చేపట్టిన కాపు ఐక్య గర్జనపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మట్లాడుతూ తుని ఘటన దురదృష్టకరమని.. ఇది తనను ఎంతో బాధించిందని అన్నారు. లక్షలమంది ఒకచోట గుమిగూడుతున్నప్పుడు ప్రభుత్వం ఎందుకు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదో.. తగినంత బందోబస్తు ఎందుకు ఏర్పాటు చేయలేదో తనకు అర్ధం కావడంలేదని అన్నారు. రాజకీయ పార్టీలు బాధ్యతతో వ్యవహరించాలని హితవు పలికారు. నిన్నటి హింసాత్మక ఘటనల వెనుక ఖచ్చితంగ సంఘ వ్యతిరేక శక్తుల ప్రమేయం ఉంది. ఈ సమస్య ఎప్పటినుండో ఉంది.. ఒక్కరోజులో తీరేది కాదు.. తెలంగాణ, ఉత్తరాంధ్రలో కాపులు బీసీలుగా ఉన్నారు.. రాయలసీమ కోస్తాంద్రాలో మాత్రమే కాపులు ఓసీలుగా ఉన్నారని అన్నారు.. 

అప్ఘనిస్థాన్లో బాంబు పేలుడు.. ఈజిప్టులో కూడా..

ఈ ఒక్కరోజే పలు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. అప్ఘనిస్థాన్ రాజధాని కాబూల్‌లో పార్లమెంటు భవనం సమీపంలో పేలుడు సంభవించింది. ఈ పేలుడికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. మరోవైపు ఈజిప్టులో రెండు ప్రాంతాల్లో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఈజిప్టులోని రఫా ప్రాంతంలో భద్రతా సిబ్బంది పోలీసు వాహనంలో వెళుతుండగా బాంబు పేలుడు సంభవించింది. ఈఘటనలో ఇద్దరు పోలీసు అధికారులు మృతి చెందారు. మరో ప్రాంతం ఉత్తర సినాయ్‌ లో కూడా బాంబు పేలుడు సంభవించింది. షేక్‌ జువాయిడ్‌ పట్టణంలో సైనికాధికారులపై దుండగులు బాంబు దాడి జరిపారు. ఈ ఘటనలో  ఇద్దరు సైనికాధికారులు మృతిచెందగా.. మరో నలుగురు తీవ్రగాయాలపాలయ్యాయి.

చంద్రబాబుది క్రిమినల్ బుర్ర.. జగన్

ముద్రగడ పద్మనాభం కాపు ఐక్య గర్జన పై వైకాపా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్పందించారు. ఈ ఉద్యమం గురించి ఆయన మాట్లాడుతూ టీడీపీ అధినేత చంద్రబాబుపై విమర్సల బాణాలు వదిలారు. ఘటనపై చంద్రబాబు మాట్లాడిన తీరు తప్పని.. చంద్రబాబు తప్పుచేసి ఇతరలపై నెట్టడానికి చూస్తున్నారని అన్నారు. అంతేకాదు చంద్రబాబు చేసేవన్నీ క్రిమినల్ పనులే అని.. చంద్రబాబుది క్రిమినల్ బుర్ర కాదా? అని మండిపడ్డారు. 1988లో విజయవాడ కాపునాటు మహాసభ జరిగితే ఆనాటి సభను తట్టుకోలేక సభను అడ్డుకున్నారు.. ఇప్పుడు ఈ సభను అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారు అని అన్నారు. కాపుల మీటింగ్ సక్సెస్ అయితే తట్టుకోలేకపోతున్నావ్.. మీటింగ్ ఆపేందుకు ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నావ్ అని ధ్వజమెత్తారు. గతంలో ఎస్సీ కులాల మధ్య చిచ్చుపెట్టావు.. ఇప్పుడు కాపులకు, బీసీలకు చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు అని విమర్శించారు.