బెంగళూరు సంఘటన సిగ్గుచేటు- సుష్మాస్వరాజ్!
ఇటీవల బెంగళూరులో టాంజానియా విద్యార్థుల మీద జరిగిన దాడిని సిగ్గుచేటుగా పేర్కొన్నారు విదేశీవ్యవహారాల మంత్రి సుష్మాస్వరాజ్. జనవరి 31 ఆదివారం రాత్రి బెంగళూరులోని హెసర్‌గట్టలో జరిగిన ఈ ఘటనలో టాంజానియాకి చెందిన ముగ్గురు విద్యార్థుల మీద స్థానికులు దాడి చేయడమే కాకుండా మరో టాంజానియా యువతిని వివస్త్రను చేశారు. అంతకు ముందు ఆ రోడ్డు పక్కన నిద్రిస్తున్న మహిళ మీద నుంచి ఓ సూడాన్ పౌరుడు తన కారుని నడపడంతో, ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. దీంతో ఆగ్రహం చెందిన స్థానికులు అదే దారిన వస్తున్న కొందరు ఆఫ్రికన్ జాతీయుల మీద తమ ఆవేశాన్ని ప్రదర్శించారు. వారి కారుని తగలబెట్టడమే కాకుండా, లోపల ఉన్న నలుగురు వ్యక్తుల మీదా పిడిగుద్దులు కురిపించారు. అకస్మాత్తుగా ఈ దాడి ఎందుకు జరుగుతోందో తెలియని వారు పరుగులు తీయగా, వెంటపడి మరీ దాడి చేశారు. వారిలోని ఒక యువతి మీద తమ ప్రతాపాన్ని చూపుతూ ఆమెను వివస్త్రను చేశారు.
ఈ దాడికి పాల్పిడిన వ్యక్తులందరినీ గుర్తించి వారి మీద కేసు నమోదు చేసినట్లు బెంగళూరు పోటీసులు చెబుతున్నారు. అయితే బెంగళూరులో ఆఫ్రికా పౌరుల మీద దాడి కొత్తేమీ కాదు. బహుశా ఇది చివరిది కూడా కాకపోవచ్చు. వేరే దేశాలలో భారతీయుల మీద దాడి జరుగుతోందని ఆవేదన చెందే నేతలు ఇలాంటి సంఘటనలను చూసీ చూడనట్లు వదిలేస్తున్నారన్న ఆరోపణలూ ఉన్నాయి. అందుకే ఈసారి స్వయంగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి రంగంలోకి దిగినట్లు సమాచారం. ఈ సంఘటనలో నిందితులైనవారి మీద కఠిన చర్యలు తీసుకోవడమే కాకుండా, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడమంటూ ఆమె స్వయంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని సుష్మాస్వరాజ్ కోరారు.