katari anuradha

చింటూ ఆస్తులు జప్తు చేస్తున్న పోలీసులు

కటారి దంపతుల కేసు కొత్త మలుపు తిరిగింది. ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి 28 మందికి నోటీసులు అందజేయగా.. ఇప్పుడు మరో 40 మందికి నోటీసులు ఇచ్చేందుకు రంగం సిధ్ధమైనట్టు తెలుస్తోంది. అంతేకాదు చింటూతో వ్యాపార లావాదేవిలు జరిపిన వారిపై కూడా పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న చింటూ ఆస్తులను పోలీసులు జప్తు చేస్తున్నారు. ఇప్పటికే మురకం బుట్టలో ఉన్న వైన్ షాప్, యాదమర్రిలో చింటూ క్వారీలో ఉన్న వాహనాలు, యంత్రాంగాలు సీజ్ చేశారు. అంతేకాదు కర్నాటకలో కూడా చింటూకు ఆస్తులు ఉన్నట్టు పోలీసులు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా సంతపేటలో ఉన్న చింటు అనుచరుడు మురుగ ఇంట్లో పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.

USA

అమెరికా న్యూ అర్లిన్ లో కాల్పులు

  అమెరికాలో మళ్ళీ తుపాకుల మోత మారుమ్రోగింది. ఈసారి న్యూ ఆర్లిన్ లోని తొమ్మిదవ వార్డులో గల బన్నీ ఫ్రెండ్ పార్క్ వద్ద జరిగిన కాల్పులలో సుమారు 16 మంది తీవ్రంగా గాయపడినట్లు సమాచారం. ఈ కాల్పులలో సుమారు 10మంది వరకు చనిపోయి ఉండవచ్చని వార్తలు వస్తున్నాయి. కానీ వాటిని పోలీసు అధికారులు ఖండిస్తున్నారు. గాయపడిన వారినందరినీ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స చేయిస్తున్నట్లుస్థానిక పోలీస్ అధికార ప్రతినిధి టేలర్ గ్యాంబల్ తెలిపారు. ఇది స్థానికంగా ఉండే రెండు గ్యాంగుల మధ్య జరిగిన ఘర్షణే తప్ప ఉగ్రవాదుల దాడి కాదని తాము భావిస్తున్నట్లు తెలిపారు. ఈ కాల్పులపై దర్యాప్తు మొదలుపెట్టమని తెలిపారు.    స్థానిక కాలమాన ప్రకారం ఆదివారం రాత్రి ఏడు గంటలకి ఆ పార్క్ లో ఒక మ్యూజిక్ వీడియో ఆల్బం షూటింగ్ జరుగుతోంది. దానిలో పాల్గొనేందుకు చాల మంది ప్రజలు తరలివచ్చేరు. అదే సమయంలో రెండు గ్రూపుల మధ్య ఘర్షణ మొదలయింది. చివరికి అది తుపాకీ కాల్పుల వరకు వెళ్లిందని సమాచారం.  ఇరు వర్గాల మధ్య కాల్పులు మొదలయినప్పుడు ఆ పార్క్ లో సుమారు 300-500 మంది వరకు సామాన్య ప్రజలు ఉన్నారని, వారందరూ కాల్పుల శబ్దం విని భయంతో బయటకు పరుగులు తీసి ప్రాణాలు రక్షించుకొన్నారని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు.

piduguralla accident

పిడుగురాళ్ళ వద్ద ఘోర ప్రమాదం

  గుంటూరు జిల్లా పిడుగురాళ్ళ మండలం జానపాడు గ్రామ శివార్లలో ఆదివారం నాడు ఘోర ప్రమాదం జరిగింది. ఆర్టీసీ బస్సు, లారీ ఢీకొన్న ఘటనలో ఐదుగురు మరణించగా, 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. కారంపూడి గ్రామానికి చెందిన సానబోయిన మల్లయ్య కుమార్తె వివాహానికి బంధువులంతా కలసి లారీలో రాజుపాలెం మండలంలోని దేవరంపాడు గ్రామానికి వెళ్ళారు. వివాహం తర్వాత తిరిగి స్వగ్రామానికి వస్తుండగా జానపాడు శివార్లలో వున్న మూల మలుపు వద్ద కారంపూడి నుంచి పిడుగురాళ్ళకు వస్తున్న ఆర్టీసీ బస్సుసు అదుపుతప్పి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న పూర్ణమ్మ, మాధవి, కమలాబాయి, జయమ్మతోపాటు మరో వ్యక్తి మరణించారు.

cm chandrababu

ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలి.. చంద్రబాబు

నెల్లూరు వరదలకు సంబంధించి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులు ఉద్యోగులతో సమీక్ష నిర్వహించారు. వరద బాధితుల్లో ఆత్మవిశ్వాసం, నమ్మకం కలిగించాలని చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అంతేకాదు సాయంత్రం లోపు బాధితులకు 25 కిలోల బియ్యం, కిలో పంచదార, కిలో కందిపప్పు, పామాయిల్ నూనె పంపిణీ చేయాలని చెప్పారు. వర్షాలతో నష్టపోయిన ప్రతి ఇంటికి నష్టపరిహారం, పంటలకు రెండురోజుల్లో నష్టపరిహారం అందిస్తామని తెలిపారు. కాగా నెల్లూరు జిల్లాను కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ఏరియల్ సర్వే చేశారు. నెల్లూరు వరద ప్రాంతాలను ఆయన పరిశీలించారు. మనుబోలు వద్ద గండిపడిన హైవేను ఆయన పరిశీలించి..యుద్ద ప్రాతిపదికన హైవే ను పునరుద్దరించాలని మోడీ ఆదేశించారని తెలిపారు. కాగా వరద నష్టంపై నివేదిక ఇచ్చిన తరువాత కేంద్రం సాయం చేస్తుందని స్పష్టం చేశారు.

Smuggler Gangireddy

నా భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉంది..

ఎర్రచందనం స్మగ్లర్ గంగిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. గంగిరెడ్డిని విచారణ జరిపి పోలీసులు కీలక సమాచారం రాబడుతున్నారు. అయితే ఇప్పుడు గంగిరెడ్డి భార్య మాళవిక చేస్తున్న ఆరోపణలపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తన భర్త గంగిరెడ్డికి ప్రాణహాని ఉందని.. ఆయన్ను ఎన్ కౌంటర్ చేయాలని  ప్లాన్ చేస్తున్నారని అంటుంది. అంతేకాదు తన భర్త గంగిరెడ్డికి ఎలాంటి ప్రాణహాని జరిగిన ప్రభుత్వందే బాధ్యత అని ఆమె డిమాండ్ చేస్తుంది. తన భర్తను చంద్రబాబు టార్గెట్ చేశారని.. అందుకే పోలీసులు ఆయన్ను వెంటాడి వేధించారని.. చంద్రబాబు వల్ల గంగిరెడ్డికి ప్రాణహాని ఉందంటూ గతంలో గవర్నరుకు లేఖ కూడా ఇచ్చామని అని చెప్పారు. అయితే పోలీసుల గంగిరెడ్డిని అరెస్ట్ చేసిన వారం రోజుల తరువాత ఆయన భార్య మాళవిక మీడియా ముందుకు రావడంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసలు గంగిరెడ్డిని కోర్టులో హాజరుపరిచిన తరువాత ఎన్ కౌంటర్ చేయడమనేది అసాధ్యం. అలాంటప్పుడు ఆమె చేసే వాదనలో ఎలాంటి అర్ధం లేదు. మరి ఆమె ఇప్పుడు ఎందుకు ఇలాంటి ఆరోపణలు చేస్తుందో.. ఈమె ఇలా ఆరోపణలు చేయడంతో కేసు మరో కొత్త మలుపు తిరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. కాగా ఇంటర్ పోల్ సహాయంతో గంగిరెడ్డిని మారిషన్ లో పట్టుకున్న సంగతి విదితమే.

konathala ramakrishna

టీడీపీలోకి కొణతాల? ఈసారైనా జరిగేనా?

  మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ వైసీపీని వీడిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీడీపీలోకి చేరుతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. వైసీపీని వీడిన తరువాత కొణతాల రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. అయితే ఈ మధ్య ఆయన ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయిన అనంతరం ఇప్పుడు టీడీపీలో చేరుతున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అయితే గత శాసనమండలి ఎన్నికల సమయంలోనే కొణతాల తెదేపాలోకి చేరాల్సి ఉంది. కాని అప్పుడు పెందుర్తి ఎమ్మెల్యే మాజీ మంత్రి బండారు సత్య నారయణ కారణంగా అది జరగలేదు. ఎందుకంటే అప్పుడు కొణతాల టీడీపీలోకి చేరడానికి అన్ని రకాలుగా ఏర్పాట్లు చేసుకున్నాడు.. అయితే కొణతాలతో పాటు  పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీని కూడా టీడీపీలోకి తీసుకురావాలని ప్రయత్నించాడు. కానీ దానికి బండారు సత్యనారాయణ అభ్యంతరం చెప్పడంతో కొణతాల చేరిక ఆగిపోయింది. అయితే ఇప్పుడు మళ్లీ కొణతాల చంద్రబాబును కలిసే సరికి మళ్లీ అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇప్పుడు మాత్రం కొణతాల టీడీపీలో చేరికకు వెనుక ఉంది మంత్రి అయ్యన్న పాత్రుడని అర్ధమవుతోంది. ఈయనే కొణతాలను పార్టీలోకి తీసుకురావాలని.. కొణతాల కనుక వస్తే విశాఖలో పార్టీ బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఈసారైనా కొణతాల చేరిక సాధ్యమవుతుందో లేదో చూడాలి.

congress leader v hanumathrao

సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్.. శాడిస్ట్.. వీహెచ్

రాహుల్ జాతీయతపై రోజు రోజుకూ వివాదం ముదురుతోంది. రాహుల్ పౌరసత్వంపై సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు నేతలు. ఇప్పటికే బీజేపీ నేత సుబ్రహ్మణ్యం చేసిన వ్యాఖ్యలకు గాను రాహుల్ గాంధీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. నా పౌరసత్వంపై దర్యాప్తు చేయించండి అని మోడీకి సవాల్ విసిరారు. ఇప్పుడు ఇదే విషయంపై కాంగ్రెస్ సీనియర్ నేత వీ హనుమంతురావు కూడా స్పందించి..రాహుల్‌ గాంధీకి ద్విపౌరసత్వం ఉందంటూ సుబ్రహ్మణ్యస్వామి చేసిన ఆరోపణలు వాస్తవం కాదని.. సుబ్రహ్మణ్య స్వామి ఒక బ్లాక్ మెయిలర్, శాడిస్ట్ అని మండిపడ్డారు. బీహార్ ఎన్నికల్లో ఓటమిపాలైన బీజేపీ ప్రజల దృష్టి మరల్చేందుకే రాహుల్ పై ఇలాంటి ఆరోపణలు చేస్తుందని అన్నారు. ప్రచారం కోసం ఆరోపణలు చేస్తున్నారని, దమ్ముంటే ప్రధాని విచారణ కు ఆదేశించాలని రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు డిమాండ్‌ చేశారు. పార్లమెంట్‌ సమావేశాల్లో ప్రజా సమస్యలు లేవదీయకుండా పక్కదోవ పట్టించేందుకు.. బీజేపీ ఇలాంటి కుట్రలు చేస్తుందని..ఎత్తుగడలు మాని కేంద్రం హుందాగా వ్యవహరించాలని ఆయన హితవు పలికారు.

chattisgarh cm

ఛత్తీస్‌గఢ్ సీఎం.. కరీనాతో సెల్ఫీ.. ఇలా చేస్తారా.. కాంగ్రెస్

  ప్రతిఒక్కరూ సెల్ఫీ దిగడం.. దానిని పోస్ట్ చేయడం కామన్ థింగ్. సామాన్య ప్రజల దగ్గర నుండి రాజకీయ నాయకులు వరకూ అందరూ సెల్ఫీలు దిగి ముచ్చట తీర్చుకునే వాళ్లే. అయితే అలా సెల్ఫీ దిగి విమర్శలు తెచ్చుకున్నారు ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి రమణ్ సింగ్. ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో జరిగిన రాష్ట్రం స్త్రీ, శిశు సంక్షేమ శాఖ యూనిసెఫ్ ల ఆధ్వర్యంలో బాలల హక్కలపై  జరిగిన ఓ కార్యక్రమంలో ముఖ్యమంత్రి రమణ్ సింగ్ పాల్గొన్నారు. ఇదే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ నటి కరీనా కపూర్ కూడా హాజరయ్యారు. అయితే కార్యక్రమం ముగిసే సమయానికి రమణ్ సింగ్ కరీనా కపూర్ తో సెల్పీ తీసుకున్నారు. అది కాస్త మీడియా కంట పడింది. అంతే ఇక రమణ సింగ్ పై విమర్శలు మొదలయ్యాయి. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈ విషయాన్నిచాలా సీరియస్ గా తీసుకొని రమణ సింగ్ పై మండిపడుతుంది. రాష్ట్రంలో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే పట్టించుకోని ముఖ్యమంత్రి, సినీ తారలతో సెల్ఫీలు దిగుతూ కాలక్షేపం చేస్తున్నారని ఆగ్రహించింది. ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి ఇలా చేస్తారా అని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు.

లాలు కొడుకులకి శాఖలు కేటాయించిన నితీశ్

బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నిన్న రాజధాని పాట్నాలోని గాంధీ మైదానంలో ప్రమాణస్వీకారం చేసిన సంగతి తెలిసిందే. ముఖ్యమంత్రిగా నితీశ్ తోపాటు ఆయన మంత్రివర్గంగా 28 మంది మంత్రులు కూడా ప్రమాణస్వీకారం చేశారు. అయితే ఈసారి ఆమంత్రి వర్గంలో లాలు కొడుకులు తేజ్ ప్రతాప్‌ యాదవ్‌, తేజస్వి ప్రసాద్ లకు కూడా ఉండటం విశేషం. జేడీయూ, ఆర్డేడీ, కాంగ్రెస్ మహా కూటమిగా ఏర్పడి ఎన్నికల్లో ఘన విజయం సాధించిన నేపథ్యంలో అనుకున్న ప్రకారమే (4:4:2) పదవులు పంచుకోవడం జరిగింది. నితీశ్ కుమార్ కూడా భాగస్వామ్య పార్టీల నేతలకు సముచిత స్థానం కల్పించి అందరికీ న్యాయం చేశారు. అయితే ప్రత్యక్ష ఎన్నికలకు దూరంగా ఉండి కుమారులిద్దర్నీ బరిలోకి దించిన లాలూప్రసాద్ యాదవ్... నితీశ్ ప్రభుత్వంలో మాత్రం ప్రధాన భూమికను పోషించనున్నారు. కాగా లాలూ కొడుకుల్లో పెద్దవాడైన తేజ్ ప్రతాప్‌ యాదవ్ కి నితీశ్ ఆరోగ్యశాఖ కేటాయించారు. చిన్న కొడుకు అయినా తేజస్వి ప్రసాద్ యాదవ్‌కి రోడ్డు, భవనాల శాఖతో పాటు ఉప ముఖ్యమంత్రి హోదాను కల్పించారు. కానీ హోంశాఖను మాత్రం తన వద్దే ఉంచుకున్నారు.

టీఆర్ఎస్ నేతలను వదిలిపెట్టిన మావోయిస్టులు

గ్రీన్ హంట్ నిలిపివేయాలంటూ మావోయిస్టులు ఖమ్మంజిల్లాకు చెందిన ఆరుగురు టీఆర్ఎస్ నేతలను కిడ్నాప్ చేసిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ చేసిన ఆరుగురు నేతలను మావోయిస్టులు విడుదల చేశారు. ఇవాళ ఉదయం చత్తీస్ గఢ్ సరిహద్దులో వారిని వదలిపెట్టినట్టు తెలుస్తోంది. కాగా ప్రస్తుతం ఆరుగురు నేతలు చర్లకు చేరుకున్నారు.. మరికాసేపట్లో భద్రాచలం చేరకోనున్నారు. కాగా భద్రాచలం టీఆర్ఎస్ ఇన్‌చార్జ్ రామకృష్ణ, పటేల్ వెంకటేశ్వర్లు, పంతమూరు సురేష్, రెప్పకట్ల జానర్దన్, సత్యనారాయణ, ఊకే రామకృష్ణలను మావోలు కిడ్నాప్ చేశారు. బూటకపు ఎన్ కౌంటర్లను ఆపాలని.. లేదంటే టీఆర్ఎస్ నేతలనే టార్గెట్ చేస్తామని మావోయిస్టులు హెచ్చరించారు.