విశాఖలో ఘనంగా నౌకా వేడుకలు

విశాఖపట్నంలో నిన్న మొదలైన ఇంటర్నేషనల్‌ ఫ్లీట్‌ వివ్యూ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఐఎన్‌ఎస్‌ నౌకలో కొలువుదీరిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ, రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ నౌకా విన్యాసాలను తిలకించారు. తూర్పుతీరానికే అత్యంత కీలకమైన విశాఖపట్నంలో జరుగుతున్న ఈ నౌకా వేడుకలలో ఉమ్మడి రాష్ట్రాల గవర్నరు నరసింహన్‌, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా నౌకా దళం తన శక్తిని ప్రతిబింబిచేలా తన అమ్ముల పొదిలో ఉన్న వివిధ అస్త్రాలను ప్రదర్శించగా, నౌకా దళం సిబ్బంది వివిధ విన్యాసాలతో అతిథులను అలరించారు. ఈ నౌకోత్సవంలో పాల్గొనేందుకు 70కి పైగా నౌకలు వివిధ ప్రాంతాల నుంచీ విశాఖకు చేరుకున్నాయి.

టీఆర్ఎస్ క్లీన్ స్వీప్.. 11న మేయర్ ఎంపిక

గ్రేటర్ ఎన్నికల్లో తెలంగాణ అధికారపార్టీ టీఆర్ఎస్ కారు జోరుకి అన్ని పార్టీలు చిత్తుచిత్తయ్యాయి. మొత్తం 150 డివిజన్లలో దాదాపు నగరంలోని అన్ని చోట్లా టీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసి 99 స్థానాలను దక్కించికుంది. కనీసం టీఆర్ఎస్ పార్టీ కూడా ఊహించని విధంగా ఆపార్టీకి గెలుపునిచ్చారు నగర ప్రజలు. దీంతో కారు స్పీడ్ ను తట్టుకోలేక అన్ని పార్టీలు పత్తా లేకుండా పోయాయి. మరోవైపు ఈ నెల 11 వ తేదీన మేయర్, డిప్యూటీ మేయర్ ఎంపిక జరుగుతుందని.. ఇప్పటి వరకూ మేయర్‌ అభ్యర్థి ఎవరనేది టిఆర్‌ఎస్‌ ఇంకా నిర్ణయించలేదని పార్టీ నేతలు చెపుతున్నారు.  మొత్తం 150 డివిజన్లలో * టిఆర్‌ఎస్‌ - 99 * ఎంఐఎం - 44 * కాంగ్రెస్‌ - 2 * టిడిపి - 1 * బిజెపి - 4

నటించబోయి మరణించాడు…

ఇటలీలో జరిగిన ఒక సంఘటనలో షూమేకర్‌ అనే నటుడు తీవ్ర గాయాల పాలయ్యాడు. ఒక నాటకంలో ఉరి వేసుకునే సన్నివేశంలో నటించే సందర్భంలో షూమేకర్‌ మెడకు నిజంగానే ఉరితాడు బిగుసుకుపోయింది. షూమేకర్‌ ఉరితాడుకి వేళ్లాడుతూ గిలగిలా కొట్టుకోవడంతో అనుమానం వచ్చిన ఒక ప్రేక్షకురాలు రంగస్థలం వద్దకు పరుగులుపెట్టింది. కానీ అప్పటికా జరగాల్సిన ప్రమాదం జరిగిపోయింది. మెడకి ఉరి గట్టిగా బిగుసుకుపోవడంతో షూమేకర్‌ వెంటనే కోమాలోకి జారుకున్నాడు. మరికొద్ది గంటలకే అతణ్ని వైద్యులు బ్రెయిన్‌డెడ్‌గా ప్రకటించడంతో, అతని అవయవాలని వేరొకరికి దానం చేయాలని షూమేకర్‌ కుటుంబసభ్యులు కోరారు. అయితే ఈ ప్రమాదం వెనుక థియేటర్‌ యాజమాన్యం తరఫున ఏమన్నా అజాగ్రత్త ఉందా అన్న కోణంలోంచి పోలీసులు దర్యాప్తుని చేపట్టారు.

బీజేపీతో పొత్తుకు పీడీపీ స్వస్తి పలికినట్టేనా..!

గత కొద్ది రోజుల నుండి జమ్ము కాశ్మీర్ రాజకీయాల్లో వేడి వాతావరణం నెలకొన్న సంగతి తెలిసిందే. జమ్ము కాశ్మీర్‌ ముఖ్యమంత్రి ముఫ్తీ మొహమ్మద్‌ సయీద్‌ మరణానంతరం ఆయన కూతురు మెహబూబా ముఫ్తీ సీఎం గా బాధ్యతలు చేపెట్టే విషయంలో ఎన్నో అవకతవకలు ఏర్పడుతున్నాయి. అందుకే మొహమ్మద్‌ సయీద్‌ అంత్యక్రియలు అనంతరం చేపట్టవలసిన బాధ్యతలను ఇంకా చేపట్టలేదు మెహబూబా ముఫ్తీ. అయితే అసలు దీని కారణం ఇంతకుముందు మిత్రపక్షాలుగా ఉన్న బీజేపీకి, పిడిపి (పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ) కి సరిగ్గా సయోధ్య కుదరకపోవడమే. అంతేకాదు ఇటీవలే తమతో కలిసి ఉండాలంటే  బీజేపీకి కొన్ని షరతులు కూడా విధించారు మెహబూబా ముఫ్తీ. ఆ షరతులకు బీజేపీ సంగ్దిగ్ధంలో పడింది. దీంతో కేంద్రనుంచి ''విశ్వాసాన్ని పాదుకొల్పే చర్యల'' విషయంలో స్పష్టమైన హామీ లభించని పక్షంలో బిజెపితో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యం కాదని మెహబూబా అన్నట్టు తెలుస్తోంది. దీంతో ఇక పిడిపీ బీజేపీ పొత్తుకు స్వస్తి పలికినట్టే అని వార్తలు వస్తున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.

మేము ఆరోగ్యంగా ఉన్నాము.. తప్పుడు సంకేతాలు ఇవ్వద్దు..

కాపులను బీసీల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ ముద్రగడ పద్మనాభం ఆయన భార్యతో కలిసి చేపట్టిన నిరాహార దీక్ష రెండో రోజుకు చేరుకుంది. దీంతో ముద్రగడకు, ఆయన సతీమణికి వైద్యలు వైద్య పరీక్షలు నిర్వహించారు. అయితే ముద్రగడ మాత్రం తమ ఆరోగ్యం గురించి ఎలాంటి సంకేతాలు ఇవ్వద్దని.. అలా చేయడం వల్ల అభిమానులు ఆందోళన చెందుతారని వైద్యులకు సూచించారు. అంతేకాదు మేము పూర్తి ఆరోగ్యంతో ఉన్నాము.. నాభార్యకు ఉపవాసాలు చేయడం అలవాటే.. మేము భోజనం చేయకపోయినా ఆరోగ్యంగానే అంటామని చెపుతున్నారు. దీంతో చేసేది లేక వైద్యులు కూడా వారి ఆరోగ్య పరిస్థితి గురించి ఏం చెప్పకుండానే వెళ్లినట్టు తెలుస్తోంది.

కిర్లంపూడిలో ఉత్కంఠత!

కాపులకు రిజర్వేషన్లను సాధించేందుకు ముద్రగడ పద్మనాభం చేపట్టిన ఆమరణ దీక్ష రెండో రోజుకి చేరుకుంది. తన దీక్షను ప్రశాంతంగానే కొనసాగిస్తాననీ, తనకు మద్దతుగా ఎవరూ కిర్లంపూడికి చేరుకోవద్దనీ ముద్రగడ చెప్పినప్పటికీ, ముద్రగడ ఇంటి ముందర ఉద్యమ వాతావరణ నెలకొని ఉంది. ముద్రగడ ఆరోగ్య పరిస్థితి మెరుగ్గానే ఉందని వైద్యులు పేర్కొన్నారు. అయినా దీక్ష కారణంగా కిర్లంపూడి మొత్తం కర్ఫ్యూ వాతావరణం నెలకొని ఉంది. అయితే నేడు ప్రభుత్వం ముద్రగడతో చర్చలు జరపనుందని తెలియడంతో ఇవాళ సాయంత్రానికి ముద్రగడ తన దీక్షను విరమించే అవకాశం కనిపిస్తోంది. ఎమ్మల్సీ బొడ్డు భాస్కరరామారావు ఒకటికి రెండుసార్లు ముద్రగడను కలిసి ప్రభుత్వం తరఫున పరిస్థితిని సానుకూలంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నారు.

నారాయణ చెవులు భద్రం..

తెరాసకు 100 సీట్లకు మించి వస్తే తన చెవులు కోసుకుంటానని సీపీఐ నేత నారాయణ సవాలు చేసిన విషయం తెలిసిందే. నిన్ని రాత్రి ఒకదాని తరువాత ఒకటిగా గ్రేటర్‌ ఎన్నికలలో వస్తున్న ఫలితాలతో తెరాస 110 సీట్లను సైతం చేరుకుంటుందేమో అన్న పరిస్థితి వచ్చేసింది. ఈ సందర్భంగా కేసీఆర్ విలేకరుల సమావేశంలో నారాయణ చేసిన సవాలుని గుర్తుచేస్తూ ‘నారాయణ నాకు మంచి మిత్రుడు. ఆయన చెవి జోలికి ఎవరూ పోవద్దు’ అంటూ ఛలోక్తులు విసిరారు. మరోవైపు నారాయణ కూడా ఎన్నికల సమయంలో రకరకాల మాటలు వస్తాయనీ, తన సవాలును సరదాగానే తీసుకోవాలనీ సూచించారు. చివరికి తెరాస 99 స్థానాల దగ్గరే ఆగిపోవడంతో ఇక మీదట నారాయణగారు సంజాయిషీలు చెప్పుకునే అగత్యం లేకుండా పోయింది. అయితే ఎన్నికలలో రకరకాల మాటలు వస్తూనే ఉంటాయన్నమాట!

చరిత్ర తిరగరాశాం.. కేసీఆర్

గ్రేటర్ ఎన్నికల్లో చరిత్ర తిరగరాశాం అని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. విలేకరుల సమావేశంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ అద్భుతమైన విజయాన్ని అందించిన జంటనగరాల ప్రజలకు.. విజయానికి కృషి చేసిన నేతలు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలుపుతున్నానన్నారు. ప్రజలు చాలా పెద్ద బాధ్యతను అప్పగించారు.. ఎంత గొప్ప బాధ్యత అప్పగించారో అంతే గొప్పగా ప్రజలకు సేవ చేసి నిరూపించుకుంటామని తెలిపారు. హైదరాబాద్ లో ఉన్నవారంతా మా బిడ్డలే అని.. ప్రతి ఒక్కరికీ ఉపాధీ, భద్రత కల్పించడం మా బాధ్యత.. అని అన్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో హైదరాబాద్ కు లక్షల డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇస్తామని హామి ఇచ్చారు.  

అలాంటి సవాళ్లు స్పోర్టీవ్‌గా తీసుకోవాలి.. నారాయణ

గ్రేటర్ ఎన్నిక్లలో ఎన్నో సవాళ్లు విసురుకుంటాం.. అవన్నీ స్పోర్టివ్ గా తీసుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో కనుక టీఆర్ఎస్ పార్టీ 100 సీట్లకు పైగా విజయాన్ని సాధిస్తే తాను చెవి కోసుకుంటానని సవాల్ విసిరారు. అయితే ఇప్పుడు ఆ సవాల్ ను ఆయనకు గుర్తుచేయగా.. ఇలాంటివి స్పోర్టీవ్‌గా తీసుకోవాలని.. ఏదో ఎన్నికల్లో ఎన్నో మాటలు అంటుంటామని వాటిని పట్టించుకోకూడదని తెలిపారు. అంతేకాదు ఎన్నికల ప్రచారంలో కూడా మాటలను పొదుపుగా వాడుకోవాలా ఏంటీ? అని ఎదురు ప్రశ్న కూడా వేశారు. మరి నారాయణ అయితే సీరియస్ గా తీసుకోలేదు కాని.. ప్రతిపక్ష నేతలు సీరియస్ గా తీసుకోకుండా ఉంటారా..?

వారి నమ్మకాన్ని వమ్ము చేయం..కేటీఆర్

గ్రేటర్ ఎన్నికల విజయంపై తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు, మంత్రి కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో గెలుపుతో టీఆర్ఎస్ కొత్త చరిత్రను సృష్టించిందని.. గ్రేటర్‌ ఎన్నికల్లో ప్రభంజనం సృష్టించామని అన్నారు. ప్రజలు మాపై నమ్మకం ఉంచి మమ్మల్ని గెలిపించారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయమని అని వెల్లడించారు. అంతేకాదు మమ్మల్ని గెలిపించిన ప్రతిఒక్కరికి శిరసు వంచి నమస్కరిస్తున్నాను.. ఈ ఎన్నికల్లో గెలుపునకు కృషిచేసిన మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపుతో తెరాస అంటే తిరుగులేని రాజకీయ శక్తిగా అవతరించిందన్నారు. కాగా కులాలు, మతాలు, ప్రాంతాలకు అతీతంగా ఇప్పటికే రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశామన్నారు.

నేను సవాల్ చేయలేదు: రేవంత్ రెడ్డి

  పోటాపోటీగా జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో, ప్రజలు టిఆర్ఎస్ కే పట్టం కట్టారు. ఈ సందర్భంగా టిడీపీ నేత రేవంత్ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే..." నగర ప్రజలు తమ తీర్పును ఇచ్చారు. ఈ తీర్పులో గెలిచిన కార్పొరేటర్లందరికీ టిడీపీ తరపున శుభాకాంక్షలు తెలుపుతున్నాను. ఈ తీర్పును మేము శిరసావహస్తున్నాము. మేము మరింతగా ప్రజల్లోకి వెళ్లి సమస్యలపై పోరాటాలు చేస్తాం. టిఆర్ఎస్ పార్టీ గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలను నరవేరుస్తారని ఆశిస్తున్నాం. గెలుపోటములు సహజం. ఒకప్పడు భారీ మెజారిటీ పొందిన కాంగ్రెస్ నేడు గల్లంతయ్యింది. ఒక సమయంలో, ప్రజాభిమానమే లేని బిజేపీ ఇప్పుడు కేంద్రంలో స్వతంత్రంగా ప్రభుత్వం ఏర్పాటు చేసుకుంది. ప్రజాస్వామ్యం అంటే ఇదే. టిఆర్ఎస్ వాళ్లు చేసిన సవాళ్లకు నేను ప్రతిసవాల్ చేశాను తప్ప, నేనే ముందు సవాల్ చేయలేదు" అని అన్నారు.

సీమాంధ్రులను ఆకట్టుకున్న కేటీఆర్

  గ్రేటర్ ఎన్నిల్లో పార్టీలన్నీ నువ్వా.. నేనా అంటూ పోటా పోటీగా ప్రచారం చేశాయి. అయితే ఇప్పుడు అందరికి తలెత్తే ప్రశ్న ఏంటంటే.. సెటిలర్లు కూడా టీడీపీని నమ్మలేదా.. సెటిలర్లు ఉన్న ఏరియాలు కూడా టీఆర్ఎస్ పార్టీకే పట్టం గట్టాయి. ఎందుకు..? ఇలా ప్రశ్నలెన్నో తలెత్తుతన్నాయి. ఎందుకంటే.. ఇద్దరు సీఎంల కొడుకులు సెటిలర్లు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో పోటీగా ప్రచారం చేశారు. ఆఖరికి టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ప్రచారం చేశారు. మరి ఆయన ప్రచారానికి కూడా ప్రజలు ఇంప్రెస్ అవ్వలేదా..?. అయితే కేటీఆర్ మాత్రం సీమాంధ్రులను ఆకట్టుకునే విధంగా మాట్లాడారు అనడంలో ఎలాంటి సందేహంలేదు. ఇక సీమాంధ్రులు కూడా కేటీఆర్ మాటలకు పడిపోయారేమేకాని టీఆర్ఎస్ పార్టీకే ఓటేశారు. అంతేకాదు ఎప్పుడూ సీమాంధ్రులకు ఒక్క సీటు కూడా ఇవ్వని కేసీఆర్ గ్రేటర్ ఎన్నికల్లో మాత్రం దాదాపు 20 స్థానాలను సీమాంధ్రులకు ఇచ్చారు. ఇది కూడా ఒక కారణం అయి ఉండచ్చు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..    ఎక్కడో సెటిలర్లు ఉన్న కొన్ని ప్రాంతాల్లో మాత్రమే.. అది కూడా చాలా తక్కువ మెజార్టీతో టీడీపీ అభ్యర్ధులు గెలిచారు.

పాతబస్తీలో మజ్లిస్‌… మిగతా చోట్ల తెరాస!

హైదరాబాదు ఓటర్లు అధికార పక్షానికి ఊహించని రీతిలో పట్టాన్ని కట్టబెట్టారు. ఇప్పటి వరకు వస్తున్న వార్తల ప్రకారం పాతబస్తీ మొత్తాన్నీ మజ్లిస్‌ కైవసం చేసుకోగా, నగరంలోని మిగతా ప్రాంతాలలో తెరాస విజయఢంకా మోగించనుంది. సెటిలర్లు ఉన్న కొండాపూర్‌ వంటి ప్రాంతాలలో సైతం తెరాసకి ఎదురులేకుండా పోయింది. ఇక కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా కనిపంచడం లేదు. కేవలం అయిదు సీట్లలోపే ఆ పార్టీకి దక్కేట్లు ఉన్నాయి. మాజీ మేయర్ అయిన బండ కార్తీకరెడ్డి వంటి హేమాహేమీలు సైతం తెరాస ప్రభంజనానికి తలవంచక తప్పలేదు. మొత్తానికి ఈ ఎన్నికలలో తెరాస సెంచరీ సీట్లని సాధించే దిశగా ఫలితాలు వస్తున్నాయి.  

బ్రెజిల్‌లో దోమలకు అయిదు రోజుల పండగ!

ప్రపంచమంతా జికా వైరస్‌తో వణికిపోతోంది. అన్ని దేశాలలోకెల్లా దక్షిణ అమెరికా ఖండంలోని బ్రెజిల్‌ దేశానికి ఈ వైరస్ వల్ల తీవ్ర నష్టం జరిగింది. ఇప్పటివరకూ జికా వైరస్‌ సోకి బ్రెజిల్‌లో వందలాది మంది పిల్లలు మెదడుకి సంబంధించిన లోపాలతో పుట్టారు. అయినా బ్రెజిల్ వాసులు జికా వైరస్‌కు పెద్దగా భయపడుతున్నట్లు లేదు. బ్రెజిల్‌ దేశంలో రెండో అతిపెద్ద నగరం అయిన ‘రియో డి జెనెరో’లో ఇవాల్టి నుంచి అయిదు రోజుల పాటు పెద్ద ఎత్తున కార్నివాల్‌ (జాతర) జరగబోతోంది. ఈ కార్నివాల్‌కి దేశం నలుమూలల నుంచే కాకుండా చుట్టుపక్కల దేశాల నుంచీ కూడా లక్షలాది మంది జనం తరలి వస్తారని అంచనా. ఇన్ని లక్షల మంది ఒక చోటకి చేరడం వల్ల జికాను వ్యాప్తి చేసే ఈడిస్‌ దోమలు విజృంభిస్తాయని ఆరోగ్య శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు. కార్నివాల్‌ తరువాత రియో నుంచి తిరిగి వెళ్లేవారు తమతో పాటు జికా వైరస్‌ను ప్రపంచం నలుమూలలకీ తీసుకువెళ్లే ప్రమాదం లేకపోలేదు. అయినా ఈ హెచ్చరికలను ఎవరూ పట్టించుకోవడం లేదు సరికదా… ‘అవన్నీ పట్టించుకుంటే జీవితాన్ని సరదాగా గడిపేది ఎలా?’ అంటూ ఎదురు సమాధానం చెబుతున్నారట. మరో పక్క కార్నివాల్‌కు వచ్చేవారి నుంచి డబ్బులు దండుకోవడం కోసం స్థానిక హోటళ్లన్నీ ఎదురుచూస్తున్నాయి. కొందరికి సరదా కావాలి! మరి కొందరికి డబ్బు కావాలి! ఇంతకీ దీని వల్ల ప్రపంచానికి ఏం జరుగుతుందో ఎవరికి కావాలి?