మాల్యాకు కృతజ్ఞతలు తెలిపిన కోహ్లి.. ఎందుకో..?

భారత క్రికెటర్ విరాట్ కోహ్లీ విజయ్ మాల్యాకు కృతజ్ఞతలు తెలిపాడు. కోహ్లీ ఎంటీ మాల్యాకు కృతజ్ఞతలు చెప్పడం ఏంటని అనుకుంటున్నారా.. ఐపిఎల్ 9 సిరీస్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా.. కోహ్లీ కెప్టెన్సీలో రాయల్ చాలెంజర్స్ జట్టు, హైదరాబాద్ సన్ రైజర్స్ తలపడనున్నారు. ఈసందర్భంగా కోహ్లీ మీడియాతో మాట్లాడుతూ.. అసలు నేనింత మంచి పేరు తెచ్చుకోవడానికి గల కారణం మాల్యానే అని.. ఐపిఎల్ ప్రారంభంలో  చాలెంజర్స్ తరపున ఆటగాడిగా నన్ను ఎంపిక చేసింది మాల్యానే అని.. ఆతరువాతే క్రికెట్లో ఉన్నత శిఖరాలకు ఎదగడం మొదలు పెట్టానని.. అందుకు మాల్యాకు కృతజ్ఞతలు తెలుపుతన్నానని అన్నారు. కాగా బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగనామం పెట్టి మాల్యా విదేశాల్లో చెక్కేసిన సంగతి తెలిసిందే.

ఇకనుండి అద్దెకు ఐఫోన్లు..

  ఈ మధ్య కాలంలో ఎవరి చేతిలో చూసినా స్మార్ట్ ఫోన్ ఉండటం కామన్. అయితే స్మార్ట్ ఫోన్ ఉన్నవాళ్లు మాత్రం తమ చేతిలో ఐఫోన్ ఉండాలనుకుంటారు. అయితే స్థోమత ఉన్నవాళ్లు కొనుక్కుంటారు.. లేని వాళ్లు వాటిని చూసి సంతోషపడతారు. అయితే ఇప్పుడు అలా చూసి సంతోషపడేవాళ్లకి యాపిల్ సంస్థ ఓ ఆఫర్ ను తీసుకొచ్చింది. తన ఫోన్లను అద్దెకు ఇస్తామని యాపిల్ సరికొత్త ప్రతిపాదన చేసింది. భారత కార్పొరేట్లు తాజా ఐఫోన్ ఎస్ఈ వేరియంట్ లను అద్దెకు తీసుకోవచ్చని, నెలకు రూ. 999ల అద్దెపై రెండేళ్ల పాటు వీటిని లీజుకు ఇస్తామని తెలిపింది. ఐఫోన్ 6, ఐఫోన్ 6ఎస్ రకాలు అద్దెకు తీసుకోవాలంటే నెలకు రూ. 1,199, రూ. 1,399 అద్దెను చెల్లించాల్సి వుంటుందని తెలిపింది. ఇంకెందుకు ఆలస్యం డబ్బులు కట్టండి.. ఐఫోన్ అద్దెకు తెచ్చుకోండి.

పాకిస్థాన్ లో మరో భారతీయ ఖైదీ అనుమానాస్పద మృతి.. 20 ఏళ్లనుండి జైల్లో

  పాకిస్థాన్ లో మరో భారతీయ ఖైదీ అనుమానాస్పద స్థితిలో మరణించిన ఘటన కలకలం రేపుతోంది. పాకిస్థాన్లో లఖ్ పత్ జైల్లో ఖైదీగా ఉన్న భారత జాతీయుడు క్రిపాల్ సింగ్ అనుమానాస్పదస్థితిలో చనిపోయాడు. 1992 వ సంవత్సరంలో మద్యం తాగి వాఘా సరిహద్దు దాటిన క్రిపాల్ ను పాకిస్థాన్.. ఉగ్రవాదం.. గూఢాచార్యం పేరుతో జైల్లో ఖైదీగా బంధించింది. అప్పటినుండీ జైల్లోనే గడుపుతున్న క్రిపాల్.. నిన్న ఉదయం జైలు గదిలో చనిపోయి కనిపించాడు. దీంతో ఆయన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిన్నా అస్పత్రికి తరలించారు. మరోవైపు క్రిపాల్ సోదరి జాగిర్ కౌర్ మాత్రం ఇది హత్యే అని ఆరోపిస్తున్నారు. తన అన్నను విడుదల చేయాలని భారత ప్రభుత్వం ఎప్పటినుండో కోరుతున్నప్పటికీ పాక్ మాత్రం స్పందించలేదని.. ఏప్రిల్ 2013లో సరబ్ జిత్ సింగ్ ను దారుణంగా హత్య చేసి చంపేసినట్టుగానే క్రిపాల్ ను హత్య చేశారని ఆవేదన వ్యక్తం చేస్తుంది. కనీసం తన అన్న మృతదేహాన్ని ఇండియాకు తెప్పించాలని ఈ దిశగా భారత ప్రభుత్వం కృషి చేయాలని క్రిపాల్ సోదరి జాగిర్ కౌర్ కోరారు.

అమరావతి.. అక్రమంగా కోట్లకి కోట్లు.. సీఆర్డీయే అధికారి ఇంటిపై సోదాలు

  ఒక పక్క ఏపీ నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి ముఖ్యమంత్రి చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే మరోపక్క దీనిని అడ్డంపెట్టుకొని కొంతమంది కోట్లకి కోట్లు సంపాదించుకున్నారు. అలా అక్రమంగా సంపాదించి అడ్డంగా బుక్కయ్యాడు ఓ సీఆర్డీయే అధికారి. వివరాల ప్రకారం.. నవ్యాంధ్ర రాజధాని అమరావతి నిర్మాణం కోసం సీఆర్డీఏను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. సీఆర్డీఏలో రెహ్మాన్ టౌన్ ప్లానింగ్ అధికారిగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆయన అక్రమంగా 4 కోట్ల ఆస్తులు కూడబెట్టారు అన్న ఆరోపణలు వస్తుండటంతో ఏసీబీ రెహ్మాన్ ఇంటిపై సోదాలు నిర్వహించింది. గుంటూరు, విజయవాడ, కర్నూలు, విశాఖపట్నంలోని పదకొండు చోట్ల అధికారులు దాడులు చేశారని తెలుస్తోంది. ఆయన ఇంట్లో విదేశీ కరెన్సీ కూడా దొరికినట్టుగా సమాచారం. ఆయన వద్ద రూ.1.60 కోట్ల అక్రమాస్తులను అధికారులు గుర్తించారని తెలుస్తోంది. విశాఖ ఆయన నివాసంలో 4.46 లక్షలు, విదేశీ కరెన్సీ, బంగారంతో పాటు పలు జిల్లాల్లో స్థిరాస్తులు గుర్తించారు. దాడులు ఇంకా కొనసాగుతున్నాయి.

రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం

పద్మ అవార్డలు ప్రదానోత్సవం రాష్ట్రపతి భవన్‌లో అట్టహాసంగా జరిగింది. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజేతలకు అవార్డులు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఐగుగురికి పద్మవిభూషణ్, పదిమందికి పద్మభూషణ్, 40 మందికి పద్మశ్రీ అవార్డులు అందించారు. సీనినటుడు రజినీకాంత్, ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు, టెన్నిస్ స్టార్ సానియా మీర్జా, బాలీవుడ్ స్టార్ ప్రియాంక చోప్రా తదితర ప్రముఖులు అవార్డులను అందుకున్న వారిలో ఉన్నారు. ఈ కార్యక్రమానికి ఉపరాష్ట్రపతి హామీద్ అన్సారీ, ప్రధాని నరేంద్రమోడీ, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్ సింగ్, వెంకయ్యనాయుడు, బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా తదితరులు హాజరయ్యారు.  

మరో నలుగురు ఎమ్మెల్యేలు టీడీపీలోకి..! బుజ్జగించే పనిలో జగన్..

  వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి పార్టీ నుండి ఇప్పటికే 10 మంది ఎమ్మెల్యేలు దాకా టీడీపీలోకి చేరారు. ఇప్పుడు మరో నలుగురు ఎమ్మెల్యేలు కూడా టీడీపీ లోకి వెళ్లడానికి చూస్తున్నట్టు వార్తలు జోరందుకున్నాయి. ఈ నేపథ్యంలో జగన్ వారిని బుజ్జగించే పనిలో పడ్డట్టు తెలుస్తోంది. దీనిలో భాగంగానే ప్రకాశం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు.. గొట్టిపాటి రవి, మేకా ప్రతాప్ లను పిలిపించి ఆయన చర్చలు జరిపినట్టు రాజకీయవర్గాల టాక్. అంతేకాదు.. కేవలం రాజ్యసభ ఎన్నికల కోసమే పార్టీల్లోకి ఆహ్వానిస్తున్నారు.. ఆ తరువాత ఎలాంటి ప్రాధాన్యత ఉండదు. వెళ్లిన వారు ఈ విషయం తెలుసుకోవడంలేదు అని జగన్ వారికి చెప్పినట్టు సమాచారం. కాగా రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో నాలుగో సీటును కూడా గెలుచుకోవడానికి సాధ్యమైనంత ఎక్కువ మంది వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులను టిడిపిలోకి తీసుకు రావడానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు తెలుస్తోంది.

ఆ భారతీయ విద్యార్ధులపై చర్యలు తీసుకుంటా..

తెలియక తప్పు చేస్తే ఏముండదు కానీ.. తెలిసి, తెలిసి తప్పు చేస్తే దానికి ఖచ్చితంగా మూల్యం చెల్లించక తప్పదు. ప్రస్తుతం అమెరికాలో అక్రమంగా ఉండాలనుకున్న భారతీయ విద్యార్ధుల పరిస్థితి అలానే ఉంది. ఎందుకంటే.. మోసపు యూనివర్శిటీ అని తెలిసీ కూడా.. వీసా గడువు లేకుండా దేశంలోనే ఉండిపోవాలని చూసిన 306 మంది భారతీయ విద్యార్ధులపై అమెరికా చర్యలు తీసుకుంటామని తెలిపింది. దీనిపై  హోంల్యాండ్‌ సెక్యూరిటీ అండ్‌ ఇమ్మిగ్రేషన్‌ అండ్‌ కస్టమ్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌  కొంతకాలం నుండి స్టింగ్ ఆఫరేషన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్లోనే అసలు వివరాలు బయటపడ్డాయి. అధికారులే బోగస్ వర్శిటీని స్పష్టించి విద్యార్ధులపై వల విసిరారని.. వీసా పొడిగింపుకు ప్రయత్నించి అది పొందలేకపోయిన వారికి బ్రోకర్లు రంగ ప్రవేశం చేసి వర్శిటీలో ప్రవేశాన్ని ఇప్పించారని.. అయితే మొత్తం 1000 మంది విద్యార్ధులు వర్శిటీలో చేరగా అది తప్పు అని తెలియక కొంతమంది చేరగా.. అందులో విషయం తెలిసినా కూడా కొంతమంది విద్యార్ధులు చేరారని తెలిసింది. దీంతో అమెరికా కూడా అది ఫ్రాడ్ అని తెలిసినా కూడా తప్పు చేసిన విద్యార్దులపై మాత్రమే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. కాగా ఈ ఆపరేషన్లో బయటపడ్డ మొత్తం 32 మంది బ్రోకర్లను అరెస్ట్ చేశారు. వారిలో 11 మంది భారతీయులు కూడా ఉన్నారు.

సాయిబాబా, శని దేవుళ్లుగా అనర్హులు.. స్వామి స్వరూపానంద సరస్వతి

  సాయిబాబాను పూజించడంవల్లే కేరళలోని కొల్లం, పుట్టంగల్ దేవి ఆలయంలో ప్రమాదం జరిగిందని ద్వారాకా పీఠాధిపతి స్వామి స్వరూపానంద సరస్వతి సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసింది. ఇప్పుడు ఈ ఘటనపై ఆయన మరోసారి సంచలనమైన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలోని శనిసింగనాపూర్ ఆలయంలో మహిళలు ప్రేవేశించడంవల్లే అక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని. శని దేవాలయంలోకి మహిళల్ని అనుమతించినందువల్లే  దేశంలో అన్ని అనర్థాలు జరుగుతున్నాయని మండిపడ్డారు. నాలుగు శతాబ్ధాలుగా ఉన్న సంప్రదాయాన్ని ఒక్కసారిగా కూల్చివేసి మహిళలు ఆలయంలోకి ప్రవేశించారు.. అందుకే అమ్మవారి ఆలయంలో విలయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన మాట్లాడుతూ అసలు షిర్డీ సాయిబాబా, శని దేవుళ్లు.. దేవుళ్లుగా అనర్హులని.. వారికి పూజలు చేయడంవల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని అన్నారు. మరోవైపు స్వరూపానంద స్వామి చేసిన వ్యాఖ్యలపై మహిళా సంఘాలు మండిపడుతున్నాయి.

డీఎండీకే కూటమిలో మరో నాలుగు పార్టీలు..!

  తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరగనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పార్టీలన్నీ ఏ పార్టీతో వారు పొత్తులు పెట్టుకొని బరిలో దిగుతున్నారు. అయితే ఇప్పటికే డీఎండీకే, ప్రజా సంక్షేమ కూటమి పొత్తుపెట్టుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో నాలుగు పార్టీలు కూడా డీఎండీకే కూటమిలో చేరే ఆవకాశాలు కనిపిస్తున్నాయి. తమిళగ వాళ్వురిమై కట్చి అధ్యక్షుడు వేల్‌ మురుగన్‌, తమిళగ మున్నేట్ర కళగం అధ్యక్షుడు జాన్‌ పాండియన్‌, మూవేందర్‌ మున్నేట్ర కళగం అధ్యక్షుడు సేతురామన్‌లు ప్రస్తుతం డీఎండీకే కూటమిలో చేరే విషయమై చర్చలు జరుపుతున్నట్లు సమాచారం. కాగా ప్రస్తుత ఎన్నికల్లో పంచముఖ పోటీ నెలకొంటున్న విషయం తెలిసిందే. డీఎంకే, అన్నాడీఎంకే, డీఎండీకే- ప్రజాసంక్షేమ కూటమి, భాజపా, పీఎంకే తలపడుతున్నాయి.

ప్రఖ్యాత మహిళా బైక్ రేసర్ వీను పాలివల్ దుర్మరణం

మహిళలు బైక్ రేసింగ్ చేయగలరని నిరూపించి దేశ వ్యాప్తంగా ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మహిళల్లో స్పూర్తినింపిన వీను పాలివల్ ఇకలేరు. మధ్యప్రదేశ్‌లోని విదీషా జిల్లాలో నిన్న జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆమె దుర్మరణం పాలయ్యారు. జైపూర్‌కి చెందిన వీనుకి చిన్నప్పటి నుంచి బైక్‌లు నడపడం అంటే సరదా..ఆ సరదానే వృత్తిగా మార్చుకుని హార్లే డేవిడ్‌సన్ బైక్‌ను గంటకు 180 కిమీల స్పీడ్‌‌తో నడిపి సంచలనం సృష్టించింది. దేశంలోని ఎన్నో నగరాల్లో బైక్ రేసుల్లో పాల్గోంది. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా బైక్ జర్నీ చేసి దానిని డాక్యుమెంటరీ తీయాలనుకుంది. కానీ ఇదే ఆమె చివరి యాత్రగా మారిపోయింది.     వీను తన తోటి బైక్ రేసర్ దీపేశ్ తన్వర్‌తో కలిసి హార్లేడేవిడ్‌సన్ బైక్‌పై టూర్‌కి వెళ్లింది. ఈ క్రమంలో తన యాత్ర మధ్యప్రదేశ్‌లోకి ప్రవేశించింది. నిన్న మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌కి 100 కి.మీల దూరంలో ఉన్న గ్యారాస్‌పూర్ ప్రాంతంలో బైక్ అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వీను తీవ్రంగా గాయపడటంతో దీపేశ్ ఆమెను స్థానిక ఆసుపత్రిలో చేర్చారు. అయితే పాలివల్ అప్పటికే మరణించినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ వార్తతో ఆమె అభిమానులు విషాదంలో మునిగిపోయారు.  

ముంబైలో భారీ అగ్నిప్రమాదం

అగ్నిప్రమాదాలు దేశాన్ని వణికిస్తున్నాయి. కేరళలోని కొల్లాం పుట్టింగల్ దేవి ఆలయంలో జరిగిన అగ్నిప్రమాదంలో 110 మంది మరణించిన సంఘటన మరవకముందే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ధానే జిల్లా భివాండి ప్రాంతంలోని వస్త్ర దుకాణంలో ఒక్కసారిగా మంటలు సంభవించాయి. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఐదు ఫైరింజిన్ల సాయంతో మంటలను అదుపు చేస్తున్నారు. అగ్నిప్రమాదం సంభవించిన సమయంలో భవనంలో అనేకమంది కార్మికులు ఉన్నారు. వీరంతా బిల్డింగ్ పైకి చేరుకోవడంతో వారిని రక్షించేందుకు అగ్నిమాపక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. ఫ్యాక్టరీకి దగ్గరలోనే నివాస సముదాయాలు ఉండటంతో స్ధానికులు ఆందోళనకు గురవుతున్నారు. వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. ముంబై, థానే తదితర ప్రాంతాల నుంచి మరికొన్ని ఫైరింజిన్లు ఘటనాస్థలికి చేరుకుంటున్నాయి. షార్ట్ సర్క్యూట్ వల్లే ప్రమాదం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు.

కొల్లం ఘటన.. లొంగిపోయిన ఐదుగురు అధికారులు

  కేరళలోని కొల్లం పుట్టింగల్ దేవి ఆలయంలో బాణసంచా పేలి ఘోర ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో 109 మంది చనిపోగా.. 400 మందికి పైగా గాయాలయ్యాయి. అయితే ఏదో ప్రమాదవశాత్తు జరిగిందనుకున్న ఈ ఘటనపై కొత్త కొత్త అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే ప్రమాదం జరిగిన చోట మూడు కార్లు.. వాటినిండా బాంబులు, పేలుడు పదార్ధాలు ఉండటంతో ఈ అనుమానాలకు ఆజ్యం పోసినట్టైంది. ఇక పోలీసులు ఆదిశగా దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ నేపథ్యంలోనే ఐదుగురు అధికారులు పోలీసుల ముందు లొంగిపోవడంతో పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. కాగా బాణాసంచా పోటీలకు అనుమతి నిరాకరించినా... అధికారులు పట్టనట్లు వ్యవహరించారని కొల్లం కలెక్టర్‌ ఎ.షాయినామోల్‌ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఈఘటనపై ఇంకెన్ని కొత్త విషయాలు బయటపడతాయో చూడాలి.

ఒక్క పుట్టినరోజు ఖర్చు 9వేల కోట్లా..!

ఎవరి స్తోమతకు తగ్గ రేంజ్ లో వాళ్లు పుట్టినరోజులు జరుపుకుంటారు. బాగా డబ్బు ఉన్నవాళ్లైతే వారి రేంజ్ కు తగ్గట్టు జరుపుకుంటారు. కానీ ఇక్కడ ఏకంగా ఒక్క పుట్టినరోజునే 9000 కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతకీ అంత ఖర్చు పెట్టింది ఎవరనుకుంటున్నారా.. బ్రిటన్ రాణి రెండో ఎలిజబెత్ రాణి. అయితే ఈ పుట్టినరోజు వేడుకలు చేసుకుంటున్నది ఆమె కాకపోయినా.. ఆమె పుట్టినరోజు వేడుక సందర్భంగా దేశమంతటా సంబరాలు జరిపేందుకు ప్రజలు బిలియన్ పౌండ్లు (రూ.9 వేల కోట్లు) ఖర్చుచేస్తారని 'ద సండే టైమ్స్' పత్రిక సర్వేలో వెల్లడైంది. ఏప్రిల్ 21 నుండి జూన్ 11 వరకూ జరిగే ఈ వేడుకలకు.. ఒక్కో బ్రిటన్ పౌరుడు ఎంత వెచ్చించాలో తెలుసా సుమారు 42.98 పౌండ్లు. వేడుకల్లో మూడో వంతు బ్రిటిషర్లు హాజరై.. పబ్బులు, బార్లు, వీధి పార్టీల్లో పాల్గొంటారట.

ఒకే ఒక్క ఛాన్స్ అంటున్న విజయకాంత్..

  తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల సందడి మొదలైంది. అదేదో సినిమాలో హీరో ఒక్క ఛాన్స్.. ఒకే ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని అడిగినట్టు.. నేతలు కూడా ఒక్క ఛాన్స్ ఇవ్వండి అని ప్రజలను కాకాపట్టే పనిలో పడ్డారు. డీఎండీకే అధినేత, సినీ నటుడు విజయకాంత్ కూడా ఇప్పుడు ఆ జాబితాలో చేరిపోయాడు. పార్టీ బహిరంగ సభలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఇప్పటికే పలు జాతీయ పార్టీలు అధికారంలోకి వచ్చాయి.. ఇక రాష్ట్రం నుండి డీఎంకే, అన్నాడీఎంకే పార్టీలు కూడా అధికారం చేపట్టాయి.. అయినప్పటికీ ఇంకా రాష్ట్రం అనేక సమస్యలతో ఉంది.. ఈసారి డీఎండీకే ప్రజా సంక్షేమ కూటమికి ఒక్క అవకాశం ఇవ్వండి.. అద్భుత పాలన అంటే ఏంటో రుచి చూపిస్తాము అని అన్నారు. ఈ కూటమిలో భాగస్వామిగా ఉన్న తాను తప్పుచేస్తే.. మిగిలిన ఐదుగురికి ప్రశ్నించే హక్కు ఉందన్నారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే ప్రజలు కోరుకునే పాలనను అందిస్తామన్నారు.

కొల్లం ఘటనపై మాతా అమృతానందమయి సంచలన వ్యాఖ్యలు.. దేవుడికేమైనా చెవుడా?

  కేరళలోని  కొల్లం.. పుట్టంగళ్ ఆలయం సమీపంలో బాణసంచా కాలుస్తుండగా ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. అయితే దీనిపై స్పందించిన  ప్రముఖ ఆథ్యాత్మిక గురువు మాతా అమృతానందమయి ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవుడికేమైనా చెవుడా?...దేవాలయాల్లో బాణాసంచా కాలుస్తారు? అని ఆమె ప్రశ్నించింది. ఈ బాణసంచా కాల్చడం వల్ల ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు.. ఇలాంటి ఘటనలు తీవ్రంగా పరిగణించాలి.. దీనిపై చర్యలు తీసుకోవాలి.. కేవలం మానవుల ఆనందం కోసం బాణసంచా కాలుస్తున్నారు.. దీన్ని పూర్తిగా నిషేదించాలని ఆమె డిమాండ్ చేశారు.

కేరళ శబరిమల ఆలయ ట్రస్ట్ కు సుప్రీం ప్రశ్న.. దేని ఆధారంతో చెపుతున్నారు..!

  మొన్నటి వరకూ శనిసింగనాపూర్ లోని శని దేవాలయంలోకి స్త్రీలను ప్రవేశించనివ్వకుండా అడ్డుకున్నారు. అయితే దీనిని వ్యతిరేకించిన బ్రిగేడ్ భూమాతా మహిళా సంఘాల ఆందోళనతో.. హైకోర్టు ఇచ్చిన తీర్పుతో ఎట్టకేలకు ఆలయంలోకి ప్రవేశించడానికి అనుమతినిచ్చారు. ఇప్పుడు మరో వివాదం తెరపైకి వచ్చింది. కేరళలోని శబరిమల ఆలయంలో మహిళలకు అనుమతి నిషేదంపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈకేసుపై విచారించిన సుప్రీం.. ఆలయ అధికారులపై మండిపడింది. రాజ్యాంగం చట్టం కంటే సంప్రదాయం గొప్పదా..? రాజ్యాంగ నిబంధనలను వెనక్కి నెట్టివేసే సంప్రదాయం ఏదైనా ఉందా..? దేని ఆధారంతో మహిళలు దేవాలయాల్లోకి వెళ్లకూడదని చెబుతున్నారు.. దేవుడు సర్వాంతర్యామి అని, అలాంటి దేవుణ్ణి ఎవరైనా ఆరాధించవచ్చని స్పష్టం చేసింది. రాజ్యాంగ హక్కు కానంతవరకు శబరిమలలో మహిళల ప్రవేశాన్ని ఎవరూ అడ్డుకోకూడదని సుప్రీంకోర్టు తెలిపింది.