'వాడెబ్బ' అన్న జేసీ.. జగన్ కు సారీ
ఏదైనా కుండబద్దలు కొట్టినట్టు చెప్పడం జేసీ బ్రదర్స్ నైజం. అవతలి వ్యక్తి ఎవరైనా సరే.. తమకు ఏది అనిపిస్తే అది.. ఏది చెప్పాలనిపిస్తే అది చెప్పేస్తుంటారు. అయితే ఇప్పటి వరకూ వారు ఎలాంటి వ్యాఖ్యలు చేసినా సారీ చెప్పని జేసీ దివాకర్ రెడ్డి మొదటి సారి సారీ చెప్పాల్సి వచ్చింది. ఎందుకంటే.. జేసీ దివాకర్ రెడ్డి వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ డ్యామ్‌కు గండి పడిందని, నీళ్లు నిలిచే పరిస్థితి లేదని.. వెల్లువలా వైయస్సార్ కాంగ్రెసు పార్టీ శాసనసభ్యులు టిడిపిలోకి వస్తారని ఆయన అన్నారు. తండ్రిని చూపడం కాదు, తానేమిటో జగన్ నిరూపించుకోవాలని ఆయన అన్నారు. అయితే ఇలా మాట్లాడుతున్న క్రమంలోనే జగన్‌ను 'వాడెబ్బ' అంటూ జెసీ సంభోదించి నోరు జారారు. దీంతో గమనించిన జేసీ వెంటనే సారీ సారీ సారీ అంటూ, దాదాపుగా లెంపలేసుకున్నంత పని చేశారు. మా వాడు అన్న భావనతోనే అన్నాను తప్ప ఇందులో మరో ఉద్దేశం లేదని, జగన్ దీనిని మరోలా అర్థం చేసుకోవద్దని, మీడియా మిత్రులూ... మీరు కూడా తప్పుగా రాయవద్దని కోరారు. మొత్తానికి మొదటిసారి జేసీ దివాకర్ రెడ్డి సారీ చెప్పారు. మరి దీనికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మీదున్న గౌరవమా లేక జగన్ అంటే భయమా.. ఆయనకే తెలియాలి