కేజ్రీవాల్ పై షూ దాడి..

  ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ కు ఓ చేదు అనుభవం ఎదురైంది. ఆయన ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో షూ దాడి జరిగింది. ఢిల్లీలో కాలుష్య నివారణకు కేజ్రీవాల్ సరి బేసి విధానాన్ని అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఈనెల 15 నుండి ఢిల్లీలో సరి బేసి సంఖ్య విధానం పునరుద్దరణ చేపట్టనున్న నేపథ్యంలో ఆయన ఈరోజు ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఈ పునరుద్దరణపై కేజ్రీవాల్ వివరిస్తుండగా అనుకోకుండా ఓ వ్యక్తి కేజ్రీవాల్ పై షూ విసిరాడు. వెంటనే అప్రమత్తమైన భద్రతా సిబ్బంది అతనిని అదుపులోకి తీసుకున్నారు. కాగా గతంలో కేజ్రీవాల్ పై ఇంకు దాడి జరిగింది. తాజాగా మరోసారి ఆయనపై చెప్పుదాడి జరగడం కలకలం రేపుతోంది.

కేసీఆర్ గవర్నర్‌ను కలవబోయేది అందుకేనా?

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మరి కాసేపట్లో గవర్నర్‌ను కలిసే అవకాశముంది. ఉగాది తర్వాత మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపడతారని పార్టీలోనూ, ప్రభుత్వంలోనూ జోరుగా ప్రచారం జరుగుతున్న తరుణంలో సీఎం గవర్నర్‌ను కలవబోతున్నారు. కేబినెట్‌లో మార్పులు, చేర్పులు చేయాలని భావిస్తున్న కేసీఆర్ పార్టీలో ఎప్పటి నుంచో ఉన్నవారితో పాటు కొత్తగా టీఆర్‌ఎస్‌లో చేరిన వారికి మంత్రి పదవి ఇచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రుల్లో కొందరి శాఖలు మార్చడంతో పాటు కొందరికి ఉద్వాసన పలికే అవకాశముంది. ఇప్పటికే మంత్రివర్గ కూర్పుపై సన్నిహితులతో చర్చించారని, దీనికి సంబంధించి కసరత్తు పూర్తి చేశారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ప్రస్తుతం మంత్రులుగా కొనసాగుతున్న నాయిని నర్సింహారెడ్డి, జూపల్లి కృష్ణారావు, చందులాల్..తదితరుల శాఖ మార్చడం గాని తొలగించడం గాని జరుగుతుందని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి వరకు కేసీఆర్ కేబినెట్‌లో ఒక్క మహిళ కూడా లేదు. ఈ సారి ఆ అపవాదును కూడా తొలగించుకోవాలని గులాబీ దళపతి స్కెచ్ గీస్తున్నారట. మొత్తం మీద ముఖ్యమంత్రి గవర్నర్‌ను కలిసేది మంత్రివర్గ విస్తరణపైనా లేక మరేదైనా కారణంతోనా అనేది అర్థంకాక గులాబీ కండువాలు జుట్టుపీక్కుంటున్నాయి.   

కోహినూర్ వజ్రంపై కేంద్రాన్ని ప్రశ్నించిన సుప్రీం.. స్పందించిన బ్రిటన్ ప్రధాని

  బ్రిటిష్ పాలకులు భారత దేశం నుండి దోచుకున్న వాటిలో అత్యంత విలువైంది ఏంటంటే కోహినూర్ వజ్రం అని అందరికి తెలిసిందే. అయితే కొన్ని సంవత్సరాల క్రితం దోచుకెళ్లిన ఈ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి కేంద్రం ఇప్పటివరకూ పెద్దగా చర్యలు చేపట్టింది లేదు. అయితే ఇప్పుడు దీనిపై సుప్రీంకోర్టు కేంద్రాన్ని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. ఆల్ హ్యుమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ ఫ్రంట్‌కు చెందిన ఓ వ్యక్తి కోహినూర్ ను ఇండియాకి తెప్పించడంపై కేంద్రం స్పందన ఏంటో తెలుసుకుందామని సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. దీనిపై విచారించిన న్యాయస్థానం.. కోహినూర్ వజ్రాన్ని ఇండియాకు తీసుకురావడానికి ప్రయత్నించారా అంటూ కేంద్రాన్ని సూటిగా ప్రశ్నించింది. అయితే సుప్రీం అడిగిన ప్రశ్నకు కేంద్రం సంగతేమో కానీ.. బ్రిటన్ ప్రధాన మంత్రి డేవిడ్ కామెరూన్ మాత్రం స్పందించారు. కోహినూర్ వజ్రం రాణి కిరీటంలో ఉన్నందున దాన్ని తిరిగి ఇవ్వడం సాధ్యం కాదని చెప్పారు. మరి సుప్రీం ప్రశ్నకు బ్రిటన్ ప్రధాని స్పందించారు.. మరి మన కేంద్రం ఎప్పుడు స్పందిస్తుందో చూడాలి.

జికా వైరస్ కు విరుగుడు జికా దోమేనట..

  బ్రెజిల్ నుండి మొదలై ప్రపంచ దేశాల్ని గడగడలాంచిన వైరస్ ఏదంటే టక్కున గుర్తొచ్చే పేరు జికా వైరస్. అయితే ఈ వైరస్ విరుగుడు కనిపెట్టారు పరిశోధకులు. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. ఈ జికా వైరస్ కు విరుగుడు జికా దోమేనట. అదేలాగో చూద్దాం.. అమెరికాకు చెందిన ఓ సంస్థ జన్యుమార్పిడి దోమను సృష్టించింది. ఇలా సృష్టించిన దోమల్లో ప్రాణాంతకమైన జన్యువును ప్రవేశపెట్టి జీకా వ్యాధికి కారణమవుతున్న దోమల సంతానాన్ని నిరోధిస్తారు. ఈ దోమలను కొంత మొత్తంలో ప్రయోగించి.. ఆడ దోమలు పెట్టే గుడ్లు సంతానవృద్ధికి పనికి రాకుండా కట్టడి చేస్తారు. ఈ దోమలను బ్రెజిల్, పనామా వంటి దేశాల్లో ప్రయోగించి దాదాపు 99 శాతం దోమలను కట్టడి చేసినట్టు తెలుస్తోంది. అయితే జికా వైరస్ నివారణ వ్యాక్సిన్ తయారీకి మాత్రం మరికొన్ని సంవత్సరాలు వేచి చూడాల్సిందే.

జగన్ మరో షాక్.. మరో ఎమ్మెల్యే టీడీపీలోకి రెడీ..!

  వైసీపీ అధినేత జగన్ కు పార్టీ నేతలు షాకుల మీద షాకులిస్తున్నారు. ఇప్పటికే పార్టీ నుండి జంప్ అయిన ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది. ఇప్పుడు పరిస్థితి చూస్తుంటే మరో ఎమ్మెల్యే కూడా జగన్ షాకివ్వనున్నట్టు తెలుస్తోంది. చిత్తూరు జిల్లా మదనపల్లి ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడితో భేటీ అయ్యారు. ఉదయం విజయవాడ నుంచి బయలుదేరి చిత్తూరు జిల్లాలోని మదనపల్లికి వచ్చిన చంద్రబాబును, తిప్పారెడ్డి కలవడం జరిగింది.  దీంతో ఇప్పుడు తిప్పారెడ్డి, చంద్రబాబు భేటీపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అయితే తిప్పారెడ్డి మాత్రం భేటీ గురించి ఏం చెప్పకపోయినా.. తాను కూడా పార్టీ మారే యోచనలో ఉన్నట్టు వార్తలు వస్తున్నాయి. మరి చూద్దాం..

అసదుద్దీన్ పీకపై నేను కత్తి పెడతా...

భారత్ మాతా కీ జై వివాదం.. కాస్త పరిస్థితి నెమ్మదిస్తుంది కదా అనే లోపే ఎవరో ఒకరు దీనిని మళ్లీ తెరపైకి తెస్తున్నారు. ఇప్పుడు తాజాగా అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలకు మహారాష్ట్ర నవ నిర్మాణ సేన (ఎమ్మెన్నెస్) అధినేత రాజ్ ఠాక్రే స్పందించి ఆయనకు సవాల్ విసిరారు. ముంబైలోని శివాజీ పార్క్ సమీపంలో జరిగిన ర్యాలీలో పాల్గొన్న ఆయన అసదుద్దీన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేస్తూ..  ఒవైసీ మహారాష్ట్రకు వస్తే... ఆయన కుత్తుకపై తాను కత్తి పెడతానంటూ రాజ్ ఠాక్రే సంచలన వ్యాఖ్యలు చేశారు. అంతేకాదు ఒవైసీ సోదరులిద్దరూ బీజేపీ మద్దతుగానే వ్యవహరిస్తున్నారని కూడా ఠాక్రే ఆరోపించారు. మరి రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలు ఎంతటి దుమారం రేపుతాయో చూడాలి.

బీహార్లో మద్యం నిషేదం.. ఇద్దరు మృతి.. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ కూడా

బీహార్ లో మద్యం నిషేదించిన సంగతి తెలిసిందే. బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ బీహార్లో సంపూర్ణ మద్యపాన నిషేదం విధిస్తూ ప్రకటన చేశారు. అయితే మద్యం నిషేదం అనేది కొంతమందికి సంతోషానిచ్చేదే అయినా.. మందుబాబులకు మాత్రం నోట్లో చుక్క పడక.. నానా అవస్థలు పడుతున్నారట. మందులేక వింత వింతగా ప్రవర్తిస్తు ఆస్పత్రుల్లో కూడా చేరుతున్నారట. అంతేకాదు అలా ఇద్దరు చనిపోయారట కూడా. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే చనిపోయిన వారిలో పోలీస్ డిపార్ట్ మెంట్ ఉద్యోగి కూడా ఉన్నాడు. అసిస్టెంట్‌ సబ్‌ ఇన్‌స్పెక్టర్‌ రఘునందన్ బెస్రాకి బాగా మందు తాగే అలవాటు ఉండటంతో.. ఒకపక్క మందు దొరక్కపోవడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం మ‌ద్యం అల‌వాటును మాన్పించేందుకు ఏర్పాటు చేసిన కేంద్రాల‌ను మందుకు బానిసైన వారు ఉప‌యోగించుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు.

ఎన్నికల బరిలో ఆరుగురు హిజ్రాలు..

  త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి  తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. త్వరలో జరగబోయే తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో పురుషులు, మహిళలతో పాటు హిజ్రాలకు కూడా పోటీ చేసే అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే తమిళనాడు ముఖ్యమంత్రి విజయలలితపై దేవి అనే హిజ్రా పోటీకి బరిలో దిగింది. ఇంకా ఈ ఎన్నికల్లో పోటీ చేసే హిజ్రాల సంఖ్య పెరిగింది. మొత్తం ఇప్పటికి ఆరుగురు హిజ్రాలు బరిలో దిగుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. డీఎండీకే తరఫున సేలంలో రాధిక అనే హిజ్రా.. రత్ కుమార్ అధ్యక్షుడుగా ఉన్న సమత్తువ మక్కల్ కట్చి నుంచి గతంలో ఎన్నికల బరిలో దిగిన భారతికన్నమ్మ, హిందు మక్కల్ కట్చి తరఫున మదురై సెంట్రల్ నుంచి అనసూయ అనే హిజ్రా ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. మొత్తానికి  తమిళనాడులోని 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంతమంది హిజ్రాలకు పోటీ చేసే అవకాశం రావడం అనందించాల్సిన విషయమే. మరి ఇంతమందిలో ఎవరు ఎన్నికల్లో నెగ్గి అధికారం చేపడుతారో తెలియాలంటే ఎన్నికల వరకూ ఆగాల్సిందే. కాగా పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ పైన కూడా ఓ హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే.

మోడీ టూర్ల వెనుక అసలు సీక్రెట్ ఇదా..!

  ప్రధాని నరేంద్ర మోడీకి విదేశీ పర్యటనలు కొత్తేం కాదు. ఏడాదిలో చాలా దేశాల్లోనే ఆయన పర్యటిస్తారు. అయితే ఈ పర్యటనల్లో మోడీ గురించి తెలిసిన సీక్రెట్ ఏంటంటే.. ఆయన సమయం వృధా కాకుండా ఫ్లైట్ లోనే నిద్రపోతున్నారంట. అంతేకాదు దానివల్ల హోటల్లో ఉండే ఖర్చు కూడా తగ్గుతుంది అంటున్నారు. అసలు సంగతేంటంటే.. ప్రధాని మోడీ రీసెంట్ గా విదేశీ పర్యటన చేసిన సంగతి తెలిసిందే. మార్చి 30 నుంచి ఏప్రిల్ 2 వరకూ బెల్జియం, అమెరికా సౌదీ అరేబియా పర్యటించిన ఆయన ఎక్కవ శాతం రాత్రి ప్రయాణానికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చారట. అంతేకాదు ఫైట్ లోనే పడుకున్నారట. ఇదిలా ఉండగా ప్రధాని మోదీ కేవలం 97 గంటల్లో అమెరికాకు వెళ్లిరావడం అసాధారణ విషయమైని అధికారులంటున్నారు. ఒకవేళ ప్రధాని విమానాల్లో రాత్రి నిద్రను ప్రిఫర్ చేయకుంటే ఆ పర్యటన కనీసం ఆరు రోజులు సాగేదని ప్రభుత్వాధికారులన్నారు. మొత్తానికి మోడీ సీక్రెట్ అదిరింది..

భారీ అగ్ని ప్రమాదం.. 8మంది పిల్లలకు గాయాలు

  హైద‌రాబాద్ పాతబస్తీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. పాతబస్తీ తలాబ్‌కట్టాలోని బన్‌ రోటీ తయారీ కేంద్రంలో షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగింది. అయితే అక్కడ కిరోసిన్‌ డబ్బాలు ఉండటంతో మంటలు మ‌రింత చెల‌రేగినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో ఎనిమిది మంది పిల్లలు సహా 12 మంది గాయ‌ప‌డ్డారు. క్షతగాత్రుల‌ను ఉస్మానియా, నిలోఫర్ ఆస్పత్రులకు తరలించారు. ప్ర‌మాద స్థ‌లికి చేరుకున్న‌ ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు.   ఇదిలా ఉండగా అగ్రరాజ్యమైన అమెరికాలో కూడా భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. అమెరికాలోని హిడెన్ రిట్జ్ ప్రాంతానికి చెందిన మూడంతస్తుల అపార్ట్ మెంట్ లో ఉన్నట్టుండి మంటలు చెలరేగాయి. అయితే ప్రమాదాన్ని ముందే గుర్తించిన అపార్ట్ మెంట్ వాసులు పరుగుపరుగున బయటకు వచ్చేసరికి కాస్త ప్రమాదం తప్పింది. ఇక సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

మూడోసారి కూడా ఎగనామం పెట్టిన మాల్యా..

  కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలుగా తీసుకొని వాటిని చెల్లించకుండా ఎగనామం పెట్టిన విజయ్ మాల్యా దర్యాప్తు సంస్థలకు చుక్కలు చూపిస్తున్నారు. ఈ కేసులో భాగంగా ఈడీ ముందు హాజరు కావాల్సిన మాల్యా ఈరోజు కూడా డుమ్మా కొట్టాడు. గతంలో ఈడీ తమ ముందు హాజరు కావాలని ఆదేశించినా తనకు ఏప్రిల్ వరకూ గడువు కావాలని కోరాడు. దీనికి ఈడీ కూడా ఒప్పుకొని ఏప్రిల్ 2 న తమ ముందు హాజరు కావాలని ఉత్తర్వులు జారీ చేసింది. అయితే అప్పుడు కూడా తాను హాజరుకాకుండా మే నెల వరకూ గడువు కావాలని కోరాడు. అయితే దీనికి ఆగ్రహించిన ఈడీ ఏప్రిల్ 9న ఈడీ ముందు హాజరు కావాలని ఆదేశించింది. కానీ మాల్యా మాత్రం ఈసారి కూడా ఈడీ ముందు హాజరుకాకుండా ప్రస్తుత పరిస్థితుల్లో హాజరు కాలేనని.. బ్యాంకులతో చర్చిస్తున్నానని.. గడువుకావాలని కోరారు. దీంతో  మాల్యా అభ్యర్థనకు ఏ విధంగా స్పందించాలో తెలియక ఈడీ అధికారులు తలలు పట్టుకుంటున్నారట.

పఠాన్ కోట్ పై దాడి.. మసూద్ తో పాటు ముగ్గురిపై అరెస్ట్ వారెంట్లు

  పఠాన్ కోట్ విమానం స్థావరం పై ఉగ్రవాదులు దాడిపై దర్యాప్తు వేగం పుంజుకున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే దీనికి సంబంధించిన పలు ఆధారాలు పాక్ కు అందించినా వారు మాత్రం మాట మారుస్తూనే ఉన్నారు.  ఈ దాడికి అసలు సూత్రధారి జైషే మొమ్మద్ చీఫ్ మసూద్ అజార్ అని ఆధారాలు చూపించినా.. పాక్ ప్రభుత్వం మాత్రం అతనిని అదుపులోకి తీసుకున్నాం.. గృహనిర్భంధంలో ఉంచాం అంటూ చెబుతూ మాయమాటలు చెప్పింది. అంతేకాదు మసూద్ సహా ఈ దాడి పథక రచనలో పాలుపంచుకున్న అతడి సోదరుడు రవూఫ్, మరో ఇద్దరు పాకిస్థానీలు కషిఫ్ జాన్, షాహిద్ లతీఫ్ లను అరెస్ట్ చేయాలని కోరింది. కానీ పాక్ మాత్రం అవేమీ పట్టించుకోలేదు. ఇంకా ఈ దాడికి పాల్పడింది మనవాళ్లే అని చెబుతూ బుకాయించింది. దీంతో నిన్న ఎన్ఐఏ అధికారుల అభ్యర్థన మేరకు ఢిల్లీలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు మసూద్ తో పాటు మిగిలిన ముగ్గురిపై అరెస్ట్ వారెంట్లు జారీ చేసింది. మరి దీనిపై పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

నేటి నుండి ప్రారంభంకానున్న ఐపిఎల్ 9

మొన్నటి వరకూ ఏపీ వరల్డ్ కప్ టోర్నమెంట్ ఫీవర్ అయిపోయింది. ఇప్పుడు ఐపిఎల్ ఫీవర్ స్టార్ట్ అయింది. నేటి నుండి ప్రారంభమయ్యే సిరీస్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈమ్యాచుల్లో భాగంగా ముంబైలోని వాంఖడే స్టేడియంలో నిన్న జరిగిన ప్రారంభ వేడుకలు అదిరిపోయాయి. బాలీవుడ్ తారలు కత్రినా కైఫ్, జాక్వెలిన్ ఫెర్నాండెజ్ స్టెప్పులతో హోరెత్తించారు. వీరితో కలిసి వెస్టిండీస్ జట్టు సభ్యుడు డ్వేనీ బ్రేవో కాలు కదిపి దుమ్మురేపాడు. ఇక ఈ సీజన్ లో అసలు పోరు నేటి నుంచి మొదలు కానుంది. వాంఖడే స్టేడియం వేదికగానే జరగనున్న ఈ మ్యాచ్ లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై ఇండియన్స్, కొత్త జట్టు పుణే సూపర్ జెయింట్స్ తలపడనుంది.

జయలలితపైనే కాదు.. మమతాపై కూడా హిజ్రా పోటీ

  త్వరలో తమిళనాడులో ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో తమిళనాడు ముఖ్యమంత్రి, అన్నాడీఎంకే అధినేత్రి జయలలితపై దేవి అనే హిజ్రా పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే తరహా పోటీ పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి మమతా బెనర్జీకి ఎదురైంది. కోల్ కతాలోని భవానీ నగర్ నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగుతన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగా దీదీ నిన్న నామినేషన్ కూడా దాఖలు చేశారు. ఇదే నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి దీపా దాస్ మున్షీ, బీజేపీ అభ్యర్థిగా నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్ లు బరిలోకి దిగుతున్నారు. ఇక లోక్ జనశక్తి పార్టీ తరఫున బాబీ హాల్డర్ అనే ఓ హిజ్రా బరిలోకి దిగుతున్నారు.

బాలుడిని చంపి.. ఆపై రక్తం తాగి..

  అమెరికాలో ఓ భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఓ బాలుడిని చంపి ఆపై అతని రక్తం తాగిన ఓ నరరూప రాక్షసుడి ఉదంతం కలకలం సృష్టిస్తోంది. వివరాల ప్రకారం.. టెక్సాస్ బోర్డర్ కు దగ్గరలో ఉన్న ఆంటానియోలో డేవిడ్ కార్డెన్నా అనే 12 ఏళ్ల బాలుడు 7వ తరగతి చదువుతున్నాడు. అయితే అతనిని  లుసియో వాస్క్యూజ్ (38) అనే వ్యక్తి ఇనుప పైపుతో కొట్టి గొంతుకోసి హత్య చేసి అనంతరం అతని రక్తాన్ని తాగాడు. ఈవిషయాన్ని లుసియోనే పోలీసులు అరెస్ట్ చేసిన అనంతరం తన వాంగ్మూలంలో తెలిపాడు. 1998లో జరిగిన ఈ ఘటనపై అప్పటినుండి సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. తాజాగా దీనిపై విచారణ జరిపినకోర్టు అతనికి  మరణ శిక్షను విధించింది. చివరిసారిగా  తన కుటుంబ సభ్యులను కలవడానికి నిరాకరించిన లుసియో.. కేవలం జైలు లోపలే ఉండి కిటికీ ద్వారా అతని కుటుంబసభ్యలను చూశాడు. అంతేకాదు తాను చంపిన బాలుడు తల్లి దండ్రులు కూడా వారి పక్కనే ఉండగా.. అతను వారిని చూసి తనను క్షమించాలని వేడుకున్నాడు. అనంతరం లుసియోకి పెంటోబార్బిటోన్ ఎక్కువ మోతాదులో ఇచ్చిన 24 నిమిషాల అనంతరం మరణించినట్లు అధికారులు ప్రకటించారు.

శ్రీనగర్ నిట్.. 1500 మందికి 600 మంది పోలీసులు

  శ్రీనగర్ లోని నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎన్ఐటీ) లో స్థానికేతర విద్యార్దులకు, స్థానిక విద్యార్ధులకు మధ్య గొడవలతో అట్టుడుకుతోంది. ఈ నేపథ్యంలోనే పరిస్థితి మరింత చేయి దాటకుండా ఐదు కంపెనీల కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించారు. అయితే ముందు  రెండు కంపెనీల సీఆర్పీఎఫ్ జవాన్లను పంపిన కేంద్రం పంపినా కూడా పరిస్థితి నెమ్మదించకపోవడంతో సహస్త్ర సీమా బల్ కు చెందిన మూడు దళాలను పంపింది. అంటే ప్రస్తుతం 600 మంది పోలీసులు కాపలాగా ఉన్నారన్నమాట. మొత్తం వర్శిటీలో 1500 మంది విద్యార్థులుండగా వారికి 600 మంది పోలీసులు కాపలా అంటే.. ప్రతి ఇద్దరి విద్యార్ధులకు ఓ సైనికుడు ఉన్నట్టన్నమాట. ఈ సందర్బంగా  జమ్మూకాశ్మీర్ ఉప ముఖ్యమంత్రి నిర్మల్ సింగ్ మాట్లాడుతూ.. ఇకపై వర్శిటీలో కేంద్ర బలగాల పహారా కొనసాగించాలని.. వర్శిటీలో ప్రతి ఒక్కరి బాధ్యతా తమదేనని చెప్పారు. కాగా ఇండియాలో ఇలా జరగడం ఇదే తొలిసారని తెలుస్తోంది

విలేకరికి దిమ్మతిరిగే సమాధానమిచ్చిన రైనా..

  ఈమధ్యన క్రికెటర్లు ఇంటర్య్వూ చేసేవాళ్లకి షాకుల మీద షాకులిస్తున్నారు. ఇటీవలే ధోని తన రిటైర్మెంట్ పై అడిగినందుకు విలేకరికి షాకిస్తే.. టీ20 ప్రపంచం కప్ గెలిచిన ఆనందంలో ఏకంగా తన కాళ్లను బెంచ్ పై పెట్టి అందరికీ షాకిచ్చాడు. ఇప్పుడు రైనా కూడా తన సమాధానంతో రిపోర్టర్ కి షాకిచ్చినట్టు తెలుస్తోంది. త్వరలో ఐపిఎల్ ప్రారంభంకానున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతడు కొత్త జట్టు గుజరాత్ లయన్స్ కు కెప్టెన్ గానూ వ్యవహరించనున్నాడు. ఈ క్రమంలో అతడి ఫామ్ పై సందేహాలు రేకెత్తేలా విలేకరి ఓ ప్రశ్న సంధించాడు. ‘‘మీరు టీమిండియాకు కోచ్ గా గానీ, లేదా ఏదో ఒక నేషనల్ టీంకు కోచ్ గా వ్యవహరిస్తారంటూ వార్తలొస్తున్నాయి. మీరు ప్లేయర్ గా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? కోచ్ గా కంఫర్ట్ గా ఉంటుందని భావిస్తున్నారా?’’ అని పొంతన లేని ప్రశ్నను రిపోర్టర్ సంధించాడు. దీంతో ఆగ్రహానికి గురైన రైనా... ‘‘మీ ప్రశ్న ఎలా ఉందంటే... మీరు భార్యతో కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? లేదా మరెవరితోనైనా కంఫర్ట్ గా ఫీలవుతున్నారా? అన్నట్టుగా ఉంది. 11 ఏళ్లుగా టీమిండియాకు ఆడుతున్నాను. ఏ సమయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో నాకు తెలుసు అని ఆ విలేకరికి రైనా గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చాడు. బీసీసీఐ నాకు ఏ బాధ్యత అప్పగించినా చేస్తా’’ అని రైనా చెప్పిన సమాధానంతో ఆ రిపోర్టర్ షాక్ తిన్నాడట.