షార్టులు వేసుకురావద్దన్న ప్రొఫెసర్.. మరుసటి రోజు అమ్మాయిలందరూ షార్టుల్లో
ఈ మధ్య కాలంలో యూనివర్శిటీల్లో ఏదో ఒక వివాదంపై ఏదో ఒక రగడ జరుగుతూనే ఉంది. హెచ్ సీయూ, జెఎన్యూ, రీసెంట్ గా శ్రీనగర్ నిట్ తాజాగా బెంగళూరులోని లా యూనివర్శిటీలో మరో వివాదానికి తెర పడింది. ఈయూనివర్శిటిలో విద్యార్థినులకు, ప్రొఫెసర్ కు మధ్య చిన్నపాటి యుద్ధమే జరుగుతోంది. ఒక అమ్మాయి తరగతికి షార్ట్ వేసుకొని వచ్చినందుకు ప్రొఫెసర్ సదరు విద్యార్ధినిని ఆక్షేపించారు. దీంతో ఆ అమ్మాయికి మద్దతుగా..మరుసటి రోజు తరగతి గదిలోని అమ్మాయిలందరూ షార్టులతో వచ్చారు. ప్రొఫెసర్ తీరును వ్యతిరేకిస్తూ.. తామేసుకున్న దుస్తుల గురించి కామెంట్లేంటని, తాము ఎలాంటి దుస్తులను వేసుకోవాలన్నది ఆయనకు ఎందుకని ప్రశ్నిస్తున్నారు. యూనివర్శిటీలో ప్రొఫెసర్ వేధింపులు పెరిగిపోతున్నాయని ఆరోపించిన విద్యార్థినులు ఇండిపెండెంట్ కమిటీని వేసి దర్యాఫ్తు జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనిపై ఆ ప్రొఫెసర్ స్పందిస్తూ, తాను చేసింది మంచి పనేనని, దర్యాఫ్తునకు సిద్ధమని, విచారణలో భాగంగా ఏం అడిగినా సమాధానం చెబుతానని అంటున్నారు.