ఘోర రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జయిన కారు.. 11 మంది మృతి

  విశాఖ జిల్లా నక్కపల్లి దగ్గర ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో 11 మంది ప్రాణాలు పోయాయి. వివరాల ప్రకారం..విశాఖపట్నం ఎన్ఏడీ దరి బుచ్చిపాలేనికి చెందిన ఈదలాడ శ్రీను అనే వ్యక్తి తన కుటంబంతోపాటు, వదిన వారి పిల్లలతో కలిసి తలుపులమ్మతల్లి దర్శనానికి కారులో బయలుదేరాడు. అయితే నక్కపల్లి దగ్గరకు రాగానే కారు టైరు పగిలిపోవడంతో కారు అదుపుతప్పి ఎదురుగా వస్తున్న మోటర్ బైక్ ను గుద్దింది. ఈలోపు ఏం జరిగిందా అని ఆలోచించుకొనే లోపే భారీ పైపులతో వచ్చిన లారీ ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయిపోయి కారులో ఉన్నవారందరూ మృతి చెందారు. ముఖ్యంగా లారీ కారుని తొక్కుకుని వెళ్లడంతో, కారు ఇంజిన్‌కింద చిక్కుకుపోయి తుక్కుతుక్కయ్యింది. ఇందులోని వారంతా దుర్మరణం చెందడంతోపాటు శరీరభాగాలన్నీ మాంసపు ముద్దలైపోయాయి. అంతేకాదు చనిపోయిన వారిలో ఎక్కువమంది చిన్నారులే ఉండటంతో ఆ ఘటన చూసినవారందరినీ కలిచి వేస్తుంది.

సాయిపూజ వల్లే మహారాష్ట్రలో కరువు -స్వరూపానంద

షిర్డీ సాయిబాబాపై తరచూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే ద్వారకా శారదా పీఠ శంకరాచార్య స్వామి స్వరూపానంద సరస్వతి మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో ప్రస్తుతం కరువు విలయ తాండవం చేస్తోంది దీనికి కారణం షిర్డీసాయిబాబా పూజా ఫలితమేనన్నారు. దేవుడిని పూజించవచ్చు కాని ఫకీరైన సాయిబాబాను పూజించడం ఏమిటని ప్రశ్నించారు. అందుకనే మరాఠా గడ్డ కరువు కాటకాలతో అల్లాడుతోందన్నారు. పూజకు యోగ్యత లేని వారిని పూజించిన చోట కరువు, వరదలు, చావు భయం లాంటివి మనుషులను వెంటాడుతుంటాయన్నారు. 94 ఏళ్ల స్వరూపానంద గతంలో పలుమార్లు సాయిబాబాని టార్గెట్ చేశారు. సాయిబాబా దేవుడు కాదని ఆయనను పూజించరాదని సంచలన ఆరోపణలు చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద దూమారం రేగడంతో పాటు ఆయనపై ఏకంగా కేసు నమోదైంది.  

నా భార్యకు 'భారత్ మాతాకీ జై' అని పేరు పెడతా.. కన్నయ్య కుమార్

  దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారన్న ఆరోపణలతో జెఎన్ యూ విద్యార్ధి సంఘ నేత కన్నయ్య కుమార్ జైలుకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే.  అయితే ఇప్పుడు కన్నయ్య తన దేశభక్తిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం దేశంలో హాట్ ఏదంటే భారత్ మాతాకి జై వివాదం అని చెప్పొచ్చు. ఎవరో ఒకరు.. ఎక్కడో దగ్గర దీనిపై నోరు కదుపుతూనే ఉన్నారు. దీనిలో భాగంగానే కన్నయ్య కుమార్ కూడా ఈ నినాదంపై నోరు తెరిచాడు. తనకు పెళ్లయిన తరువాత తన భార్యపేరు 'భారత్ మాతాకీ జై' అని పెట్టుకోమని చెబుతానని.. తన పేరును కూడా అదే విధంగా మార్చుకుంటానని చెప్పారు. తనకు పెళ్లి అయి.. పిల్లలు పుట్టిన తర్వాత తన పిల్ల పేరును ‘భారత్ మాతాకీ జై’ అని పెట్టుకుంటానని చెప్పుకొచ్చారు. మరి కన్నయ్య చేసిన ఈ వ్యాఖ్యలపై ఎవరు ఎలా స్పందిస్తారో చూడాలి.

ప్రభుత్వం ప్రయత్నించాలి..షిఫ్ట్ చేసుకోమనం సరికాదు.. ధోని

  మహారాష్ట్రలో నీటి సమస్య కారణంగా అక్కడ ఐపీఎల్ మ్యాచులు నిర్వహించవద్దని  ఓస్వచ్ఛంధ సంస్థ కోర్టు కెక్కిన సంగతి తెలిసిందే. దీనిపై విచారించిన కోర్టు వేరే ఎక్కడైనా నిర్వహించుకోవాలని సూచించింది. దీనిపై మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ మాట్లాడుతూ... ఐపీఎల్ మ్యాచులు మహారాష్ట్ర నుంచి తరలించడం గురించి తాము పట్టించుకోమని, ప్రజలకు నీళ్లు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అని చెప్పారు. దీనిపై మహేంద్ర సింగ్ ధోనీ స్పందించి.. నీటి సమస్య ఉన్న ప్రాంతాలలో దానికి పరిష్కారం కనుగొనేందుకు ప్రభుత్వం యత్నించాలని నీటి సమస్య చాలా కాలంగా ఉందని, దానిని పరిష్కరించేందుకు మంచి పరిష్కారం చూడాలి.. అంతేకాని మ్యాచులను షిఫ్ట్ చేసుకోమనం సరికాదని అన్నారు.

దుబాయ్ రికార్డును దుబాయే.. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తులో మరో భవంతి

  దుబాయ్ రికార్డును దుబాయే బద్దలు కొట్టే ప్రయత్నాలు చేస్తుంది. ప్రపంచంలో ఎత్తైన భవంతి ఏదంటే టక్కున దుబాయ్ లోని బుర్జ్ ఖలీఫా భవనం గుర్తుకొస్తుంది. ప్రముఖ నిర్మాణ రంగ సంస్థ ఎమ్మార్ ఎంతో శ్రమించి 2,700 అడుగులు ఉన్న ఈ భవంతిని నిర్మించి ప్రపంచంలో ఎత్తైన భవంతిగా గిన్నిస్ రికార్డులకెక్కింది. ఇప్పుడు అదే సంస్థ తమ రికార్డును తామే బద్దలు కొట్టేందుకు రంగంలోకి దిగింది. 2020 నాటికి బుర్జ్ ఖలీఫాను తలదన్నే రీతిగా మరో భవంతిని నిర్మిస్తామని ఎమ్మార్ చైర్మన్ మొహమద్ అలబ్బార్ చెప్పారు.  దాదాపు ఓ మిలియన్ డాలర్ల ఖరీదుతో కట్టనున్న ఈ నిర్మాణం ఎత్తు ఎంత అన్న విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా ఉండే ఈ నిర్మాణం ఎత్తు ఎంతన్న విషయాన్ని నిర్మాణాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రకటిస్తామని ఆయన వెల్లడించారు.

తెలుగు సీఎంలపై పవన్ కళ్యాణ్.. చంద్రబాబు చేయలేకపోతున్నారు.. కేసీఆర్ పై అదొక్కటే అసంతృప్తి

  పవర్ స్టార్ పవన కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా విడుదలైన సందర్భంగా ఓ మీడియాలో సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇరు తెలుగు రాష్ట్రాల సీఎంలపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.   ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఆయన మాట్లాడుతూ.. ఏపీ అభివృద్ధికోసం చంద్రబాబు బాగానే కష్టపడుతున్నారని.. కానీ ఆయన పక్కన ఉన్నావారు మాత్రం వ్యవస్థను ముందుకు సాగనీయడం లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలన్న తపన తనలో ఉంది.. అలాగే చేయలేకపోతున్నా అనే బాధ కూడ ఉందని అన్నారు. ఇంకా వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీలోకి వెళ్లడంపై ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నుండి ఎమ్మెల్యేలను తీసుకెళ్లడం తప్పుదారికి సంకేతం.. ఇప్పుడు అంత అవసరం ఏమొచ్చింది.. పదవి, అధికారం లేకుంటే ప్రజాసేవ చేసేందుకు వీలుండదా అని వ్యాఖ్యానించారు.   ఇంకా కేసీఆర్ గురించి మాట్లాడుతూ.. తెలంగాణలో కేసీఆర్ ఓ ప్రణాళిక బద్దంగా వెళుతున్నారు.. ఆయన ఓ విజన్ తో జాగ్రత్తగా ముందుకు వెళుతున్నారని అన్నారు. తెలంగాణలో కూడా టీఆర్ఎస్ పార్టీలోకి నేతలు చేరడంపై ఆయన స్పందిస్తూ.. మిగతా పార్టీల ఎమ్మెల్యేలను కలుపుకోని పోవడం... నిజంగా అది అంత అవసరం లేదుకదా? అనిపిస్తుంది.. నాకు అదొక్కటే చంద్రశేఖరరావు ఆలోచనా విధానంపై అసంతృప్తి అని అన్నారు.

రియాలిటీ షో చేశాడు..ప్రాణం తీసుకున్నాడు

రియాలిటీ షోలు ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్ చేయడంతో పాటు వారి ప్రాణాలు తీస్తున్నాయనడానికి ఎన్నో ఉదాహరణలు. తాజాగా హైదరాబాద్ పాతబస్తీకి చెందిన జలీల్ అనే యువకుడు రియాలిటీ షోను అనుకరించబోయి ప్రాణాలు తీసుకున్నాడు. పాతబస్తీలోని జాన్‌మాల్‌కు చెందిన 22 ఏళ్ల జలాలుద్దీన్‌కు రియాలిటీ షోలు చూడటమంటే ఇష్టం. ఆ షోలో స్టార్లు చేసినట్టే తాను చేసేవాడు. మొన్నామధ్య ఒక షోలో ఒక స్టార్ ఒంటి మీద కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. దీనిని చూసిన జలీల్ తాను ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నా తనకేమి కాదని స్నేహితులతో ఛాలెంజ్ చేశాడు. చెప్పినట్టుగానే స్నేహితుల ఎదుటే కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకున్నాడు. కొద్దిసేపు అలాగే ఉన్న యువకుడు తర్వాత మంటలు ఒళ్లంతా వ్యాపించడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్నేహితులు అతడిని వెంటనే ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఈ రోజు మరణించాడు. జలీల్ ఒంటిపై నిప్పంటించుకున్న వీడియో ప్రజంట్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.  

కేరళ కొల్లం ప్రమాదానికి అసలు కారణం అదేనట..

  కేరళ జిల్లాలోని కొల్లం సమీపంలో బాణసంచా కాలుస్తుండగా జరిగిన ప్రమాదంలో 112 మంది మృతి చెందగా 300 మందికి పైగా గాయాలయిన సంగతి తెలిసిందే. దాదాపు నాలుగు గంటల పాటు జరిగిన ఈ బాణసంచా ప్రదర్శన ఇక చివరికి వచ్చినందన్న సమయానికి ఇంతటి ప్రమాదం జరిగింది. అయితే అసలు ఈ ప్రమాదానికి కారణం ఏంటి అనే విషయాన్ని గాయాలతో తప్పించుకున్న వినోద్ అనే యువకుడు చాలా స్పష్టంగా వివరించాడు. అతని మాటల్లో.. ఈ పేలుడుకు అసలు కారణం సన్ ఫ్లవర్ అనే వెరైటీ రాకెట్ కారణమట. ఈ రాకెట్ ను కాల్చినప్పుడు చాలా ఆకర్షణీయమైన వెలుగులు వస్తాయి.. వాటిని చూడటానికి అందరూ ఇష్టపడతారు.. ఈనేపథ్యంలోనే సన్ ఫ్లవర్ రాకెట్ ను కాల్చామని.. అయితే అది వెళ్లాల్సిన ఎత్తుకంటే చాలా తక్కువ ఎత్తులో వెళ్లింది.. అలా దాని దాని నిప్పురవ్వలు బాణసంచా ఉంచిన  ఓ మినీ వ్యాన్ లో పడ్డాయి.. అంతే అక్కడ ఏం జరుగుతుందో అని తెలుసుకునేలోపే ఘోర ప్రమాంద జరిగిందని వివరించాడు.   ఇదిలా ఉండగా ప్రమాదంలో గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రుల్లో చేర్చి చికిత్స అందిస్తున్నారు. పరిస్థితి కొంచెం విషమంగా ఉందనుకున్నవారిని ఎయిర్ అంబులెన్స్ ల ద్వారా త్రివేండ్రం ఆస్పత్రికి తరలిస్తున్నారు.

సిద్ధిపేట విజేతలు వీరే

సిద్ధిపేట మున్సిపాలిటికి జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి విజయం సాధించింది. 28 వార్డులకు జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ 16 వార్డులను కైవసం చేసుకుంది. మిగిలిన వారిలో స్వతంత్రులు 7, కాంగ్రెస్ 2, బీజేపీ 2, ఎంఐఎం 1 వార్డుల్లో విజయం సాధించగా టీడీపీ ఖాతా తెరవలేదు. 34 వార్డులున్నసిద్ధిపేట మున్సిపాలిటిలో ఆరు వార్డుల్లో టీఆర్ఎస్ అభ్యర్ధులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పార్టీల వారీగా విజేతల వివరాలు. టీఆర్‌ఎస్ అభ్యర్థులు:  1వ వార్డు- మల్లికార్జున్  2వ వార్డు- లలిత  7వ వార్డు- ప్రశాంత్ 8వ వార్డు- నర్సయ్య 9వ వార్డు- ఉమారాణి 10వ వార్డు- వేణుగోపాల్‌రెడ్డి 11వ వార్డు- రవీందర్ 12వ వార్డు- అక్తర్ పటేల్ 15వ వార్డు- భవానీ 20వ వార్డు- జావేద్ 23వ వార్డు- లక్ష్మీ 26వ వార్డు- శ్రీనివాస్ 28వ వార్డు- లక్ష్మీ 29వ వార్డు- ఉమారాణి 31వ వార్డు- కవిత 32వ వార్డు- ప్రభాకర్. మిగతా గెలుపొందిన ఆరుగురు అభ్యర్థుల వివరాలు తెలియాల్సి ఉంది. కాంగ్రెస్:  6వ వార్డు- బాలలక్ష్మి 30వ వార్డు- వజీర్ బీజేపీ:  17వ వార్డు- వెంకట్ 14వ వార్డు- శ్రీకాంత్ స్వతంత్ర అభ్యర్థులు: 3వ వార్డు- సంధ్య 4వ వార్డు- దీప్తి 5వ వార్డు- స్వప్న 22వ వార్డు- ప్రవీణ్ 25వ వార్డు- ప్రమీల 27వ వార్డు- విజయరాణి 34వ వార్డు- మంజుల ఎంఐఎం : 33వ వార్డు- అబ్దుల్‌ మొయిజ్‌

2019 ఎన్నికల్లో పోటీ చేస్తా.. పవన్ కళ్యాణ్

  జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంకా రెండు మూడు సినిమాల్లోనే నటిస్తారని.. ఆ తరువాత ఆయన రాజకీయాలపై దృష్టి పెట్టి.. 2019 ఎన్నికల బరిలో దిగుతున్నారని ఎప్పటినుండో వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈసారి ఆవార్తలు మరింత బలపడేలా ఉన్నాయి పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు వింటుంటే. పవన్ కళ్యాణ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 2019 ఎన్నికల్లో జనసేన పార్టీ తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. అయితే సినిమాలు మాత్రం ఎప్పుడు మానేస్తానో చెప్పలేనని.. తనకు ఎప్పుడు ఏం చేయాలో తెలుసని.. అన్నింటికి ప్రణాళికలు వేసుకుంటున్నానని అన్నారు. విత్తనం వేయగానే పళ్లు, కాయలు రావు అలాగే రాజకీయాల్లో కూడా ఫలితాలు వెంటనే రావు.. ప్రజల కోసం పోరాడుతాను.. విజయం సాధించేది.. లేనిది తరువాత ముందు ప్రయత్నిస్తాను.. శాయశక్తులా పోరాటం మాత్రం చేస్తానని ఆయన చెప్పారు.

ఐపిఎల్ 2016 : 98 పరుగులకే ఢిల్లీ డేర్ డెవిల్స్ ఆలౌట్..!

  ఐపిఎల్ 2016లో లో స్కోరింగ్ మ్యాచ్ లే దిక్కయ్యేలా కనిపిస్తోంది. సీజన్ ఓపెనర్లో ముంబై 121 పరుగులకే ఆలౌట్ అయింది. ఢిల్లీ, కోల్ కతాకు జరుగుతున్న ఈరోజు మ్యాచ్ లో టాస్ గెలిచి కోల్ కతా బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన ఢిల్లీ 98 పరుగులకే ఆలౌట్ అయింది. క్వింటర్ డి కాక్ కొట్టిన 17 పరుగులే అత్యధిక స్కోరు. ఢిల్లీ ఓవర్సీస్ ఆప్షన్లలో, క్వింటన్ డికాక్ తప్పితే, మిగిలిన ముగ్గర్నీ బౌలింగ్ డిపార్ట్ మెంట్లోనే తీసుకోవడం విశేషం. ఢిల్లీకి రాహుల్ ద్రవిడ్ మెంటార్ గా వ్యవహరిస్తున్నాడు. మరో వైపు కోల్ కతా తరపున గంభీర్ అద్భుతమైన కెప్టెన్సీ చేశాడు. తెలివిగా బౌలర్లను రొటేట్ చేస్తూ, బ్యాట్స్ మెన్ ను కుదరుకోనివ్వకుండా చేశాడు. కోల్ కతా బౌలర్లలో రస్సెల్, హాగ్ లకు చెరో మూడు, హేస్టింగ్స్, చావ్లా లకు చెరో రెండు వికెట్లూ దక్కాయి.

క్రికెట్ కామెంటేటర్ హర్షా భోగ్లేను తొలగించిన బిసిసిఐ..!

క్రికెట్ రెగులర్ గా ఫాలో అయ్యేవారందరికీ హర్షా భోగ్లే అన్న పేరు తెలిసే ఉంటుంది. క్రికెట్ కామెంటరీ చేయడంలో దాదాపు మూడు దశాబ్దాల అనుభవం హర్ష సొంతం. కామెంటరీ చేయడంలో తిరుగులేని అనుభవమున్న హర్షకు బిసిసిఐ ఝలక్ ఇచ్చింది. ఆల్రెడీ ఐపిఎల్ సీజన్ 9 కు ఆయన్ను బుక్ చేసినప్పటికీ, ఆయన్ని తొలగిస్తూ ఆ ఒప్పందాన్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. హర్షా భోగ్లేపై క్రికెటర్ల వద్ద నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని బిసీసీఐ చెబుతున్నప్పటికీ, దీని వెనుక వేరే కారణాలున్నట్లు తెలుస్తోంది.   టి20 వరల్డ్ కప్ సమయంలో, భోగ్లే ఇండియాకు కాకుండా బంగ్లాదేశ్ కు అనుకూలంగా మాట్లాడారంటూ, పేరు చెప్పకుండా ఆయనపై విమర్శలు చేశారు అమితాబ్ బచ్చన్. దానికి ప్రతిగా, తాను వ్యాఖ్యానం చేసే ఛానల్ ఫీడ్ వరల్డ్ వైడ్ వెళ్తుందని, అందుకే తాను అందరి తరపున మాట్లాడాలంటూ హర్షా కూడా ఇన్ డైరెక్ట్ గానే క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చాడు. వరల్డ్ టి20 సమయంలో నాగ్ పూర్ మ్యాచ్ లో హిందీ ఇంగ్లీష్ కామెంటరీ బాక్స్ లకు మధ్యలో విఐపీ బాక్స్ నుంచి దారి ఉండేది. కానీ దాన్ని మూసేయడంతో ఒక కామెంటరీ బాక్స్ మెట్లు దిగి, మరో కామెంటరీ బాక్స్ మెట్లు ఎక్కుతూ కామెంటేటర్స్ చాలా అలిసిపోయేవారట. ఈ విషయమై అక్కడి అధికారితో హర్షా భోగ్లే గొడవపడ్డాడు. ఆ బోర్డ్ బిసిసిఐ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ కంట్రోల్ లో ఉంది. ఈ కారణంగానే హర్ష పై వేటు పడిందనేది అసలు కారణమంటున్నాయి క్రికెట్ వర్గాలు. ఐపిఎల్ స్టార్ట్ అయినప్పటి నుంచీ హర్షా భోగ్లే కు ఈ టోర్నీతో అనుబంధముండటం విశేషం.

సచిన్ తో క్రికెట్ ఆడిన బ్రిటన్ రాజదంపతులు..!

భారత పర్యటనలో భాగంగా ముంబైలో పర్యటించిన బ్రిటన్ ప్రిన్స్ విలియం, ఆయన భార్య కేట్ మిడిల్టన్ లు సరదాగా తమ దేశపు ఆట క్రికెట్ ను ఆడారు. ఈరోజు మధ్యాహ్న సమయానికి ముంబై చేరుకున్న రాజదంపతులు, తీరిక లేని షెడ్యూల్ తో బిజీబిజీగా గడిపారు. స్థానికంగా ఉన్న ఓవర్ గ్రౌండ్ లో స్వచ్ఛంద సంస్థల చిన్నారులతో రాజదంపతులు, సచిన్ కలిసి క్రికెట్ ఆడారు. సచిన్ ఫీల్డింగ్ కాస్తుంటే, వెంగ్ సర్కార్ కీపింగ్ చేశారు. ప్రిన్స్ కపుల్ కు స్వచ్ఛంద సంస్థల ప్రతినిథులు ఘన స్వాగతం పలికారు. రాత్రి జరగబోయే పార్టీలో బాలీవుడ్ సూపర్ స్టార్స్ షారుఖ్, ఐశ్వర్యారాయ్, అలియాభట్, కరణ్ జోహార్ లను విలియం దంపతులు కలుస్తారు.

కాల్పుల విరమణ ఒప్పందాన్ని మళీ ఉల్లంఘించిన పాక్..!

  కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్థాన్ ఏనాడూ విలువివ్వలేదు. ఎప్పటికప్పుడు తన వైఖరిని తెలియజేస్తూనే ఉంది. తాజాగా జమ్మూ కశ్వీర్ లో మరోసారి కాల్పులకు తెగబడింది పాక్ సైన్యం. పూంచ్ సెక్టార్ లో పాకిస్థాన్ సైన్యం రెచ్చగొట్టే విధంగా కాల్పులు జరిపింది. ఉదయం నాలుగున్నర సమయంలో పూంచ్ సెక్టార్ లో ఉన్న షాపూర్ ప్రాంతంలో పాక్ సైన్యం కాల్పులు జరిపిందని డిఫెన్స్ స్పోక్స్ పర్సన్ లెఫ్టనెంట్ కల్నల్ మనీష్ మెహతా చెప్పారు. దానికి సమాధానంగా భారతసైన్యం కూడా ఎదురుకాల్పులు జరిపింది. ఇప్పటివరకూ ఎవరూ మృతి చెందలేదు. పాక్ హై కమిషనర్ అబ్దుల్ బాసిత్ భారత్ పాక్ ల మధ్య శాంతి చర్చలు తాత్కాలికంగా క్యాన్సిల్ అయ్యాయని చెప్పిన కొద్దిరోజులకే ఈ కాల్పులు జరగడం గమనార్హం.

పాకిస్థాన్ లో భూకంపం, ఢిల్లీ లో స్వల్ప ప్రకంపనలు..!

  ఈరోజు 6.6 మాగ్నిట్యూడ్ తో పాకిస్థాన్ ఆప్ఘాన్ బోర్డర్లో భూకంపం సంభవించింది. ఈ భూకంపం తాలూకు ప్రభావం ఉత్తరభారతం మీద కూడా పడింది. ఢిల్లీ, జమ్మూ కశ్మీర్, ఉత్తరాఖండ్, పంజాబ్ రాష్టాల్లో భవనాలు కంపించాయి. ఆఫ్ఘాన్ బోర్డర్లో ఉన్న హిందూ ఖుష్ పర్వత శ్రేణిలో భూకంపమే దీనికి మూలం అని నిపుణులు అంచనా వేస్తున్నారు. భూకంపానికి సంబంధించి ఎటువంటి నష్టం రిపోర్ట్ అవ్వలేదు. ఢిల్లీలో మెట్రో రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపేవేసినా మధ్యాహ్నం నుంచి మళ్లీ రైళ్లు మొదలయ్యాయి. హిందూకుష్ పర్వతాల కింది భాగంలో, ఇండియన్ టెక్టానిక్ ప్లేట్లు, యూరేషియా ప్లేట్లను ఢీకొట్టడం వలనే ఈ భూకంపం సంభవించిందని నిపుణులు చెబుతున్నారు. 2015 అక్టోబర్లో కూడా 7.5 మాగ్నిట్యూడ్ తో పాకిస్థాన్ ఆఫ్ఘాన్ బోర్డర్లో వచ్చిన భూకంపానికి దాదాపు 400 మంది బలయ్యారు. అక్టోబర్ 2005 లో వచ్చిన భూకంపానికి 75 వేల మంది మరణించారు. దాంతో ఇప్పుడు ఆప్ఘాన్ ప్రజలు భయంతో వణుకుతున్నారు.

కేరళ ఆలయంలో ఘోర ప్రమాదం, 100 మంది మృతి..!

  కేరళ పుట్టింగళ్ దేవి గుడిలో ఘోర అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. అనూహ్యంగా జరిగిన ఈ సంఘటనలో 102 మంది నిండుప్రాణాలు బలవ్వగా, 200 మందికి పైగా తీవ్రగాయాలపాలయ్యారు. ఆదివారం తెల్లవారుఝామున 3 గంటలకు ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ఆలయవేడుకల్లో భాగంగా భక్తులు బాణాసంచా కాలుస్తుండగా, ప్రమాదవశాత్తూ పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. జాగ్రత్తలు తీసుకునేలోపే మంటలు వేగంగా వ్యాపించాయి. మంటల్ని చూసి భయంలో భక్తులు పరుగులు పెట్టడంతో, తొక్కిసలాట జరిగి ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ప్రమాద సమయంలో భక్తులు ఎక్కువసంఖ్యలో ఉండటంతో ఇంత ప్రాణనష్టం సంభవించిందని అధికారులు చెబుతున్నారు. పుట్టింగళ్ దేవి గుడిలో మళయాళ నెలల ప్రకారం భరణి నక్షత్రంలో ఉత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. భారీగా బాణాసంచా కాల్చడం ఉత్సవ ఆచారంలో భాగం. బాణాసంచా పేల్చడంలో జరిగిన తప్పు కారణంగా ఈ ఘోరం చోటు చేసుకుంది. ఈ ఘటనపై కేరళ సిఏం ఉమెన్ చాందీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు.

55 ఏళ్ల బామ్మ.. ముగ్గురు శిశువులకు జన్మ

  ఒకే కాన్పులో ఇద్దరు ముగ్గురిని కనడం చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇంగ్లండ్ లో కూడా ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి కాన్పునిచ్చింది. ఇందులో ఆశ్చర్యం ఏముందనుకుంటున్నారా.. ఉంది ఎందుకంటే ఆమెకు 55 ఏళ్లు. ఇంగ్లండ్ లో షరోన్ కట్స్ (55) అనే మహిళ నాటింగ్‌హామ్ యూనివర్శిటీ వైద్యశాలలోకృత్రిమ గర్భధారణ పద్ధతి ద్వారా గర్భం దాల్చి ముగ్గురు శిశువులకు జన్మనిచ్చింది. అంతేకాదు లేటు వయసులో ముగ్గురు శిశువులకు జన్మనిచ్చిన మహిళగా రికార్డు సృష్టించింది. బ్రిటన్ ప్రభుత్వాసుపత్రిలో 42 ఏళ్లలోపు గల వారికే కృత్రిమ గర్భధారణ చికిత్సలు చేస్తారు. దీంతో ప్రైవేట్ ఆస్పత్రిలో ఈ చికిత్స పొందిన ఆ బామ్మ ఇద్దరు మగశిశువులు, ఒక ఆడ శిశువుకు జన్మనిచ్చింది.