చంద్రబాబుకు మేలు.. జగన్ తీరు!
ప్రతిపక్ష హోదా లేకపోయినా ఆంధ్రప్రదేశ్ లో అధికార కూటమికి ప్రత్యర్థి పార్టీ వైసీపీ మాత్రమే. ఇది ఎవరూ కాదనలేని వాస్తవం. అంతే కాకుండా గత ఏడాది జరిగిన ఎన్నికలలో ఘోర పరాజయం తరువాత.. మళ్లీ రాష్ట్రంలో రాజకీయంగా బలోపేతం కావాలని ప్రయత్నిస్తున్న పార్టీ. అటువంటి పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేయడం, లోపాలను ఎత్తిచూపడాన్ని ఎవరూ తప్పుపట్టరు. కానీ కువిమర్శలు, అసత్య ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టడానికీ, తప్పదోవపట్టించడానికి చేస్తున్న ప్రయత్నాలు వైసీపీకి మేలు చేయవు సరికదా, ఆ పార్టీ ప్రతిష్ఠను మరింత మసకబారుస్తాయి.
ప్రత్యర్థి పార్టీగా వైసీపీ ప్రస్తుతం చేస్తున్న విమర్శలు, ఆరోపణల వల్ల రాజకీయంగా ఆ పార్టీకి మరింత నష్టం చేకూరుస్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో వైసీపీ అధినేత, ఆ పార్టీ నేతలూ వ్యవహరిస్తున్న తీరు.. అధికార కూటమికి, తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు ఎనలేని మేలు చేస్తున్నాయని వివరిస్తున్నారు.
తాజాగా వైసీపీ అధినేత జగన్ సీఎం చంద్రబాబుపై చేసిన వ్యాఖ్యలు బూమరాంగ్ అయ్యాయి. జగన్ విమర్శల వల్ల ఆయనకు రాజకీయంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా నష్టం జరిగే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ జగన్ ఏమన్నారంటే.. చంద్రబాబు ఎవరికీ క్రెడిట్ ఇవ్వరనీ, ఎవరో చేసిన మంచి పనుల క్రెడిట్ ను కూడా తన ఖాతాలో వేసేసుకుని, అంతా తానే చేశాన్న బిల్డప్ ఇచ్చుకుంటారనీ జగన్ మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరీ చెప్పారు.
ఆయన వ్యాఖ్యలకు నెటిజనులు క్షణం ఆలస్యం చేయకుండా గట్టి కౌంటర్ ఇస్తున్నారు. కియా, విశాఖకు ఏఐ వంటి అంశాలలో తొలుత విమర్శలకు దిగిన జగన్ తీరా వాటికి ప్రజల నుంచి వచ్చిన అమోఘమైన సానుకూలతను గమనించి అవి తమ ఘనత వల్లే వచ్చాయని క్లెయిమ్ చేసుకోవడానికి చేసిన ప్రయత్నాన్ని నెటిజనులు ప్రస్తావిస్తూ జగన్ ను ట్రోల్ చేస్తున్నారు. అనంతపురానికి కియా రాక తన తండ్రి వైఎస్ దేననీ, అదానీతో తాను గతంలో జరిపిన చర్చల వల్లే విశాఖకు గూగుల్ డేటా సెంటర్, ఏఐ వచ్చాయనీ జగన్ చెప్పుకోవడాన్ని గుర్తు చేస్తూ.. చంద్రబాబు ఎన్నడూ వేరొకరి క్రిడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ప్రయత్నించలేదని గుర్తు చేస్తున్నారు. ఆర్థిక సంస్కరణలకు ఆద్యుడిగా ఆయన అప్పుడూ, ఇప్పుడూ కూడా దివంగత ప్రధాని పీవీ నరసింహరావు పేరునే ప్రస్తావించడాన్ని గుర్తు చేస్తున్నారు.
ఇక వైఎస్ జగన్ తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తీసుకువచ్చిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ వంటి వాటిని చంద్రబాబు కొనసాగించారనీ, అయితే ఆ క్రెడిట్ ను తన ఖాతాలో వేసుకోవడానికి ఎన్నడూ ప్రయత్నించలేదనీ గుర్తు చేస్తున్నారు నెటిజనులు. ఇక హైదరబాద్ కు అదనంగా సైబరాబాద్ ఆవిర్భావం చంద్రబాబు ఘనతే అనడంలో సందేహం లేదు. ఎందుకంటే.. జగన్ స్నేహితుడు, తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ స్వయంగా పలు సందర్భాలలో హైదరాబాద్ లో ఐటీ అభివృద్ధి చంద్రబాబు వల్లే సాధ్యమైందని చెప్పారు. నెటిజనులు అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు. జగన్ అసత్యాలను ప్రచారం చేస్తూ చంద్రబాబును వ్యక్తిగతంగా టార్గెట్ చేయడం వల్ల రాజకీయ మైలేజ్ రావడం సంగతి అటుంచి ఉన్న ప్రతిష్ఠ కూడా మసకబారుతుందని విశ్లేషకులు అంటున్నారు.