కృష్ణాతీరంలో తెదేపాపై వాలుతున్న కాంగ్రెస్ వలస పక్షులు
posted on Apr 3, 2014 8:38AM
సీమాంద్రాలో కాంగ్రెస్ పార్టీ దాదాపు ఖాళీ అయిపోయింది. పార్టీ నుండి బయటకు వెళ్ళిన వారిలో దాదాపు 75శాతం మంది తెలుగుదేశం పార్టీలో చేరారు. కొత్తగా కృష్ణా జిల్లాకు చెందిన కాంగ్రెస్ నేతలు పిన్నమనేని వెంకటేశ్వర రావు, మండలి బుద్ధ ప్రసాద్ నిన్నతెదేపా కండువాలు కప్పుకొన్నారు. వారిని చంద్రబాబు సాదరంగా పార్టీలోకి ఆహ్వానించినా, జిల్లా నేతలు మాత్రం వారిపై చాలా గుర్రుగా ఉన్నారు. నిన్న వారిరువురు పార్టీలో చేరుతున్న సమయంలో జిల్లాకు చెందిన ప్రముఖనేతలెవరూ కూడా ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఆసక్తి చూపలేదు.
కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నంతకాలం ఆయన చుట్టూ ఉపగ్రహంలా ప్రదక్షిణాలు చేసి పదవులు సంపాదించుకొన్న మండలి బుద్ధ ప్రసాద్, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి, కిరణ్ కుమార్ రెడ్డికి కూడా హ్యాండిచ్చి ఎన్నికలలో గెలిచే అవకాశం ఉన్న తెదేపా టికెట్ కోసమే పార్టీలో చేరుతున్నారని జిల్లా నేతలు భావిస్తున్నారు.
తెదేపా-బీజేపీ పొత్తులలో భాగంగా తమ సీట్లకు ఎక్కడ ఎసరు వస్తుందో అని ఆందోళన చెందుతుంటే, ఇప్పుడు ఈ కాంగ్రెస్ వలస పక్షుల కారణంగా తాము నష్టపోవలసి వస్తుందని జిల్లా నేతలు ఆక్రోశిస్తున్నారు. కృష్ణా జిల్లాకు చెందిన దేవినేని ఉమా మహేశ్వర రావు, కొనకళ్ళ నారాయణ రావు తదితరులు, పార్టీ కార్యకర్తలు కూడా వీరి రాకను తీవ్రంగా వ్యతిరేఖిస్తున్నారు. ఇంతకాలం తాము వ్యతిరేఖించిన, తెదేపాను వ్యతిరేఖించిన ఈ నేతలకు మద్దతుగా మాట్లాడుతూ ఇప్పుడు ప్రజల వద్దకు ఏ మొహం పెట్టుకొని వెళ్లి వాళ్లకు ఓట్లేయమని అడగగలమని వారు ప్రశ్నిస్తున్నారు. కానీ, చంద్రబాబు నాయుడు జిల్లా నేతలతో స్వయంగా మాట్లాడి ఒప్పించడంతో వారు అయిష్టంగా ఒప్పుకోవలసి వచ్చింది.
వీరిరువురి రాకతో జిల్లాలో పార్టీ మరింత బలపడుతుందని చంద్రబాబు సంతోషిస్తుంటే, ఇటువంటివారితో కలిసి పనిచేయడం అసాధ్యమని జిల్లా నేతలు భావిస్తున్నారు. రాష్ట్ర విభజన వ్యవహారంలో తీవ్ర ఆటుపోటులకు గురయ్యి ఇప్పుడిప్పుడే కొల్కొంటున్న తెదేపా, విభజనకు కారకులయిన కాంగ్రెస్ నేతలను పార్టీలో చేర్చుకొంటే కాంగ్రెస్ పార్టీపై ఉన్న ప్రజావ్యతిరేకత, ప్రజాగ్రహం పార్టీపై తప్పక పడుతుందని, దానివలనపార్టీ తీవ్రంగా నష్టపోవలసి రావడమే కాకుండా, వైకాపా వంటి ప్రత్యర్ద పార్టీలు బలపడవచ్చని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.
తీవ్ర ప్రజా వ్యతిరేఖతను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ నేతలను పార్టీలోకి ఆహ్వానించి టికెట్స్ కట్టబెట్టడం కొరివితో తల గోక్కోన్నట్లే అవుతుందని పార్టీ నేతలు, కార్యకర్తలే హెచ్చరించడం గమనార్హం. గత రెండు ఎన్నికలలో ఇటువంటి వింత వింత ప్రయోగాలు చేయడం వలన పార్టీ ఓటమి పాలయిన సంగతిని ఈ సందర్భంగా జ్ఞప్తికి తెచ్చుకొని మళ్ళీ అటువంటి ప్రయోగాలు చేయవద్దని పార్టీ పాత కాపులు అందరూ కోరుకొంటున్నారు. తాను చాలా మారానని చెప్పుకొంటున్న చంద్రబాబు మరి వారి సలహాలను, సూచనలను చెవికెక్కించుకొంటారో లేదో చూడాలి.