చంద్రబాబు సమర్ధతకు సవాలుగా మారిన వ్యవసాయ ఋణాలు
posted on Jun 18, 2014 8:24AM
వేలకోట్ల వ్యవసాయ ఋణాలను మాఫీ చేయడం తగదంటూ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆంద్ర, తెలంగాణా ప్రభుత్వాలకు లేఖలు వ్రాసింది. ఒకవేళ ఋణాలు మాఫీ చేయదలిస్తే ప్రభుత్వమే ఆ మొత్తాన్ని నగదు రూపంలో బ్యాంకులకు చెల్లించి మాఫీ చేసుకోవచ్చని కానీ ప్రభుత్వ బాండ్లు పెట్టి మాఫీ కోరడం తగదని స్పష్టంగా చెప్పింది. ఋణాలు మాఫీ చేయకపోతే ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా ఊరుకోరు. మాఫీ చేస్తామంటే ఆర్.బీ.ఐ. ఒప్పుకోవడం లేదు. అందువల్ల రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబు, కేసీఆర్ ల పరిస్థతి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారయింది. కేసీఆర్ ప్రభుత్వానికి కొద్దిగా మిగులు బడ్జెట్ తో ఉన్నందున ఏదోవిధంగా ఈ గండం గట్టెక్కగలదు. కానీ లోటు బడ్జెట్ లో ఉన్న చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ అప్పుల ఊభి నుండి బయటపడాలంటే చాలా కష్టం.
కేంద్రం చాలా ఉదారంగా ఆదుకొంటే తప్ప అది సాధ్యం కాదు. దేశంలో వివిధ రాజకీయ పార్టీలు అధికారంలోకి రావడానికి చేసిన హామీలను తీర్చే బాధ్యత ఒకవేళ కేంద్రం తలకెత్తుకొన్నట్లయితే, అదొక సంప్రదాయంగా మారే ప్రమాదం ఉంది. గనుక ప్రధానమంత్రి మోడీ ఈ విషయంలో చంద్రబాబుకి నేరుగా ఆర్ధిక సహాయం చేయక పోవచ్చును. ఒకవేళ కేంద్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదుకోవడానికి సిద్దపడినట్లయితే, మిగిలిన ఇతర రాష్ట్రాల నుండి కూడా ఇటువంటి డిమాండ్లే మొదలయితే అప్పుడు కేంద్రం కూడా ఇరకాటంలో పడుతుంది గనుక ఈ విషయంలో కేంద్రం ఏ మేరకు, ఏ విధంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి సహాయ, సహకారాలు అందజేస్తుందనేది వేచి చూడాలి.
ఈ సంగతి ముఖ్యమంత్రి చంద్రబాబుకి తెలియదనుకోలేము. ఆర్.బీ.ఐ. నుండి లేఖ అందుకొన్న తరువాత, నిన్న చంద్రబాబు, ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు, ఋణమాఫీపై వేసిన కొండయ్య కమిటీ సభ్యులతో ఈవిషయంపై సుదీర్గంగా చర్చించారు. వ్యవసాయ ఋణాలు మొత్తం అన్నీ కలిపి రూ.59,105కోట్లు ఉన్నట్లు తేలింది. కానీ వాటిని ఏవిధంగా తీర్చాలో మాత్రం తేల్చుకోలేకపోయారు. కానీ ఈవిషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా వెనక్కి తగ్గరాదని మాత్రం ఒక నిర్ణయానికి వచ్చారు. అందుకు మళ్ళీ కేంద్రాన్నే ఆశ్రయించాలని నిశ్చయించుకొన్నారు. పనిలో పనిగా ఆర్.బీ.ఐ.కు కూడా తాము ఏ పరిస్థితుల్లో పంట ఋణాలు మాఫీ చేసేందుకు అంగీకరించవలసి వచ్చిందో వివరిస్తూ ఒక లేఖ వ్రాసి, ఈ విషయంలో ఆర్.బీ.ఐ. సహకారం కూడా కోరాలని నిర్ణయించేరు. కానీ ఈ రెండు నిర్ణయాల వలన ఎటువంటి ఫలితము ఉండకపోవచ్చును.
రాష్ట్ర విభజన వల్ల చితికిపోయిన ఆంద్రప్రదేశ్ రాష్ట్రాన్ని తప్పకుండా అన్నివిధాల ఆదుకొంటానని కేంద్రం పదేపదే హామీ ఇస్తుండవచ్చును. కానీ దానర్ధం చంద్రబాబు తలెకెత్తుకొన్న ఈ వేల కోట్ల ఋణభారాన్ని భరిస్తానని మాత్రం కాదని గ్రహించవలసి ఉంటుంది. అటువంటప్పుడు చంద్రబాబే ఈ సమస్యను పరిష్కరించుకోవలసి ఉంటుంది. రైతులకు, ప్రజలకు ఇచ్చిన మాట తప్పకుండా, వారిపై కొత్తగా ఎటువంటి ఆర్ధిక భారం మోపకుండా, కేంద్రం నుండి సహాయం అందకపోయినా ఈ జటిల సమస్యను తాను విధించుకొన్న 45రోజుల గడువులో ఏదోవిధంగా పరిష్కరించ వలసి ఉంటుంది. ఆ గడువులో అప్పుడే 10రోజులు పూర్తయిపోయాయి. మిగిలిన ఈ కొద్ది రోజులలో తప్పనిసరిగా ఈ సమస్యకు ఆయన పరిష్కారం కనుగొనవలసి ఉంటుంది. ప్రజలు ప్రతిపక్షాలు కూడా ఆయన ఈ జటిల సమస్యను ఏవిధంగా పరిష్కరిస్తారా? అని ఎదురుచూస్తున్నారు.
ఒకవేళ పరిష్కరించ గలిగితే ఆయన సమర్ధతకు ప్రజలందరూ నీరాజనాలు పడతారు. లేకుంటే విమర్శలు, తీరని అపఖ్యాతి మూటగట్టుకొంటారు. నిజంగా ఇది చంద్రబాబు సమర్ధతకు అగ్ని పరీక్ష వంటిదే! అయితే ఆ పరీక్షను ఆయానే స్వయంగా ఎన్నుకొన్నారు గనుక ఇక ఎవరినీ నిందించడానికి లేదు.