కార్యకర్తల సంక్షేమం కోసం తెదేపాలో వ్యవస్థ ఏర్పాటు
posted on Jun 19, 2014 @ 12:39PM
ఆంధ్ర, తెలంగాణా రాష్ట్రాలలో తెదేపాకు గ్రామ స్థాయి నుండి కూడా చాలా బలమయిన పార్టీ క్యాడర్ ఉందనే సంగతి అందరికీ తెలుసు. గత పదేళ్లలో కార్యకర్తల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు చెప్పట్టింది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న కార్యకర్తలకు, నిరుపేద కార్యకర్తల పిల్లలు చదువులకు ఆర్ధిక సహాయం చేస్తూ కార్యకర్తలను ఆదుకొంటోంది. అయితే ఈ సంక్షేమ కార్యక్రమాలను నిరంతరంగా నిర్వహించాలంటే దానికి ఒక ప్రత్యేకమయిన నిధి, దానిని నిర్వహించేందుకు ఒక వ్యవస్థ అవసరమని నారా లోకేష్ చేసిన సూచనను పార్టీ ఏకగ్రీవంగా ఆమోదించడమే కాక ఆ భాద్యతను ఆయనకే అప్పగించింది. ఈరోజు తన తండ్రి రాష్ట్ర ముఖ్యమంత్రి గా లేక వ్యూ గెస్ట్ హౌస్ లో బాధ్యతలు స్వీకరిస్తున్న సమయంలోనే నా రాలోకేష్ కూడా ఈ సంక్షేమ నిధి సమన్వయకర్తగా బాధ్యతలు స్వీకరించారు.
ఈ సందర్భంగా నారా లోకేష్ లోకేష్ మాట్లాడుతూ ఒకటి రెండు రోజుల్లోనే కార్యకర్తల సహాయం కోసం (హెల్ప్ లైన్) ఒక ప్రత్యేక ఫోన్ నెంబర్ కేటాయిస్తామని, రెండు రాష్ట్రాలలో కార్యకర్తలు ఎప్పుడయినా ఆ నెంబరుకు ఫోన్ చేసి అవసరమయిన సహాయం పొందవచ్చని తెలిపారు.
సాధారణంగా రాజకీయ పార్టీలకు ఎన్నికల సమయంలోనే పార్టీ కార్యకర్తలు గుర్తుకు వస్తారు. ఆసమయంలో వారిని పూర్తిగా వాడుకొని, అధికారం చేజిక్కించుకొన్నాక మళ్ళీ వచ్చే ఎన్నికల వరకు వారిని పట్టించుకోరు. అయినప్పటికీ ఏదో ఒకరోజు పార్టీ మేలుచేయకపోతుందా అనే ఆశతో పార్టీ కార్యక్రమాలలో పాల్గొంటుంటారు. వాటి కోసం తమ కష్టార్జితాన్ని సైతం ఖర్చు చేస్తుంటారు. పార్టీ పిలుపు మేర ధర్నాలు, నిరాహార దీక్షలు చేసి కడుపు మాడ్చుకొంటారు, పోలీసుల లాటీ దెబ్బలు తింటారు, కేసులలో చిక్కుకొని కోర్టుల చుట్టూ తిరుగుతూ తమ జీవితాలను, తమపై ఆధారపడిన కుటుంబసభ్యుల జీవితాలను కూడా చేజేతులా నాశనం చేసుకొంటుంటారు. అయితే వారి ఈ కష్టానికి ప్రతిఫలం మాత్రం సదరు పార్టీ నాయకులు అనుభవిస్తారు. కార్యకర్తలు వారి కుటుంబాలు పస్తులుంటే, వారి కష్టంతో గెలిచిన నాయకులు మాత్రం విలాసవంతమయిన జీవితం గడుపుతుంటారు.
నారా లోకేష్ ప్రత్యక్ష రాజకేయాలలోకి రాకుండా పార్టీని బలోపేతం చేసే పనిలో ఈ పరిస్థితులన్నిటినీ స్వయంగా చూసారు. అందుకే ఇకపై పార్టీ కార్యకర్తల, వారి కుటుంబాల బాగోగులు పార్టీయే చూడాలని నిర్ణయించుకొన్నారు. ఆ ప్రయత్నంలోనే ఈరోజు కార్యకర్తల సంక్షేమ నిధికి సమన్వయ కర్తగా బాధ్యతలు స్వీకరించారు. దేశంలో మరే పార్టీ చేయని విధంగా పార్టీ కార్యకర్తల కోసం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయడం, పార్టీయే వారి బాగోగులు చూసుకోవాలని భావించడం నిజంగా చాలా అభినందనీయం. మిగిలిన రాజకీయ పార్టీలు కూడా ఈ పద్ధతి అనుసరిస్తే బాగుంటుంది.