ఇల్లలకగానే పండగ కాదు
posted on Sep 5, 2014 7:26AM
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మంచి రోజు, మంచి ముహూర్తం వగైరాలన్నీ సరిచూసుకొని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధానిని విజయవాడ వద్ద ఏర్పాటు చేయబోతున్నట్లు నిన్న శాసనసభలో ప్రకటించారు. ఇంతవరకు ఈ అంశంపై జరిగిన రాజకీయాలు, చర్చలు, లెక్కలు ఒక ఎత్తయితే, ఇక ముందు జరుగబోయేవన్నీ మరో ఎత్తు. రాజధానిపై రాయలసీమ ప్రజల అభ్యంతరాలు, రాజధాని నిర్మాణం కోసం అవసరమయిన భూసేకరణ, దానికి నిధులు, రాజధాని రూపురేఖలు, అవసరమయిన సాంకేతిక పరిజ్ఞానం, నిర్మాణ కార్యక్రమాలు, కాలపరిమితి వంటివి చాలానే ఉన్నాయి. వీటిలో మొదటి మూడు సమస్యలను ప్రభుత్వం సమర్ధంగా పరిష్కరించగలిగితే రాజధాని నిర్మాణం గురించి ఆలోచించవచ్చును. వీ.జీ.టీ.యం. పరిధిలో దాదాపు 45,000 ఎకరాల ప్రభుత్వ భూములు ఉన్నట్లు రాష్ట్ర రెవెన్యూ శాఖ చెప్పిన మాట వాస్తవమయితే, ఇక ప్రభుత్వం భూసేకరణ, దాని కోసం నిధుల సమీకరణ గురించి పెద్దగా ఆలోచించనవసరం ఉండదు. బహుశః అందుకే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడ పరిసర ప్రాంతాలలో రాజధానిని ఏర్పాటు చేస్తామని దైర్యంగా ప్రకటించి ఉండవచ్చును.
ప్రభుత్వ భూములు ఉన్నప్పటికీ అవి ఆక్రమణకు గురయ్యాయని రెవెన్యూ శాఖే స్వయంగా చెప్పినట్లు సమాచారం. అదే నిజమయితే, ఆభూములను స్వాధీనం చేసుకోవడానికి ప్రభుత్వం కోర్టుల చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ చాలా ప్రయాసపడకతప్పదు. దాని వలన రాజధాని నిర్మాణపనులలో జాప్యం అనివార్యం కావచ్చును. కానీ చాలా దూరదృష్టితో ఆలోచించే అలవాటున్న చంద్రబాబు నాయుడు భూసేకరణపై ఎంతో కొంత స్పష్టత ఉన్న కారణంగానే బహుశః విజయవాడ వద్ద రాజధాని ఏర్పాటు ప్రకటన చేసి ఉండవచ్చును. ఆయన అందుకోసం ప్రత్యేకంగా మంత్రులతో కూడిన ఒక ఉప కమిటీని వేశారు కూడా.
భూసేకరణ కంటే ముందే మొదలయ్యే మరో అధ్యాయం నిధుల సమీకరణ. ఈ మూడు నెలలలో విజయవాడ పరిసర ప్రాంతాలలో ఊహించనంతగా పెరిగిపోయిన భూముల ధరలకు తోడు ఈ ఏడాది నుండి కొత్తగా అమలులోకి వచ్చిన భూసేకరణ చట్టాలు భూసేకరణ పనిని మరింత కష్టంగా, క్లిష్టంగా మార్చివేస్తున్నాయి. ప్రభుత్వం ఈ సమస్యలను అధిగమించి భూసేకరణ కార్యక్రమం పూర్తి చేయవలసి ఉంటుంది. దానికి ఎంత సమయం పడుతుందో ఇప్పుడే ఎవరూ చెప్పలేరు.
అదేవిధంగా రాజధాని నిర్మాణం కోసం తగిన డిజైన్, సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థలను ఎంచుకోవలసి ఉంటుంది. అయితే చేతిలో డబ్బుంటే అదేమీ పెద్ద సమస్య కాదు. కనుక నిధుల కోసం కేంద్రంవైపే చూడాల్సి ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఎంత నిధులు విడుదల చేస్తుందనే విషయం కూడా తెలియవలసి ఉంది. దానిని బట్టే మిగిలిన అన్ని పనులు ఎప్పుడు, ఏవిధంగా మొదలుపెట్టి ఎంతకాలంలో పూర్తి చేయాలనే విషయంపై ఒక స్పష్టత వస్తుంది.
రాష్ట్రంలో పలు విశ్వవిద్యాలయాలు, విద్యావైద్య సంస్థలు, పారిశ్రామికవాడలు, విమానాశ్రయాలు, పోర్టులు, సింగపూర్ ను తలదన్నే విధంగా రాష్ట్ర రాజధాని, జిల్లాకో స్మార్ట్ సిటీ, వైజాగ్, విజయవాడ మరియు తిరుపతి నగరాలను మెగాసిటీలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి ఐదేళ్ళ సమయం మాత్రమే ఉందనే సంగతి గుర్తుంచుకొని తదనుగుణంగా చాలా వేగంగా పనిచేయాల్సి ఉంటుంది. అధికార తెలుగుదేశం పార్టీ ఈ ఐదేళ్ళలోనే తన ఈ హామీలలో సగమయినా నెరవేర్చకపోతే, అది వచ్చే ఎన్నికలలో పార్టీపై వ్యతిరేఖ ప్రభావం చూపే అవకాశం ఉంటుందనే విషయం కూడా గుర్తుంచుకోవడం మంచిది.