వైకాపా తీరు మారదా?
posted on Sep 4, 2014 @ 5:11PM
శాసనసభలో నేడు వైకాపా సభ్యులు, వారి అధినేత జగన్మోహన్ రెడ్డి అవలంభించిన ద్వంద వైఖరి వ్యవహరించిన తీరు చూస్తే వారికి ఇంకా పాత అలవాట్లు పోలేదనిపించింది. ఇదివరకు భూటకపు సమైక్యవాదంతో, సమైక్య ఉద్యమాలతో సీమాంధ్ర ప్రజలను ప్రసన్నం చేసుకొని ఎన్నికలలో గెలుద్దామని భంగపడినట్లే, మళ్ళీ ఇప్పుడు కూడా రాజధాని విషయంలో రభసచేసి రాయలసీమ ప్రజల మెప్పు పొందాలని ప్రయత్నించి మంత్రి అచ్చెం నాయుడు చేతిలో భంగపడ్డారు.
రాజధానిపై చర్చకు పట్టుబడుతూ సభను స్తంభింప జేసిన వైకాపా సభ్యుల నేత జగన్మోహన్ రెడ్డిని, “అసలు మీ పార్టీ రాజధానిని ఎక్కడ నిర్మించాలని కోరుకొంటోందో స్పష్టంగా చెప్పండి,” అని మంత్రి అచ్చెం నాయుడు నిలదీయడంతో, జగన్ నోట కాసేపు మాట రాలేదు. ఎందుకంటే ఆయన ఏ ప్రాంతం పేరు చెప్పినా మరో ప్రాంతం వారికి అది ఆగ్రహం కలిగించవచ్చును. బహుశః అందుకే రాజధానిపై తమ పార్టీ వైఖరి చెప్పకుండా, ఆ సమస్యను అధికార తెలుగుదేశం పార్టీ మీదకి నెట్టేసి రాజధానిపై చర్చ అంటూ సభలో నానా రభస చేసి రాయలసీమ ప్రజలను ఆకట్టుకొనే ప్రయత్నం చేసారు. అయితే తీరా చేసి అచ్చెం నాయుడు నిలదీసినప్పుడు జగన్ ఏ కడపో, కర్నూలో అనంతపురమో అని దైర్యం చేసి చెప్పి ఉంటే కనీసం అక్కడి ప్రజల మద్దతు ఆయనకు దొరికి ఉండేది. కానీ చెప్పలేకపోయారు.
మళ్ళీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడలో రాజధాని అని ప్రకటించిన తరువాత, కోస్తా ఆంధ్రాలో కూడా తన పార్టీకి ఇబ్బంది లేకుండా చూసుకొనేందుకు, తాము కూడా ఆ ప్రతిపాదనకు స్వాగతం పలుకుతున్నామని జగన్ ప్రకటించారు. అంతేకాక అంతవరకు సభలో నానా రభస చేసిన వైకాపా సభ్యులు రాజధానిపై జరిగిన చర్చలో ఎంచక్కా పాల్గొన్నారు. అటువంటప్పుడు ఈ రభస అంతా ఎందుకంటే రాయలసీమ ప్రజలను ఆకట్టుకోవడానికేనని అర్ధమవుతోంది.
అయితే వైకాపా అనుసరించిన ఈ ద్వంద వైఖరి వలన రెండు ప్రాంతాల ప్రజలలో ఆయన పట్ల మరింత అపనమ్మకం పెరుగుతుందే తప్ప ఆయన చేసిన పనిని మెచ్చుకొనేవారు ఉండరు. నిజాయితీకి, విశ్వసనీయతకు, విలువలకు తానే కేర్ ఆఫ్ అడ్రెస్స్ అని చెప్పుకొనే జగన్మోహన్ రెడ్డి రాజధాని విషయంలో కూడా తన ద్వంద వైఖరిని ప్రదర్శించి తనలో, తన పార్టీ తీరులో ఎటువంటి మార్పులు రాలేదని మరోసారి నిరూపించి చూపారు.