రామచంద్రయ్యకు కాంగ్రెస్ తప్పులు కనబడవా?
posted on Sep 5, 2014 @ 10:22PM
ఈరోజు శాసనమండలిలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అంశంపై జరిగిన చర్చలో మాజీ మంత్రి సి.రామచంద్రయ్య మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు ఎవరినీ సంప్రదించకుండా ఏకపక్షంగా విజయవాడలో రాజధాని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించడాన్ని తప్పు పట్టారు. అసలు ఇంత హడావుడిగా రాజధానిని ప్రకటించవలసిన అవసరం ఏమొచ్చిందని ఆయన ప్రశ్నించారు. ఆయన రాయలసీమ ప్రజలకు చాలా అన్యాయం చేసారని ఆరోపించారు. నిజమే! రాష్ట్ర ప్రభుత్వం ఒకసారి అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలు తెసుకొన్నాక రాజధానిపై నిర్ణయం తీసుకొని ఉండి ఉంటే ఎవరూ తప్పు పట్టే అవకాశం ఉండేది కాదు.
రామచంద్రయ్య ముఖ్యమంత్రిపై చేసిన విమర్శలకు బహుశః నేడో రేపో తెదేపా తగిన జవాబు చెప్పవచ్చును. కానీ గమనించాల్సిన విషయం ఏమిటంటే ఈరోజు అయన అధికార పార్టీని ఏమని విమర్శిస్తున్నారో, రాష్ట్ర విభజన సందర్భంగా ప్రతిపక్షాలు, ప్రజలందరూ కూడా కాంగ్రెస్ అధిష్టానాన్ని సరిగ్గా అదేవిధంగా విమర్శించారు. కానీ కాంగ్రెస్ అధిష్టానం మొండిగా రాష్ట్రవిభజన చేసింది.
కాంగ్రెస్ అధిష్టానం కేవలం రాష్ట్ర ప్రజలనే కాదు, తమ పార్టీకే చెందిన ముఖ్యమంత్రి, కేంద్రమంత్రులు, యంపీలపట్ల చాలా అవమానకరంగా వ్యవహరించిన విషయం అందరికీ తెలుసు. కాంగ్రెస్ అధిష్టానం చేసిన పనికి కేవలం రాష్ట్ర ప్రజలే కాదు, అనేకమంది కాంగ్రెస్ నేతల రాజకీయ భవిష్యత్ కూడా సర్వ నాశనం అయింది. అప్పుడు కూడా మిగిలిన కాంగ్రెస్ నేతలెవరూ కూడా అధిష్టానానికి వ్యతిరేఖంగా నోరు మెదిపే సాహసం చేయలేకపోయారు.
పార్లమెంటులో ఇతర రాష్ట్రాలకు చెందిన కాంగ్రెస్ యంపీలను స్వయంగా కాంగ్రెస్ అధిష్టానమే ఆంధ్రా కాంగ్రెస్ యంపీలపైకి ఉసిగొల్పినపుడు రామచంద్రయ్య వంటి కాంగ్రెస్ నేతలెవరూ కూడా నోరు మెదపలేకపోయారు. ఆంధ్రాలో లక్షాలాది ప్రజలు రోడ్లమీదకు వచ్చి రాష్ట్ర విభజన వద్దని ఉద్యమాలు చేస్తున్నప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పార్లమెంటు తలుపులు, కిటికీలు మూసివేసి, టీవీ ప్రసారాలు నిలిపివేసి విభజన బిల్లును మూజు వాణిఓటుతో ఆమోదింపజేసినప్పుడు రామచంద్రయ్య వంటి కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాకొన్నారో ఎవరికీ తెలియదు.
మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కరే రాష్ట్రవిభజనను వ్యతిరేఖిస్తూ అధిష్టానానికి వ్యతిరేఖంగా పోరాడుతుంటే, ఈ కాంగ్రెస్ నేతలు ఎవరూ కూడా ఆయనకు అండగా నిలబడలేదు. పైగా రాష్ట్ర విభజన చేస్తున్న తమ కాంగ్రెస్ అధిష్టానాన్ని వెనకేసుకు వస్తూ తిరిగి ఆయననే విమర్శించేవారు. అందుకే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఒక్క యంపీ, యం.యల్యే సీటు కూడా దక్కకుండా ఓడించి బుద్ది చెప్పారు. కనీసం అప్పుడయినా కాంగ్రెస్ పార్టీ నేతలెవరూ కూడా జరిగిన దానికి రాష్ట్ర ప్రజలను క్షమాపణ కోరలేదు. కనీసం ఇంతవరకు పశ్చాతాప పడినట్లయినా కనబడలేదు.
కానీ, ఇప్పుడు ప్రజలెనుకొన్న రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గ సమావేశంలో చర్చించి తీసుకొన్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సభాముఖంగా ప్రకటించిన తరువాత దానిని ప్రధాన ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి స్వయంగా స్వాగతించారు. ఆ తరువాత దానిపై ఉభయసభలలో చర్చ కూడా జరిగింది. ఆ చర్చలోనే రామచంద్రయ్య ఈ విమర్శలు చేసారు. ఇవన్నీ ఆయన మరిచిపోయి రాష్ట్ర ప్రభుత్వాన్ని తప్పు పట్టడం హాస్యాస్పదం