కొత్త రాజధాని అమరావతి?
posted on Sep 10, 2014 @ 2:58PM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ పరిసరాల్లోనే వుంటుందని ప్రకటించారు. ఈ నేపథ్యంలో విజయవాడ పరిసరాల్లో ఏ వైపున రాజధాని అభివృద్ధి చెందే అవకాశం వుందా అన్న ఆలోచన అందరిలోనూ వుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని విజయవాడ సమీపంలోని అమరావతి అవుతుందని తెలుస్తోంది. విజయవాడ పరిసరాల్లోని మిగతా ప్రాంతాలతో పోలిస్తే అమరావతే రాజధాని ఏర్పాటుకు సరైన ప్రాంతం అన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. అమరావతి పరిసరాల్లో అసెంబ్లీ, సెక్రటేరియట్, రాజ్‌భవన్... ఇలా అన్ని ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు చేయడానికి సరిపడా ప్రభుత్వ భూములు ఉన్నట్టు తెలుస్తోంది. అలాగే కృష్ణాతీరంలో వున్న అమరావతిని రాజధానిగా చేయడం వల్ల రాజధానికి నీటి సమస్య వుండదని కూడా ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నట్టు తెలుస్తోంది.
అమరావతి ప్రాంతమే రాజధాని అనడానికి బలం చేకూర్చే ఒక మ్యాప్ వెలుగులోకి వచ్చింది. అమరావతి ప్రాంతం మీద ట్రాఫిక్ ఒత్తిడి పడకుండా రింగ్ రోడ్లను ప్లాన్ చేశారు. విజయవాడ పరిసరాలు మొత్తం అభివృద్ధి చెందేలా, అమరావతి మీద ఎలాంటి ఒత్తిడి లేకుండా చూసేలా ఈ ప్రణాళిక వుంది.
అమరావతి ఆంధ్రప్రదేశ్‌కి రాజధాని కాబోతోందన్న అభిప్రాయాలకు బలం చేకూర్చే విధంగా ఈ ప్రాంతంలో ఆంధ్రప్రదేశ్ సర్వేకి ఆదేశాలు జారి చేసింది. ఈ ప్రాంతంలో భూములకు సంబంధించిన అన్ని వివరాలు తెలుసుకోవడానికి ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినట్టు సమాచారం. అలాగే అమరావతిని ఆంధ్రప్రదేశ్‌కి రాజధానిని చేసిన తర్వాత ఆ ప్రాంతంలో రవాణా సదుపాయాలను పెంచడానికి కూడా ప్రభుత్వం ఇప్పటికే పక్కా ప్రణాళికను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా కృష్ణానదిపై రెండు భారీ వంతెనలను నిర్మించడానికి కూడా ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం.అమరావతి ప్రాంతంలో పెద్ద గోల్ఫ్ కోర్సును కూడా ఏర్పాటు చేయబోతున్నట్టు తెలుస్తోంది.
అమరావతిని కొత్త రాజధాని చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావించడం వెనుక కారణాలను పరిశీలకులు వివరిస్తున్నారు. అమరావతిని రాజధాని చేయడం వల్ల విజయవాడ నగరం మీద ఒత్తిడి బాగా తగ్గుతుంది. అధికారిక కార్యకలాపాలు జరిగే అమరావతి ప్రాంతలో ఎక్కువ ట్రాఫిక్ జంజాటం వుండదు. దీనితోపాటు మరెన్నో అనుకూల అంశాలు వుండటం వల్లనే అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. వీటన్నిటితోపాటు మరో ముఖ్యమైన అంశం కూడా వుందని పరిశీలకులు భావిస్తున్నారు. బౌద్ధ సంస్కృతి విలసిల్లిన అమరావతిని ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అభివృద్ధి చేసినట్టయితే లక్షల కోట్ల ఆర్థిక సాయాన్ని అందించడానికి సిద్ధంగా వున్నట్టు బౌద్ధ గురువు దలైలామా రాష్ట్ర ప్రభుత్వానికి హామీ ఇచ్చినట్టు తెలుస్తోంది. అలాగే బౌద్ధాన్ని పాటించే జపాన్ కూడా అమరావతి రాజధాని అయినట్టయితే రాజధాని అభివృద్ధికి భారీ స్థాయిలో సహకరిస్తామని చెప్పినట్టు తెలుస్తోంది. ఇన్ని మంచి కారణాల వల్ల అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారని తెలుస్తోంది.