నరేంద్ర మోడీకి పాక్ ప్రధాని మామిడిపళ్ళ సందేశం
posted on Sep 5, 2014 @ 12:02PM
భారత్-పాకిస్తాన్ దేశాల మధ్య గొప్ప సంబంధాలు ఎప్పుడూ లేవు. అందుకు పాకిస్తాన్నే నిందించక తప్పదు. భారత్ ఎప్పుడూ కూడా పాకిస్తాన్ కు స్నేహస్తం అందిస్తూనే ఉంది. కానీ పాక్ ప్రభుత్వంపై సైన్యం, ముస్లిం చాంధసవాదుల పెత్తనం చేస్తుండటంతో భారత్ తో బలమయిన స్నేహ సంబంధాలు పెంచుకోవాలని పాక్ ప్రభుత్వాధినేతలు కోరుకొంటునప్పటికీ వీలుపడటం లేదు. అందుకే ఇరుదేశాలకు స్వాతంత్ర్యం వచ్చి ఆరు దశాబ్దాలు గడిచినా వాటి మధ్య ఇంతవరకు పటిష్టమయిన స్నేహ సంబంధాలు ఏర్పడలేకపోయాయి.
మోడీ ప్రధానిగా బాధ్యతలు చేప్పట్టిన తరువాత ఇరుదేశాల మధ్య స్నేహ సంబంధాలు పటిష్టం కోవాలనే ఆలోచనతో, పాక్ ప్రధానిని తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వానించడం, ఆయన దానిని మన్నించి రావడం, ఆ తరువాత ఇరువురు ప్రధానులు బహుమతులు ఇచ్చిపుచ్చుకోవడం వరకు అంతా సవ్యంగానే సాగిపోయింది. కానీ మళ్ళీ షరా మామూలుగానే జమ్మూ కాశ్మీర్ సరిహద్దుల్లో కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ పాక్ సేనలు పదేపదే భారత జవాన్లపై, సరిహద్దు గ్రామాలపై కాల్పులకి తెగబడటంతో, రెండు దేశాల నడుమ చిగురిస్తున్న స్నేహ పుష్పం వడిలిపోవడం మొదలయింది.
భారత్ లో పాకిస్తాన్ హై కమీషనర్ అబ్దుల్ బాసిత్, భారత ప్రభుత్వం వారిస్తున్నా వినకుండా డిల్లీలోనే కాశ్మీరు వేర్పాటువాదులతో సమావేశం అవడంతో, ఉభయదేశాల విదేశాంగశాఖ కార్యదర్శుల స్థాయిలో జరగవలసిన సమావేశం భారత్ ఏకపక్షంగా రద్దు చేసుకోవడం ద్వారా పాక్ తీరుకు తన నిరసన, ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజానికి సరిహద్దులలో కాల్పులు తిరిగి మొదలయినప్పుడే భారత ప్రభుత్వం ఆ పని చేసిఉండేది. కానీ సహనంతో ఎదురుచూసినా ఫలితం లేకపోయింది. రెండు దేశాల మధ్య స్నేహ పుష్పం వికసిస్తున్న ప్రతీసారి దానికి ముగింపు ఇంచుమించుగా ఇలాగే ఉండటానికి కారణం ముందే చెప్పుకొన్నాము.
పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ భారత ప్రధాని మోడీతో కొంచెం సన్నిహితమవుతున్నట్లు సూచనలు కనబడగానే, ప్రతిపక్ష నేతలు ఇమ్రాన్ ఖాన్ మరియు తహీరుల్ ఖాద్రీల నేతృత్వంలో అకస్మాత్తుగా తిరుగుబాటు మొదలయింది. వారిరువురు నవాజ్ షరీఫ్ వెంటనే ప్రధాని పదవిలో నుండి దిగిపోవాలంటూ ప్రజలతో కలిసి పార్లమెంటును, ప్రధాని నివాసాన్ని ముట్టడించి ఆందోళన చేస్తున్నారు. అయితే అందుకు వారు చెపుతున్న కారణాలు వేరు. వారిరువురినీ పాకిస్తాన్ సైన్యంలో మత ఛాందసవాదులయిన సైనికాధికారులే నడిపిస్తున్నారనేది అందరికీ తెలిసిన బహిరంగ రహస్యం. అందుకే నేటికీ వారిరువురినీ పాక్ సైన్యం ఉపేక్షిస్తోంది. ప్రజాసమస్యలను సాకుగా చూపి పాకిస్తాన్ లో ప్రభుత్వాలను నేరుగానో లేదా ఈవిధంగా పరోక్షంగానో కూలద్రోయడం పాక్ సైన్యానికి అలవాటే.బహుశః ఇప్పుడు కూడా అదే జరుగుతోందని భావించవచ్చును.
అయితే ఇంత జరిగినా, జరుగుతున్నా పాకిస్తాన్ ప్రధాని భారత్ తో స్నేహ సంబంధాలు పునరుద్దరించుకోవాలని తాపత్రయపడటం చాలా మంచి ఆలోచనే. ఆయన రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి, ఉపరాష్ట్రపతి హమీద్ అన్సారీకి, ప్రధాని మోడీకి మరియు భారత విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ కు భారత్ లో తమ అధికారుల ద్వారా పాకిస్తాన్ లో సుప్రసిద్దమయిన సింద్రీ, చౌస రకం అత్యుత్తమ మామిడి పళ్ళను బహుమతిగా పంపించారు. తద్వారా భారత్ తో తిరిగి సత్సంబంధాలు నెలకొల్పుకోవాలనే తన బలమయిన కోరికను వ్యక్తం చేసారు. బహుశః మోడీ ప్రభుత్వం కూడా అందుకు సానుకూలంగా స్పందించవచ్చును. కానీ పాక్ ప్రభుత్వంపై పాక్ సైన్యం, మత ఛాందసవాదుల పెత్తనం కొనసాగుతున్నంత కాలం భారత్-పాక్ సంబంధాలు మూడడుగులు ముందుకీ మూడడుగులు వెనక్కీ సాగుతూ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోవచ్చును.