జగన్ బాధకు అద్దం పట్టిన కధనం
posted on Sep 20, 2014 @ 12:48PM
ఈరోజు ఒక ప్రముఖ తెలుగు దిన పత్రికలో చాలా ఆసక్తికరమయిన కధనం వచ్చింది. కాంగ్రెస్ పార్టీలో నెహ్రు-గాంధీ వంశ పారంపర్యపాలన కొనసాగించేందుకే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలలో అధిష్టానానికి అత్యంత విధేయులైన వారిని, కొన్నిసార్లు అసమర్ధులను ముఖ్యమంత్రులుగా నియమిస్తోందని చెపుతూ అందుకు కొన్ని ఉదాహరణలు పేర్కొంది. ఆ తరువాత మెల్లగా కధనాన్ని ఆంద్రప్రదేశ్ వైపు మళ్ళించి మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి పార్టీలో తిరుగులేని శక్తిగా ఎదిగి ఎవరూ ఊహించని విధంగా 2009ఎన్నికలలో విజయం సాధించిపెట్టేరో వివరించబడింది. ఆయన హటాన్మరణం తరువాత శాసన సభ్యులు అందరూ కూడా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని కోరినప్పటికీ, ఆయనకు అధికారం కట్టబెడితే ఎక్కడ తన ఉనికికి ప్రమాదం ఏర్పడుతుందో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం మొదట అసమర్దుడయిన రోశయ్యకు ఆ తరువాత ఎటువంటి అనుభవమూ లేని కిరణ్ కుమార్ రెడ్డికి అధికారం కట్టబెట్టారు. అందువలన ముఖ్యమంత్రి కావాలనుకొన్న జగన్మోహన్ రెడ్డికి తీరని అన్యాయం జరిగిపోయింది. ఎందుకంటే అనేకమంది శాసనసభ్యులు ఆయనే ముఖ్యమంత్రి కావాలని సంతకాలు చేసారు. అతని వంటి బలమయిన నేత ముఖ్యమంత్రి కాలేకపోవడం చేత రాష్ట్రం బలహీనపడింది. ఈవిధంగా రాష్ట్రాలను బలహీనపరిచి వాటిని సామంత రాజ్యాలుగా మలిచే ప్రయత్నం సమాఖ్య స్పూర్తికి ప్రమాదకరం అంటూ కధనం ముగించారు. ఈ కధనం ఏ పత్రికలో వచ్చి ఉంటుందో ఊహించడం పెద్ద కష్టం కాదు.
ఇక అసలు విషయంలోకి వస్తే ఇక్కడ ప్రస్తావించని అంశాలు కొన్ని ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీలో గాంధీ-నెహ్రు వంశపారంపర్య పాలన కొనసాగించడానికే ఇదంతా అని చెపుతున్నపుడు, ఇక్కడ రాష్ట్రంలో వైయస్స్ కుటుంబపాలన సాగడం చాలా అవసరమని ఏవిధంగా సమర్ధించుకొంటారు? నేటికీ వైకాపాలో వైయస్స్ భార్య విజయమ్మ, ఆయన కుమారుడు జగన్, ఆయన కుమార్తె షర్మిల ముగ్గురూ ప్రధాన పాత్ర పోషిస్తున్నపుడు కాంగ్రెస్ పార్టీలో వంశ పారంపర్య పాలనను వేలెత్తి చూపడం ఎందుకు? ఇక సుదీర్గ రాజకీయ, పరిపాలనానుభావం ఉన్న రోశయ్య, తీవ్ర అల్లకల్లోల పరిస్థితుల్లో రాష్ట్రాన్ని మూడేళ్ళు పాలించిన కిరణ్ కుమార్ రెడ్డిల కంటే జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా సమర్ధుడు? వారిరువురితో పోలిస్తే అతనికి ఎటువంటి అనుభవమూ లేదు కదా? అయినప్పటికీ వారు అసమర్ధులు, తను సమర్ధుడని ఏవిధంగా సమర్ధించుకొంటున్నారు?
రోశయ్య ముఖ్యమంత్రిగా రాణించలేకపోయి ఉండవచ్చును. కానీ ఆయన స్వర్గీయ రాజశేఖర్ రెడ్డి హయం వరకు కూడా గొప్ప ఆర్ధిక మంత్రిగా పేరు గడించిన సంగతి అందరికీ తెలుసు. అదేవిధంగా ఉదృతంగా సాగిన తెలంగాణా ఉద్యమాలు, ఆ తరువాత రాష్ట్ర విభజన, సమైక్యాంద్ర ఉద్యమాలు ఒకదాని తరువాత మరొకటి వరుసగా తరుముకొచ్చినప్పటికీ కిరణ్ కుమార్ రెడ్డి మూడేళ్ళు రాష్ట్రాన్ని పరిపాలించి తన సత్తా చాటుకొన్నారు. నిజానికి కాంగ్రెస్ అధిష్టానం ఆయన మాట విని ఉండి ఉంటే రాష్ట్రంలో మళ్ళీ కాంగ్రెస్ పార్టీయే అధికారంలోకి వచ్చి, ఆయనే మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యి ఉండేవారేమో కూడా. కానీ అలా జరగకపోవడంతో, ఆయనకు, పార్టీకి తీరని నష్టం జరిగిన సంగతి అందరికీ తెలుసు. అటువంటప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏవిధంగా వారిరువురి కంటే తను సమర్ధుడని భావిస్తున్నారు?
ఇక తనకు ముఖ్యమంత్రి పదవి దక్కకపోతే అది సమైక్య స్పూర్తికి విరుద్దం అని నేర్పుగా కలరింగ్ ఇవ్వడం కూడా హాస్యాస్పదం. నిజమే! కాంగ్రెస్ అధిష్టానం తనకు అత్యంత విధేయులు, నమ్మకస్తులనే రాష్ట్రాలలో ముఖ్యమంత్రులుగా నియమించుకొని వారిపై కర్ర పెత్తనం చేసింది. వైకాపాలోనే ఆయన నియంతృత్వ పోకడలు భరించలేక అనేకమంది సీనియర్లు ఆయనకు, పార్టీకి దణ్ణం పెట్టి బయటకు వెళ్ళిపోయిన సంగతి పెద్ద రహస్యం ఏమీ కాదు. అటువంటప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీలో లోపాలు ఎంచడం ఎందుకు?
జగన్మోహన్ రెడ్డి నిజంగా అంత సమర్ధుడు రాజకీయ దురంధుడు అయితే ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో ఎందుకు విజయం సాధించి ముఖ్యమంత్రి కాలేకపోయారు? తన అతివిశ్వాసమే కొంప ముంచిందని ఒకవైపు అంగీకరిస్తూనే మళ్ళీ చంద్రబాబును ఎందుకు నిందిస్తున్నట్లు? ఇలా ప్రశ్నించుకొంటూపోతే జవాబు దొరకని ప్రశ్నలు చాలానే వస్తాయి. అయితే అంతిమంగా చెప్పుకోవలసింది ఏమిటంటే ఈ కధనం కాంగ్రెస్ అధిష్టానాన్ని విమర్శిస్తున్నప్పటికీ, జగన్మోహన్ రెడ్డికి ముఖ్యమంత్రి పదవిపై ఎంత ఆరాటం ఉందో ఇది మరోసారి బయటపెట్టింది.