బీజేపీ హడావుడి అందుకేనా?
posted on Sep 18, 2014 @ 1:20PM
తెలంగాణా విమోచన దిన సందర్భంగా నిన్న తెలంగాణా బీజేపీ నేతలు గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేస్తామని చాలా హడావుడి చేసారు. కానీ పోలీసులు వారి ప్రయత్నాలను అడ్డుకొని అరెస్టు చేసిఅక్కడి నుండి తరలించారు. ఆ తరువాత షరా మామూలుగానే బీజేపీనేతలు ప్రెస్ మీట్ పెట్టి తెలంగాణా ప్రభుత్వం స్వయంగా అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం నిర్వహించకపోగా, అది చేస్తున్న తమను అడ్డుకొని అరెస్టులు చేయించారని ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు.
బీజేపీ కోరికను కాదనడానికి ఏమీ లేదు. నిజానికి ఇంతకు ముందు తెరాస నేతలే ఈ డిమాండ్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పుడు ఈ అంశంపై వారు పెదవి విప్పడం లేదు. అందుకు కారణాలు బీజేపీ తెలంగాణా అధ్యక్షుడు కిషన్ రెడ్డే చెపుతున్నారు. మజ్లిస్ పార్టీతో సత్సంబంధాలు నిలుపుకొనేందుకే తెరాస ప్రభుత్వం ఇందుకు వెనకాడుతోందని ఆరోపిస్తున్నారు. త్వరలో జీ.హెచ్.యం.సి. ఎన్నికలు జరగనున్నాయి కనుక అందులో గెలిచేందుకు మజ్లిస్ పార్టీ మద్దతు అవసరం ఉంటుందనే ఆలోచనతోనే తెరాస ప్రభుత్వం అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపేందుకు వెనుకాడిందని కిషన్ రెడ్డి ఆరోపించారు.
బహుశః ఆయన ఆరోపణలలో ఎంతో కొంత వాస్తవం ఉందని నమ్మవచ్చును. అయితే బీజేపీ నేతలు కూడా సరిగ్గా అదే కారణంతో అంటే రానున్న జీ.హెచ్.యం.సి. ఎన్నికలను దృష్టిలో పెట్టుకొనే ఇంత హడావుడి చేసారని తెరాస ఆరోపిస్తే దానికి బీజేపీ ఏమి సమాధానం చెపుతుందో?
అయితే గోల్కొండ కోటలో ఇదేవరకే ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను చాలా ఘనంగా నిర్వహించి, గోల్కొండ కోటపై జాతీయ జెండా ఎగురవేసిన సంగతి బీజేపీ నేతలు పట్టించు కోకుండా, ఇప్పుడు కోటపై జెండా ఎగురవేయాలనుకోవడం దేనికంటే బహుశః ప్రజల దృష్టిని ఆకర్షించేందుకేనని చెప్పక తప్పదు. నిజానికి వారు ఆపని చేయదలిస్తే ఇదివరకు తెలంగాణా ప్రభుత్వం గోల్కొండ కోటలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలను నిర్వహించేందుకు పురావస్తు శాఖ నుండి ఏవిధంగా అనుమతి తీసుకొని చేసిందో అదేవిధంగా బీజేపీ కూడా చేసి కోటపై జెండా ఎగురవేసి ఉండవచ్చును. కానీ బీజేపీ నేతల ఉద్దేశ్యం కోటపై జెండా ఎగురవేయడం కాక జెండా ఎగురవేయడానికి వెళుతున్న తమను తెలంగాణా ప్రభుత్వం అడ్డుకొందని ప్రజలకు చాటి చెప్పి వారి దృష్టిని ఆకర్షించడమే కనుక ఇంత హడావుడి చేసి ఉండవచ్చును.
కానీ ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, తెలంగాణా ప్రభుత్వం అధికారికంగా తెలంగాణా విమోచన దినోత్సవం జరిపినంత మాత్రాన్న ముస్లిం ప్రజలందరూ దానిని వ్యతిరేఖిస్తారా? చరిత్రలో జరిగిన కొన్ని ప్రధాన ఘటనలని స్మరించుకొనంత మాత్రాన్న ప్రజలలో వ్యతిరేఖత ఏర్పడుతుందనే ఆలోచనే ఒక అపోహగా చెప్పుకోవచ్చును. ఒకవేళ అదే నిజమయితే ముఖ్యమంత్రి కేసీఆర్ గోల్కొండ కోట మీద కేసీఆర్ మువ్వన్నెల జాతీయ జెండా ఎగురవేసినందుకు ముస్లిం ప్రజలు ఆయనకు దూరం అయ్యి ఉండేవారు. కానీ కాలేదు.
ఏ కులం, మతం, ప్రాంతానికి చెందిన ప్రజలయినా ప్రభుత్వాల పనితీరును చూసే అధికారం కట్టబెడతారు తప్ప ఇటువంటి కారణాలను చూసి కాదు. అయినప్పటికీ రాజకీయ పార్టీలు తమ అపోహల నుండి ఎన్నడూ బయట పడలేకపోతున్నాయి. అందుకు ఇదే ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చును.