రియల్ ‘హీరో’ కంభంపాటి!
posted on Sep 17, 2014 @ 6:08PM
ఆంధ్రప్రదేశ్‌లో అధికారం చేపట్టిన వంద రోజుల్లోనే చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పారిశ్రామికంగా ఒక అద్భుతమైన ఘనతను సాధించింది. ఆంధ్రప్రదేశ్‌లో హీరో మోటార్స్ కర్మాగారాన్ని ఏర్పాటు చేసేలా ఒప్పందాన్ని కుదుర్చుకుంది. సాధ్యమైనంత త్వరగా ఆంధ్రప్రదేశ్‌లో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి హీరో మోటార్స్ సంస్థ శరవేగంగా సన్నాహాలు చేస్తోంది. నిన్నమొన్నటి వరకు హీరో సంస్థ తెలంగాణ రాష్ట్రంలో పరిశ్రమను ఏర్పాటు చేయబోతోందని అందరూ అనుకున్నారు. ఎవ్వరూ ఊహించని విధంగా హీరో మోటార్స్ సంస్థ ఆంధ్రప్రదేశ్‌కి షిఫ్ట్ అయిపోవడం, ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకోవడం చకచకా జరిగిపోయాయి. రెండు రాష్ట్రాల్లోని పరిస్థితులను, పరిణామాలను గమనిస్తున్న వారిని ఈ ‘ట్విస్ట్’ ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సమర్థతకు జాతీయ స్థాయి నుంచి కూడా అభినందనలు అందేలా చేసింది. ఏపీ ప్రభుత్వం ఈ ఘనత సాధించడానికి కీలకంగా నిలిచిన వ్యక్తి, ఈ ఇష్యూలో రియల్ ‘హీరో’గా నిలిచిన వ్యక్తి మరెవరో కాదు... తెలుగుదేశం నాయకుడు కంభంపాటి రామ్మోహనరావు.
కంభంపాటి రామ్మోహనరావు తెలుగుదేశం పార్టీలో అత్యంత క్రమశిక్షణ కలిగిన కార్యకర్త. వివాదాలకు చాలా దూరంగా వుండే వ్యక్తి. తెలుగుదేశం నాయకత్వం మనసెరిగి ప్రవర్తిస్తూ, పార్టీ అభివృద్ధికి తనవంతు కృషి చేసిన నాయకుడు. కంభంపాటి సమర్థతను గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయనని ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ప్రతినిధిగా నియమించి ఆయన సేవలను అందుకుంటున్నారు. ఇటీవల కాశ్మీర్‌లో వరదలు సంభవించినప్పుడు ఆ వరదల్లో చిక్కుకున్న తెలుగు విద్యార్థులను సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ఆయన ఎంతో కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి చెందిన విద్యార్థులతోపాటు తెలంగాణకు చెందిన విద్యార్థులను కూడా అక్కడి నుంచి తీసుకువచ్చి తెలుగుదేశం పార్టీ తెలుగువారందరికీ అండగా వుంటుందనే విషయాన్ని మరోసారి చాటారు.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో హీరో పరిశ్రమ ఏర్పాటు కావడానికి కూడా కంభంపాటి రామ్మోహనరావే కీలకం అయ్యారు. కంభంపాటి గత 26 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్ డీలర్‌గా వ్యవహరిస్తున్నారు. సమర్థుడైన డీలర్‌గా హీరో సంస్థలో ఆయనకు మంచి పేరు వుంది. ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ పవన్‌కాంత్ ముంజాల్‌తో కూడా కంభంపాటికి సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో చంద్రబాబు సీఎంగా వున్న సమయంలో కంభంపాటి ఆయనను హీరో కర్మాగారాలకు తీసుకెళ్ళారు. ఏపీలో హీరో ప్రాజెక్టులను ఏర్పాటు చేయడానికి అప్పుడే ప్రయత్నాలు చేశారు. అయితే ఆ తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారం కోల్పోవడంతో ఆ ప్రయత్నాలకు కామా పడింది. ఇప్పుడు మళ్ళీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక కంభంపాటి రంగంలోకి దిగారు. హీరో సంస్థ దక్షిణాదిలో పరిశ్రమను ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు చేస్తోందని తెలియగానే అధికారులతోపాటు రంగంలోకి దిగిన కంభంపాటి తనకున్న పరిచయాలను ఉపయోగించి హీరో మోటర్స్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌కి వచ్చేలా చేశారు.
హీరో మోటార్స్‌కి దక్షిణాదిలో తొలి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటవుతుంది. ఈ పరిశ్రమ కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన దాదాపు పదివేల మందికి ఉపాధి లభించే అవకాశం వుంది. ఈ పరిశ్రమ వల్ల రాయలసీమ ప్రాంతంలో నిరుద్యోగ సమస్యకు విజయవంతంగా చెక్ పెట్టే అవకాశం వుంది. హీరో పరిశ్రమ దక్షిణాదిలో పరిశ్రమ ఏర్పాటు చేయడానికి మరో ఆరు నెలల సమయం తీసుకోవాలని భావించింది. అయితే కంభంపాటి చొరవతో అది ముందుగానే, అది కూడా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడం సాధ్యమైంది. ఒక మంచి పరిశ్రమ ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు కావడానికి కీలక వ్యక్తిగా నిలిచిన కంభంపాటిని తెలుగుదేశం పార్టీ వర్గాలు అభినందిస్తున్నాయి. రియల్ ‘హీరో’ అని అభినందిస్తున్నాయి. కంభంపాటి లాంటి చిత్తశుద్ధి కలిగిన వ్యక్తుల కృషి ఆంధ్రప్రదేశ్‌ని అనతికాలంలోనే అగ్రస్థానంలో నిలబెడుతుందన్న నమ్మకం అక్కడి ప్రజల్లో మరింత బలపడుతోంది.