తుఫాను మీద చిరంజీవి ముష్టి రాజకీయాలు
posted on Oct 15, 2014 @ 5:28PM
ముష్టి రాజకీయాలు అంటే ఎలా వుంటాయో తెలుసుకోవాలంటే మాజీ మెగాస్టార్, రాజకీయాల్లో దగాస్టార్ చిరంజీవి చేసే రాజకీయాలను చూసి తెలుసుకోవచ్చు. ఆయన ఆ తరహా రాజకీయాలు చేస్తారు కాబట్టే రాజకీయ రంగంలోకి వచ్చిన తర్వాత తెలుగు ప్రజల్లో వున్న ఆదరణ కోల్పోయి, ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ సమావేశాల్లో ఆటలో అరటి పండులాగా మాత్రమే మిగిలిపోయారు. సినిమా రంగంలో మెగాస్టార్ అయిన ఆయన రాజకీయంగా మాత్రం అట్టర్ ఫ్లాప్ అయి కూర్చున్నారు. ఎందుకంటే రాజకీయంగా ఆయన వ్యవహార శైలే అందుకు కారణం. ఆయన గారు రాజకీయ రంగప్రవేశం చేసినప్పటి నుంచి ఆయన ఏ పని చేసినా తెలుగు ప్రజలు నవ్వుకునేవిధంగానో, తిట్టుకునే విధంగానో వుంది తప్ప ‘‘చిరంజీవి భలే చేశాడు’’ అనుకునే విధంగా ఆయన రాజకీయంగా ఏనాడూ ప్రవర్తించలేదు. అది ఆయన రాజకీయ అసమర్థత అనడం ఎంత కరెక్టో.. తెలుగు ప్రజల దురదృష్టం అనడం కూడా అంతే కరెక్టు. అంతటి ప్రజాదరణ వున్న వ్యక్తి ఒక బలమైన రాజకీయ నాయకుడిలా మారి, ప్రజలకు అండగా నిలిచే నాయకుడిలా వుండాల్సింది. అయితే ఆయన నేలబారు రాజకీయాలు చేసే రాజకీయ నాయకుడిలా మిగిలిపోవడమే తెలుగు ప్రజల దురదృష్టం.
హుదుద్ తుఫాను పెను విపత్తులా మారి తెలుగు ప్రజలందరికీ ఆవేదన కలిగిస్తోంది. తుఫాను కారణంగా విలవిలలాడుతున్న ఉత్తరాంధ్ర ప్రజలను ఆదుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్విరామ కృషి చేస్తున్నారు. ఉత్తరాంధ్రను ఆదుకోవడానికి అనేకమంది ముందుకు వస్తున్నారు. ఈ నేపథ్యంలో అనేకమంది సినీ తారలు ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించిన తర్వాత చిరంజీవి తీరిగ్గా రంగంలోకి దిగి ఆయన కూడా 50 లక్షల విరాళాన్ని ప్రకటించారు. అది కూడా ప్రజలు ఆయన సినిమాలను ఆదరించి ఇచ్చిన వేలాది కోట్ల నుంచి కాకుండా తనకు ప్రభుత్వం ద్వారా వచ్చిన ఎంపీ లాడ్స్ నుంచి 50 లక్షల నుంచి విరాళాన్ని ఇచ్చారు. అంటే తన జేబులోంచి ఒక్క పైసా కూడా ఇవ్వలేదన్నమాట. సినిమా ఇండస్ట్రీలో చిన్న కమెడియన్‌గా వున్న వ్యక్తి కూడా తన జేబులోంచి డబ్బు తీసి ఇచ్చాడు. ‘మెగాస్టార్’ అని తనను తాను చెప్పుకునే చిరంజీవి మాత్రం తన జేబులోంచి డబ్బు తీసి ఇవ్వలేదు. పోనీ డబ్బు ఏదైనా డబ్బే.. ప్రజల డబ్బే ప్రజలకు ఇచ్చారని అనుకుని సరిపెట్టుకోవచ్చు. కానీ విరాళాన్ని ప్రకటిస్తూ ఆయన మీడియాకు విడుదల చేసిన లేఖని చూస్తేనే ఆయన ఎంత దిగజారుడు రాజకీయాలు నడుపుతున్నారో అర్థమవుతోంది.
చిరంజీవి తాను రాసిన లేఖలో తుఫానుకు సంబంధించి అందరికీ తెలిసిన విషయాలే మరోసారి ఉల్లేఖించారు. అక్కడితో ఆగితే బాగుండేది. తుఫాను బాధిత ప్రాంతాలను సందర్శించిన ప్రధానమంత్రి నరేంద్రమోడీ కేవలం 1000 కోట్లు మాత్రమే ఆర్థిక సహాయంగా ప్రకటించడం చిరంజీవికి ఆశ్చర్యాన్ని కలిగించిందట. అలాగే ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించకపోవడం కూడా చిరంజీవిని ఆశ్చర్యానికి గురిచేసిందట. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం మీదే బాధ్యత వుందట. అయినా విశాఖ పట్టణం కోలుకునే వరకూ తాను అండగా వుంటానని ప్రధాని నరేంద్రమోడీ ప్రకటించిన విషయం చిరంజీవికి తెలియదా.. ఉత్తరాంధ్రను ఆదుకునే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి చిరంజీవికి కనిపించడం లేదా. చిరంజీవి రాసిన లేఖ ఏదో ఎందుకూ పనికిరాని రాజకీయాలు చేసే విధంగా వుంది తప్ప... ప్రజలను ఆదుకోవడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న కృషికి నైతికంగా మద్దతు ఇచ్చేవిధంగా ఎంతమాత్రం లేదు.
తన లేఖలో భారీ స్థాయిలో వాపోవడాలు, ఆశ్చర్యపోవడాలు చేసిన చిరంజీవి అదే లేఖలో మరెంతో కామెడీ అంశాలు కూడా రాశారు. వాటిని చదివి నవ్వాలో ఏడవాలో అర్థంకాని పరిస్థితి. ఇంత ఆశ్చర్యపోతున్న పెద్దమనిషి విపత్తులో వున్న ఉత్తరాంధ్ర ప్రజలను పరామర్శించడానికి ఇప్పుడు వెళ్ళరట. ఈనెల 19, 20 తేదీలలో కాంగ్రెస్ జాతీయ నాయకులతో కలసి ఉత్తరాంధ్రలో పర్యటిస్తారట. అప్పటికి ఉత్తరాంధ్ర మొత్తం తుఫాను తెచ్చిన విలయం నుంచి తేరుకుని తన జీవన గమనంలో తాను వుంటుంది. అప్పుడు వెళ్ళి ఈ పెద్దమనిషి ఎవరి కన్నీరు తుడుస్తారోమరి. అందరూ అన్ని రకాలుగా పరిస్థితిని చక్కదిద్దిన తర్వాత ఈయన తీరిగ్గా మేకప్ వేసుకుని వెళ్ళి అక్కడ స్పీచ్‌లు ఇస్తారన్నమాట. ఇలాంటి చర్యలే చిరంజీవి రాజకీయంగా ఎందుకు ఎదగలేపోయారో చెప్పకనే చెబుతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రానికి ముప్పుగా పరిణమించింది హుదుద్ లాంటి తుఫాను కాదు.. చిరంజీవి లాంటి బాధ్యత లేని రాజకీయ నాయకులు.