టీడీపీ - బీజేపీ... మిత్రభేదం మొదలవుతుందా?
posted on Oct 20, 2014 @ 12:46PM
ఎంకిపెళ్ళి సుబ్బి చావుకొచ్చిందనే సామెత చాలామందికి తెలిసే వుంటుంది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో టీడీపీ, బీజేపీ మధ్యన వున్న స్నేహం ఆ సామెత మాదిరిగానే తయారయ్యేట్టుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో బీజేపీ విజయం సాధించింది. హర్యానాలో ప్రభుత్వ ఏర్పాటుకు పూర్తి మెజారిటీని సంపాదించింది. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన మెజారిటీకీ కొన్ని సీట్లు తక్కువ వున్నప్పటికీ అక్కడ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేది బీజేపీనే. ఇలా చాలా తక్కువ వ్యవధిలోనే కేంద్రంతోపాటు పలు రాష్ట్రాల్లో కూడా బీజేపీ అధికారం సొంతం చేసుకుంది. తాజాగా మహారాష్ట్ర, హర్యానాల్లో అయితే ఏపార్టీలో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసి విజయం సాధించింది. ఇలా ఆ రెండు రాష్ట్రాల్లో ఒంటరిగా సాధించిన విజయాలు బీజేపీ నాయకత్వంతో కొత్త ఆలోచనలకు ప్రాణం పోసింది. ఆంధ్రప్రదేశ్‌లో కూడా అదే విధానాన్ని అనుసరిస్తే ఓ పనైపోతుంది కదా అన్న ఆలోచన మొదలైంది.
గత ఎన్నికలలో భారతీయ జనతాపార్టీ తెలుగుదేశం పార్టీలో కలసి ఎన్నికలలో పోటీ చేసింది. అటు ఆంధ్రప్రదేశ్‌లో ఇటు తెలంగాణలో బీజేపీ కొద్ది సీట్లు మాత్రమే సాధించి సరిపెట్టుకుంది. తెలుగుదేశం పార్టీతో కలసి పోటీ చేయడం వల్లనే రెండు రాష్ట్రాల్లోనూ ‘సరిపెట్టుకునే స్థితి’లో బీజేపీ వుందని, ఇక్కడ కూడా ఒంటరిగా పోటీ చేస్తే ఆ పరిస్థితే వేరుగా వుండేదన్న అభిప్రాయాలు ఇక్కడి బీజేపీ నాయకత్వంలో వుంది. ముఖ్యంగా మొన్నటి వరకూ ఆంధ్రప్రదేశ్ బీజేపీ అధ్యక్షుడిగా వుండి, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కిషన్‌రెడ్డికి మొదటి నుంచీ తెలుగుదేశం పార్టీతో బీజేపీ పొత్తు కుదుర్చుకోవడం ఎంతమాత్రం ఇష్టంలేదు. ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకుండా చేయాలని ఆయన శాయశక్తులా ప్రయత్నించి విఫలమయ్యారు. ఇప్పుడు భారతీయ జనతాపార్టీ ఒంటరి పోరులో రెండు రాష్ట్రాలను కైవసం చేసుకోవడంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో కూడా ఒంటరిగానే రాజకీయ ప్రస్థానం చేస్తే మంచిదన్న ఉద్దేశాన్ని కిషన్ రెడ్డి కేంద్ర నాయకత్వానికి ఇంజెక్ట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోతున్న హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికలలో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తే బాగుంటుందన్న అభిప్రాయంలో వున్న కిషన్ రెడ్డి ఆ విషయాన్నే పార్టీ కేంద్ర నాయకత్వానికి చెప్పినట్టు తెలుస్తోంది.
ఈ పరిణామాలు తెలుగుదేశం పార్టీకి కొత్త తలనొప్పి తెచ్చే అవకాశాలు ఉన్నాయని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో వున్న తెలుగుదేశం పార్టీకి కేంద్ర ప్రభుత్వం నుంచి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందడానికి ప్రధాన కారణం టీడీపీ - బీజేపీ మధ్య సయోధ్య ఉండటమేనన్న అభిప్రాయాలు వున్నాయి. ఇప్పుడుగనుక బీజేపీ భవిష్యత్తులో ఒంటరి ప్రయాణం చేసే ఉద్దేశంతో రాజకీయంగా పావులు కదపడం మొదలుపెట్టిందంటే అది రెండు పార్టీల మధ్య వున్న సుహృద్భావ వాతావరణాన్ని దెబ్బతీసే అవకాశం వుంది. ఇప్పటి వరకూ బీజేపీతో ఉన్న స్నేహపూర్వక సంబంధ బాంధవ్యాలు చెడిపోయే ప్రమాదం వుంది. ప్రభుత్వానికి మరో ప్రతిపక్షాన్ని ఎదుర్కోవలసి కూడా వుంటుంది. అటువైపు తెలంగాణ రాష్ట్రంలో కూడా బీజేపీ సొంతగా బలాన్ని పెంచుకునే ప్రయత్నాలు ముమ్మరం చేస్తే, భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రభుత్వాన్ని స్థాపించాలన్న టీడీపీ కలలకు గండిపడే ప్రమాదం వుంది. ఈ విధంగా మోడీ, బీజేపీ హవా పుణ్యమా అని తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తులో కొత్త సమస్యలు వచ్చే అవకాశం వుందని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.ఇప్పటి వరకూ బీజేపీ వల్ల మిత్రలాభం పొందిన టీడీపీ ఇక ముందు మిత్రభేదాన్ని కూడా ఎదుర్కోవలసి వుండొచ్చని అంటున్నారు.