కృష్ణమ్మ ఒడ్డున సింగపూరు కడితే, హుస్సేన్ సాగర్ పక్కన పెట్రోనాస్ కట్టాల్సిందే
posted on Nov 13, 2014 @ 2:50PM
ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హైదరాబాదుకి ధీటుగా అంతర్జాతీయ స్థాయిలో ఒక గొప్ప రాజధాని నిర్మిస్తానని చెప్పడమే కాకుండా ఆ దిశలో అప్పుడే చురుకుగా అడుగులు వేస్తున్నారు కూడా. కేంద్రం కూడా అందుకు సహాయం అందించేందుకు సిద్దంగా ఉంది. ఆ కేంద్రంపై ఒత్తిడి తెచ్చి నిధులు విడుదల చేయించేందుకు ఆయనకు ముగ్గురు మంత్రులు కూడా డిల్లీలో ఉన్నారు. ఇదివరకు హై టెక్ సిటీ నిర్మించి చూపిన ఆయన ఇప్పుడు ఈ అత్యంత ఆధునికమయిన సుందర రాజధానిని తప్పకుండా నిర్మిస్తారని ప్రజలు కూడా గట్టిగా విశ్వసిస్తున్నారు. రాష్ట్రానికి రాజధాని లేదు కనుక తప్పని సరి పరిస్థితుల్లో కొత్త రాజధానిని నిర్మించవలసి వస్తోంది. కనుకనే చంద్రబాబు ఆ పనిలో పడ్డారు.
ఆయనకు ఎందులోనూ తీసిపోకూడదనే ఆలోచనో లేకపోతే ప్రజల దృష్టి విద్యుత్ సమస్యలపై మళ్ళించేందుకో తెలియదు కానీ, తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కి కూడా హుస్సేన్ సాగర్ ను మంచి నీటి చెరువుగా మార్చి దాని చుట్టూ ఆకాశ హర్మ్యాలు నిర్మించాలని డిసైడ్ అయిపోయారు. రాజుగారు తలుచుకొంటే కొరడా దెబ్బలకు కరువా? అన్నట్లు ఆయన వెంటనే అధికారులను సమావేశపరిచి, దీనినేవిధంగా వర్కవుట్ చేయాలో చూడమని ఆదేశించారు. హుస్సేన్ సాగర్ చుట్టూ ఉన్న మురికివాడలలో ప్రజలను అందరినీ ఖాళీ చేయించి, కొత్తగా తన ప్రభుత్వం కట్టబోయే ఆ ‘పెట్రోనాస్ టవర్స్’ లలోకి మార్చేద్దామని ఆయన ప్రతిపాదించారుట. కలల ప్రపంచంలో జీవిస్తున్న కేసీఆర్, ప్రజలని వారి కష్టాల నుండి మరిపించేందుకే వారిని కూడా తన కొత్త బంగారి లోకంలోకి తీసుకుపోయే ప్రయత్నం చేస్తున్నారేమో?
ఆయన రాష్ట్ర బడ్జెట్ ను లక్ష కోట్లయితే చాలా వీజీగా దాటించేయగలిగారు, కానీ దానిలో పేర్కొన్న వివిధ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేయడానికి తన వద్ద అంత సొమ్ము లేదని, కేంద్రం నియమనిబంధనలు సడలించి తన ప్రభుత్వానికి అనుమతిస్తే బ్యాంకుల నుండి అప్పులు తెచ్చుకొని ‘పని కానిచ్చేస్తామని’ ఆయనే స్వయంగా శాసనసభలో చెపుతున్నప్పుడు, లక్షల కోట్లు ఖర్చయ్యే పెట్రోనాస్ టవర్లు ఒకటో రెండో డజన్లు ఒకేసారి నిర్మించేద్దామనుకోవడం చాలా గొప్ప విషయమే.
ఈ ఐదేళ్ళలో ఆయన ట్యాంక్ బ్యాండ్ చుట్టూ పెట్రోనాస్ టవర్లు నిర్మించినా నిర్మించలేకపోయినా, దానిలో పేరుకు పోయిన మురుగు నీటిని మాత్రం తప్పకుండా ఖాళీ చేయించగలరని ఖచ్చితంగా చెప్పవచ్చును. ఎందుకంటే దానికి పెద్దగా ఖర్చవదు కనుక. ఒకవేళ ఆయన ఆ ఒక్కపని పూర్తిచేసినా చాలు హైదరాబాద్ ప్రజలు చాలా మెచ్చుకొంటారు.
ప్రస్తుతం రాష్ట్రంలో తీవ్ర విద్యుత్ సంక్షోభం నెలకొని ఉంది. దానిని అధిగమించడానికి ఇరుగుపొరుగు రాష్ట్రాల నుండి వేలు,లక్షల కోట్లు వెచ్చించి విద్యుత్ కొనుగోలు చేయవలసి ఉంది. అదేసమయంలో లక్షల కోట్లు వ్యయం అయ్యే తన హామీలను కూడా అమలు చేయాల్సి ఉంది. కానీ ఆయన ఇవి సరిపోవన్నట్లు హటాత్తుగా ఈ పెట్రోనాస్ టవర్లు కట్టేయాలని ఎందుకు భావిస్తున్నారు? వాటికి లక్షల కోట్ల నిధులు ఏవిధంగా సమకూర్చుకొంటారు? రైతు సమస్యలను పక్కన బెట్టి గాల్లో మేడలు కడతామంటే ప్రజలు ఏమనుకొంటారు? వంటి ప్రశ్నలకు ఆయన సమాధానాలు సిద్దం చేసుకోవలసి ఉంటుంది. ఒకవైపు నిత్యం రైతన్నలు ఆత్మహత్యలు చేసుకొంటుంటే ఆయన ఆకాశానికి నిచ్చెనలు వేయాలనుకోవడం ఇటువంటి విమర్శాలకే దారి తీస్తుంది.
అయితే ఆయన తలబెట్టిన చెరువుల పునరుద్దరణ కార్యక్రమానికి రాష్ట్ర ప్రజల నుండే కాదు, ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల నుండి కూడా మంచి స్పందన వస్తోంది. ఎందుకంటే ఆ పని చేయడానికి ఈవిధంగా ఆకాశానికి నిచ్చెనలు వేయనవసరం లేదు. పైగా దాని వలన రైతాంగానికి తక్షణమే ప్రయోజనం చేకూరుతుంది. తెలంగాణతో పోలిస్తే ఆంధ్రాలో పాడి పంటలకు పెద్ద ఇబ్బందులు ఏవీ లేవు. కనుక చంద్రబాబు నాయుడు తన రాష్ట్రానికి ముందు ఏది అవసరమో అది చేస్తున్నారు. అదేవిధంగా కేసీఆర్ కూడా తన రాష్ట్రానికి ఏది అవసరమో దానికే ప్రాదాన్యాత నిస్తే అందరూ హర్షిస్తారు.