రాష్ట్రంలోనే కాదు సభలో కూడా ఎదురు ఉండకూడదంటే ఎలా?
posted on Nov 14, 2014 6:48AM
తెలంగాణా అసెంబ్లీ వ్యవహారాల శాఖా మంత్రి హరీష్ రావు అవసరమయితే తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసయినా సరే సభను నిర్వహిస్తామని మొన్న హెచ్చరించారు. చెప్పినట్లే అన్నంత పనీ చేసి చూపించారు కూడా. సభ సజావుగా సాగనీయకుండా అడ్డుపడుతున్నారంటూ పదిమంది తెదేపా సభ్యులను ఏకంగా వారం రోజుల పాటు సభ నుండి సస్పెండ్ చేయించారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావు సభలో మాట్లాడుతూ ప్రతిపక్ష సభ్యులు నోటికి ఎంతవస్తేంతా మాట్లాడితే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. తమ యంపీ కవితపై నిరాధారమయిన ఆరోపణలు చేసినందుకు రేవంత్ రెడ్డి సభలో క్షమాపణలు చెప్పవలసిందే అంటూ పట్టుబట్టారు. కానీ రేవంత్ రెడ్డి అందుకు అంగీకరించలేదు. బహుశః అందుకే తెదేపా సభ్యులందరినీ సభా కార్యక్రమాలకు అడ్డు తగులుతున్నారని సభ నుండి సస్పెండ్ చేయించినట్లు కనిపిస్తోంది.
రేవంత్ రెడ్డి తప్పుగా మాట్లాడినట్లు భావిస్తే ఆయన ఒక్కరిని సభ నుండి సస్పెండ్ చేసి ఉంటే సరిపోయేది. కానీ ఆ మిషతో మొత్తం తెదేపా సభ్యులు అందరినీ సభ నుండి వారం రోజుల పాటు సస్పెండ్ చేయడం చాలా అప్రజాస్వామిక చర్య. తెలంగాణా రాష్ట్రంలో తమ పార్టీకి అసలు వేరే పార్టీ నుండి పోటీయే ఉండకూడదని భావించే తెరాస అధినేత కేసీఆర్, శాసన సభలో కూడా తమకు ఎవరు ఎదురు చెప్పకూడదు. తమ తప్పులు ఎత్తి చూపుతూ తమను విమర్శించ రాదు. తమను ప్రశ్నించకూడదు...అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. అందుకే తమను సభలో గట్టిగా నిలదీస్తున్న తెదేపా సభ్యులను సభ నుండి సస్పెండ్ చేసి చేతులు దులుపుకొన్నారు.
తెరాస చర్యలను సభలో మిగిలిన కాంగ్రెస్, బీజేపీ సభ్యులు తీవ్రంగా తప్పుపట్టారు. ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ ఏదో ఒక సాకుతో సభ నుండి సస్పెండ్ చేసుకొంటూపోతే చివరికి సభలో అధికార పక్ష సభ్యులే మిగులుతారని కాంగ్రెస్ సభ్యుడు కె జానారెడ్డి ఎద్దేవా చేసారు. నిజానికి తెరాస కూడా అదే మేలని భావిస్తుండవచ్చు. కానయితే ఆ విషయం బహిరంగంగా చెప్పడం మంచిది కాదని ఊరుకొని ఉండవచ్చును. అంతే. సభలో బీజేపీ సభ్యులు కూడా తెరాస ప్రభుత్వాన్ని కడిగి పడేస్తున్నారు కనుక, బహుశః నేడో రేపో వారిని కూడా సభ నుండి సస్పెండ్ చేసి బయటకు పంపివేస్తారేమో! ఒకవేళ తెరాస నేతలు శాసనసభలో ప్రతిపక్ష సభ్యుల గొంతు వినబడకూడదని భావిస్తున్నట్లయితే ఈ సభా సమావేశాలు నిర్వహించడమే అనవసరం. కానీ అది మన దేశంలో వీలుపడదు కనుకనే నిర్వహించవలసి వస్తోంది.
ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రధాన ప్రతిపక్షమయిన వైకాపా సభ్యులు, దాని అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని చాలా గట్టిగా నిలదీస్తున్నప్పటికీ, అధికార పార్టీ సభ్యులు వారికి ధీటుగా సమాధానాలు చెపుతూ ప్రతివిమర్శలు చేస్తున్నారు తప్ప ఈవిధంగా ప్రతిపక్ష సభ్యులందరినీ సభ నుండి బయటకి పంపేసి సభలో తమ మాటకు ఎదురులేకుండా చేసుకోవాలని ప్రయత్నించలేదు.
నియంతృత్వ పోకడలకు ప్రజాస్వామ్యంలో తావు లేదు. ఒకవేళ అటువంటి లక్షణాలు కనబరిస్తే దానిని చక్క దిద్దగల సమర్ధత మన రాజ్యాంగ వ్యవస్థలకు ఉంది కనుకనే నేటికీ మనదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థ బలంగా నిలబడి ఉంది. అధికారంలో ఉన్నవారికి సహనం చాలా అవసరం. అది లేకపోతే ప్రజల ముందు తామే అభాసుపాలవుతామని తెరాస నేతలు గ్రహిస్తే మంచిదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.