తెరాసకి మజ్లిస్ తలాక్ చెప్పబోతోందా?
posted on Dec 22, 2014 @ 12:00PM
బ్రిటిష్ వాడు నేర్పిన ‘విభజించి పాలించు’ అనే ఐడియా వాడికి గుర్తుందో లేదో తెలియదు కానీ మనోళ్ళు మాత్రం దానిని ఔపోసన పట్టేసారని చెప్పవచ్చును. అయితే ఒక్కోసారి అది రాష్ట్ర విభజన వ్యవహారంలా ఎదురు తంతుంటుంది. అయినా దాని మీద మనోళ్ళకి ఉన్న మోజు అంతా ఇంతా కాదు. రాష్ట్ర విభజనతో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని భావిస్తే తెరాస వచ్చేసింది. అయితే తెరాస తెలంగాణా రాష్ట్రాన్ని ఏలేస్తున్నప్పటికీ, రాజధాని హైదరబాద్ పై అందునా జి.హెచ్.యం.సి.పై తమ పార్టీకి బొత్తిగా పట్టులేకపోవడం కొంచెం బాధగానే ఉంటుంది. అందుకే జి.హెచ్.యం.సి. పరిధిలో ఓట్లన్నిటికీ పూర్తి పేటెంట్ హక్కులు ఉన్నాయని భావిస్తున్న తలసాని శ్రీనివాస్ యాదవ్ మంత్రివర్గంలోకి వచ్చి పడ్డారు, మజ్లిస్ పార్టీతో తెరాసకి దోస్తీ కుదిరింది.
అయితే అంతమాత్రాన్న జి.హెచ్.యం.సి.లో తెరాస పాగా వేసేస్తుందనే గ్యారంటీ లేదు. కనుక తన ప్రత్యర్ధులను బలహీనపరచాలంటే వారు బలంగా ఉన్న వార్డులను రెండు ముక్కలుగానో వీలయితే మూడు ముక్కలుగానో విభజించడమే మంచి పద్ధతని తెరాస భావిస్తుండటంతో ప్రస్తుతం 155 వార్డులను 175 గా పునర్విభజన చేసేందుకు సిద్దమవుతోంది. అందులో మళ్ళీ మహిళలకు 50శాతం కోటా, యస్సీ, ఎస్టీ, బీసీలకు వేర్వేరుగా కోటాలు షరా మామూలే. ఇటువంటివి జీర్ణించుకోవడం ప్రత్యర్ధ పార్టీలకు వీలవుతుందేమో కానీ కేవలం ముస్లిం ప్రజల ఓట్ల మీదనే ఆధారపడిన మజ్లిస్ పార్టీకి చాలా నష్టం కలిగించవచ్చును. అందుకే అది తెరాసపై గుర్రుగా ఉందిపుడు.
ఈ వార్డుల పునర్విభజన, ఆ వంకతో ఎన్నికలు వాయిదా వేసుకొంటూపోవడం ఆ పార్టీకి చాలా కోపం తెప్పిస్తోంది. 155 మంది సభ్యులున్న జి..హెచ్.యం.సి. బోర్డు డిశంబర్ మూడున రద్దయిపోయింది. కనుక తెలంగాణా ప్రభుత్వం జి.హెచ్.యం.సి. కమీషనర్ సోమేశ్ కుమార్ కి ఆ బాధ్యతలు అప్పగించింది. అంటే ఆయన ద్వారా పరోక్షంగా తను అధికారం చెప్పట్టిందని అర్ధమవుతోంది. జి.హెచ్.యం.సి. రద్దయిన తరువాత ఆరు నెలలోగా మళ్ళీ ఎన్నికలు నిర్వహించే వెసులుబాటు ఉంది కనుక ప్రభుత్వం కూడా ఏమీ తొందరపడటం లేదు. అయితే అంతవరకు మజ్లిస్ పార్టీ నేతలు నిరుద్యోగులుగా మిగిలిపోతారు. కనుక మజ్లిస్ పార్టీ నాయకుడు అక్బరుద్దీన్ ఓవైసీ తక్షణమే జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరపాలని గట్టిగా పట్టుబడుతున్నారు.
ఎన్నికలు ఆలశ్యం జరుగుతున్న కొద్దీ తెదేపా-బీజేపీలు, కాంగ్రెస్, తెరాస పార్టీలు అన్నీ క్రమంగా బలపడితే అసలుకే ఎసరు వస్తుందని మజ్లిస్ బెంగపెట్టుకొంది. అయితే ఆ మాట పైకి చెప్పకుండా జి.హెచ్.యం.సి. ఎన్నికలు జరిగి మళ్ళీ కొత్త సభ్యులు బాధ్యతలు చెప్పట్టేవరకు కేంద్రం నుండి జి.హెచ్.యం.సి.కి రావలసిన నిధుల విడుదల ఆగిపోతుందని, అసలే ఆర్ధిక ఇబ్బందులలో ఉన్న జి.హెచ్.యం.సి. ఇంకా కష్టాలలోకి కూరుకు పోతుందని మజ్లిస్ నేతలు వాదిస్తున్నారు.
కానీ, నిన్నమొన్ననే తలసానిని పార్టీలోకి రప్పించుకొన్న తెరాస, వెంటనే ఎన్నికలు నిర్వహించినా గెలవడం కష్టమని భావిస్తున్నందున ముందుగా జి.హెచ్.యం.సి. పరిధిలో పార్టీ కొంత బలపడిన తరువాత అప్పుడు నిర్వహించడం మేలనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అందువలన మజ్లిస్ పార్టీని కుష్ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ మెట్రో రైల్ అలైన్ మెంటులో మార్పులు చేర్పులు చేసి చూసారు. కానీ ఆ తరువాత కేసీఆర్ ఆర్భాటంగా ప్రకటించిన నగరంలో పేదలకు 125 గజాల స్థలం ఉచితంగా క్రమబద్దీకరణ పట్ల మజ్లిస్ నేతలు గుర్రుగా ఉన్నారు.
మజ్లిస్ పార్టీతో దోస్తీ అంటూనే తెరాస తమను పట్టించుకోవడం లేదని, పైగా తమకే ఎసరు పెట్టే ప్రయత్నాలు చేస్తోందని వారు వాపోతున్నారు. తమను సంప్రదించకుండా వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించిన వారికి భూములు క్రమబద్దీకరిస్తామని చెప్పడాన్ని మజ్లీస్ నేతలు తప్పుపడుతున్నారు. వారి బాధ ఎలా ఉన్నప్పటికీ, జి..హెచ్.యం.సి.పై పూర్తి పట్టు సాధించడమే ధ్యేయంగా తెరాస అడుగులు వేస్తోంది. అందువలన ఏదో ఆనాడు మజ్లీస్ పార్టీ తెరాసకు తలాక్ తలాక్ తలాక్ చెప్పేసి మళ్ళీ కాంగ్రెస్ చెయ్యందుకొన్నా ఆశ్చర్యం లేదు.