కొప్పులు పట్టుకొంటున్న తెరాస నేతలు
posted on Dec 15, 2014 7:02AM
ఎన్నికలలో టికెట్స్ కేటాయింపు, మంత్రివర్గ విస్తరణ ఏ రాజకీయపార్టీకయినా అగ్ని పరీక్షల వంటివే. వాటికి ముందు ఒక రకమయిన పరిస్థితి తరువాత పూర్తిగా విభిన్నమయిన పరిస్థితులు ఉంటాయి. ముందు పార్టీ అధిష్టానాల చుట్టూ ఆ పార్టీ నేతలు తిరిగితే, ఆ తరువాత పార్టీ అధిష్టానాలు అసమ్మతి రాగాలు ఆలపించే వారి చుట్టూ తిరగడం పరిపాటి. అందుకే ఈ రెండు పనులు కత్తి మీద సాము వంటివేనని చెప్పక తప్పదు. రేపు మంత్రి వర్గ విస్తరణకు పూనుకొన్న తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా సరిగ్గా ఇటువంటి పరిస్థితే ఎదుర్కొంటున్నారు.
ఆయనకు అత్యంత సన్నిహితుడు, విశ్వసనీయ అనుచరుడు అని పేరు పొందిన కొప్పుల ఈశ్వర్ కు మొదట్లోనే ఉపముఖ్యమంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. ఆయన కరీం నగర్ జిల్లా ధర్మపురి నియోజకవర్గం నుండి మూడు సార్లు యం.యల్యే.గా పోటీ చేసి గెలిచారు. కానీ కనీసం మంత్రి పదవి కూడా దక్కలేదు. కనీసం ఈసారయినా తప్పకుండా మంత్రి పదవి ఇస్తారని ఆయన, ఆయన అనుచరులు కూడా ఆశించారు. కానీ ఈసారి కూడా వేరే వాళ్ళందరికీ మంత్రి పదవులు ఇచ్చి ఆయనకు మాత్రం చీఫ్ విప్ పదవి ఇవ్వజూపితే ఆయన నిరాకరించినట్లు తెలుస్తోంది.
ఆయన అనుచరులయితే అప్పుడే కరీంనగర్ జిల్లాలో ధర్నాలు, రాస్తారోకోలు అంటూ వీరంగం అడేస్తున్నారు కూడా. మూడు సార్లు వరుసగా యం.యల్యే.గా గెలిచి, కేసీఆర్ ఆదేశానుసారం రెండు సార్లు తన యం.యల్యే. పదవికి రాజీనామాలు చేసిన తమ నాయకుడు కొప్పులకుమంత్రి పదవి ఈయకుండా నిన్నగాక మొన్న పార్టీలో చేరిన వారికి, మొట్టమొదటిసారిగా యం.యల్యే.గా ఎన్నికయిన వారికీ మంత్రిపదవులు ఇస్తున్నందుకు ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నాయకుడికి మంత్రి పదవి ఇవ్వకపోతే ముఖ్యమంత్రి కార్యాలయం ముందే తాము ధర్నాలు చేసేందుకు కూడా వెనుకాడబోమని మీడియా ముఖంగానే వారు ముఖ్యమంత్రి కేసీఆర్ కి బహిరంగ హెచ్చరికలు చేస్తున్నారు. అది వారు చేస్తున్న హెచ్చరికలు కావు వారి ద్వారా కొప్పులే స్వయంగా చేస్తున్న హేచ్చారికలుగా భావించవలసి ఉంటుంది.
ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఇంకా24 గంటలు సమయం ఉన్నందున ఈలోగా అటు ముఖ్యమంత్రి కేసీఆర్, ఇటు కొప్పుల వర్గీయులు తాము అనుకొన్నది సాధించేందుకు సామదానబేధ దండోపాయలన్నీ ప్రయోగించడం తధ్యం. ఒకవేళ ముఖ్యమంత్రి కొప్పులను వెనక్కి తగ్గేలా ఒప్పించగలిగితే, తాత్కాలికంగా మంటలు ఆర్పివేసినా లోలోన నిప్పు రాజుకొంటూనే ఉంటుంది.
ఒకవేళ కొప్పుల ముఖ్యమంత్రిపై ఒత్తిడి తెచ్చి మంత్రి పదవి దక్కించుకోగలగితే, ఆయన వలన వేరేవారి నోటికాడ కూడు లాకోన్నట్లవుతుంది కనుక అప్పుడు సదరు నేత ఇంతకంటే తీవ్ర స్థాయిలో అసమ్మతి రాగం ఆలపించే అవకాశం ఉంది. అయితే ఎవరు ఎన్ని కుప్పి గంతులు వేసినప్పటికీ ప్రస్తుతం అధికార పార్టీని వీడి బయటకు వెళ్ళే దుస్సాహసం ఎవరూ చేయబోరు కనుక ఈ అలకలు, అసమ్మతి రాగాలు కూడా క్రమంగా తగ్గుముఖం పట్టక తప్పదు. మన రాజకీయ పార్టీల చరిత్రలను తిరగేస్తే ఆ సంగతి అర్ధమవుతుంది.