రోజూ చెమట పట్టనివారికి… ముచ్చెమటలు తప్పటం లేదు!
ఒకప్పుడు మన దేశంలో ఊహించటానికి కూడా వీలు లేని చర్చలు ఇప్పుడు జరుగుతున్నాయి. అలాంటి వాటిల్లో అత్యంత ఆందోళకర అంశం… అధిక బరువు! భారత్ వేల సంవత్సరాలుగా వ్యవసాయ ప్రధాన దేశం. మన దగ్గర పోతన లాంటి కవీశ్వరులు కూడా నాగలి పట్టి దున్నారు. సీతమ్మ వారు జనకుడికి పొలం దున్నుతుంటేనే లభించింది! ఇక శ్రీకృష్ణుడి అన్న బలరాముడికి ఆయుధం… నాగలి. అంతగా వ్యవసాయం మన సంస్కృతిలో భాగంగా వుండేది. రాజుల నుంచి పేదల దాకా అందరూ మట్టిలో , బురదలో శ్రమించి పని చేసేవారు! బహుశా అందుకేనేమో గతంలో ఎప్పుడూ మన దగ్గర అధిక బరువు ఒక సమస్యగా మారలేదు. ఎవరో కొందరు స్థూల కాయులు ఎప్పుడూ వున్నప్పటికీ సమాజం మొత్తం తల పట్టుకుని కూర్చునేలా అందరికందరూ లావైపోవటం ఎప్పుడూ జరగలేదు! కాని, ఇప్పుడు అదే జరుగుతుండటం ఆలోచించాల్సిన విషయం!
సాధారణంగా మనకు ఇంతకు ముందు వున్నంతగా శరీర శ్రమ వుండటం లేదు. కాని, మనస్సు పైన తీవ్రమైన ఒత్తిడి వుంటోంది. ఈ రెండూ కలిసి వయస్సుతో సంబంధం లేకుండా అధిక బరువుతో బాధపడుతున్నా కోట్లాది భారతీయులు. ఇందులో మామూలు వారే కాదు సెలబ్రిటీలు కూడా బోలెడు మంది వున్నారు. అత్యంత తాజాగా దాసరి నారాయణ రావు అనూహ్య పరిస్థితిలో స్వర్గస్తులయ్యారు. ఆయనకు చాలా రోజులుగా ఏదో ఆనారోగ్యం వున్నట్టుగా కూడా ఎవ్వరూ వినలేదు. కాని, కేవలం మూడు, నాలుగు నెలల వ్యవధిలో చనిపోయే స్థితి దాపురించింది. ఇందుకు కారణం… అధిక బరువుతో వచ్చిన ఒత్తిడేనంటే నమ్ముతారా?
దాసరి వెయిట్ రిడక్షన్ ట్రీట్మెంట్ తీసుకుని , వికటించి మరణించారంటే మొదట్లో ఎవరో నమ్మలేదు. కాని, ఆయనకు ఆప్తుడైన మరో దర్శకుడు రేలంగి నరసింహారావు అదే విషయాన్ని ధృవీకరించారు! దాసరి బరువు తగ్గటానికి చికిత్స తీసుకుని , అది సరిగ్గా కుదరక మరణించారంటున్నారు ఆయన! దీన్ని ఒప్పుకోని వారు కూడా వుంటే వుండొచ్చు కాని… ఆ మధ్య ఆర్తి అగర్వాల్ కేసైతే అందరికీ తెలిసిందే! ఆమె కూడా అధిక బరువు వల్ల బాధపడి ప్రాణాంతక ట్రీట్మెంట్ తీసుకుని మనకు దూరమయ్యారు!
మ్యూజిక్ డైరెక్టర్ చక్రీ అధిక బరువు తగ్గించుకునే రిస్క్ ఏం చేయలేదు కాని… ఆయనకు గుండెపోటు రావటానికి ఓవర్ వెయిటే కారణమని కొందరు వాదిస్తుంటారు. ఇలా అందరికీ తెలిసిన సెలబ్రిటీలు అధిక బరువుతో మృత్యు వాత పడితే మనకు తెలుస్తుంది. కాని, సామాన్యుల పరిస్థితి ఏంటి? మారిపోయిన లైఫ్ స్టైల్ కారణంగా చాలా మంది అనేక రోగాలకు బలవుతున్నారు. వాటిలో చాలా వాటికీ కారణం అధిక బరువే. ఒంట్లో చెడు కొలెస్ట్రాల్ పేరుకుపోవటం ప్రాణాలు తీసేదాకా వెళుతుంది. అలాగని సాహసం చేసి వివిధ రకాల సర్జరీలు, చిక్సిత్సలతో కొవ్వు తీయించుకున్నా… అదీ ప్రమాదకరంగానే పరిణమిస్తోంది! ఇలా ఊరుకున్నా, ఉద్రేకపడినా ఇబ్బందిగా మారిపోయింది ఓవర్ వెయిట్!
ఏదో చూడటానికి బాగా వుండమనో, లేక రోజువారీ పనులు చేసుకోటం కూడా కష్టమవుతుందనో మనం అధిక బరువు తగ్గాల్సిన అవసరం లేదు. కాని, అవసరానికి మించి బరువు వుండటం వల్ల జీవితమే నిరాశా,నిస్పృహలతో నిండిపోతుందని డాక్టర్లు చెబుతున్నారు. అలాగే, కొన్నేళ్లకు మన బరువే మన శత్రువుగా మారి ఆయుష్షు తగ్గించేస్తుందంటున్నారు. అయితే, దీనికి ఉచిత పరిష్కారం కూడా ఉచితంగానే చెబుతున్నారు నిపుణులు. బాబా రాందేవ్ లాంటి యోగా గురువులు మొదలు డైటీషన్లు, ఫిట్ నెస్ ఎక్సపర్ట్స్ అందరూ ఒకటే అంటున్నారు. యోగాతోనో, జిమ్ లోనో, పరుగులు పెట్టటానికి వీలుగా వుండే గ్రౌండ్లోనో… ఎక్కడో ఓ చోట, లేదంటే ఇంట్లోని ట్రెడ్ మిల్ పైనా… ఎక్కడైనా, ఎలాగైనా కొవ్వు కరిగించమంటున్నారు! మందులు, చిక్సిత్సలకంటే ఒళ్లు వంచి శ్రమపడటం చాలా సేఫ్ అండ్ గ్యారెంటీ అంటున్నారు!
ఎవరికైతే చెమట పట్టడం లేదో… వారికి అధిక బరువు ముచ్చెమటలు పట్టిస్తుందనేది… ఇప్పటి మన ఏసీల కాలపు సుఖమైన ఆధునిక జీవన సత్యం!