జీఎస్టీ వచ్చాక… మస్తీ అండ్ మజా… కాస్ట్లీనా.. చీపా
posted on Jun 30, 2017 @ 11:58AM
మనిషన్నాక కళపోషణ వుండాలి. అది వున్నా లేకున్నా … ఏదో ఒక విధమైన ఎంజాయ్ మెంటు, ఎంటర్టైన్మెంటు మాత్రం వుండి తీరాలి. లేకుంటే రొటీన్ లైఫ్ తో బోర్ కొట్టేస్తుంది! మరి జీఎస్టీ వచ్చేస్తే జనాల ఎంజాయ్ మెంట్, ఎంటర్టైన్మెంట్ సంగతేంటి? అలా సరదాగా సినిమాకో, హోటల్ కో వెళితే జేబుకి చిల్లా? లేక ముందుకన్నా లాభమా? రండి చూసేద్దాం…
మీరు వారానికి ఒకసారో, నెలకి ఒకసారో హోటల్ కి వెళ్లి లాగించే టైపు అయితే జీఎస్టీ వచ్చాక పెద్ద హోటల్ కే వెళ్లండీ! ఫైవ్ స్టార్ హోటల్స్, ఏసీ వుండే హోటళ్లు అయితే గతంలో 28శాతం ట్యాక్స్ వుండేది. జీఎస్టీ వచ్చాక 18శాతం మాత్రమే వేస్తారు. కాని, ఏసీ లేని మామూలు రెస్ట్రాంట్ లైతే గతంలో కన్నా ఎక్కువ బిల్లు పడుతుంది!
సినిమా చూద్దామని థియేటర్ కి వెళ్లాలనుకుంటే మాత్రం మల్టీప్లెక్సులకి నాలుగు నోట్లు ఎక్కువే పెట్టుకుని వెళ్లండీ! ఇప్పుడు 18 శాతం వున్న ట్యాక్స్ జీఎస్టీ వచ్చాక 28శాతం అవుతుంది! కానీ, వంద రూపాయల కంటే తక్కువ ధర టికెట్లు వుండే చిన్న సినిమా హాళ్లలో మాత్రం 18 శాతమే ట్యాక్స్ వుంటుంది. సో… చిన్న సినిమా థియేటర్లను ఆదరించటం మనకు, థియేటర్ వాళ్లకి ఇద్దరికీ బెటర్ అన్నమాట!
సరదా అంటే ఎప్పుడూ సినిమా, హోటల్ మాత్రమేనా అంటారా? అయితే, ఎక్కడికైనా విహారానికి వెళితే ఎంత ఖరీదైన హోటల్ ఎంచుకుంటారో అంత వాయింపు వుండబోతోంది. రూం రెంట్ వెయ్యి కంటే తక్కువ వుండే హోటళ్లకు జీఎస్టీ వర్తించదు. వెయ్యి నుంచీ 2500 వరకూ ధర పలికే హోటల్స్ అయితే 19శాతం ట్యాక్స్. 2500 నుంచీ 7500 రేంజ్ హోటళ్లకు 18శాతం ట్యాక్స్. అంతకంటే ఖరీదైన హోటల్స్ అయితే 28శాతం ట్యాక్స్ కట్టాల్సి వుంటుంది!
జీఎస్టీ వచ్చాక తినటం కాస్త ఖరీదైనా తిరగటం చీప్ అవుతుంది! ఓలా, ఉబర్ లాంటి క్యాబ్స్ ఇప్పుడు 6శాతం ట్యాక్స్ కట్టాల్సి వస్తోంది. జీఎస్టీలో 5శాతం మాత్రం చెల్లిస్తే సరిపోతుంది. కాబట్టి క్యాబ్ లో షీకార్లు వేయటం ముందు ముందు కొంత చీప్ అవుతుంది అన్నమాట!