ప్రెసిడెంట్ ని ఎన్నుకునే ఫస్ట్ ఎంపీ, లాస్ట్ ఎమ్మెల్యే ఎవరో తెలుసా? మనవాళ్లే!
posted on Jun 29, 2017 @ 11:44AM
2014లో పార్లమెంట్ కు ఎన్నికలు జరిగాయి. మోదీ ఘనవిజయం సాధించి పీఎం అయ్యారు. అప్పట్నుంచీ ఇప్పటి వరకూ ప్రతీ సంవత్సరం ఏదో ఒక అత్యంత కీలక ఎన్నిక జరుగుతూనే వుంది. ఓ సారి బీహార్ అయితే, మరోసారి యూపీ, ఇంకో సారి అస్సొమ్, మరోసారి కాశ్మీర్… ఇలా ఎక్కడో ఒక చోట నగారా మోగుతూనే వుంది. కాని, 2017 మరింత స్పెషల్! ఈ సంవత్సరం మన ఫస్ట్ సిటీజన్ మారబోతున్నాడు. కొత్త రాష్ట్రపతి కోసం దేశ వ్యాప్తంగా ఎన్నిక జరగబోతోంది! జనంతో సంబంధం లేని పరోక్ష ఎన్నిక ఇది. మనం ఎన్నుకున్న వారు రాష్ట్రపతిని ఎన్నుకుంటారు!
ప్రెసిడెంట్ ఎలక్షన్స్ లో ఎంపీలు, ఎమ్మెల్యేలు మాత్రమే ఓటు వేస్తారు. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు… ఎక్కడ్నుంచి ఎన్నికైన ప్రజాప్రతినిధులైనా… రాష్ట్రపతి ఎన్నికలో ఓటు వేయాల్సిందే! అయితే, ఈ సారి బీజేపి నిలిపిన రామ్ నాథ్ కోవింద్ గెలిచే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ కాంగ్రెస్ మాజీ పార్లమెంట్ స్పీకర్ మీరా కుమార్ ను రంగంలోకి దింపింది. అయితే, అటు రామ్ నాథ్ కోవింద్ కి, ఇటు మీరా కుమార్ కు ఎంతో కీలకమైన ఎంపీల ఓట్ల విషయంలో ఇద్దరు తెలుగు వారు స్పెషల్ గా నిలిచారు! అందులో ఒకరైతే అన్నయ్య చిరు!
ఇంతకీ… విషయం ఏంటంటే… ప్రెసిడెంట్ ఎలక్షన్ లో ఓటు వేసే ఎంపీల జాబితా తయారు చేసినప్పుడు తొలి పేరుగా రాజ్యసభ సభ్యుడైన చిరంజీవి పేరు వచ్చింది! అలాగే, అదే లిస్టులో చివరి పేరుగా… యానాం నుంచి ఎమ్మెల్యేగా వున్న మల్లాడి కృష్ణారావు పేరు వచ్చింది! వీరిద్దరూ తెలుగు వారే! కానీ, ఇలా జరగటానికి కారణం… సదరు లిస్టుని ఈసీ వారు రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల స్పెల్లింగ్ లోని మొదటి ఆల్ఫబిట్ ఆధారంగా తయారు చేశారు! అందుకే, ఏ అక్షరంతో స్టార్ట్ అయ్యే ఏపీ… మొదటి నెంబర్ లో నిలబడింది. ఏపీ నుంచి రాజ్యసభలో వున్న చిరంజీవి పేరు మొట్ట మొదట వచ్చింది. ఇక అందరికంటే లాస్ట్ వున్న మల్లాడి కృష్ణారావు యానాం నుంచి ఎన్నికయ్యారు కాబట్టి వై అక్షరం కారణంగా లిస్టులో చిట్ట చివరి స్థితికి చేరుకున్నారు!