మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌లో కాంగ్రెస్‌ పెద్దలకూ వాటాలున్నాయా? వాళ్లెందుకు సైలెంట్‌ అయ్యారు

  అవకాశం అందివస్తే రెచ్చిపోవాలి... చేతికి ఆయుధం దొరికితే సర్కారును దులిపేయాలి... కానీ భారీ కుంభకోణం బయటపడినా... టీకాంగ్రెస్ పెద్దలు మాత్రం ఎక్కడి దొంగలు అక్కడే గప్ చుప్ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. కేవలం జిల్లా నేతలకు పని అప్పచెప్పేసి చేతులు దులుపుకున్నారనే టాక్ వినిపిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏడాపెడా వాయించే అవకాశం వచ్చినా... పీసీసీ, సీఎల్పీ పెద్దలు మాట్లాడకుండా తప్పించుకునే యత్నం చేస్తున్నారని అంటున్నారు. మియాపూర్‌ ల్యాండ్‌ స్కామ్‌పై టీడీపీ దూకుడుగా వెళ్తుంటే.... ప్రతిపక్ష పార్టీ అయిన కాంగ్రెస్‌ పెద్దలు మాత్రం చూసీచూడనట్లు పోతున్నారనే ఆరోపణలు  వినిపిస్తున్నాయి.   ఒకవైపు టీడీపీ నేతలు ఫీల్డ్‌ను విజిట్‌ చేయడం... సీఎస్‌కు గవర్నర్‌కు ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి. మరోవైపు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి కంప్లైంట్‌ చేయడానికి కూడా టీటీడీపీ సిద్ధమవుతోంది. కానీ ప్రతిపక్ష కాంగ్రెస్‌ మాత్రం అప్పుడప్పుడూ ఒక ప్రకటన చేస్తూ తప్పించుకుని తిరుగుతోంది. అయితే కిందిస్థాయి నేతల నుంచి, కేడర్‌ నుంచి విమర్శలు పెరగడంతో ఆలస్యంగా ఫీల్డ్‌ విజిట్ చేసిన టీకాంగ్రెస్‌ పెద్దలు... ఆ తర్వాత గవర్నర్‌‌ను కలిసి మళ్లీ చేతులు దులిపేసుకున్నారు. అయితే తీవ్రస్థాయిలో పోరు చేయాల్సిన ప్రధాన ప్రతిపక్షం...ఇలా వెనుకంజ వేయడం వెనుక మర్మమేమిటో అర్థంకాక కాంగ్రెస్‌ నేతలే బుర్ర బద్దలు కొట్టుకొంటున్నారు.   ఇంత పెద్ద స్కామ్‌ బయటపడినా హస్తం నేతలు కిమ్మనకుండా ఉండటంపై రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నారు. మంత్రి హరీష్‌ అన్నట్లుగా మియాపూర్ భూదందా కాంగ్రెస్ హయాంలోనే ప్రారంభమవడం ఒక కారణమైతే....స్కామ్‌లో తమ  లింకులూ ఎక్కడ బయపడుతాయోనని కాంగ్రెస్ పెద్దలు ఆందోళన చెందుతున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. పైగా టీఆర్ఎస్ ఎంపీ కేకే సైతం తాను కాంగ్రెస్ లో ఉన్నప్పుడే భూములు కొనుగోలు చేసినట్లు చెప్పడంతో....తమ వ్యవహారం కూడా బయటపడుతుందని కాంగ్రెస్ నేతలు భయపడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. అందుకే భారీ భూ కుంభకోణం గురించి మాట్లాడకుంటా కాంగ్రెస్ సీనియర్లు తప్పించుకుని తిరుగుతున్నారని అంటున్నారు.

కేసీఆర్‌ సొంత జిల్లాలో నలుగురు ఎస్సైల సూసైడ్‌... ఎందుకిలా జరుగుతోంది?

  తెలంగాణలో ఎస్సైల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ఏర్పడ్డాక ఎస్సైల ఆత్మహత్యలు పెరిగిపోవడం ఆందోళన కలిగిస్తోంది. హక్కుల కోసం కొట్లాడి పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో నాలుగో సింహం నలిగిపోతున్నాడు. 24 అవర్స్‌... 365 డేస్... ఆన్‌ డ్యూటీ‌... ఇలాంటి డైలాగులు సినిమాల్లోనే వినడానికి బాగున్నా... కిందిస్థాయి పోలీసులు ఇదే తరహాలో పనిచేయిస్తున్నారు. ఓ మనిషిగా కనీస అవసరాలు తీర్చుకోలేక.... ప్రాథమిక హక్కులు పొందలేక... ఓ మర మనిషిలా పనిచేస్తూ మానసికంగా చితికిపోతున్నారు. ఒకవైపు తీరికలేని విధులు.... మరోవైపు ఉన్నతాధికారుల వేధింపులకు బలైపోతున్నారు.   తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ఈ మూడేళ్లలో ఆరేడుగురు ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సొంత జిల్లాలోనే నలుగురు ఎస్సైలు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. 2015 సెప్టెంబర్‌లో రంగారెడ్డి జిల్లా యాలాల ఎస్సై రమేష్‌.... చెట్టుకు ఉరేసుకుని అనుమానాస్పదస్థితిలో మరణించగా, 2016 జనవరిలో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా పెద్దపల్లి ఎస్సై జగన్మోహన్‌ సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని సూసైడ్‌ చేసుకున్నాడు. 2016 ఆగస్ట్‌‌లో మెదక్‌ జిల్లా కుకునూరుపల్లి ఎస్సై రామకృష్ణారెడ్డి తన సర్వీస్ రివాల్వర్‌తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అదే ఏడాది సెప్టెంబర్‌లో పోస్టింగ్‌ ఇవ్వడం లేదంటూ నల్గొండ జిల్లా మిర్యాలగూడలో యువ ఎస్సై కిరణ్‌ సూసైడ్‌ చేసుకున్నాడు. ఇదే తరహాలో ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్సై కాశమేని శ్రీధర్‌ తన సర్వీస్‌ రివాల్వర్‌తో కాల్చుకుని తనువు చాలించాడు. దుబ్బాక ఎస్సై చిట్టిబాబు అయితే తన భార్యను రివాల్వర్‌తో కాల్చి.... తానూ కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కారణం ఏదైనా లేటెస్ట్‌గా కుకునూరుపల్లి ఎస్సై ప్రభాకర్‌రెడ్డి ఆత్మహత్య చేసుకోవడం పోలీస్‌ శాఖలో కలకలం రేపుతోంది.   ఎస్సైల ఆత్మహత్యలకు పని భారం, ఒత్తిడి, ఉన్నతాధికారుల వేధింపులు, అవినీతే కారణంగా తెలుస్తోంది. చేయని తప్పుకు ఎస్సైలు బలైపోతున్నారు. పలువురి సూసైడ్‌ నోట్స్‌లో ఇది స్పష్టంగా కనిపించింది. ప్రజలతో నేరుగా సంబంధాలు కలిగి ఉంటూ, శాంతి భద్రతల పరిరక్షణలో కీలకంగా వ్యవహరించే ఎస్సైలు ఆత్మహత్యలు చేసుకోవడం కలవరపర్చే అంశమే. ఏదిఏమైనా ఎస్సైల ఆత్మహత్యలపై ప్రభుత్వం దృష్టిసారించాల్సిన అవసరం కనిపిస్తోంది.

బెడిసికొట్టిన బీజేపీ ప్లాన్‌? దామోదర గొంతెమ్మ కోర్కెలు... అవాక్కయిన కమలం పెద్దలు!

  కాంగ్రెస్‌ సీనియర్‌ నేత దామోదర రాజనర్సింహను బీజేపీలోకి రప్పించాలనే ప్రయత్నాలు బెడిసికొట్టాయనే టాక్‌ వినిపిస్తోంది. కేసీఆర్‌ సొంత జిల్లా ఉమ్మడి మెదక్‌లో పట్టు పెంచుకునేందుకు కాంగ్రెస్‌, టీడీపీ నేతలకు గాలమేసిన కమలం నేతలు... ముందుగా రాజనర్సింహతో చర్చలు జరిపారు. అయితే అప్పటికే కాంగ్రెస్‌ అధిష్టానం తీరుతో అసంతృప్తితో ఉన్న దామోదర... బీజేపీ నేతల దగ్గర తన కోర్కెల చిట్టా విప్పారట. తనకు ఆంథోల్‌‌ సీటుతోపాటు తన సతీమణికి సంగారెడ్డి అసెంబ్లీ టికెట్‌ ఇవ్వాలని కోరినట్లు తెలుస్తోంది. అంతేకాదు జిల్లాలో మరో 6 సీట్లలో తాను చెప్పిన వారికే  టికెట్లు ఇవ్వాలని షరతు పెట్టారట. పైగా తనకు అవసరమైన అర్ధబలం సమకూర్చడంతోపాటు... కేంద్ర పనులకు సంబంధించిన కాంట్రాక్టు పనులూ ఇప్పించాలంటూ గొంతెమ్మ కోర్కెలు కోరారట.   దామోదర రాజనర్సింహ కోర్కెల చిట్టా, షరతులు విన్న రాష్ట్ర బీజేపీ నేతలు అవాక్కయ్యారట. తనకూ, ఆయన భార్యకు టికెట్లు కోరడంలో తప్పులేదని, కానీ జిల్లాలోని 12 సీట్లలో 8 టికెట్లను తాను చెప్పిన వారికే ఇవ్వాలనడంతో కంగుతిన్నారట. 12 సీట్లలో ఎనిమిదింటిని దామోదరకు ఆ‍యన వర్గానికే కట్టబెడితే... ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకున్న నేతల పరిస్థితి ఏంటని ఆలోచనలో పడ్డారట. దాంతో దామోదరకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే... మీ డిమాండ్లను పార్టీ హైకమాండ్‌కి చెబుతామంటూ వచ్చేశారని తెలుస్తోంది. అంతేకాదు రాజనర్సింహ డిమాండ్లను ఒప్పుకుంటే... అసలుకే మోసం వస్తుందని రాష్ట్ర బీజేపీ నేతలు నిర్ణయానికి వచ్చారట. అదేదో పాత కాపులనే ఎంకరేజ్‌ చేస్తే... పార్టీ గెలుపు కోసం మరింత కష్టపని చేస్తారని... ఆ కాంట్రాక్టులేవో వాళ్లకే ఇప్పించడం మంచిదని డిసైడ్‌ అయ్యారట.   దామోదర గొంతెమ్మ కోర్కెలు విన్న కమలం నేతలు... మళ్లీ కలుద్దామంటూ చెప్పేసి వచ్చేశారట. దాంతో రాజనర్సింహ చేరిక ఇప్పట్లో లేనట్లేనని తేలిపోయింది. మొత్తానికి దామోదరను ఉపయోగించుకుని కేసీఆర్‌ సొంత జిల్లాలో బలపడతామనుకున్న బీజేపీ ఎత్తుగడ మొదట్లోనే బెడిసికొట్టింది.

శిరీషది ఆత్మహత్యే...ఆరోజు ఏం జరిగిందంటే..?

  హైదరాబాద్ నగరంలో బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ ఆత్మహత్య నగరంలో సంచలనం సృష్టించింది. ఇక దీనికి తోడు ఎస్సై ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్యకు.. శిరీష ఆత్మహత్యకు మధ్య లింక్ ఉన్నట్టు వార్తలు రావడంతో ఈ కేసు ఇంకా కీలకంగా మారింది. అయితే ఎస్సై ప్రభాకర్ రెడ్డి శిరీషపై లైంగిక వేధింపులకు పాల్పడడ్డాడని.. అందుకే శిరీష ఆత్మహత్య చేసుకుందని... ఇది తెలిసి తన పరువు పోతుందన్న భయంతోనే ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడని పుకార్లు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలోనే శిరీషది హత్యా..? లేక ఆత్మహత్యా..? అని పోలీసులు దర్యాప్తు చేసి అసలు ఏం జరిగిందో వెల్లడించారు. బ్యూటీషియన్‌ శిరీషది ఆత్మహత్యేనని హైదరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ మహేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఈకేసులో నిందితులుగా ఉన్న రాజీవ్‌ కుమార్‌, శ్రావణ్‌కుమార్‌లను పోలీసులు అరెస్ట్‌ చేసి విచారించగా.. విచారణలో వెల్లడైన పూర్తి వివరాలను సీపీ మహేందర్‌రెడ్డి తెలిపారు.   అసలు ఆరోజు ఏం జరిగిందంటే..   ‘విజయవాడకు చెందిన వల్లభనేని రాజీవ్‌ కుమార్‌  హైదరాబాద్‌లో ఆర్‌జే ఫోటోగ్రఫీ పేరుతో స్టూడియో నిర్వహిస్తున్నాడు. అదే స్టూడియోలో ‘పశ్చిమగోదావరి జిల్లా ఆచంటకు చెందిన విజయలక్ష్మి అలియాస్‌ శిరీష మేకప్‌ ఆర్టిస్టుగా పనిచేస్తోంది. శిరీషకు 13ఏళ్ల క్రితం సతీశ్‌ చంద్ర అనే వ్యక్తితో వివాహమైంది. వీరికి 12ఏళ్ల కుమార్తె కూడా ఉంది. అయితే స్టూడియోలో నాలుగేళ్లుగా పనిచేస్తున్న శిరీషకు రాజీవ్ కు మధ్య అక్రమ సంబంధం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాజీవ్ కు తేజస్వీ అనే మరో అమ్మాయితో పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారి, పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. అయితే శిరీష, రాజీవ్ ల మధ్య ఉన్న సంబంధాన్ని తెలుసుకున్న తేజస్వీ అతని ఆఫీస్ కు వెళ్లి తరచూ గొడవపడుతూ ఉండేది. అదే సమయంలో శిరీష కూడా రాజీవ్‌ తనను దూరం చేస్తున్నాడని భావించింది. దీంతో శిరీష-తేజస్విని మధ్య గొడవ జరిగి, అదికాస్త ఒకరిపై ఒకరు దాడి చేసుకునే వరకూ వెళ్లింది.  అనంతరం బంజారాహిల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు కూడా చేసుకున్నారు.  పోలీసులు వారిద్దరికీ కౌన్సిలింగ్‌ ఇచ్చి పంపించారు. అయినా సమస్య పరిష్కారం కాకపోవడంతో శిరీష తనకు తెలిసిన శ్రావణ్‌కుమార్‌ను సంప్రదించింది. దీంతో శ్రావణ్ రాజీవ్‌, శిరీషల సమస్య పరిష్కారానికి ఇద్దరినీ జూన్‌ 12న తనకు తెలిసిన కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి దగ్గరికి తీసుకెళ్లాడు.  రాత్రి 11.30 గంటలకు కుకునూర్‌పల్లికి కారులో బయలుదేరి వెళ్లేటప్పుడు తమతో మద్యాన్ని తీసుకు వెళ్లారు. నలుగురూ కలిసి మద్యం తాగిన తర్వాత ఎస్‌ఐ, రాజీవ్‌, శ్రవణ్‌ కొద్దిసేపు బయటకు వెళ్లారు.  రాజీవ్‌, శ్రావణ్‌లను ఎస్ఐ ప్రాసిక్యూషన్‌ డెన్‌ వద్దకు వెళ్లమని చెప్పి తాను శిరీష దగ్గరకు వెళ్లాడు. అయితే ఎస్ఐ లోపలికి వెళ్లిన వెంటనే శిరీష గట్టిగా కేకలు వేస్తూ అరవడంతో.. రాజీవ్‌, శ్రావణ్‌ లోపలకు వచ్చారు. వాళ్లు వచ్చేసరికి ఓ పక్కన భయంభయంగా వణికిపోతూ కనిపించింది.  ఎస్‌ఐ ప్రభాకర్‌రెడ్డి నేనేమీ చేయలేదు కదా. కంగారు పడకు అని సముదాయించే ప్రయత్నం చేశారు. అయినా శిరీష అరవడం మానకపోవడంతో రాజీవ్‌ చెంపపై కొట్టాడు. గొడవ ఇంకా పెరుగుతుండగా ఎస్‌ఐ సలహా మేరకు రాజీవ్‌, శ్రవణ్‌ ఆమెను కారులో ఎక్కించుకుని బయలుదేరారు. ఇక కారులో వెళుతున్నప్పుడు కూడా శిరీష కారు డోర్‌ ఓపెన్‌ చేసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది. దీంతో వారిద్దరూ శిరీషను పట్టుకునే క్రమంలో ఆమెకు గాయాలయ్యాయి. ఇక ముగ్గురూ షేక్‌పేట్‌కు చేరుకున్న వెంటనే శిరీష నేరుగా ఫొటోగ్రఫీ కార్యాలయంలోని గదిలోకి వెళ్లిపోయింది. రాజీవ్‌, శ్రవణ్‌ కిందే ఉండిపోయారు. కొద్దిసేపటి తర్వాత ఇద్దరూ పైకి వెళ్లి డోర్‌ కొట్టగా శిరీష తీయలేదు. దాంతో శ్రావణ్ వెళ్లిపోయాడు. తర్వాత ఫ్లాట్‌కు వెళ్లి డోర్‌ ఓపెన్‌ చేయగా శిరీష ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. ఇక ఏంచేయాలో తెలియని రాజీవ్ కత్తితో చున్నీ కట్‌ చేసి మృతదేహాన్ని మంచంపై పడుకోబెట్టాడు. ఫోన్ చేసి శ్రవణ్ కు జరిగిన విషయం చెప్పగా.. శ్రవణ్‌ తిరిగి రావడంతో ఇద్దరూ కలిసి శిరీషను వైద్యుల వద్దకు తీసుకెళ్లారు. అయితే అప్పటికే ఆమె మృతిచెందినట్లు డాక్టర్లు చెప్పారని మహేందర్ రెడ్డి చెప్పారు. అక ఎస్‌ఐ ప్రభాకర్‌ రెడ్డిది ఆత్మహత్యలేనని ఆయన తెలిపారు.

విమానయాన సంస్థలు మెట్టు దిగాలా? జేసీ బెట్టు మానాలా?

  నిరంతరం మారేది ఏది? కాలమే! కాలంతో పాటూ మనమూ మారాలి. ఈ విషయం అందరికంటే బాగా తెలుసుకోవాల్సింది రాజకీయ నేతలే! ఎందుకంటే, వారికి ఎప్పటికప్పుడు కాలం సవాలు విసురుతూనే వుంటుంది. అదీ జనం సోషల్ మీడియా సాక్షిగా ఫుల్లుగా అలెర్ట్ అయిన ప్రస్తుత తరుణంలో ఏ మాత్రం ఏమరపాటుగా వున్నా అంతే సంగతులు! కాని, ఈ సత్యం మన జేసీ దివాకర్ రెడ్డి గారికి బోధపడినట్టు లేదు! మొన్నటికి మొన్న శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ ఏం చేశారో దాదాపు ఈయన అలాంటి పనే చేసి చిక్కుల్లో పడ్డారు…   విశాఖ నుంచీ హైద్రాబాద్ రావాల్సిన జేసీ ఇండిగో విమానం ఎక్కాలి. లేటుగా వచ్చిన ఆయన బోర్డింగ్ పాస్ ఇవ్వాలంటూ గొడవ చేశారు. ఆలస్యమైంది కాబట్టి తరువాతి ఫ్లైట్ లో పంపుతామని చెప్పారు ఇండిగో కంపెనీ సిబ్బంది. అంతే దివాకర్ రెడ్డి దిక్కులన్నీ ఏకం చేశారు. ప్రింటర్ కింద పడేసి హంగామాకి కారణం అయ్యారు. ఇదే ఇప్పుడు ఆయనకు ఇబ్బంది తెచ్చిపెడుతోంది. మొదట్లో మామూలుగా సద్దుమణుగుతుందని అంతా భావించినా ఎయిర్ లైన్స్ సంస్థల వాలకం చూస్తుంటే గొడవ పెద్దదయ్యేలానే కనిపిస్తోంది.   ఇండిగో సిబ్బందితో గొడవ తరువాత వెంటనే మీడియాకి వివరణ ఇచ్చిన జేసీ దాడి చేయలేదని చెప్పారు. కాని, టీవీల్లో వచ్చిన వీడియో ఫుటేజ్ సీన్ వేరేలా చూపిస్తోంది. జేసీ ఆగ్రహంతో ఊగిపోవటం, ప్రింటర్ కిందపడటం లాంటివి స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే, మొదట ఆయన విమానయానంపై ఇండిగో ఎయిర్ లైన్స్ నిషేదం విధిస్తే ఇప్పుడు ఎయిర్ ఇండియా, జెట్ ఎయిర్ వేస్, విస్తారా, స్పైస్ జెట్, ఎయిరేషియా, గో ఎయిర్ కూడా దివాకర్ రెడ్డిపై వేటు వేశాయి. అంటే ఇక మీదట ఇన్ని సంస్థల విమానాలు వేటిల్లోనూ ఆయన తిరగటానికి వీల్లేదన్నమాట!   ఒక్కో సంస్థ… జేసీ లాంటి సీనియర్ ఎంపీని , అందులోనూ ఎన్డీఏ భాగస్వామి అయిన టీడీపీ పార్టీ నేతని నిషేధించటం కాస్త ఇబ్బందికర విషయమే. పైగా ప్రస్తుతం విమానయాన శాఖను చూస్తోంది మన తెలుగు వారు ఆశోక్ గజపతి రాజే! మరి ఆయన శివసేన ఎంపీ రవీంద్ర గైక్వాడ్ విషయంలో స్పందించినట్టు ధీటుగా స్పందిస్తారా… లేక సాటి తెలుగు వాడు, స్వంత పార్టీ ఎంపీ అయిన దివాకర్ రెడ్డిని వెనకేసుకొస్తారా చూడాలి! ఏది ఏమైనా జేసీ విశాఖ ఎయిర్ పోర్ట్ ఎపిసోడ్ అటు ఆయనకి, ఇటు పార్టీకి, కేంద్రంలో మోదీ సర్కార్ కి ధర్మ సంకటమే తెచ్చి పెట్టింది. ఈ గొడవ ఎంత దాకా సాగుతుందో చూడాలి. ఎయిర్ లైన్స్ సంస్థలు మెట్టు దిగుతాయా? జేసీ బెట్టు చాలిస్తారా? ఇవే ఇప్పుడు మిలియన్ డాలర్ ప్రశ్నలు!

మైసూర్ రాజవంశాన్ని వెంటాడుతున్న 4వందలేళ్ల శాపం గురించి మీకు తెలుసా?

  రాజ్యాలు, రాజవంశాలు పోయాయి. ఇప్పుడంతా ప్రజాస్వామ్యం , ప్రజలే రాజులు అనుకుంటాం. కాని, ఇప్పటికీ రాజులు, రాజ కుటుంబాలు, సింహాసనాలు అంటే జనానికి ఎక్కడలేని ఆసక్తి! కొందరికైతే పిచ్చి కూడా! ఉదాహరణకే బ్రిటన్నే తీసుకోండి. అక్కడ ప్రజాస్వామ్యం వచ్చేసి వందల ఏళ్లు గడిచిపోతోంది. అయినా బ్రిటన్ మహారాణి, యువరాజు అంటే ఎక్కడలేని ఇంట్రస్ట్ చూపిస్తారు ఇంగ్లీషు వాళ్లు. అలాంటి ఓ రాజ కుటుంబమే మనకూ వుంది! అదే మైసూర్ మహారాజా వంశం!   దేశానికి స్వాతంత్ర్యం వచ్చేదాకా మైసూర్ సంస్థానం పాలన కొనసాగింది. తరువాత అది ఇప్పటి కర్ణాటక రాష్ట్రంగా ఆవిర్భవించింది. కాని, మైసూర్ లో రాజవంశీయుల ప్యాలెస్, వారి ధనం, దర్పం అన్నీ చెక్కుచెదరకుండా వున్నాయి. ప్రతీ దసరాకు విద్యుత్ వెలుగుల్లో ధగధగలాడే ప్యాలెస్ ను మీడియా కూడా ప్రత్యేకంగా చూపిస్తూ వస్తుంది. కాని, అందంగా కనిపించే మైసూర్ ప్యాలెస్ లోలోపల దాగిన చాలా రహస్యాలు ఎవరికీ తెలియవు! అలాంటి ఓ రహస్యమే 4వందల ఏళ్లుగా మైసూర్ రాజవంశాన్ని వెంటాడుతోంది! దాని వల్లే ప్రతీ తరంలోనూ సింహాసనం అధిష్టించే వారసుడు లేక నానా తంటాలు పడుతున్నారు మైసూర్ రాజులు!   ఇప్పటికి 4వందల ఏళ్ల కింద మైసూరు రాజ్యాన్ని తిరుమలరాజు అనే ఆయన పరిపాలించేవాడు. కాని, ఆయనపై ఒడయార్ తిరుగుబాటు చేసి సింహాసనం దక్కించుకున్నాడు. ఇప్పటికీ ఒడయార్లే మైసూర్ ను ఏలుతున్నారు. కాని, ఒడయార్ వల్ల రాజ్యాన్ని, భర్తని కోల్పోయిన తిరుమలరాజు భార్య అలమేలమ్మ ఆగ్రహంతో కావేరీ నదిలో దూకి ఆత్మహత్య చేసుకుంటూ మైసూర్ రాజవంశం సంతానం లేక అంతమైపోతుందని శపించిందట! అది నిజమవుతోందా అన్నట్లు… గత 4వందల ఏళ్లుగా మైసూర్ రాజైన ఏ ఒక్కరికీ కొడుకులు పుట్టలేదు. దగ్గరి బంధువుల్ని ఎవరో ఒకర్ని దత్తత తీసుకుని రాజును చేయటమే జరుగుతోంది.   ఇక ఇప్పుడు మైసూర్ సింహాసనంపై కూర్చున్న రాజు పేరు… యదువీర్ కృష్ణదత్త చామరాజ ఒడయార్. ఆయన భార్య త్రిషీక కుమారి. వీరికి తప్పకుండా కొడుకు పుడతాడని జ్యోతిష్యులు చెప్పారట. వారు చెప్పినట్టే మహారాణి గర్భం ధరించింది. త్వరలో తల్లికానుంది! ఈ పరిణామంతో మైసూర్ కోటలో సంతోషం వెల్లివిరిస్తోందట! ఎందుకంటే, 4వందల ఏళ్లుగా ఏనాడూ పసి పాపల నవ్వులు మైసూర్ కోటలో వినిపించనేలేదు! ఇప్పుడిక తమ శతాబ్దాల శాపం తీరిపోయిందని వారు మురిసిపోతున్నారు…

డేంజర్‌ జోన్‌‌లో కేకే? పొమ్మన లేక పొగ? కేకేకి బాస్‌కి ఎక్కడ తేడా వచ్చింది?

  కేకే డేంజర్ జోన్ లో ఉన్నారా? కేశవరావును బాస్‌ టార్గెట్ చేశారా? పొమ్మన లేక పొగ పెడుతున్నారా? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. టీఆర్ఎస్‌లో చరిత్ర పున‌రావృత‌మ‌వుతున్నట్లే కనిపిస్తోంది. కేశవరావును పక్కన పెడుతున్నారన్న చర్చ గులాబీ పార్టీలో ఇప్పుడు హాట్‌హాట్‌గా సాగుతోంది. గోల్డ్ స్టోన్ భూ కుంభకోణం వ్యవహారంలో నిండా కూరుకు యిన కేకే విష‌యంలో ప్రభుత్వం, పార్టీ  అంటీముట్టనట్లు వ్యవహ‌రిస్తుండటమే దీనికి కారణంగా చెప్పుకుంటున్నారు. గతంలో ఆలె నరేంద్ర, విజయశాంతికి ఇలానే జరిగిందని చెవులు కొరుక్కుంటున్నారు.   తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న సమయంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా ఉన్న కేకే కారెక్కారు. ఆయన‌కు పార్టీ సెక్రట‌రీ జ‌న‌ర‌ల్ ప‌ద‌వితో పాటు రాజ్యస‌భ స‌భ్యుడిగా అవకాశం కల్పించారు కేసీఆర్. ఇటీవలి కాలం వరకు కేకేకు ఎంతో ప్రాధాన్యత ఇచ్చారు. కానీ గోల్డ్ స్టోన్ ప్రసాద్ దగ్గర కేకే భూములు కొన్నట్లు బయటపడడంతోనే... కేకే పరిస్థితి తారుమారైంది. పైగా ఈ భారీ కుంభకోణంలో కేకే పేరును ప్రభుత్వమే లీక్  చేసింద‌ంటూ టీజేఏసీ బాంబు పేల్చింది.   కేకేకు టీఆర్ఎస్ హైకమాండ్ కు పడకపోవడానికి కారణం కేసీఆర్ తీరును విమర్శించడమే అనే వార్తలు గుప్పుమంటున్నాయి. కేసీఆర్ వ్యవహారశైలిపై కేకే వ్యతిరేకంగా మాట్లాడిన‌ట్లు బాస్ దృష్టికి వెళ్లిందట. ఫలితంగా ఏడెనిమిది నెలలుగా కేకేను పక్కనపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని టీఆర్ఎస్ నేతలు చెవులు కొరుక్కుంటున్నారు. అంతేకాదు త‌న‌కు అన్యాయం జ‌రిగింద‌ని కేకే భావిస్తే ఆయ‌న న్యాయ పోరాటం చేయ‌డంలో త‌ప్పు లేద‌ని ఎమ్మెల్సీ క‌ర్నె ప్రభాక‌ర్ చెప్పడాన్ని బట్టిచూస్తే ....కేకే విష‌యంలో పార్టీ పెద్దలు దూరంగా ఉంటున్నట్లే కనబడుతోంది. మరి కేకే... నెంబర్ టూ సెంటిమెంట్ ను అధిగమిస్తారా..? డేంజ‌ర్ జోన్ నుంచి సేఫ్ గా బయట పడతారా..అనేది వేచి చూడాలి.

మంత్రుల చెలగాటం… విశాఖ టీడీపీ ప్రాణ సంకటం!

  మన దేశంలో అధికార పార్టీపై కుంభకోణం ఆరోపణలు రావటం సహజమైపోయింది. దిల్లీలోని కేంద్ర ప్రభుత్వం మొదలు చిన్న చిన్న ఈశాన్య రాష్ట్రాల దాకా అంతటా కుంభకోణాల వార్తలే! గత యూపీఏ సర్కార్ తో పోలిస్తే ఇప్పటి మోదీ గవర్నమెంట్ నూటికి నూరు శాతం నిజాయితీగా పని చేస్తోందనే చెప్పాలి. కాని, మన రెండు తెలుగు రాష్ట్రాల కీర్తి మూడేళ్లు గడిచిన నేపథ్యంలో ఇప్పుడిప్పుడే మసకబారుతోంది. ప్రధానంగా తెలంగాణలో మియాపుర్ భూకుంభకోణం, ఆంధ్రాలో విశాఖ భూకుంభకోణం ఒకేసారి బయటపడి జనంలో ఎంతో కొంత అనుమానం సృష్టించేశాయి…   అధికారంలో వున్న పార్టీపై ప్రతిపక్షాలు కుంభకోణం ఆరోపణలు చేయటం పెద్ద ఇబ్బందికర విషమేం కాదు. కాని, ఏపీలో టీడీపీకి… అంతకంటే డ్యామేజింగ్ ఇంటర్నల్ ఫైట్ తో ఇబ్బంది కలుగుతోంది. అదే ఇప్పుడు టీడీపీ అభిమానుల్లో ఆందోళనకు కారణం అవుతోంది. విశాఖలో వేల కోట్ల రూపాయల భూములకు సంబంధించి అక్రమాలు జరిగాయని వార్తలు గుప్పుమంటున్న నేపథ్యంలో అయ్యన్న పాత్రుడు, గంటా శ్రీనివాసరావుల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ ఇంటి పోరు ప్రతిపక్షానికి కూడా మంచి ఆయుధంలా మారే సూచనలు కనిపిస్తున్నాయి…   విశాఖలో టీడీపీకి బలమైన నేతగా పేరుంది మంత్రి ఆయ్యన్న పాత్రుడికి. అలాగే, 2014 విజయం తరువాత విశాఖ టీడీపీలో ఎంతో కీలకమయ్యారు మరో మంత్రి గంటా శ్రీనివాసరావు. కాని, వీరిద్దరి మధ్యా విభేదాలు పబ్లిక్ సీక్రెట్టే! మహానాడు లాంటి వేడుకల్లో కలిసే కనిపించినా, చంద్రబాబు ముందు బుద్దిగానే వున్నా … అదను వస్తే అయ్యన్న, గంటా ఒకరినొకరు కార్నర్ చేసుకునే అవకాశాలు అస్సలు వదలటం లేదు. మరీ ముఖ్యంగా, అయ్యన్న పాత్రుడు… గంటా శ్రీనివాసరావును విశాఖ స్థానికుడు కాదన్నట్టుగా భావిస్తున్నారు. ఆ ఉద్దేశంతోనే ఆయన స్థానికులు కాని వారొచ్చి విశాఖలో జనం కష్టం పడి కొనుక్కున్న భూముల్ని మింగేస్తున్నారని వ్యాఖ్యానించారు. దీనిపై సీరియస్ గానే స్పందించిన గంటా శ్రీనివాసరావు నేరుగా చంద్రబాబుకు లేఖ రాసి విచారణ జరిపించి నిజం తేల్చాలని డిమాండ్ చేశారు. అయ్యాన్న పాత్రుడు తన మీద కోపాన్ని పార్టీకి నష్టంగా మార్చేస్తున్నారని వాపోయారు!   మొదట్నుంచీ ఏదో ఒక అంశంపై అయ్యన్న, గంటా ఇలా మాటల యుద్ధం నడుపుతూనే వున్నారు. కానీ, భూముల కుంభకోణం లాంటి తీవ్రమైన అంశంలో కూడా తమలో తాము గొడవపడి ప్రతిపక్షానికి మంచి అవకాశం ఇవ్వటం టీడీపీ కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేని పరిణామం. అదీ అయ్యన్న పాత్రుడు, గంటాశ్రీనివాసరావు మంత్రుల స్థాయిలో వుంటూ ఇలా చేయటం పార్టీకి ఖచ్చితంగా నష్టం చేస్తుంది. దీనిపై చంద్రబాబు ఎలా స్పందిస్తారో చూడాలి. కాని, అంతకంటే ముందు టీడీపీ నేతలు ఇద్దరూ వ్యక్తిగత స్పర్థల్ని పక్కన పెట్టి వైసీపీని ఎదుర్కోవాలి. లేదంటే అవినీతి ఆరోపణల్ని జనం సీరియస్ గా తీసుకుని వచ్చే ఎన్నికల్లో చేదు ఫలితాల్ని రుచి చూపించే ప్రమాదం వుంది!

విశ్వవిఖ్యాత నటసార్వభౌముడితో విశ్వంభరుడి అనుబందం!

  తన విశ్వంభర కావ్యంతో తెలుగు సాహిత్య ఖ్యాతిని విశ్వ వ్యాప్తం చేసిన గొప్ప కవి సినారె. జ్ఞానపీఠ్ అవార్డ్ పొందిన ఆయన 85ఏళ్ల వయస్సులో చివరి శ్వాస దాకా ఉత్తమమైన సాహిత్యాన్ని తెలుగు నేలపై వెదజల్లుతూనే వున్నారు. అయితే, సినారె ఎన్నో కావ్యాలు, గేయాలు, గ్రంథాలు రాసినప్పటికీ…. ఆయన గురించి సామాన్య జనానికి తెలిసింది మాత్రం సినిమా పాటల రచయితగానే! ఒకవేళ ఆయన సినిమా రంగంలోకి కాలుమోపకుంటే బహుశా ఇంత మందికి దగ్గరయ్యేవారే కాదేమో!   సి. నారాయణ రెడ్డి తమదైన పంథాలో సాహిత్య సృష్టి చేస్తూ ముందుకు సాగుతుంటే సినిమా రంగంలోకి ఆహ్వానించింది ఎవరో తెలుసా? నటసార్వభౌమ ఎన్టీఆర్! ఆయన పట్టుబట్టి సినారె చేత సినీ గీతం రాయించారు. అలా చరిత్రలో స్థానం సంపాదించుకున్నదే గులేబకావళి కథలోని నన్ను దోచుకుందువటే పాట! సినారెని బీ.ఎన్.రెడ్డి లాంటి గొప్ప దర్శకులు సినిమా పాటలు రాయమన్నా ఆయన సున్నితంగా తిరస్కరించారు. కాని, అన్నగారు రమ్మన్నాక కాదనలేకపోయారు. అదే సినారె మూడు వేల అయిదు వందల ఆణిముత్యాల్లాంటి పాటలు రాయటానికి కారణమైంది!   ఎన్టీఆర్ కి సినారెపైన కేవలం వృత్తిపరమైన గౌరవమే కాదు…. వ్యక్తిగతంగా ఎంతో ప్రేమ వుండేది. ఆయన స్వయంగా మద్రాస్ రైల్వే స్టేషన్ కు వెళ్లి ఆయన్ను ఆహ్వానించే వారంటే తారక రాముడి భావం మనం అర్థం చేసుకోవచ్చు! అంతే కాదు, అప్పట్లో యావత్ టాలీవుడ్ ను తిరుగులేకుండా ఏలుతోన్న ఎన్టీఆర్ సినారె పెట్టిన షరతుకు ఒప్పుకుని అన్ని పాటలూ ఆయనతోనే రాయించుకునే వారు కూడా! మరో రచయిత పేరు లేకుండా సింగిల్ కార్డ్ వేస్తేనే తాను పాటలు రాస్తానని అనేవారట సినారె. ఇక నారాయణ రెడ్డి తమ కెరీర్ మొత్తంలో మాటలు రాసిన రెండే రెండు సినిమాలు ఏకవీర్, అక్బర్, సలీం, అనార్కలీ. ఇవి రెండూ ఎన్టీఆర్ వే కావటం సినారెకు ఆయనతో వున్న అనుబంధాన్ని మనకు సూచిస్తుంది!   అన్నగారు సీఎం అయ్యాక కూడా నారాయణ రెడ్డితో అనుబంధం తగ్గలేదు. మరింత పెరిగింది కూడా. హుస్సేన్ సాగర్ పైన తెలుగు ప్రముఖుల విగ్రహాల ఏర్పాటు, వారికి సంబంధించిన కవిత పంక్తులు… వీటి వెనుక కూడా సినారె హస్తం వుందంటారు. ఇక ఎన్టీఆర్ ప్రతిష్టాత్మకంగా భావించిన తెలుగు విశ్వవిద్యాలయానికి కూడా సినారె వైస్ ఛానల్సర్ గా పని చేసిన విషయం తెలిసిందే!   సినారె పట్ల ఎన్టీఆర్ అభిమానం తెలియాలంటే… ఆయన పిలుపు గుర్తుకు చేసుకుంటే చాలు! నటరత్నీ ఈ సాహితీ రత్నాన్ని ‘’ మా రెడ్డిగారు ‘’ అనేవారు ఆప్యాయంగా!

బ్రిటన్ యువరాణి చనిపోయింది! జనంలో ఆసక్తి మాత్రం చావటం లేదు!

ఆధునిక ప్రజాస్వామ్యానికి పుట్టినిల్లు గ్రేట్ బ్రిటన్. అక్కడ్నుంచే డెమోక్రసీ ప్రపంచమంతా వ్యాపించింది. రాజ్యాలు, రాజుల అంతం ఆరంభమైంది. కాని, విచిత్రంగా బ్రిటన్ లో ఇప్పటికీ మహారాణి వుంటుంది. మహారాజుల వంశమూ వుంటుంది. వాళ్ల ప్యాలెస్ , ఆ ప్యాలెస్ లోని రాజులు, రాణుల జీవితాలంటే జనం పడి చచ్చిపోతారు!   శతాబ్దాల చరిత్ర కలిగిన బ్రిటన్ రాజవంశపు బకింగ్ హ్యామ్ పాల్యెస్ లో అత్యంత వివాదాస్పదమైన యువరాణి… డయాన! ఒక కార్ యాక్సిడెంట్లో విషాదాంతమైన ఆమె… జీవితకాలం పాటూ గొడవల్లో మునిగిపోయింది. ఆమెను బ్రిటన్ యువరాజు గ్రాండ్ మ్యారేజ్ సెర్మనీలో ప్రపంచం మొత్తం సాక్షిగా చేపట్టాడు! కాని, తరువాత వారిద్దరూ ఏ ఒక్క రోజూ సుఖంగా, సంతోషంగా వుండలేదు. చివరకు, డయానా ఆ రాజవంశం, రాజభోగాలు, రాచరిక కట్టుబాట్లు ఏవీ వద్దనుకుని డైవోర్స్ తీసుకుని బయటకొచ్చేసింది. తరువాత కొన్నేళ్లకు బ్రిటన్ పాపరాజీ మీడియా వెంటాడుతుంటే బాయ్ ఫ్రెండ్ తో కలిసి తప్పించుకునే తొందర్లో యాక్సిడెంట్ కి గురై చనిపోయింది!   అప్పుడెప్పుడో అర్ధాంతరంగా అంతమైపోయిన యువరాణి డయానా అంటే బ్రిటన్ జనానికి ఇప్పటికీ పిచ్చి. ఆమె గురించి ఏం చెప్పినా పనిగట్టుకుని, పనులు మానేసి వింటారు. అందుకే, తాజాగా … డయానా , హర్ ట్రూ స్టోరీ అనే మరో పుస్తకం వదిలాడు ఓ రచయిత. అందులో బయటపెట్టిన విషయాలు ఇప్పుడు బ్రిటీషర్లని షాక్ కి గురిచేస్తున్నాయి. అసలు డయానా పెళ్లైన కొద్ది రోజులకే ఆత్మహత్య చేసుకోవాలనుకుందట. చేతి మణికట్ల దగ్గర కోసుకుని ప్రాణాలు తీసుకోవాలని భావించిందట. ఇదంతా ఆమె 1990లలో ఒక ఫ్రెండ్ సాయంతో రికార్డ్ చేసింది. ఇప్పుడు ఆ రికార్డింగ్స్ పుస్తక రచయిత బయటపెట్టాడు!   పైకి హంగూ, ఆర్భాటంతో కనిపించే రాచ కుటుంబీకుల జీవితాలు బ్రిటన్లో మాత్రమే కాదు చాలా చోట్ల ఒత్తిళ్లతోనే వుంటాయి. డయానా వైవాహిక జీవితం కూడా అంతే. బ్రిటన్ యువరాజును పెళ్లాడిన ఆమె అనుక్షణం అతడి లవ్వర్ క్యామిల్లా మీద అనుమానంతోనే సతమతం అయిపోయింది. స్వయంగా డయానానే యువరాజు ప్రేమికురాలైన క్యామిల్లా పట్ల తన ఫీలింగ్స్ గురించి వివరించింది. కలలో కూడా ఆమెకు తన భర్త క్యామిల్లాకు ఫోన్ చేసినట్టు కనిపించేదట! ఆ ఒత్తిడే చివరకు డైవోర్స్ దాకా వెళ్లింది.   యువరాణి డయానా గురించిన తాజా చర్చ… ఆమె చనిపోయినా బ్రిటీషర్లకు ఆమెపై వున్న ఆసక్తి మాత్రం చావలేదని నిరూపిస్తోంది!

ఆ ముగ్గురితో ...చిక్కుల్లో పడుతోన్న ఓరుగల్లు టీఆర్‌ఎస్

ఓరుగల్లు టీఆర్‌ఎస్‌లో ముగ్గురు కీలక నేతల మధ్య విభేదాలు... పార్టీపై తీవ్ర ప్రభావం చూపెడుతున్నాయి. ఆ ముగ్గురు నేతలను ఏకతాటిపైకి తెచ్చేందుకు... అధిష్టానం తలలు పట్టుకుంటోందట. చిరకాల ప్రత్యర్ధులుగా... ఒకప్పుడు వివిధ పార్టీల్లో బలమైన నాయకులుగా ముద్రపడ్డ ఆ లీడర్లు ఇప్పుడు ఒకే గూటిలో ఉన్నా... ఇప్పటికీ ఉప్పు-నిప్పులానే ఒకరిపై మరొకరు భగభగమండిపోతున్నారని అంటున్నారు. ఈ ముగ్గురిలో ఒకరు డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అయితే, మరొకరు ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు... ఇంకొకరు ఎమ్మెల్సీ కొండా మురళి... ఈ ముగ్గురిలో ఒకరితో మరొకరికి సత్సంబంధాల్లేవ్‌. పార్టీ పటిష్టం కోసం కలిసి పనిచేయాల్సి సమయంలోనూ... మనుషులు కలవరు... మనస్సులు అసలే కలవవు.   కడియం, ఎర్రబెల్లి... వీళ్లిద్దరూ టీడీపీ నుంచి కీలక నేతలుగా ఎదిగారు. కడియం మంత్రిగా పనిచేస్తే... అదే పార్టీలో ఎర్రబెల్లి ...ప్రభుత్వ విప్ గా వ్యవహారించారు. ఇద్దరి మధ్య అప్పటి నుంచే భేదాభిప్రాయాలు ఉండేవి. అప్పట్లో టీడీపీని రెండు వర్గాలు నడిపించారు. 2014 ఎన్నికలకు ముందు కడియం టీడీపీ నుంచి టీఆర్ఎస్ లోకి వెళ్లి... ఆ తర్వాత ఎంపీగా గెలిచి... కొద్దిరోజులకు డిప్యూటీ సీఎం పదవి చేపట్టారు. టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా, టీడీఎల్పీ నేతగా పనిచేసిన ఎర్రబెల్లి సైతం ఇటీవలే గులాబీ గూటికి చేరారు.   అయితే ఉప్పు-నిప్పులా ఉండే ఈ ఇద్దరు నేతలూ ... ఇప్పుడు కూడా ఒకే పార్టీలో ఉన్నా ..ఒకరితో మరొకరికి పొసగదు. ఎర్రబెల్లి టీడీపీలో.. కడియం టీఆర్ఎస్ లో ఉండగా... జెడ్పీలో జరిగిన ఓ గొడవ వారి మధ్య విభేదాలను మరింత పెంచింది. ఆ వైరం ఇంకా అలానే కొనసాగుతోంది. ఇక ఎర్రబెల్లి-కొండా మురళీ మధ్య సుదీర్ఘకాలంగా వైరం ఉంది. రెండు వర్గాల మధ్య హత్యా రాజకీయాలు కూడా నడిచాయి. ఈ ఇద్దరి వర్గపోరుపై అసెంబ్లీ స్ధాయిలో చర్చ కూడా జరిగింది. ఇప్పుడు ఈ ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నారు. ఒకే వేదిక పంచుకుంటున్నారు. కానీ ఎడముఖం... పెడముఖమే. ఇటు కడియం శ్రీహరి, కొండా మురళీకి మధ్య కూడా గ్యాప్ ఉంది. అందుకే సురేఖ నియోజకవర్గమైన వరంగల్ ఈస్ట్‌లో జరిగే ఏ కార్యక్రమంలోనూ కడియం పాల్గొనరట.   బలమైన నాయకులుగా ముద్రపడ్డ కడియం, ఎర్రబెల్లి, కొండా మురలి కలిసి పనిచేయడం కష్టంగా మారింది. పార్టీ బలోపేతానికి ఈ ముగ్గురు నేతలు సమన్వయం అనివార్యమైయినప్పటికీ ఎవరికి వారే యమునా తీరేఅన్నట్లుగా వ్యవహారించడం కార్యకర్తల్లో అయోమయానికి దారితీస్తోంది. రానున్న రోజుల్లో ఈ ముగ్గురు నేతల మధ్య విభేదాలు ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందో అన్నది టీఆర్ఎస్ అధిష్టానానికి ఆందోళన కలిగిస్తోంది.

వరంగల్‌ జిల్లాలో గజేంద్ర మోక్షం రియల్‌ సీన్‌...

భూమ్మీద నూకలు చెల్లిపోతే తాడే...పామై... కాటేస్తుందంటారు. ప్రపంచంలోనే ధనవంతుడైనా... ఎంత పేరు ప్రఖ్యాతలున్నా.... మృత్యువు పిలిస్తే ఎవరైనా వెళ్లిపోవాల్సిందే... అంతేకాదు టైమ్‌ దగ్గర పడితే ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా... ఎవ్వరూ కాపాడలేరు... అయితే భూమ్మీద నూకలుంటే మాత్రం ఆత్మహత్య చేసుకున్నా, ఘోర ప్రమాదం జరిగినా బతికి బట్టకట్టడం ఖాయం... చివరికి శరీరం తూట్లు తూట్లు అయ్యేలా బుల్లెట్లు దిగినా.... ప్రాణాలతో బయటపడతారు.... అందుకే కావాలనుకున్నప్పుడు చావు రాదు... చావాలని రాసిపెట్టి ఉంటే మృత్యువు ఆగదంటారు.... ఓ అవ్వ విషయంలో ఇదే జరిగింది.....   వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లి మండలం ఆర్షణపల్లి శివార్లని బొల్లోనిపల్లిలో ఈ వింత జరిగింది... ముగ్గురు ఆడపిల్లలకు పెళ్లిళ్లు చేసి అత్తారిళ్లకు పంపేసింది గండు సుగుణమ్మ... రెండేళ్ల క్రితం భర్త కాలం చేశాడు... అప్పట్నుంచి ఒంటరిగా జీవిస్తోన్న సుగుణమ్మ.... అనారోగ్యం బారిన పడింది. ఏ పనిచేసుకోవాలన్నా ...కాళ్లూచేతులు సహకరించడం లేదు.... ఆదరించేవాళ్లు ఎవరూ లేరు... ఒకవైపు ఒంటరితనం.... మరోవైపు బతకమే కష్టమైన పరిస్థితి.... దాంతో జీవితంపై విరక్తి చెంది.... ఆత్మహత్య చేసుకోవాలనుకుంది....   చావాలని డిసైడై.... ఓరోజు రాత్రి 30-40 అడుగుల లోతున్న వ్యవసాయ బావిలోకి దూకేసింది. బావిలో నీరు తక్కువగా ఉండటంతో బతికి బట్టకట్టింది. అయితే తీవ్ర గాయాల పాలైంది. బావిలో ఉన్న బురదలో చిక్కుకుపోయింది. అప్పటికే బావిలో ఓ కుక్క... నాగుపాము పడి ఉన్నాయి... బావిలో తలో దిక్కున అవి సుగుణమ్మకు కనిపించాయి... చావాలనే బావిలోకి దూకినా... నాగుపామును చూసేసరికి భయం పుట్టుకొచ్చింది. కాటేస్తుందేమోనని బిక్కచచ్చిపోయింది... రక్షించండంటూ అరుపులు కేకలు వేసింది. అది అర్ధరాత్రి కావడంతో ఎవరూ పట్టించుకోలేదు... అయితే సుగుణమ్మ అరుపులతో బెదిరిన నాగుపాము బుసలు కొడుతూ కాటేసేందుకు విశ్వప్రయత్నాలు చేసింది. అయితే ఇక్కడే అసలు కథ మలుపు తిరిగింది. సుగుణమ్మను కాటేసేందుకు బుసలు కొడుతున్న నాగుపాముకి అక్కడే ఉన్న కుక్క ఎదురు నిలిచింది. పడగ విప్పిన పాముతో కలబడింది. రాత్రంతా పోరాడి నాగుపాము నుంచి సుగుణమ్మను కాపాడింది. అచ్చం హాలీవుడ్‌ సినిమాను తలపించేలా ఈ సీన్‌ సాగింది.   మొత్తానికి ఉదయం సుగుణమ్మ అరుపులు కేకలు విన్న జనం.... ఆమెను పైకి తీసేందుకు మంచానికి తాళ్లు కట్టి బావిలోకి దింపారు. అయితే ఈ క్రమంలో కొన్ని రాళ్లు... బావిలో ఉన్న నాగుపాముపై పడ్డాయి. దాంతో మరోసారి బుసలు కొట్టింది. అయితే కుక్క సుగుణమ్మకు రక్షణగా నిలిచింది. నాగుపాముతో పోరాడింది. నోటితో పట్టుకుని మూడుసార్లు బావికేసి కొట్టింది. ఈ క్రమంలో ఒకసారి నాగుపాము కాటుకు గురైంది. అయినప్పటికీ సుగుణమ్మను బావి నుంచి పైకి తీసేవరకూ రక్షణగా నిలబడింది. ఇదంతా పైనుంచి చూస్తున్న జనం ఆశ్చర్చపోయారు. వినడానికి విడ్డూరంగా ఉన్నా.... ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన గ్రామస్తులు మాత్రం వింతగా చెబుతున్నారు. సుగుణమ్మ పెంపుడు కుక్క కాకపోయినా... మనిషిని కాపాడాలన్న ఆలోచన దానికెలా వచ్చిందోనంటూ ఆశ్చర్చపోతున్నారు. ఇదంతా ఓ వింతంగా ఉందంటున్నారు.

మిస్సింగ్‌కి ముందు పూర్ణిమ...ఇంటర్నెట్‌లో దేని కోసం సెర్చ్‌ చేసిందంటే?

హైదరాబాద్‌లో బాలిక పూర్ణిమ మిస్సింగ్‌ మిస్టరీగా మారింది. స్కూల్‌కి వెళ్తున్నానంటూ ఇంటి నుంచి బయటికెళ్లిన పూర్ణిమ ఏమైందో అంతుచిక్కడం లేదు. మరోవైపు 18 బృందాలతో ఏడు రోజులుగా గాలిస్తున్నా.. చిన్న క్లూ కూడా దొరక్క పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. అసలు హైదరాబాద్‌‌లో మిస్సయిన పూర్ణిమ ఏమైనట్లు?, స్కూల్‌కు వెళ్తానని చెప్పి పూర్ణిమ ఎక్కడికి వెళ్లింది?, పూర్ణిమను ఎవరైనా కిడ్నాప్‌ చేశారా?, లేదంటే పూర్ణిమే... ఇంటి నుంచి వెళ్లిపోయిందా?, పూర్ణిమ మిస్సింగ్‌కి ముందు ఇంట్లో ఏం జరిగింది? స్కూల్‌లో ఎలా ఉండేది? ఆమె ఫ్రెండ్స్‌ ఎవరు? పూర్ణిమ మానసిక స్థితి ఎలా ఉంది? ఇలా అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు చేస్తున్నారు.పేరెంట్స్‌, బంధువులు, టీచర్స్‌, ఫ్రెండ్స్‌ నుంచి వివరాలు సేకరిస్తున్నారు. అయితే పూర్ణిమ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నప్పుడు హూషారుగానే ఉన్నట్లు సీసీటీవీ ఫుటేజ్‌లో పోలీసులు గుర్తించారు. స్కూల్‌ యూనిఫాంలో గంతులేసుకుంటూ మెట్లు దిగడం సీసీ కెమెరాల్లో రికార్డయింది.    అయితే బాలికకు చదువు ఇష్టంలేదని, దాంతో తల్లిదండ్రులు మందలించారని ప్రాథమికంగా గుర్తించిన పోలీసులు, అందుకే ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయి ఉంటుందని భావిస్తున్నారు. అయితే పూర్ణిమ తండ్రి ఫోన్‌ను పరిశీలించిన పోలీసులు... ఆందోళన వ్యక్తంచేసినట్లు తెలిసింది. పూర్ణిమ ఇంటి నుంచి వెళ్లే ముందు... హౌ టు హ్యాంగ్‌ అంటూ గూగుల్‌లో సెర్చ్‌ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా పూర్ణిమ మిస్సింగ్‌కు ప్రేమ వ్యవహారం కూడా కారణం కావొచ్చని అనుమానిస్తున్నారు.    మరోవైపు పూర్ణిమ మిస్సింగ్‌ ఇష‌్యూని తల్లిదండ్రులు ట్విట్టర్‌ ద్వారా మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లడం.... కేటీఆర్‌ స్పందించి.... బాలిక ఆచూకీ కనిపెట్టాలంటూ ఆయా పోలీస్‌ కమిషనర్లకు ఆదేశాలివ్వడంతో.... పోలీసులు ఉరుకులు పరుగులు పెడుతున్నారు. మొత్తం 18 ప్రత్యేక బృందాలను రంగంలోకి దింపి గాలిస్తున్నారు.

ఎర్రబెల్లి-కొండా యుద్ధం మళ్లీ మొదలైంది...

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో ఎర్రబెల్లి దయాకర్‌రావు, కొండా మురళీధర్‌రావు మధ్య నడిచిన పోటీ రాజకీయాలు అక్కడి ప్రజలు కథకథలుగా చెప్పుకుంటారు. చంద్రబాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఓరుగల్లులో ఎర్రబెల్లి హవా బాగా నడిచేది. మంత్రి పదవిలో లేకపోయినప్పటికీ... అధికార పార్టీ కావడం, ప్రభుత్వ విప్‌గా ఉండటంతో ఉమ్మడి వరంగల్‌లో ఎర్రబెల్లి మాట నెగ్గేది. అదే సమయంలో కొండా మురళి... కాంగ్రెస్‌లో ఉంటూ ఎర్రబెల్లితో ఢీ అంటే ఢీ అనేవారు. ఈ ఇద్దరి మధ్యా హత్యా రాజకీయాలు కూడా నడిచాయని చెప్పుకుంటారు. ఈ ఇద్దరి వర్గపోరుపై అసెంబ్లీలో కూడా చర్చ జరిగింది.   కొండా మురళీకి నక్సల్స్‌తో సంబంధాలుండేవని చెబుతారు. అప్పట్లో ఒకసారి హన్మకొండ సెంటర్‌లో తన ప్రత్యర్ధులపై కొండా మురళి కాల్పులు జరపడం సంచలనం సృష్టించింది. అదే సమయంలో నక్సల్స్‌తో సంబంధాలున్నాయనే వంకతో కొండా మురళీని ఎర్రబెల్లి ఎన్‌కౌంటర్‌ చేయించేందుకు కుట్ర చేశారనే ఆరోపణలు ఆనాటి అసెంబ్లీలో ప్రకంపనలు సృష్టించాయి. ఎమ్మెల్యేగా ఉన్న కొండా సురేఖ... అసెంబ్లీలో కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్‌ రాజశే‌ఖర్‌రెడ్డి... కొండా మురళీకి, అతని కుటుంబానికి అండగా నిలబడ్డారని చెబుతారు. అంతేకాదు దాదాపు ఎన్‌‌కౌంటర్‌ కావాల్సిన కొండా మురళీని ఆ ప్రమాదం నుంచి వైఎస్సే తప్పించారని చెప్పుకుంటారు.   అయితే ఎర్రబెల్లి-కొండా మురళి మధ్య సుదీర్ఘకాలంగా నడుస్తోన్న వైరం ఇప్పటికీ కొనసాగుతోంది. ప్రస్తుతం ఇద్దరూ ఒకే పార్టీలో ఉన్నా... ఇద్దరూ ఉప్పూనిప్పులాగే కంటిన్యూ అవుతున్నారు. కొండా దంపతుల కంటే లేటుగా గులాబీ గూటికి వచ్చినప్పటికీ... జిల్లా పార్టీలో పట్టు సాధించేందుకు ఎర్రబెల్లి పావులు కదుపుతున్నారు. అందులో భాగంగా కొండా దంపతులకు చెక్‌ పెట్టేందుకు చూస్తున్నారట. ప్రస్తుతం కొండా సురేఖ ప్రాతినిథ్యం వహిస్తున్న వరంగల్‌ ఈస్ట్‌లో తన సోదరుడు ప్రదీప్ రావుకు రాబోయే ఎన్నికల్లో టికెట్టు ఇప్పించేందుకు ఎర్రబెల్లి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో ఎర్రబెల్లి-కొండా మధ్య మళ్లీ యుద్ధం మొదలైందనే టాక్ వినిపిస్తోంది. 

రాహుల్ కి భజన చేసే తొందర్లో… ‘పప్పు’లో కాలేసిన కాంగ్రెస్ నేత!

  ఫేస్బుక్, ట్విట్టర్, వాట్సప్ లాంటి సోషల్ మీడియా మాధ్యమాలు రెండు వైపులా పదునున్న కత్తుల్లాంటివి. తెలివిగా వాడుకుంటే శత్రువులపై ఆయుధాలుగా పనికొస్తాయి. తెలివితక్కువగా ప్రయోగిస్తే మన మీదకే తిరిగొచ్చి చుక్కలు చూపిస్తాయి. ఇప్పుడు అలాంటి చుక్కల్నే పట్టపగలు చూసేస్తున్నాడు ఉత్తర్ ప్రదేశ్ లోని మీరట్ కు చెందిన కాంగ్రెస్ నేత వినయ్ ప్రధాన్!   ఆయన వాట్సప్ లో ఒక పోస్ట్ పెట్టాడు. అది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ గ్రూపులో తెగ చర్చనీయాంశమైంది. అందుక్కారణం… ఆ పోస్ట్ లో మీరట్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడైన వినయ్ ప్రధాన్ రాహుల్ ను ఆహా ఓహో అంటూ పొగడటమే. గాంధీ వారసుడైన తమ యువనేత రైతు బాంధవుడనీ, ఇంకా చాలా చాలా గొప్పగా వర్ణించాడు. కాని, అంతా బాగానే నడిచినప్పటికీ ... ఒక చిన్న పొరపాటు కొంపముంచింది! ఆ వాట్పప్ పోస్టులో రాహుల్ ను పనిలో పనిగా పప్పు అని కీర్తించాడట... సదరు కాంగ్రెస్ నేత!   బీజేపి నేత సుబ్రమణ్యం స్వామి ఓ సారి సరదాగా రాహుల్ ని పప్పు అన్నాడు. అప్పట్నుంచీ సోషల్ మీడియాలో కాంగ్రెస్ వ్యతిరేకులు, మోదీ భక్తులు సోనియా తనయుడ్ని పప్పు అనటం మామూలైపోయింది. కాని, విచిత్రంగా తమ నేతని పొగడటానికి వాట్సప్ లో పెట్టిన పోస్టులో కాంగ్రెస్ నాయకుడే పప్పూ అనటం చాలా మంది కాంగ్రెస్ ఫ్యాన్స్ కి మంట పుట్టించింది. వెంటనే వాట్సప్ గ్రూపులో వినయ్ ప్రధాన్ ను తిట్టటం మొదలు పెట్టారు రాహుల్ ఫ్యాన్స్! అయితే, జరిగిన పొరపాటు ఏంటో ఆలస్యంగా గ్రహించిన కాంగ్రెస్ మీరట్ జిల్లా  అధ్యక్షుడు వివరణ ఇచ్చుకున్నాడు…   వాట్సప్ లో రాహుల్ ని కీర్తిస్తూ తానసలు పోస్టే పెట్టలేదనీ, అది అనురాగ్ అనే మరో వ్యక్తి పెట్టాడనీ చెప్పుకొచ్చాడు. అందులో వున్న పప్పూ అన్న పదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని మొత్తుకున్నాడు. అయినా కాంగ్రెస్ అభిమానులు ఎవ్వరూ వినటం లేదట! వాట్సప్ లో కూర్చుని తమ స్వంత నాయకుడ్నే పప్పు అంటూ పిచ్చి వేషాలు వేస్తే… నీ పప్పులు ఉడకవ్ అంటూ హెచ్చిరిస్తున్నారట!

కేసీఆర్‌ కంచుకోటలపై కమలం కన్ను... షాకిచ్చేందుకు అమిత్‌షా స్కెచ్‌...

  తెలంగాణలో ఎలాగైనా సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతోన్న బీజేపీ... కేసీఆర్‌ కంచుకోటలపై కన్నేసింది. ముఖ్యంగా ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కేసీఆర్‌ హవాకు చెక్‌ పెట్టాలని వ్యూహ రచన చేస్తోంది. టీఆర్‌ఎస్‌కు తిరుగులేని ఉమ్మడి మెదక్‌ జిల్లాలో కాలు పెట్టడం ద్వారా కేసీఆర్‌‌ దూకుడుకి కళ్లెం వేయాలనుకుంటోన్న కాషాయదళం... పకడ్బందీ ప్లాన్‌‌తో ముందుకెళ్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా... గెలిచేందుకు ఉన్న అన్ని అవకాశాలను వినియోగించుకోవాలనుకుంటోంది.   గత ఎన్నికల్లో ఒక్క జహీరాబాద్‌ మినహా మిగిలిన ఎమ్మెల్యే, ఎంపీ సీట్లన్నీ టీఆర్‌ఎస్సే గెలిచింది. ఉమ్మడి మెదక్‌ జిల్లాలో ఇప్పటికీ టీఆర్‌ఎస్‌ ఆధిపత్యమే కొనసాగుతోంది. అయితే ఈసారి టీఆర్‌ఎస్‌ ఆధిపత్యానికి గండి కొట్టాలని బీజేపీ ప్లాన్‌ చేస్తోంది. కేసీఆర్‌‌కి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో సత్తా చాటడం ద్వారా టీఆర్‌ఎస్‌కి షాకివ్వాలనుకుంటోన్న కమలం నేతలు... అందుకు సరైన నేతల కోసం అన్వేషణ మొదలుపెట్టింది. అందులో భాగంగా కాంగ్రెస్‌ సీనియర్లకు గాలమేస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్‌ సీనియర్‌ లీడర్‌, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహతో చర్చలు జరిపిన బీజేపీ నేతలు... మరికొందరి నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పనులకు సంబంధించిన కాంట్రాక్టులు ఇవ్వడం ద్వారా వీళ్లందరినీ పార్టీలోకి రప్పించాలనుకుంటున్నారు. అంతేకాదు పార్టీలో తగిన ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు... సీట్ల కేటాయింపులో మీరు చెప్పినవారికి టికెట్ల ఇస్తామంటూ బంపర్‌ ఆఫర్లు ఇస్తున్నట్లు తెలుస్తోంది. మరి బీజేపీ ఆపరేషన్ ఆకర్ష్‌ వలలో పడే నేతలెవరో చూడాలి.   ఏదిఏమైనా కేసీఆర్‌ సొంత జిల్లా అయిన ఉమ్మడి మెదక్‌ నుంచే టీఆర్‌ఎస్‌‌కు సవాల్‌ విసరాలని బీజేపీ డిసైడైంది. అమిత్‌షా కూడా అందుకు భారీ స్కెచ్‌ గీశారని అంటున్నారు. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్‌కి... ఆయన మేనల్లుడు హరీష్‌రావుకి మంచి పట్టున్న ఉమ్మడి మెదక్‌ జిల్లాలో బీజేపీ పాగా వేయడం అంత ఈజీ కాదనేది మాత్రం వాస్తవం.

కేటీఆర్‌ - హరీ‌ష్‌ మధ్య కోల్డ్ వార్‌? పార్టీలో పట్టు కోసం ఎత్తులు పైఎత్తులు

  కేసీఆర్‌ తర్వాత ఎవరు?... కొడుకు కేటీఆరా? మేనల్లుడు హరీష్‌రావా?... ఈ చర్చ ఎప్పట్నుంచో అటు పార్టీలోనూ...ఇటు ప్రభుత్వంలోనూ నడుస్తున్నా... మొగ్గు కేటీఆర్‌ వైపే ఉంటుందన్నది సహజంగా ఎవరైనా భావిస్తారు? అయితే కేసీఆర్‌ ఉద్యమం చేపట్టినాటి నుంచి ఆయన అడుగుల్లో అడుగేసి వెన్నంటే ఉన్న హరీష్‌రావు బలమేమీ తక్కువ కాదు... పార్టీ లీడర్లలోనూ కేడర్‌లోనూ హరీష్‌రావుకు విశేషమైన ఆదరణ ఉంది. అందుకే కేటీఆర్‌‌కు అటు పార్టీలో... ఇటు ప్రభుత్వంలో నెంబర్‌ టూ పొజీషన్‌ కట్టబెట్టేందుకు కేసీఆర్‌ వెనుకాడుతుంటారని టాక్‌. అంతేకాదు కేటీఆర్‌‌ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ప్రకటించాలని కేసీఆర్‌కి ఉన్నా... హరీష్‌ భయంతోనే వెనకడువేస్తున్నారనే ప్రచారమూ ఉంది. అయితే సమర్ధత విషయంలో కేటీఆర్‌‌, హరీష్‌రావూ ఇద్దరూ సమర్ధులే. కానీ కేసీఆర్‌ ఉద్యమం చేపట్టిన నాటి నుంచి ప్రజల్లో ఉండటంతో... టీఆర్‌ఎస్‌ లీడర్లు, కేడర్‌లో హరీష్‌రావుకే పట్టు ఎక్కువగా ఉంది. దీన్ని బ్రేక్‌ చేసేందుకు కేటీఆర్‌ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వంలో హరీష్‌రావుపై దాదాపు పైచేయి సాధిస్తూనే... అటు పార్టీలోనూ తన పట్టు పెంచుకునేందుకు పావులు కదుపుతున్నారు కేటీఆర్‌.   ముఖ్యంగా పార్టీ, నామినేటెడ్ పదవుల్లో కేటీఆర్ మార్కు స్పష్టంగా కనిపిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా పదవుల పంపకంలో కేటీఆర్‌ అనుచరులకు అధిక ప్రాధాన్యత లభిస్తోంది. ఇటు నామినేటెడ్, అటు పార్టీ పదవులు రెండింటిలోనూ ఆయన అనుచరులకే పెద్ద పీట దక్కుతోంది. పార్టీ అనుబంధ సంఘాల నియామకాలే పార్టీలో పెరుగుతున్న కేటీఆర్ హవాకు సంకేతమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ యువజన విభాగం అధ్యక్ష బాధ్యతలను తన శిష్యుడు... MLC శంబుపూరి రాజుకి కట్టబెట్టారు. విద్యార్ధి విభాగపు అధ్యక్షుడిగా నియమితులైన గెల్లు శ్రీనివాస్ యాదవ్, టెక్నికల్ ఎడ్యుకేషన్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన రాకేష్ కూడా కేటీఆర్ అనుయాయులే.. తెలంగాణ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా నియమితులైన బాలమల్లు కూడా కేటీఆర్ వర్గీయుడే. వీరే గాక... గ్రంధాలయ ఛైర్మన్లు, ఇతర నామినేటెడ్ పదవుల భర్తీలో కేటీఆర్ ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది.   ఇక జిల్లా కన్వీనర్లు, పార్టీ కార్యవర్గంలో తన అనుచరులకు అధిక ప్రాధన్యత దక్కేలా కేటీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గతంలో పార్టీ పదవుల విషయం అంతగా పట్టించుకోని కేటీఆర్‌...పార్టీపై పట్టు బిగించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. దాంతో సచివాలయంలోని కేటీఆర్‌ ఛాంబర్, నందినగర్‌లో ఆయన క్యాంప్ కార్యాలయం కిటకిటలాడుతోంది. పదవుల కోసం నేతలు ఆయన చుట్టూ తిరుగుతున్నారు. కేటీఆర్ కూడా కీలక జిల్లాల బాధ్యతలు తన అనుచరులకే కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే చాలా జిల్లాల్లో ఏకాభిప్రాయం కుదరడం లేదు. అందుకే పార్టీ పదవుల భర్తీ ఆలస్యమవుతుందనే చర్చ పార్టీలో సాగుతోంది. అయితే ఏకాభిప్రాయం కుదరకపోవడానికి హరీష్‌రావే కారణమనే టాక్‌ వినిపిస్తోంది.  

రాజనర్సింహ‌ను సైడ్‌ చేస్తోంది అందుకేనా? మాజీ డిప్యూటీ... పార్టీ మారడం ఖాయమేనా?

  ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ డిప్యూటీ సీఎం హోదాలో ఉంటూ రాష్ట్ర విభజన సమయంలో కీలక పాత్ర పోషించిన దామోదర రాజనర్సింహకు... మొన్నటి రాహుల్ సభలో ప్రాధాన్యత దక్కకపోవడానికి కారణమేంటో తెలిసింది. రాష్ట్ర విభజనకు ముందు ఢిల్లీలో జరిగిన పలు కీలక మీటింగ్స్‌లో అప్పటి ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డితోపాటు పాల్గొన్న దామోదర రాజనర్సింహ... తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కీలక పాత్ర పోషించారనే చెప్పాలి. అయితే రాష్ట్ర విభజన విషయంలో కొందరు తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు తప్పుదోవ పట్టించారని ఆలస్యంగా గ్రహించిన హైకమాండ్‌... పలువురి విషయంలో కోపంగా ఉందని, ఆ లిస్ట్‌లో దామోదర రాజనర్సింహ కూడా ఉన్నారని టాక్‌ వినిపిస్తోంది.   మరోవైపు దామోదర రాజనర్సింహ... బీజేపీ వైపు చూస్తున్నారనే సమాచారం కాంగ్రెస్‌ హైకమాండ్‌‌కి ఉప్పందిందని అంటున్నారు. రాహుల్‌ సంగారెడ్డి మీటింగ్‌కి ముందు తెలంగాణలో పర్యటించిన బీజేపీ చీఫ్‌ అమిత్‌షాను రాజనర్సింహ రహస్యంగా కలిసేందుకు ప్రయత్నించారని చెబుతున్నారు. అంతేకాదు అమిత్‌షా తెలంగాణ పర్యటనకు రాకముందే... రాష్ట్ర బీజేపీ నేతలు దామోదరతో చర్చలు జరిపారని, అయితే చర్చల్లో ప్రతిష్టంభన ఏర్పడటంతో భేటీ అసంపూర్తిగా ముగిసిందని, ఇదంతా హైదరాబాద్‌లోని ఓ స్టార్‌ హోటల్‌ కేంద్రంగా జరిగిందని అంటున్నారు.   అయితే అమిత్‌షా తెలంగాణ పర్యటన సమయంలోనే దామోదర రాజనర్సింహ... బీజేపీలో చేరతారని ప్రచారం జరిగినా... చర్చల్లో ప్రతిష్టంభనతో ఆగిపోయిందని, కానీ ఏదో ఒకరోజు ఆ పార్టీలోకి జంప్‌ చేయడం ఖాయమనే నిర్ణయానికి టీకాంగ్రెస్‌ వచ్చిందని, అందుకే రాజనర్సింహకు ప్రాధాన్యత తగ్గిస్తూ వస్తున్నారే టాక్‌ వినిపిస్తోంది. అందులో భాగంగానే దామోదర రాజనర్సింహకు... రాహుల్‌ సభలో మాట్లాడే అవకాశం కూడా ఇవ్వలేదనే గుసగుసలు వినిపిస్తున్నాయి.  

చేప ప్రసాదం… విశేషాలు, విమర్శలు, వివాదాల సమ్మేళనం!

  1.     మృగశిర కార్తె వస్తే అందరూ వాన చినుకుల కోసం చూస్తారు! రైతులు విత్తనాలు చల్లేందుకు సిద్ధమవుతారు. కాని, లక్షలాది ఆస్తమా రోగులు భాగ్యనగరం వైపు చూస్తారు. బత్తిన సోదరులిచ్చే చేప ప్రసాదం కోసం నిరీక్షిస్తారు! ఇంతకీ ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన చేప ప్రసాదం గతం, ఘనత ఏంటి?   2.    ఏటా లక్షల సంఖ్యలో ఆస్తమా రోగులు హైద్రాబాద్ వచ్చి చేప ప్రసాదం తీసుకుంటారు. ఈ పరంపర ఇప్పటిది కాదు. 1847 నుంచీ కొనసాగుతోంది. నిజాముల కాలంలోనే చేప ప్రసాదం పంపిణీ పాతబస్తీలో మొదలైంది. ఇప్పుడు ప్రసాదం అందిస్తోన్న బత్తిన సోదరుల తాతగారైన బత్తిన వీరన్న తొలిసారి ప్రసాదం పంచటం మొదలుపెట్టారు. తరువాత బత్తిని వంశంలో వరుసగా మూడు తరాలు ఈ ప్రసాదం పంపిణీ ఉచితంగా చేస్తూనే వున్నారు.   3.    చేప ప్రాసదం పంపిణీ వెనుక ఆసక్తికరమైన కథనం ఒకటి వుంది. 1847 ప్రాంతంలో ఒక సాధువు బత్తిన వంశానికి చెందిన వీరన్న గౌడ్ ఇంట్లో ఆతిథ్యం స్వీకరించారు. జోరు వానలో తడిసిపోయిన వచ్చిన ఆ సాధువుకి వీరన్న గౌడ్ భక్తిగా సేవలు చేశారు. అందుకు మెచ్చి ఆయన ఆస్తమా మందు ఎలా తయారు చేయాలో చెప్పి దాన్ని ఏటా మృగశిర కార్తె రోజున ఉచితంగా పంపిణీ చేయమని చెప్పి వెళ్లాడు. అప్పట్నుంచీ బత్తిని వంశజులు శతాబ్దమున్నరకు పైగా విజయవంతంగా చేప ప్రసాదం రోగులకు అందిస్తూ వస్తున్నారు.   4.    చేప ముందు మూడు రకాలుగా ఇస్తారు రోగులకి. పూర్తి శాఖాహారులైతే బెల్లంతో కలిపి ప్రసాదాన్ని అందిస్తారు. మాంసాహారులైతే కొర్రమీను చేప నోట్లో ప్రసాదాన్ని వుంచి… ఆ చేపని రోగి చేత మింగిస్తారు. ఇక మూడో రకం ప్రసాదం.. ప్రత్యేకంగా పత్యం చేసే వారికి వేస్తారు.   5.    ఈ చేప ప్రసాదం ప్రత్యేకంగా మృగశిర కార్తె రోజునే ఇవ్వటానికి కారణం… మృగశిర కార్తె నుంచీ వాతావరణంలో మార్పు రావటమే. ఎండ తగ్గి తేమ క్రమంగా పెరుగుతూ వుంటుంది. అందువల్ల ఆస్తమా రోగులు ఇబ్బంది పడే అవకాశం కూడా ఎక్కువగా వుంటుంది. అందుకే, వర్షాలు మొదలయ్యే మృగశిర కార్తె రోజు ఆస్తమాను అరికట్టే చేప ప్రసాదం ఇవ్వటం ఆనవాయితి.   6.    కొన్నాళ్లుగా ఎంతో చరిత్ర కలిగిన ఈ చేప ప్రసాదంపై  హేతువాదులు, శాస్త్రీయవాదుల దృష్టి పడింది. జన విజ్ఞాన వేదిక లాంటి సంస్థలు మీడియా సాయంతో ఏటేటా పెద్ద వివాదమే రాజేశాయి. చివరకు వ్యవహారం కోర్టు దాకా వెళ్లింది.   7.    కోర్టులో చేప మందు అని కాకుండా చేప ప్రసాదం అని వ్యవహారించాలని జడ్జ్ తీర్పునిచ్చారు. అలాగే అనేక సూచనలు కూడా న్యాయస్థానం చేసింది. కాని, ఉద్యమకారులు కోరినట్టు చేప ప్రసాదం పంపిణీ మాత్రం నిషేధించలేదు.   8.    శతాబ్దమున్నర కాలంగా రోగులు అంతకంతకూ పెరుగుతూనే వున్న చేప ప్రసాదం హానికరమని ఎక్కడా నిరూపించబడలేదు. అలాగే శాస్త్రీయత కూడా ఋజువు కాలేదు. కాని, చేప ప్రసాదం హైద్రాబాద్ కి ఒక ప్రత్యేకత అని మాత్రం చెప్పుకోవచ్చు. ప్రపంచంలోని చాలా ప్రాంతాల్లోంచి జనం ఈ ప్రసాదం కోసం ఏటా వస్తుంటారు!   9.    వివాదాల కారణంగా మధ్యలో ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అండగా వుంటం మానేసినా… ఇప్పుడు గవర్నమెంటే అన్ని ఏర్పాట్లూ చూసుకుంటోంది. వచ్చే రోగులకి ఇబ్బందులు లేకుండా జాగ్రత్తపడుతోంది.   10.  కాల పరీక్షకి నిలబడి, ఎన్ని విమర్శలు, వివాదాలు వచ్చినా తట్టుకున్న బత్తిని సోదరుల చేప ప్రసాదం ఒక విధంగా సాంస్కృతిక అద్బుతమే. ఇక దాని వైద్యపరమైన లాభాలు ఔషధం స్వీకరిస్తున్న ఆస్తమా రోగులకే తెలియాలి. అందులో ఎలాంటి ఉపయోగం లేకుంటే లక్షలాది మంది ఎంతో శ్రమకోర్చి తీసుకోరు కదా?