జీఎస్టీ… పక్కా లోకల్ బ్రాండ్స్ కి పక్కలో బల్లెమేనా?
posted on Jun 29, 2017 @ 10:57AM
పెద్ద పెద్ద తుఫాన్లు వచ్చినప్పుడు మహావృక్షాలే కూలిపోతాయి. గడ్డి మొక్కలు కాదు! ఇది జీవిత సత్యమే! కాని, జీఎస్టీ సత్యం మాత్రం కాదు! ఎందుకంటే, కొంత మంది ఆర్దిక నిపుణుల అభిప్రాయం ప్రకారం జీఎస్టీ దెబ్బకి పెద్ద పెద్ద బ్రాండ్స్ హ్యాపీగా వున్నాయి. కాని, జూలై ఫస్ట్ తరువాత లోకల్ బ్రాండ్స్ జీఎస్టీ తుఫాన్ కి గజగజ వణికిపోనున్నాయట!
మీరెప్పుడైనా పల్లెటూళ్లకి వెళితే బోలెడు లోకల్ బ్రాండ్స్ కనిపిస్తుంటాయి. ఊళ్లలో కనిపించే సబ్బులు, చిరుతిళ్ల లాంటి లోకల్ బ్రాండ్స్ మొదలు పెడితే పట్టణాల్లో కనిపించే లోకల్ మేడ్ ఎల్సీడీ టీవీల దాకా ఇండియాలో చీప్ అండ్ బెస్ట్ పక్కా లోకల్ సరుకు బోలెడంత! లక్స్ , ఎల్జీ, సామ్ సంగ్, హల్దీరామ్స్, బింగో లాంటి రకరకాల బ్రాండెడ్ ప్రాడెక్ట్స్ తో ఈ లోకల్ బ్రాండ్స్ ఎన్నో దశాబ్దాలుగా పోటిపడుతున్నాయి. కాని, జీఎస్టీ వస్తే ఈ చిన్న చిన్న మొక్కలు ట్యాక్స్ దుమారానికి గాల్లో కలిసిపోవాల్సిందేనట!
ఇంత కాలం నడుస్తోన్న ట్యాక్స్ విధానం వల్ల చాలా లోకల్ బ్రాండ్స్ అతి తక్కువ ట్యాక్స్ లు చెల్లిస్తూ వస్తున్నాయి. అంతే కాదు, చాలా చోట్ల లోకల్ బ్రాండ్ తయారీదారులు నేరుగా హోల్ సేలర్ తో నగదు లావాదేవీలు జరిపి వ్యాపారం చేస్తూ వస్తున్నారు. దీని వల్ల పెద్దగా ట్యాక్స్ లు కట్టే తప్పనిసరి పరిస్థితి ఏర్పడలేదు. కాని, జీఎస్టీ అమలు జరిగితే ట్యాక్స్ ల చెల్లింపులో పూర్తి పారదర్శకత రానుంది. ఏ వ్యాపారీ ట్యాక్స్ చెల్లించకుండా సరుకు అమ్మటం, కొనటం చేయలేడు. కాబట్టి అనేక లోకల్ బ్రాండ్స్ పెద్ద మొత్తం లో ట్యాక్స్ చెల్లించాల్సి వుంటుంది. ఉదాహరణకి లోకల్ సబ్బుల్నే తీసుకుంటే … భారీ బ్రాండ్స్ అయిన లక్స్, లైఫ్ బాయ్ లాగే అవ్వి కూడా 18శాతం జీఎస్టీ విభాగంలోకి వస్తాయి. లోకల్ టీవీ తయారీదారులు కూడా సోని, సామ్ సంగ్ లతో సమానంగా 28శాతం పన్ను చెల్లించాలి. ఇంత మొత్తంలో ట్యాక్స్ కట్టి లోకల్ బ్రాండ్ తయారీదారులు మార్కెట్లో నిలదొక్కుకోవటం అనుమానమే అంటున్నారు ఎనలిస్టులు!
ఒకవైపు లోకల్ , చిరు బ్రాండ్స్ జీఎస్టీ వేడికి అల్లాడబోతుంటే … పెద్ద పెద్ద కార్పోరేట్ బ్రాండ్స్ తయారీదారులు మాత్రం కూల్ గా కనిపిస్తున్నారు. ఒకటి రెండు శాతం ధరలు పెరిగినా, తగ్గినా వారికి వచ్చే పెద్ద ప్రమాదమేం లేనట్టుగానే కనిపిస్తోంది. పైగా ఎక్స్ పర్ట్స్ చెబుతున్నట్టు లోకల్ బ్రాండ్స్ తగ్గిపోతే అది పేరు మోసిన బ్రాండ్లకి మరింత శుభసూచకం!