చైనా వర్సెస్ ఇండియా… వయా భూటాన్
posted on Jul 1, 2017 @ 12:00PM
ప్రస్తుతం అంతర్జాతీయ స్థాయిలో ఏదైనా దేశం గూండాగిరి చేస్తోందంటే అది చైనా ఒక్కటే! చాలా దేశాలకు తమ పక్క దేశాలతో సరిహద్దు సమస్యలుంటాయి. కాని, ఏకపక్షంగా ప్రకటనలు చేయటం, బెదిరించటం మాత్రం చైనానే చేస్తుంటుంది. ఒకవైపు ఇండియాతో కయ్యం పెట్టుకునే డ్రాగన్ మరో వైపు టిబెట్ ను ఎప్పుట్నుంచో అక్రమంగా ఆక్రమించుకుని కూర్చుంది. టిబెటన్ల మత గురువు, పరిపాలకుడు అయిన దలైలామాకు ఇండియా ఆశ్రయం ఇవ్వటం కూడా చైనాకు అనుక్షణం కోపం తెప్పిస్తూ వుంటుంది. ఇక చైనా తైవాన్ తో, వియత్నాంతో , జపాన్ తో పెట్టుకునే పంచాయితీలు కూడా అన్నీ ఇన్నీ కావు. ఇవే కాక… ఈ మధ్య వేగంగా అభివృద్ది చెందుతూ వుండటంతో అగ్ర రాజ్యం అమెరికాతో కూడా కుస్తీకి రెడీ అయిపోతోంది!
చైనా శత్రువులుగా భావించే అతి కీలక దేశాల్లో భారత్ కూడా ఒకటి. మనతో ఓ సారి 1962లో యుద్ధం చేసి తీవ్ర నష్టం కూడా కలిగించింది. కొంత భూభాగం ఆక్రమించుకుంది. ఇప్పటికీ తిరిగి ఇవ్వలేదు. కాని, 1962నాటి నెహ్రు ఇండియాకి, ఇప్పటి మోదీ ఇండియాకి చాలా తేడా వుంది. ఈ సత్యం బీజింగ్ కు బోధపడటం లేదు. కాదంటే కావాలనే కవ్విస్తోందో!
సిక్కింలో ప్రస్తుతం భారత్, చైనా దళాలు ముఖాముఖి నిలబడి వున్నాయి. అందుక్కారణం చైనా దురాక్రమణ సిద్ధాంతమే. చాలా చిన్న దేశమైన భూటాన్ ను ఈసారి బెదిరించే పనిలో పడింది మైటీ డ్రాగన్. ఆ దేశంతో చైనాకు వున్న సరిహద్దు ప్రాంతంలోని వివాదాస్పద స్థలంలో రోడ్డు వేయటానికి ప్రయత్నించింది! డోక్లామ్ గా పిలవబడే ఆ చోట చైనాగానీ, భూటాన్ గాని ఎలాంటి కట్టడాలు, నిర్మాణాలు చేయకూడదని అగ్రిమెంట్ వుంది. అయినా దాన్ని పట్టించుకోకుండా రోడ్డు వేయటానికి సిద్ధమైంది. అలా చేస్తే చైనా, భూటాన్, టిబెట్, బంగ్లాదేశ్ లను కలిపే రోడ్ వే ప్రాజెక్ట్ చైనాకు తేలికవుతుంది. ఈ ఉద్దేశ్యంతో బలవంతంగా భూటాన్ భూ భాగంలోకి చొరబడి పనులు మొదలు పెట్టింది.
భూటాన్ పై బలప్రయోగానికి దిగిన చైనాకు ఇండియన్ ఆర్మీ అడ్డుగా నిలిచింది. భూటాన్ కు సైనిక సహాయం అందించటం ఆ దేశంతో మనకున్న అగ్రిమెంట్లలో ఒకటి. అందుకే, భూటాన్ కు అండగా ఇండియన్ ఆర్మీ రంగంలోకి దిగింది. ఇప్పుడు ఇదే చైనాకు మంట పుట్టిస్తోంది. 1962నాటి రోజులు భారత్ గుర్తుంచుకోవాలని చైనా కమ్యూనిస్టు పాలకులు హెచ్చరిస్తున్నారు. కాని, అప్పటికి ఇప్పటికీ ఎంతో ఎదిగిన ఇండియా చైనా ఊహించినంత ఈజీగా బెదిరిపోదు. ఆ విషయం బీజింగ్ కి కూడా తెలుసు. అయినా , రోజు రోజుకు ఆమెరికాకు దగ్గరవుతోన్న ఇండియా ఆసియాలో చైనాకు తాళలేని పోటీ ఇస్తోంది. ఆ ఒత్తిడి తట్టుకోలేకే ఇలా పదే పదే కయ్యానికి కాలుదువ్వుతుంటుంది!
పైకి బుద్ది చెబుతాం అన్నట్టు భీకరంగా మాట్లాడుతున్నా చైనాకు ఇప్పటికిప్పుడు భారత్ తో యుద్ధం చేసే ఉద్దేశం లేదు. అందుకు తగ్గ పరిస్థితులు కూడా లేవు. ఇండియాలోని మార్కెట్ చైనాకు చాలా అవసరం. అది పోతే యుద్ధం వల్లే నష్టం కన్నా ఎక్కువ నష్టం తప్పదు. కాబట్టి డ్రాగన్ సిక్కింలో,అరుణాచల్ ప్రదేశ్ లో, అక్కడా, ఇక్కడా చేసేవన్నీ ఉత్తుత్తి హంగామాలే అని భావించాల్సి వుంటుంది. అయినప్పటికీ పాక్ లాంటి బలహీన దేశం కాదు కాబట్టి ఇండియన్ అర్మీ అలెర్ట్ గా వుండటం ఎంతో అవసరం…