జీఎస్టీ తేనె తుట్టె కదిలిస్తే… గతంలో వివిధ దేశాల్లో ఏం జరిగింది
posted on Jun 30, 2017 @ 10:28AM
వస్తువులు, సేవల పన్ను… ఠక్కున అర్థమయ్యేలా చెప్పాలంటే… జీఎస్టీ! మరి కొన్ని గంటల్లో భారత్ జీఎస్టీ శకంలోకి ప్రవేశించబోతోంది! ఇంతకాలం వున్న సేల్స్ ట్యాక్సుల్లాంటి అనేక పరోక్ష పన్నులు ఇక మీద వుండవు! ఒక దేశం, ఒక ట్యాక్స్ నినాదం నిజం కాబోతోంది! ఇది మామూలుగా ఏం జరగలేదు. గత ఇరవై ఏళ్లుగా వివిధ చోట్ల గుసగుసగా , బిగ్గరగా వినిపిస్తూనే వుంది. ఎట్టకేలకు ఇప్పుడు జీఎస్టీ అమలుకు అవకాశం లభించింది. కాని, జీఎస్టీ అమలు తరువాత ఆర్దిక కుదుపు ఎలా వుండబోతోంది? ఇది తెలియాలంటే, గతంలో జీఎస్టీ లాంటి విధానాన్ని తమ దేశాల్లో అమలు చేసిన వ్యవస్థల్ని ఒకసారి పరిశీలించాల్సిందే!
ప్రపంచంలోనే అత్యంత సుసంపన్న ఆర్దిక వ్యవస్థ అయిన అమెరికాలో జీఎస్టీ లాంటి విధానమే లేదు! అక్కడ రాష్ట్రాలకు ట్యాక్స్ వేసుకునే విషయంలో చాలా వెసులుబాటు వుంటుంది! ఇక ప్రపంచంలో మొట్ట మొదటి జీఎస్టీ అమలు చేసిన దేశం ఫ్రాన్స్! 1954లొ ఆ దేశం వన్ నేషన్ వన్ ట్యాక్స్ అన్నాక దాదాపు 160దేశాలు అదే పద్ధతి ఫాలో అయ్యాయి. చాలా యూరోపియన్ దేశాలు ఫ్రాన్స్ బాటలో పయనించి 1970లు, 80లలో జీఎస్టీ విధానం ప్రవేశపెట్టాయి.
చైనా దశల వారీగా జీఎస్టీకి బదులు వ్యాట్ అమలు చేస్తూ వచ్చింది. 2016లో వ్యాట్ సంస్కరణలు పూర్తిగా ముగించింది. బిజినెస్ ట్యాక్స్, ఇతర ట్యాక్సులు అన్నీ రద్దు చేసేసింది. ఒకే ఒక్క వ్యాట్ వుండటం వల్ల చైనాలో ఏర్పడ్డ రియల్ ఎస్టేట్ నీటి బూడగా అమాంతం పేలిపోయింది. భూములు ధరలు సామాన్య స్థితికి చేరుకన్నాయి.
జపాన్ లో జీఎస్టీని కన్జంప్షన్ ట్యాక్స్ అంటారు. 1989లో దీన్ని ప్రవేశపెట్టారు. అప్పట్లో 3శాతం వున్నం కన్జంప్షన్ ట్యాక్స్ ఇప్పుడు పది శాతానికి చేరుకుంది.
మలేషియా ప్రభుత్వం 2015లో జీఎస్టీని ప్రవేశపెట్టింది. 26ఏళ్ల చర్చలు, అనుమానాల తరువాత నిర్ణయం తీసుకున్నప్పటికీ గొడవలు, నిరసనలు తప్పలేదు. ద్రవ్యోల్బణం తీవ్రంగా పెరిగిపోయింది. అయినా మెల్లమెల్లగా పరిస్థితులు సద్దుమణిగాయి. ఇప్పుడు మలేషియా జనం దాదాపు 70శాతం మంది కొత్త పన్ను విధానం బావుందంటున్నారు!
2000వ సంవత్సరంలో జీఎస్టీ తీసుకొచ్చిన ఆస్ట్రేలియా ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోలేదు. పది శాతం వున్న ప్రస్తుత ట్యాక్స్ త్వరలో పదిహేను శాతానికి పెరగనుంది. ఆస్ట్రేలియా పక్కనే వుండే న్యూజిలాండ్ మాత్రం ఎంతో ముందుగా , 1986లోనే జీఎస్టీ అమల్లోకి తెచ్చింది. పది శాతం పన్నుతో మొదలైన జీఎస్టీ ఇప్పుడు పదిహను శాతంగా వుంది.
ప్రపంచంలోనే అత్యంత అభివృద్ధి చెందిన అతి చిన్న దేశం సింగపూర్. 1994లో జీఎస్టీ సాహసం చేసిన ఆ దేశం… మొదట్లో ఎన్జీవోలు, సోషల్ యాక్టివిస్టుల నుంచి ప్రతిఘటన ఎదుర్కొంది. ద్రవ్యోల్బణం కూడా అదుపు తప్పింది. కాని, ఇప్పుడు అంతా సద్దుకుంది. జీఎస్టీ సింగపూర్ ఆదాయంలో రెండో అతి పెద్ద వనరు! కార్పోరేట్ ఇన్ కమ్ ట్యాక్స్ తరువాతి స్థానం దానిదే!
ఇప్పుడు మన దేశంలో ప్రవేశపెడుతోన్న జీఎస్టీ విధానానికి చాలా దగ్గరగా వుంటుంది కెనడా జీఎస్టీ. సెంట్రెల్ జీఎస్టీ, స్టేట్ జీఎస్టీ వేరు , వేరుగా వుంటాయి. అయితే, 1991లో కెనడా సెంట్రల్ గవర్నమెంట్ చేసిన జీఎస్టీ ప్రయోగాన్ని మూడు ప్రావిన్షియల్ ప్రభుత్వాలు తీవ్రంగా ప్రతిఘటించాయి. కోర్టు వెళ్లి కేంద్ర ప్రభుత్వాన్ని బోనులో నిలబెట్టాయి. అయినా జీఎస్టీ ఆగలేదు…
జీఎస్టీ ప్రవేశపెట్టి తిరిగి మళ్లీ పాత పద్దతిలోకి వెళ్లిపోయిన ఏకైక దేశం కొలంబియా! అక్కడ ప్రస్తుతం జీఎస్టీ ఎత్తేశారు. పాత పద్ధతిలోనే వివిధ రకాల ట్యాక్స్ లు అమల్లో వున్నాయి!